Showing posts with label పురాణ మిధునం. Show all posts
Showing posts with label పురాణ మిధునం. Show all posts

Monday, January 22, 2018

సుకన్య - చ్యవన మహర్షి – 4

https://www.facebook.com/vallury.sarma/posts/529117880458963

(పురాణ మిధునం) --- సుకన్య - చ్యవన మహర్షి – 4



అశ్వినుల వలన యౌవనం తిరిగిపొందిన చ్యవనుడు తన భార్యయైన సుకన్యను ఎంతోప్రేమగా చూచుకొన్నాడు. తన తపోబలంచేత సమస్త ఐశ్వర్యాన్ని అనుభవింపజేశాడు. ఆవిడకోరినవన్నీ సమకూర్చాడు. "వృద్ధుడిగా, అంధుడిగా ఉన్నప్పుడు నాకు భక్తితో సేవచేశావు. దానికి సంతోషించిన నేను అశ్వినులద్వారా నీసంతోషంకోసమే ఈ యౌవనాన్ని తిరిగి పొందాను. నీవు ఉత్తమమైన సంతానాన్ని పొందుతావు. పరమయోగ్యుడు, మహానుభావుడూ అయిన పుత్రుణ్ణి నీకు ఇస్తాను. తరువాత మరో ఇద్దరు ఉత్తమమైన పుత్రులు నీకు కలుగుతారు." అని ఆయన సుకన్యను అనుగ్రహించి, ముగ్గురు పుత్రులను ప్రసాదిస్తాడు. వారి ప్రధమ పుత్రుడు దధీచి మహర్షి. దేవేంద్రునికి తన వెన్నెముకను ఆయుధంగా ఇచ్చినవాడు. చ్యవన మహర్షి, సుకన్యల రెండవ, మూడవ కుమారులు ప్రమతి, మరియు ఆప్రవానుడు. ప్రమతి కూడా మహాతపస్సంపన్నుడు. ఘృతాచి అను అప్సరస ప్రమతిని వలచి ఆశ్రమమునకు వచ్చి సేవ చేయుచుండగా కొంతకాలమునకు వారి మధ్య అనురాగము జనించినది. వారికి ఒక సుపుత్రుడు కలిగాడు. అతడు రురుడు. ధర్మాత్ముడు, తపశ్శాలి, విద్యావంతుడు. విశ్రావసు మేనకల కుమార్తె ప్రమద్వర అతిలోక సౌందర్యవతి. రురుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె తండ్రికూడా దానికి సమ్మతించాడు. కాని వివాహం కాకుండానే ప్రమద్వర పాముకాటుతో మరణిస్తుంది. రురుడు తన ఆయుర్దాయంలో సగాన్ని ఆమెకు ఇచ్చి ఆమెను బ్రతికించుకుంటాడు. ఈ వృత్తాంతం భారతంలోనిది. రురునికి సర్పాలంటే ద్వేషం కలుగుతుంది. అతడు జనమేజయుని సర్పయాగంచేయమని ప్రోత్సహిస్తాడు.

సుకన్య - చ్యవన మహర్షి – 3

https://www.facebook.com/vallury.sarma/posts/528746333829451

(పురాణ మిధునం) --- సుకన్య - చ్యవన మహర్షి – 3
ఏదో సంభాషణ జరుగుతున్నదని గ్రహించిన చ్యవనుడు సుకన్యను పిలిచి "ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడిగాడు. దానికి ఆమె "ఇద్దరు దివ్యపురుషులు వచ్చారు. వారు అశ్వనీదేవతలట. మనము ఎవరమో అడిగారు. నాకు ఏదో ఉపకారం చేస్తున్నట్లు ఇలా చెప్పారు" అని సమాధానం చెప్పినది. "వారు దేవతలు. నిన్ను అకారణంగా బాధించడం వారి ఉద్దేశ్యంకాదు. నేను చెప్పిన విధంగా వారితోచెప్పు. వారు నీకు తగిన సుందరుని తెస్తామన్నారుగదా! తీసుకురమ్మని చెప్పు. ఇది నా ఆజ్ఞ" అని చ్యవనుడు సుకన్యకు చెబుతాడు. ఆమెకు అర్థంకాక పోయినా వారి వద్దకు వెళ్ళి భర్తచెప్పినట్లు చెబుతుంది. వారిద్దరూ వెంటనే వారి కుటీరము ప్రక్కనే ఉన్న సరస్సుకు వెళ్ళి స్నానంచేసి ఇద్దరు సుందరులైన మానవదేహాలతో తిరిగి వచ్చారు. సుకన్య ఈవిషయం భర్తకు చెబుతుంది. చ్యవనుడు వెంటనే తనను కూడా ఆసరస్సుకు తీసుకొనివెళ్ళి స్నానంచేయించి తీసుకొని రమ్మని సుకన్యకు చెబుతాడు. ఆయన సరస్సులోములిగి లేవగానే ఒక సుందరమైన నవయువకునిగా మారిపోతాడు. ఆదేవతల రాకకు ప్రథమోద్దేశ్యం అదే. వారు సుకన్యను పరీక్షించి ఆమె భర్తను యువకునిగా చేయడంకొరకే వచ్చారు. ఆమె వారికై తపస్సు చేయలేదు. అందుకే వారు ఆమె భర్త యౌవనాన్ని వరంగా ఈయకుండా ఒక వైద్యవిధానంగా సూచించారు. అశ్వినులు దేవవైద్యులు. చ్యవనుని తపస్సు, సుకన్య పాతివ్రత్యము వలన ఈఫలము వారికి లభించినది. అడవిలోనే కుమార్తె సుకన్యను చ్యవనునికిచ్చి వివాహము చేసిన శర్యాతి మహారాజు కొంతకాలము తరువాత ఆమె అడవిలో జీవనము ఎలాగడుపుతో ఉన్నదో చూదామని వెడతాడు. ఆమె ఒక యువకునితో ఆనందంగా ఉండడం చూచి అపార్థంచేసుకుంటాడు. కాని చ్యవనుడు మామగారితో అశ్వినుల దయ వలన తనకు యౌవనము తిరిగి లభించినదని, సుకన్య గొప్ప పతివ్రతయనీ చెబుతాడు. అప్పుడు రాజు అల్లుని, కుమార్తెను తన నగరానికి తీసుకొనివెళ్ళి వైభవంగా వేడుకలు నిర్వహించి కానుకలు ఇస్తాడు.
అశ్వినీ దేవతలు ఎవరు?
మనం ఆటగాళ్ళు, పాటగాళ్ళు, నటులు, రాజకీయ నాయకులు వంటి ఆధునిక దేవతల మరియు నూతన ప్రవక్తల ఆరాధనలో పడి వైదికదేవతలను పూర్తిగా మరచిపోతున్నాము. అనేక దేవతలలో సూర్యకాంతికి, తేజస్సుకు సంబంధించిన ముఖ్యదేవతలు అశ్వినీదేవతలు (లేదా అశ్వినీ కుమారులు). సూర్యుడు, ద్వాదశాదిత్యులు, అశ్వినులు, ఉష (ఉషస్), పూషా (పూషాన్) వీరందరూ సూర్యకాంతి సంబంధులే. సాధారణంగా వారిగురించి మనకు తెలిసినది బహు స్వల్పం. వారు దేవతల వైద్యులనీ, పాండవులలో నకుల సహదేవులు వారి అంశలలో పుట్టారనీ చాలామందికి తెలుసు. చ్యవన మహర్షికి యౌవనము ప్రసాదించినది వారే. వారికి చ్యవనమహర్షిచేసిన ప్రత్యుపకారం గురించి కూడా తెలుసుకోవలసినదే. ప్రాచీన భారతంలో నట, విట, గాయక, వైద్యులను సమాజంలో కొంచెంతక్కువగా చూసేవారు. వైద్యుడు వృత్తిరీత్యా అందరినీ, అనారోగ్యపరిస్థితులలో ఉన్న వారిని స్పృశించవలసి వస్తుంది. అది అశుచిగా భావించేవారు. పైగా అశ్వినులు తరచు భూలోకానికి వచ్చేవారు. ఈ కారణం వలన వారికి యజ్ఞాలలో ఆహుతులు ఉండేవికావు. చ్యవనుడే ఇంద్రుని ఎదుర్కొని వారికి ఇతరదేవతలతోబాటుగా ఆహుతులు ఇప్పించాడు.
ఈ భూలోకములో సుఖసంతోషాలకోసం దేవతారాధన ఉత్తమ మార్గం. ఈ విధంగా అశ్వినులు భూలోక, స్వర్గలోక వాసులకు ఆరాధనీయులు, ప్రీతి పాత్రులు. వారు మనకు సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ ఈయగల సమర్థులు. వారిని కవలలుగా గుర్తిస్తారు. ఎప్పుడూ కలిసే ఉంటారు. ఋగ్వేదంలో వారినిగురించిన సూక్తాలు ఏబది పైన ఉంటాయి. వారిని మధుమంతులు అని వ్యవహరిస్తారు. బుద్ధికి బృహస్పతి వలెనే వారిని శుభస్పతి అంటారు. అశ్వినులు అవసరమైతే మానవులను సమీపించి వారికి సుఖ సంతోషాలనీయడానికి సిద్ధంగా ఉంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలకు సంబంధించిన ఆందోళనలను, అవరోధాలను తొలగించి శాంతి నిస్తారు. ఆవిధంగా తమస్సును తొలగించి జీవితానికి కాంతినిస్తారు. శారీరక వ్యాధులనే కాక, మానసిక వ్యధలనూ, భయాలనూ తొలగించి శాంతిసౌఖ్యాలనిస్తారు. శరీరములో అన్ని ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. తక్కిన జ్ఞానేంద్రియములకు దిశలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు అధిదేవతలు. కర్మేంద్రియములకు దేవతలు అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, యముడు, ప్రజాపతి. ఉపనయన, వివాహాది సమయములలో జరిగే హోమములలో ఈ దేవతలను ఆరాధన చేయడం వలన ఆరోగ్యము, ఆయుర్దాయము వృద్ధిచెందుతాయి. ఓంకారము అకార, ఉకార, మకారములు కలిగినది. అకారము ఋగ్వేదము. త్రిమూర్తులలో విష్ణువును సూచిస్తుంది. భౌతిక ప్రపంచమునకు సంబంధించినది. ఈ విధముగా వేదకర్మలలో యజింపబడిన దేవతలు నిత్యజీవితంలో సుఖ సంతోషాలు కలిగిస్తారు.

సుకన్య - చ్యవన మహర్షి – 2

https://www.facebook.com/vallury.sarma/posts/528354547201963

( పురాణ మిధునం) --- సుకన్య - చ్యవన మహర్షి – 2
చ్యవనుడు తపస్సు చేసేప్రదేశం ప్రక్కనే ఒక సరస్సున్నది. రాజదంపతులు అక్కడ జలక్రీడలకు ఉద్యమిస్తారు. సుకన్య మాత్రము ఆచుట్టుప్రక్కల ఒక్కతే తిరుగుతూ చ్యవనుడు తపస్సుచేస్తున్న పుట్టవద్దకు వచ్చినది. చ్యవనుని కళ్ళు తెరచిఉండి మిల మిల మెరుస్తున్నాయి. అవి మిణుగురు పురుగులనుకొని సుకన్య పుల్లలతో పుట్టలో పొడుస్తుంది. చ్యవనుని కళ్ళుపోయాయి. మెరుపు తగ్గినది. ఏమిచేయాలోతెలియక సుకన్య తల్లిదండ్రులున్న చోటికి వచ్చింది. కొంతసేపటికి రాజపరివారమంతటికి ఒక విచిత్రమైన బాధ వచ్చింది. వారి విసర్జకావయవములు బంధింపబడి పనిచేయడం మానేవేశాయి. ఈ వింతవ్యాధి వారికి ఏమో తెలియలేదు. రాజు అందరినీ అడవికి వచ్చి ప్రతి వారు చేసినపని అడుగసాగాడు. సుకన్య తానుచేసిన పని చెప్పినది. చుట్టుప్రక్కల చూడగా పుట్టలోని చ్యవనుడు అంధుడై లేచి నిలబడి ఉన్నాడు. రాజు వెళ్ళి ఆయనను ఏమైనదని అడిగితే తన కళ్ళలో ఎవరో పొడిచారని, తాను తపస్సులో ఉండడంవలన వారికి ఆబాధ కలిగియుండవచ్చునని చెబుతాడు. రాజు ఆయనను ఏమిచేయాలో చెప్పమని అడుగుతాడు. ముని వృద్ధత్వంతో అంధత్వంకూడా ప్రాప్తించడంలో తాను ఒక్కడూ అరణ్యంలో తపస్సుకొనసాగించడం కష్టమని, ఈ పనిచేసిన సుకన్యను తనకిచ్చి వివాహం చేస్తే పరిస్థితి చక్కబడుతుందని తెలుపుతాడు. రాజదంపతులు అవాక్కయ్యారు. దేశమేలేరాజు తన సౌందర్యవతి, సుకుమారి, యౌవనవతి అయిన కుమార్తెను ఒక అంధుడైన వృద్ధమునికిచ్చి వివాహం ఎలాచేయగలడు? రాజు మాట్లాడక మౌనం వహిస్తాడు. సుకన్య తను చేసిన పొరపాటు వలన ఆయనకు అంధత్వం వచ్చినదని తాను ఆయన కోరినట్లు భార్యనౌతానని చెబుతుంది. రాజ దంపతులకు ఈ వివాహం తమ రాజధానిలో వైభవంగా చేయడం ఇష్టం లేక అక్కడే కన్యాదానం చేసి, కుమార్తెను అప్పగించి వెళ్ళిపోయారు. చ్యవన మహర్షి, సుకన్య సహాయంతో అక్కడ ఒకపర్ణశాల నిర్మించుకొని, ఇద్దరూ బ్రతకడం మొదలుపెట్టారు. ఆయనకు తపస్సు తప్ప వేరే ఏమీతెలియదు. ఆమె భర్తను దైవంగా భావించి ఆయనకు సేవచేస్తూ కాలం గడపసాగినది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకదినం ఆమె ఎదుటకు ఇద్దరు వ్యక్తులు దివ్య స్వరూపాలతో వచ్చి ఆమెను ఇలా ప్రశ్నిస్తారు. " అమ్మా! ఎవరునీవు? ఆవృద్ధుడు ఎవరు? ఈ అడవిలో ఎందుకు ఉంటున్నారు?" ఆమె సమాధానంగా ఇలాచెప్పినది "నేను శర్యాతి రాజు పుత్రికను. నాపేరు సుకన్య. ఆవృద్ధుడు నా భర్తయైన చ్యవన మహర్షి". దానికి వారు " మేము ఇద్దరమూ అశ్వనీదేవతలం. మా దివ్యదృష్టితో నీపరిస్థితిచూచాము. నీ వయస్సులోని స్త్రీ ఈ వృద్ధుని వివాహంచేసుకొని జీవితంలో ఏమి అనుభవిస్తుంది? నీకు కావాలంటే నీకు సరిజోడు ఐన సుందర యువకుణ్ణి తీసుకుని వస్తాము. అతనిని వివాహంచేసుకొని సుఖ జీవితం గడుపు" అని చెబుతారు. అమె వెంటనే "నేను వివాహితను. నా భర్తే నాకు దైవం. నాకు ఇంకొక ఆలోచన ఎప్పటికీ రాకుండా ఇలా పతిసేవలోనే తరించగల చిత్తవృత్తి ఈయండి. అది నాకు మీరే ఇవ్వగల వరం. మీకు ఆ సమర్ధత లేకపోతే మీదారిన మీరువెళ్ళవచ్చును." అని అడుగుతుంది.
(సశేషం)

సుకన్య - చ్యవన మహర్షి – 1

పురాణ మిధునం
సుకన్య - చ్యవన మహర్షి – 1

చ్యవనమహర్షి భృగుమహర్షి, పులోమల పుత్రుడు. భృగుమహర్షి స్వాయంభువ మన్వంతరంలోని సప్తర్షులలో తోబాటుగా సృష్టించబడిన నవబ్రహ్మలలో ఒకడు. బ్రహ్మమానసపుత్రుడు. ఆయనకు వేరు మన్వంతరాలలోఖ్యాతి, ఉశన, పులోమ అనే భార్యలు ఉండేవారు. భృగుమహర్షి వంశంలో అవతార పురుషుడైన పరశురామునితోపాటు ఎందరో విఖ్యాతి గాంచిన మహర్షులు పుట్టారు. ఆకథలు మరోసారి. ఆయన ఒక సారి పులోమ సేవ, శుశ్రూషలకు మెచ్చి భార్యకు ఒక వరం ఇస్తానన్నాడు. మహర్షి పత్ని ఏమడుగుతుంది? వంశోద్ధారకుడు, బ్రహ్మజ్ఞాని ఐన పుత్రుని కోరుకుంటుంది. ఆయన తథాస్తు అన్నాడు. ఆవిడ తరువాత కొంతకాలానికి గర్భవతి ఆయింది. ఆకాలంలో పులోముడు అనేరాక్షసుడు ఉండేవాడు. వాడు పులోమ సౌందర్యంగురించి విని ఆమెపైమోహం పెంచుకొని తగిన అవకాశంకోసము ఎదురుచూస్తున్నాడు. ఒకదినము భృగుమహర్షి భార్యను నిత్యాగ్నిహోత్రానికి ఏర్పాట్లుచేయమనిచెప్పి నదీస్నానానికి వెడతాడు. అప్పుడు పులోముడు ఆఇంటిలో ప్రవేశించి అగ్నిని చూస్తాడు. వాడిది రాక్షసప్రవృత్తికాని వేదవేదాంగ పారంగతుడు. అగ్నిని సంబోధించి "అగ్నిదేవా! ఇప్పుడు ఇంటిలో ఉన్న స్త్రీ పులోమయేనా?" అని అడుగుతాడు.అగ్నికి ధర్మ సంకటం వచ్చినది. పులోముని దుష్టబుద్ధిని తాను గమనించాడు.అసత్యం చెప్పి పులోమను రక్షించడమా? లేక సత్యముచెప్పి ఆమె కర్మను ఆమెకు వదలివేయడమా? - అని అతనికి సందేహం వచ్చినది. ఏమైతే కానిమ్మని, "ఆమె పులోమయే" అని సత్యమే చెబుతాడు. వెంటనే ఆరాక్షసుడు ఒక పందిరూపం ధరించి, ఆమెను తనపై ఎక్కించుకొని పారిపోతాడు. భృగువు వచ్చేసరికి భార్యలేదు. అగ్నిని శపించి "నీవు నీనోటికి వచ్చినట్లు మాట్లాడావు, నీవు సర్వభక్షకుడువి కమ్ము" అని శపిస్తాడు. అగ్నికి దేనిని పడితేదానిని భస్మంచేయడము తప్ప మరియొక మార్గములేదు. ఆరాక్షసుడు వేగముగా వెళ్ళుతూంటే పులోమకు గర్భస్రావమై ఒక పిల్లవాడు పుట్టి భూమిపై పడతాడు. పిల్లవాడు తన కళ్ళు తెరచి ఆరాక్షసుని చూడగానే వాడు ఆతేజస్సుకి దగ్ధమై, భస్మమైపోతాడు. చ్యవనము అంటే జారి పడుట, చ్యుతి చెందుట. అందుకే ఆపిల్లవానికి చ్యవనుడనేపేరు సార్థక నామమైనది. పులోమ శిశువును తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అగ్నికి తను సత్యంచెప్పినా శాపంతగిలిందన్న బాధను దేవతలకు చెప్పుకుంటాడు. దేవతలు నీవు ఎంత అశుచి, చెత్త, చెదారములను దహించినా నీవునిత్య శుచివి అని అతనికి చెబుతారు. చ్యవనుని బాల్యం తల్లిదండ్రుల వద్దనే గడచింది. వారు అతనికి ఉపనయనాది సంస్కారములు చేశారు. తండ్రి కుమారునికి ఇక నీకు జ్ఞానాన్ని సంపాదించడము తప్ప వేరొక కర్తవ్యంలేదు. మనిషిజీవితానికి పరమార్థం మోక్షం. దానికి తపస్సు ఒకటే మార్గం అని ప్రేరేపించి కుమారుని ఇంటినుండి పంపేస్తాడు. చ్యవనుడు ఇంటినుండి దూరంగా వైఢూర్యపర్వతమనే ప్రదేశానికి వెళ్ళి శివుని గురించి తపస్సు ప్రారంభిస్తాడు. ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి. వృద్ధాప్యం ఆవహించినది. చుట్టూ చెట్లూ పుట్టలూ పెరిగిపోయాయి. సమాధి స్థితిలో ఆయన ఉండిపోయాడు.చాలా కాలానికి శర్యాతి అనే రాజు తన భార్య, సుకన్య అనే కుమార్తె, తగిన పరివారంతో అదే అడవికి వనవిహారానికి వస్తాడు.
(సశేషం)

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...