పురాణ మిధునం
సుకన్య - చ్యవన మహర్షి – 1
చ్యవనమహర్షి భృగుమహర్షి, పులోమల పుత్రుడు. భృగుమహర్షి స్వాయంభువ మన్వంతరంలోని సప్తర్షులలో తోబాటుగా సృష్టించబడిన నవబ్రహ్మలలో ఒకడు. బ్రహ్మమానసపుత్రుడు. ఆయనకు వేరు మన్వంతరాలలోఖ్యాతి, ఉశన, పులోమ అనే భార్యలు ఉండేవారు. భృగుమహర్షి వంశంలో అవతార పురుషుడైన పరశురామునితోపాటు ఎందరో విఖ్యాతి గాంచిన మహర్షులు పుట్టారు. ఆకథలు మరోసారి. ఆయన ఒక సారి పులోమ సేవ, శుశ్రూషలకు మెచ్చి భార్యకు ఒక వరం ఇస్తానన్నాడు. మహర్షి పత్ని ఏమడుగుతుంది? వంశోద్ధారకుడు, బ్రహ్మజ్ఞాని ఐన పుత్రుని కోరుకుంటుంది. ఆయన తథాస్తు అన్నాడు. ఆవిడ తరువాత కొంతకాలానికి గర్భవతి ఆయింది. ఆకాలంలో పులోముడు అనేరాక్షసుడు ఉండేవాడు. వాడు పులోమ సౌందర్యంగురించి విని ఆమెపైమోహం పెంచుకొని తగిన అవకాశంకోసము ఎదురుచూస్తున్నాడు. ఒకదినము భృగుమహర్షి భార్యను నిత్యాగ్నిహోత్రానికి ఏర్పాట్లుచేయమనిచెప్పి నదీస్నానానికి వెడతాడు. అప్పుడు పులోముడు ఆఇంటిలో ప్రవేశించి అగ్నిని చూస్తాడు. వాడిది రాక్షసప్రవృత్తికాని వేదవేదాంగ పారంగతుడు. అగ్నిని సంబోధించి "అగ్నిదేవా! ఇప్పుడు ఇంటిలో ఉన్న స్త్రీ పులోమయేనా?" అని అడుగుతాడు.అగ్నికి ధర్మ సంకటం వచ్చినది. పులోముని దుష్టబుద్ధిని తాను గమనించాడు.అసత్యం చెప్పి పులోమను రక్షించడమా? లేక సత్యముచెప్పి ఆమె కర్మను ఆమెకు వదలివేయడమా? - అని అతనికి సందేహం వచ్చినది. ఏమైతే కానిమ్మని, "ఆమె పులోమయే" అని సత్యమే చెబుతాడు. వెంటనే ఆరాక్షసుడు ఒక పందిరూపం ధరించి, ఆమెను తనపై ఎక్కించుకొని పారిపోతాడు. భృగువు వచ్చేసరికి భార్యలేదు. అగ్నిని శపించి "నీవు నీనోటికి వచ్చినట్లు మాట్లాడావు, నీవు సర్వభక్షకుడువి కమ్ము" అని శపిస్తాడు. అగ్నికి దేనిని పడితేదానిని భస్మంచేయడము తప్ప మరియొక మార్గములేదు. ఆరాక్షసుడు వేగముగా వెళ్ళుతూంటే పులోమకు గర్భస్రావమై ఒక పిల్లవాడు పుట్టి భూమిపై పడతాడు. పిల్లవాడు తన కళ్ళు తెరచి ఆరాక్షసుని చూడగానే వాడు ఆతేజస్సుకి దగ్ధమై, భస్మమైపోతాడు. చ్యవనము అంటే జారి పడుట, చ్యుతి చెందుట. అందుకే ఆపిల్లవానికి చ్యవనుడనేపేరు సార్థక నామమైనది. పులోమ శిశువును తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అగ్నికి తను సత్యంచెప్పినా శాపంతగిలిందన్న బాధను దేవతలకు చెప్పుకుంటాడు. దేవతలు నీవు ఎంత అశుచి, చెత్త, చెదారములను దహించినా నీవునిత్య శుచివి అని అతనికి చెబుతారు. చ్యవనుని బాల్యం తల్లిదండ్రుల వద్దనే గడచింది. వారు అతనికి ఉపనయనాది సంస్కారములు చేశారు. తండ్రి కుమారునికి ఇక నీకు జ్ఞానాన్ని సంపాదించడము తప్ప వేరొక కర్తవ్యంలేదు. మనిషిజీవితానికి పరమార్థం మోక్షం. దానికి తపస్సు ఒకటే మార్గం అని ప్రేరేపించి కుమారుని ఇంటినుండి పంపేస్తాడు. చ్యవనుడు ఇంటినుండి దూరంగా వైఢూర్యపర్వతమనే ప్రదేశానికి వెళ్ళి శివుని గురించి తపస్సు ప్రారంభిస్తాడు. ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి. వృద్ధాప్యం ఆవహించినది. చుట్టూ చెట్లూ పుట్టలూ పెరిగిపోయాయి. సమాధి స్థితిలో ఆయన ఉండిపోయాడు.చాలా కాలానికి శర్యాతి అనే రాజు తన భార్య, సుకన్య అనే కుమార్తె, తగిన పరివారంతో అదే అడవికి వనవిహారానికి వస్తాడు.
(సశేషం)
(సశేషం)
No comments:
Post a Comment