Monday, January 22, 2018

సుకన్య - చ్యవన మహర్షి – 3

https://www.facebook.com/vallury.sarma/posts/528746333829451

(పురాణ మిధునం) --- సుకన్య - చ్యవన మహర్షి – 3
ఏదో సంభాషణ జరుగుతున్నదని గ్రహించిన చ్యవనుడు సుకన్యను పిలిచి "ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడిగాడు. దానికి ఆమె "ఇద్దరు దివ్యపురుషులు వచ్చారు. వారు అశ్వనీదేవతలట. మనము ఎవరమో అడిగారు. నాకు ఏదో ఉపకారం చేస్తున్నట్లు ఇలా చెప్పారు" అని సమాధానం చెప్పినది. "వారు దేవతలు. నిన్ను అకారణంగా బాధించడం వారి ఉద్దేశ్యంకాదు. నేను చెప్పిన విధంగా వారితోచెప్పు. వారు నీకు తగిన సుందరుని తెస్తామన్నారుగదా! తీసుకురమ్మని చెప్పు. ఇది నా ఆజ్ఞ" అని చ్యవనుడు సుకన్యకు చెబుతాడు. ఆమెకు అర్థంకాక పోయినా వారి వద్దకు వెళ్ళి భర్తచెప్పినట్లు చెబుతుంది. వారిద్దరూ వెంటనే వారి కుటీరము ప్రక్కనే ఉన్న సరస్సుకు వెళ్ళి స్నానంచేసి ఇద్దరు సుందరులైన మానవదేహాలతో తిరిగి వచ్చారు. సుకన్య ఈవిషయం భర్తకు చెబుతుంది. చ్యవనుడు వెంటనే తనను కూడా ఆసరస్సుకు తీసుకొనివెళ్ళి స్నానంచేయించి తీసుకొని రమ్మని సుకన్యకు చెబుతాడు. ఆయన సరస్సులోములిగి లేవగానే ఒక సుందరమైన నవయువకునిగా మారిపోతాడు. ఆదేవతల రాకకు ప్రథమోద్దేశ్యం అదే. వారు సుకన్యను పరీక్షించి ఆమె భర్తను యువకునిగా చేయడంకొరకే వచ్చారు. ఆమె వారికై తపస్సు చేయలేదు. అందుకే వారు ఆమె భర్త యౌవనాన్ని వరంగా ఈయకుండా ఒక వైద్యవిధానంగా సూచించారు. అశ్వినులు దేవవైద్యులు. చ్యవనుని తపస్సు, సుకన్య పాతివ్రత్యము వలన ఈఫలము వారికి లభించినది. అడవిలోనే కుమార్తె సుకన్యను చ్యవనునికిచ్చి వివాహము చేసిన శర్యాతి మహారాజు కొంతకాలము తరువాత ఆమె అడవిలో జీవనము ఎలాగడుపుతో ఉన్నదో చూదామని వెడతాడు. ఆమె ఒక యువకునితో ఆనందంగా ఉండడం చూచి అపార్థంచేసుకుంటాడు. కాని చ్యవనుడు మామగారితో అశ్వినుల దయ వలన తనకు యౌవనము తిరిగి లభించినదని, సుకన్య గొప్ప పతివ్రతయనీ చెబుతాడు. అప్పుడు రాజు అల్లుని, కుమార్తెను తన నగరానికి తీసుకొనివెళ్ళి వైభవంగా వేడుకలు నిర్వహించి కానుకలు ఇస్తాడు.
అశ్వినీ దేవతలు ఎవరు?
మనం ఆటగాళ్ళు, పాటగాళ్ళు, నటులు, రాజకీయ నాయకులు వంటి ఆధునిక దేవతల మరియు నూతన ప్రవక్తల ఆరాధనలో పడి వైదికదేవతలను పూర్తిగా మరచిపోతున్నాము. అనేక దేవతలలో సూర్యకాంతికి, తేజస్సుకు సంబంధించిన ముఖ్యదేవతలు అశ్వినీదేవతలు (లేదా అశ్వినీ కుమారులు). సూర్యుడు, ద్వాదశాదిత్యులు, అశ్వినులు, ఉష (ఉషస్), పూషా (పూషాన్) వీరందరూ సూర్యకాంతి సంబంధులే. సాధారణంగా వారిగురించి మనకు తెలిసినది బహు స్వల్పం. వారు దేవతల వైద్యులనీ, పాండవులలో నకుల సహదేవులు వారి అంశలలో పుట్టారనీ చాలామందికి తెలుసు. చ్యవన మహర్షికి యౌవనము ప్రసాదించినది వారే. వారికి చ్యవనమహర్షిచేసిన ప్రత్యుపకారం గురించి కూడా తెలుసుకోవలసినదే. ప్రాచీన భారతంలో నట, విట, గాయక, వైద్యులను సమాజంలో కొంచెంతక్కువగా చూసేవారు. వైద్యుడు వృత్తిరీత్యా అందరినీ, అనారోగ్యపరిస్థితులలో ఉన్న వారిని స్పృశించవలసి వస్తుంది. అది అశుచిగా భావించేవారు. పైగా అశ్వినులు తరచు భూలోకానికి వచ్చేవారు. ఈ కారణం వలన వారికి యజ్ఞాలలో ఆహుతులు ఉండేవికావు. చ్యవనుడే ఇంద్రుని ఎదుర్కొని వారికి ఇతరదేవతలతోబాటుగా ఆహుతులు ఇప్పించాడు.
ఈ భూలోకములో సుఖసంతోషాలకోసం దేవతారాధన ఉత్తమ మార్గం. ఈ విధంగా అశ్వినులు భూలోక, స్వర్గలోక వాసులకు ఆరాధనీయులు, ప్రీతి పాత్రులు. వారు మనకు సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ ఈయగల సమర్థులు. వారిని కవలలుగా గుర్తిస్తారు. ఎప్పుడూ కలిసే ఉంటారు. ఋగ్వేదంలో వారినిగురించిన సూక్తాలు ఏబది పైన ఉంటాయి. వారిని మధుమంతులు అని వ్యవహరిస్తారు. బుద్ధికి బృహస్పతి వలెనే వారిని శుభస్పతి అంటారు. అశ్వినులు అవసరమైతే మానవులను సమీపించి వారికి సుఖ సంతోషాలనీయడానికి సిద్ధంగా ఉంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలకు సంబంధించిన ఆందోళనలను, అవరోధాలను తొలగించి శాంతి నిస్తారు. ఆవిధంగా తమస్సును తొలగించి జీవితానికి కాంతినిస్తారు. శారీరక వ్యాధులనే కాక, మానసిక వ్యధలనూ, భయాలనూ తొలగించి శాంతిసౌఖ్యాలనిస్తారు. శరీరములో అన్ని ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. తక్కిన జ్ఞానేంద్రియములకు దిశలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు అధిదేవతలు. కర్మేంద్రియములకు దేవతలు అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, యముడు, ప్రజాపతి. ఉపనయన, వివాహాది సమయములలో జరిగే హోమములలో ఈ దేవతలను ఆరాధన చేయడం వలన ఆరోగ్యము, ఆయుర్దాయము వృద్ధిచెందుతాయి. ఓంకారము అకార, ఉకార, మకారములు కలిగినది. అకారము ఋగ్వేదము. త్రిమూర్తులలో విష్ణువును సూచిస్తుంది. భౌతిక ప్రపంచమునకు సంబంధించినది. ఈ విధముగా వేదకర్మలలో యజింపబడిన దేవతలు నిత్యజీవితంలో సుఖ సంతోషాలు కలిగిస్తారు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...