Showing posts with label కఠోపనిషత్. Show all posts
Showing posts with label కఠోపనిషత్. Show all posts

Tuesday, January 23, 2018

కఠోపనిషత్ - 31,32 &33


https://www.facebook.com/vallury.sarma/posts/545817632122321

https://www.facebook.com/vallury.sarma/posts/546251492078935

https://www.facebook.com/vallury.sarma/posts/546834318687319

కఠోపనిషత్ - 31 (July 13)

నావిరతో దుశ్చరితా న్నాశాన్తో నాసమాహితః
నాశాన్త మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ (2.24)
దుష్టప్రవర్తనను విరమించనివాడు, ఇంద్రియములు శాంతి పొందనివాడు, సమాహితమైన చిత్తములేనివాడు, శాంతిలేని మనస్సు కలవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందరు. కేవలం ప్రజ్ఞచేత మాత్రమే పొందకలరు. పరీశుద్ధజీవనము వలన భౌతికదుఃఖ నివారణమేకాని ఆత్మజ్ఞానం రాదు. ప్రజ్ఞానం బ్రహ్మ. కేవలం ప్రజ్ఞయే బ్రహ్మ, అదే బ్రహ్మజ్ఞానము. ఆత్మ అన్నిశరీరాలలో ఉండే సత్యవస్తువు. దానిని మరవడం అవిద్య. ఉన్నది ఉన్నదిగా తెలుసుకోవడం జ్ఞానము. అవిద్యతొలగితే మిగిలినది స్వయంప్రకాశముగల జ్ఞానము.
యస్య బ్రహ్మ చ క్షత్రంచ ఉభేభవత ఓదనః
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సః
ఎవరికైతే బ్రాహ్మణుడు, క్షత్రియుడు (వీరు ఇరువురూ) ఆహారమవుతున్నారో, ఎవరికైతే మృత్యువు అల్పాహారముగా ఉన్నదో, దానిని ఈ ప్రకారముగా ఉన్నది అనిచెప్పి తెలుసుకొనుము. ఇక్కడ బ్రాహ్మణులను, క్షత్రియులను ఆహారంగానూ, ఇతరులను అల్పాహారంగా తినేది బ్రహ్మమనిచెప్పుకున్నప్పుడు ఈమంత్రం అర్థరహితంగా కనుపిస్తుంది. బ్రాహ్మణులు అంటే సత్త్వగుణమనే చెప్పుకోవాలి. క్షాత్రము అంటే రజోగుణము. ప్రథమంగా బ్రహ్మ వస్తువు ఉన్నది. తరువాత పుట్టినవి త్రిగుణాలు. లోకముల సృష్టి స్థితులు రజో, సత్త్వ గుణములనుండి పుట్టినవి. ఆ రెండుగుణాలు నశించే లక్షణము గలవి. తమస్సు అనే మూడవగుణము కూడా నిర్గుణమైన బ్రహ్మము నుండే పుట్టినది. సృష్టి అంతా ఎప్పటికప్పుడు మృత్యువు నోట పడుతూనే ఉంటుంది. అది మృత్యువుకు ఉపసేచనం (అల్పాహారం). తమస్సు సత్త్వరజములను వెన్నంటి ఉంటూ సృష్టిని లయంచేస్తుంది. బ్రహ్మజ్ఞాని ఇలాఅనుకుంటాడు - ఉన్నట్లు కనబడే సృష్టిని అలాంటి మృత్యువే కబళిస్తూంది. అందుచేత జ్ఞాని త్రిగుణములచేత బాధింపబడడు.



తృతీయవల్లి
కఠోపనిషత్తు మూడవ వల్లి చాలా గహనమైనది. "గుహా ప్రవిష్టౌ" - అనగా హృదయాకాశమందు ప్రవేశించిన యోగిని వర్ణించు చున్నాడు. పూర్వము చెప్పబడిన యజ్ఞమార్గము, యోగమార్గములలో లేని ప్రత్యేకత ఇక్కడచెప్పబడిన విద్యకు కలదని నిరూపింపబడుతున్నది. కర్మలు సుకృతములైనా, దుష్కృతములైనా వానిఫలములు ఇక్కడ భూమిపై అనుభవించవలసినదే! అన్నిలోకములకు అతీతమైన దహరాకాశమందు (హృదయ గుహయందు) ప్రవేశించినయోగి సర్వ పుణ్యపాపాది కర్మలనుండి విముక్తుడై ప్రణవోపాసన వలన ఫలితమగు అలోక స్థితిని పొందుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ నచికేతవిద్యద్వారా కాక రాజయోగముద్వారా అనాహత చక్రమును ప్రవేశించుటకై అక్కడ అధిష్ఠానదైవమగు వాయు తత్త్వమును “యం” అను బీజాక్షరముచేత ఉపాసించి దాటవలెను.
ఋతం పిబన్తౌ సుకృతస్యలోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పదార్థే
చాయాతపౌ బ్రహ్మవిదో వదన్తి
పంచాగ్నయో యే చ త్రిణాచికేత (3.1)
ఇక్కడ పిబన్తౌ, ప్రవిష్టౌ, చాయాతపౌ అని ద్వివచనము ఉండుటచేత ఇద్దరు యోగులను గురించి చెప్పబడుతున్నది. లోకములో మంచిపనులయొక్క యదార్థరూపమైన ఫలమునుపొందినవారైన ఇద్దరు పరతత్త్వమునకు మూలస్థానమైన హృదయగుహను ప్రవేశించి చాయ-ఆతపముల (నీడ వెలుగుల) వలె ఉన్నారని బ్రహ్మవిదులు చెప్పుచున్నారు. ప్రాణ స్వరూపములైన పంచాగ్నులను ఉపాసించిన వారు, నచికేతాగ్నిని మూడుసార్లు ఆచరించినవారు వరుసగా చాయ-ఆతపమువలె ఉన్నారు. ఈ సత్యమును అధికారికముగా బ్రహ్మవేత్తలుచెబుతున్నారు. పంచాగ్ని విద్య చాందోగ్యోపనిషత్తులో చెప్పబడినది. వేదములలో యజ్ఞములు, విధి విధానములు చెప్పబడినవి. ఇవి నచికేతవిద్య కంటె ప్రాచీనమైనవి. ఈ ఉపాసకులు ఉత్తమలోకములను పొందెదరని అందరకూ తెలిసినదే. వీరందరూ చాయామాత్రమైన స్థితిపొందియుండగా, ప్రణవోపాసకులైన నచికేతాగ్నియోగస్థులు శుద్ధతేజోమూర్తులై ముక్తులగుచున్నారు. అందుచేత ఈ ఉపనిషత్తు పూర్వమార్గమున వెళ్ళినవారికి పరమార్థకొరకు వారధి ఐనది.


కఠోపనిషత్ - 33 (July 17)
యః సేతురీజానానామక్షరం బ్రహ్మయత్పరమ్
అభయం తితీర్షతాం పారం నాచికేతగ్ం శకేమహే (3.2)
ఈజానానాం - యజ్ఞయాగాది క్రతువులు చేసేవారికి, యః సేతు - ఏదివారధివలెయున్నదో, తత్ నాచికేతం - అట్టినాచికేతవిద్యను మేము సాధించగలం. యజ్ఞయాగాదులు ఊర్ధ్వలోకాలను మాత్రమే ఈయగలవు. అది పరిమిత ఫలము. అట్టివారు మృత్యువును జయించి ఉత్తమఫలములను పొందాలంటే ప్రణవోపాసన అయిన నాచికేతవిద్యయే వారధి. తితీర్షతాం అభయం పారం అక్షరం పరం బ్రహ్మ - ఏలాంటి జన్మమృత్యుభయములేని దివ్యలోక స్థితియు, అటుపైన ముక్తిప్రదమైన ప్రణవోపాసన నాచికేతవిద్యయందున్నవి.
ఆత్మానగ్ం రథినం విద్ధి శరీరగ్ం రథమేవతు
బుద్ధింతు సారథింవిద్ధి మనః ప్రగ్రహమేవచ (3.3)
ఇది యమునిబోధ. రథము, రథికుడు, సారథి, కళ్ళెములు అని నాలుగు వస్తువులున్నాయి. రథికుడు ఆత్మ, శరీరం రథం, చోదకుడు (సారథి) బుద్ధి, మనస్సు కళ్ళెములు.
శరీరమును రథముతో పోల్చుకుంటే రథముయొక్క యజమాని ఆత్మ, అతని సారథి బుద్ధి, సారథివాడే కళ్ళెములు మనస్సు. బుద్ధిలోనే సంకల్పములు పుడతాయి. ఈ మంత్రమును యజుర్వేదములోని రుద్రమంత్రముతో పోల్చవచ్చును.
రథిభ్యో 2రథేభ్యశ్చవో నమో
నమో రథేభ్యః రథపతిభ్యశ్చవో నమః
కొంచెం తరువాత ఈ అనువాకంలోనే "రథకారేభ్యశ్చవో నమః అని వస్తుంది. రథములవంటి శరీరములు ఈశ్వరసృష్టి. తానే సారథియు, జీవాత్మయూ అయిఉండుటవలన రథకారుడు, సారథి, రథపతి అయిఉన్నాడు. అందుంచేతనే శరీరకృత్యములన్నీ తానేచేయుచున్నట్లు భాసించుచున్నాడు. తాను ఈశ్వర ప్రతిరూపమేయని గ్రగించి జ్ఞానప్రాప్తికి అర్హుడవడం అతడి కర్తవ్యం. .

కఠోపనిషత్ 27, 29 & 30

https://www.facebook.com/vallury.sarma/posts/540571089313642

https://www.facebook.com/vallury.sarma/posts/540946075942810

https://www.facebook.com/vallury.sarma/posts/541320682572016

https://www.facebook.com/vallury.sarma/posts/545430402161044

కఠోపనిషత్ - 27 (July 1)
యముడు నచికేతసునికి పరబ్రహ్మ విద్య, అపరబ్రహ్మవిద్య ఒకేసారి ఉపదేశిస్తున్నాడు. ఇన్ని లోకములున్నవి. ఒకలోకమునుండి మరియొకలోకమునకు పోవుట ఉన్నది. ఈ భావన కలిగినవాడికే మృత్యువు ఉన్నది. అన్నీ ఒకటే, అన్నింటిలో ఉన్న వస్తువు ఒకటే, ఎక్కడున్నా ఒకటే అనేభావన కలిగినవాడికి మృత్యువులేదు. అంటే అతనిజీవస్థితి మృత్యువు తరువాత జీవునిది. ఆ స్థితిలోనే ఉండుటవలన అతనికి అవస్థా బేధములేదు. ఈ జ్ఞానంచేత అతడు మృత్యువును జయించినవాడవుతున్నాడు.
అణోరణీయాన్మహతో మహీయా
నాత్మా2స్య జంతోర్నిహితోగుహాయామ్
తమః క్రతు పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మహిమా నమాత్మనః (2.20)
మనకు అణువే కనబడదు. అణోరణీయాన్ - అణువులో అణువు వంటిది, మహతో మహీయాన్ - మనము పెద్దదిగా ఉంహించుకున్న దాని కంటె పెద్దది. జీవుల (సకల ప్రాణుల) హృదయగుహలో ఉన్నది. అదియే ఆత్మ. అక్రతుః- అంటే ఏకార్యమూ లేనివాడు. చూచేవాడు చూడబడేదీ అదే కాబట్టి ఆత్మకు ఏ ఇతర కార్యములేదు. పశ్యతి - దేహాత్మాభావన లేనివాడే హృదయగుహలోని వస్తువును చూడగలుగుతున్నాడు. వీతశోకః - శోకములేనివాడు అవుతున్నాడు. అక్రతుః- అంటే ఏకార్యమూ లేనివాడు. చూచేవాడు చూడబడేదీ అదే కాబట్టి ఆత్మకు ఏ ఇతర కార్యములేదు. పశ్యతి - దేహాత్మభావన లేనివాడే హృదయగుహలోని వస్తువును చూడగలుగుతున్నాడు. వీతశోకః - శోకములేనివాడు అవుతున్నాడు. ధాతుప్రసాదాత్ మహిమానమాత్మన - విధాత ప్రసాదమువలన ఆత్మను మహత్తును చూడగలుగుతున్నాడు.
________________

ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః
కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతు మర్హతి (2.21)
ఇది కూడా యోగి స్థితిని సూచించే మంత్రం. ఆసీనో దూరం వ్రజతి - అంటే కూర్చుండే దూరం వెళ్ళగలడు (శరీరం కాదు అతని ఆత్మ). శయానో యాతి సర్వతః - అంటే పరుండియే అన్నిచోట్లకు పోగలడు. మదామదం - సుఖ దుఃఖాలకు అతీతమైనది. మదన్య: కః జాతు మర్హతి - (ధర్మ దేవత చెపుతున్నది) ఇదంతా నాకు తప్ప అన్యులకు ఎలా తెలుస్తుంది? అజ్ఞానానికి వశమవని జీవులు నా వశంలో (మృత్యు వశంలో) ఉండరు. అజ్ఞానంలోని జీవులు ప్రతి జన్మలో మ్ర్త్యువు పాలబడుతున్నారు. వారు ఆత్మవస్తువును గురించి తెలుసుకొనరు. వేమన యోగి "పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అంటే ఇదే. ఒక యోగి, ఒక సామాన్యుడు ఒకలాగే కనుపించినా యోగి ఆత్మ పరిమిత దేహానికి లోబడి ఉండదు. అది సర్వ వ్యాపియై ఉంటుంది. ఆత్మ సర్వాంతర్యామి. దాని వ్యాప్తికి అవధులు లేవు. శయానో, ఆసీనో అన్న పదాలు ముఖ్యమైనవి. అవి సాధనా మార్గాన్ని సూచిస్తాయి. సాధకుడు నిద్రపోతున్నాడు. కూర్చొనినాడు అని ఇక్కడ అర్థం కాదు. శయానో అంటే నిద్రపోతున్నాడని కాదు. ఆసీనో అంటే మత్స్యాసనం వంటి యోగాసనాన్ని, శయానో అంటే శవాసనంలో పరుండి అని అర్థం చేసుకోవాలి. నచికేతుడు యమలోకానికి వెళ్ళిన యోగవిద్య ఇక్కడ బోధింపబడుతున్నది.
______________
అశరీరగ్ం శరీరేషు అనవస్తేష్వవస్తితం
మహాన్తం విభుమాత్మానాం మత్వాధీరో నశోచతి. (2.22)
యముడు ఇప్పుడు నచికేతునకు ఆత్మనుగురించిచెప్పడం మొదలు పెట్టాడు. అశరీరగ్ం శరీరేషు - శరీరంలో ఉంటుందికాని ఆత్మకు శరీరంలేదు. శరీరలక్షణములు ఏమీలేవు. అనవస్తేష్వవస్తితం - అస్థిరమైన వస్తువులలో ఉంటూ స్థిరముగాఉంటున్నది. ఆత్మ కేవలం మనుష్య శరీరములోనే ఉంటుందా ? సమస్త జీవరాసులన్నిటిలోనూ ఉంటుంది.భూమి సూర్యచంద్రులు అన్నిటిలోనూ ఉంటుంది. పర్వతాలలో ఉన్న ఆత్మగురించి కాళిదాసు కుమార సంభవం లో చెప్పాడు. "అస్త్యుత్తరస్య దిశిదేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజా" హిమాలయాన్ని దేవతాత్మ అంటాడు. అస్థిరమైన స్థావర జంగమాలన్నిటిలోనూ స్థిరమైన ఆత్మ ఉంటుందని భావం. మహాన్తం విభుమాత్మానాం - విభు అంటే సర్వ వ్యాపియైన ప్రభువు, ఉత్కృష్టమైన మహద్వస్తువు, సర్వ వ్యాపి ఐన ఆత్మను తెలుసుకొని (తక్కిన వన్నీ నశించునవే అని తెలుసుకొని) మత్వాధీరో నశోచతి - ధీరుడు దుఃఖించడు.
నాయమాత్మా ప్రవచనేనలభ్యో
న మేధయా న బహునా శ్రుతేన
యమేవైష వృణుతే తే నలభ్య
తస్యైష ఆత్మా వివృణుతే తమాగ్ం స్వామ్ (2.23)
ఈ ఆత్మ ప్రవచనముచేయుటవలన (బోధించుట వలన) లభించదు. బుద్ధి కుశలత (మేధాశక్తి) వలన లభించదు. వినడం వలననూ లభించదు. సాధనచేత తనకు తానే అజ్ఞాన భూమిక వదలిన యోగికి తెలియజేసుకుంటుంది. ఈ మంత్రాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి

_________________________-

కఠోపనిషత్ - 31 (July 13)
నాయమాత్మా ప్రవచనేనలభ్యో
న మేధయా న బహునా శ్రుతేన
యమేవైష వృణుతే తే నలభ్య
తస్యైష ఆత్మా వివృణుతే తమాగ్ం స్వామ్ (2.23)
ఈ ఆత్మ ప్రవచనముచేయుటవలన (బోధించుట వలన) లభించదు. బుద్ధి కుశలత (మేధాశక్తి) వలన లభించదు. వినడం వలననూ లభించదు. సాధనచేత తనకు తానే అజ్ఞాన భూమిక వదలిన యోగికి తెలియజేసుకుంటుంది. ఈ మంత్రాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి.
ప్రవచనం చెప్పేవారికి, వినేవారికి కేవలం దానివలన మాత్రమే ఆత్మజ్ఞానం రాదు. బుద్ధితో, తర్కముతో, వాక్యార్థములుచెప్పి ఎదుటివారిపై గెలువవచ్చును. కాని ఆగెలుపు వలన జ్ఞానంలభించదు. కేవలం యోగసాధన వలననే తెలుస్తుంది. నచికేతసునికికూడా అతని మేధాశక్తి వలన యముని బోధఅర్థం కాలేదు. అతని అంతరంగములో పుట్టిన ప్రశ్నకు అర్థంతెలుసుకునే పరిస్థితి తగిన గురువు లభించారు. ప్రశ్నకు అర్థాన్వేషణ తప్ప ఇతర పనులలో నిరర్థకత్వం అతనికి స్పష్టంగా తెలిసినది. కర్మకాండ యొక్క అనావశ్యకత కూడా తెలిసినది. అసలు రహస్యము తెలుసుకోవాలనే జిజ్ఞాస, తండ్రి మాటలోని శక్తి వలన యమదర్శనం లభించింది. యముడు ఇస్తానన్న ఇతర వరాలను తిరస్కరించగల శక్తి వచ్చినది.
శ్రవణము, మననము వలన కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఆపై స్థితి ఉన్నదనీ, దానికి సాధన అవసరమని ఈ ఉపనిషత్తు చెబుతుంది. శ్రుతి "ఆత్మావా అరే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో నిధిధ్యాసితవ్యో" అనుటచేత ప్రారంభమున శ్రవణ మననాదులే కర్తవ్యము. అంతకంటె సామర్థ్యము ఉపాధికి లేదుకనుక. "యత్పుండరీకం పురమధ్యసంస్థం తత్రాపి దహరం గగనం విశోక తస్మిన్ యదన్తః తదుపాసితవ్యం" అనుటచే యోగమందు హృదయపద్మములో ఉపాసించవలెనని స్పష్టము. ఇట్టి ఉపాసనవలన ఆత్మయే తానుగా సాక్షాత్కరించును. మనుష్యుడు మేధాశక్తితో, బుద్ధితో దానిని దర్శింపజాలడు.

Monday, January 22, 2018

కఠోపనిషత్ - 25, 26 & 27

https://www.facebook.com/vallury.sarma/posts/539483836089034

https://www.facebook.com/vallury.sarma/posts/539821756055242

https://www.facebook.com/vallury.sarma/posts/540217896015628


కఠోపనిషత్ - 25 (జూన్ 28)
సర్వే వేదా యత్పద మామనన్తి
తపాగ్ంసి సర్వాణిచ యద్వదంతి
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదగ్ం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ ( 2.15)
యమధర్మరాజు ఇంకొక రహస్యంచెబుతున్నాడు. సర్వే వేదా యత్పద మామనన్తి - అన్నివేదములు కూడా ఏ పదమును చెప్పుతున్నాయో, (ఇక్కడ పదం అంటే పరమ పదం, పరమ గమ్యం.) తపాగ్ంసి సర్వాణిచ యద్వదంతి - అన్ని తపస్సులు ఏమి చెబుతున్నాయో, దేనిని కోరి ఋషులు తపోదీక్ష, బ్రహ్మచర్య దీక్ష వహించి తపములు చేస్తున్నారో, దానిని గురించి, సంగ్రహేణ బ్రవీమి - సంగ్రహంగా వెబుతాను, ఓమిత్యేతత్ - అదే ప్రణవం (ఓంకారం). యముడు మంచి గురువుగా "నచికేతా! నీవు ఏమి అనుభవిస్తున్నావో చెప్పు" మని అడిగి, తానే నీవు ప్రణవార్థాన్ని అనుభవిస్తున్నావు అనిచెప్పాడు. మనస్సుతో, వాక్కుతో, కర్మతో జిజ్ఞాసువులు దేనిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాక్కు రూపంలో చెప్పాలంటే అదే ప్రణవం.
ఏతద్ద్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్ద్యేవాక్షరం పరమ్
ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్యతత్ (2.16)
ఈ ఓంకారము అక్షరము (నాశనములేనిది). అదిబ్రహ్మ వస్తువే. దీనిని ఎవరైతే జ్ఞాత్వా (తెలుసుకొని) యః యదిచ్ఛతి (ఏది కోరుకుంటారో) తస్య తత్ (అది అతనికి లభిస్తుంది.) ఊర్ధ్వలోకాలున్నవని తెలుసుకొనడం నిరుపయోగం. వాటిని అక్కడే పొందాలి. అదే అనుభవం. బ్రహ్మ జ్ఞానము ఏ ఉపాధిలోనున్నా పొందవచ్చును. (స్త్రీ పురుషుడు, ఏ కులము, మతమైనా సరే) ప్రణవోపాసనయే ఉత్తమ మార్గం.
ఒక సందర్శకుడు రమణ మహర్షిని ఒక కాగితంమీద తన పేరు, కనీసం ఒక అక్షరము వ్రాసి ఇమ్మని ప్రాధేయ పడ్డాడు. ఆయన సమాధానం
ఏక మక్షరం హృది నిరంతరం
భాసతే స్వయం లిఖ్యతే కథమ్
దానికి వారిదే తెలుగు అనువాదం
ఏకమై వెలుగునే హృదయమందెపుడు
ఏకమక్షరము మేమెటు వ్రాయగలము?
హృదయగుహలో ప్రకాశించే జ్యోతి ఆత్మ, అది అక్షరము, దానిని వ్రాయుట ఎట్లు? ఆ అక్షరమే ఓంకారము.

కఠోపనిషత్ - 26 (జూన్ 29)
ఏతదాలంబనగ్ం శ్రేష్ఠమేతదాలంబనం పరమ్
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే (2.17)
ఆలంబనమంటే చేయూత, ఆధారము. ఏతద్ అంటే ఇది (ఈ ప్రణవోపాసన) శ్రేష్ఠమైనది. పరమైనది. పరమ శ్రేష్ఠమని చెప్పుకోవచ్చు. దానిని ఆధారము చేసుకొని ఎట్టి ఫలమైనా పొందవచ్చును. ఏ విషయాన్నైనా మొదట బుద్ధితో గ్రహించాలి. తరువాత దాని ఉపాసనా విధానాన్ని తెలుసుకోవాలి. ఆవిధానంతో దాని అనుభూతిని పొందాలి. తన యావచ్ఛక్తినీ (ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులన్నీ) వినియోగించి ఆ అనుభూతి పొందాలి. అప్పుడు సాధకుడు సృష్టికి కేంద్రస్థానమైన బ్రహ్మలోకమును పొందగలిగిన మహిమాన్వితుడు కాగలడు. (బ్రహ్మ లోకే మహీయతే)
ఓంకారమే పరబ్రహ్మ. అదే అపర బ్రహ్మ (సగుణ బ్రహ్మ) కూడా. దానినే శబ్ద బ్రహ్మ అనికూడా అనవచ్చును. ఈనాదము నుండి వర్ణములు (వానిని సూచించే అక్షరములు) పుట్టినవి. వర్ణములకు మాతృకగా అకార, ఉకార, మకారములతో కూడిన ఓంకారము పుట్టినది. దానినుండి వర్ణములు పుట్టినవి. అ, ఉ, మ త్రిమూర్తులైన విష్ణువు, బ్రహ్మ, రుద్రులను సూచిస్తాయి. ఈ అక్షరములే సృష్టిని చూపిస్తాయి. శరీరములోని షట్చక్రములనే పద్మముల దళములపై మొత్తంఅక్షరమాల ఉంటుంది. హృదయాకాశము అనాహత పద్మ స్థానము. అనాహత పద్మమునకు అధిష్టానము యం అనే వాయు బీజము. దాని పన్నెండు దళముల బీజాక్షరాలు {క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ} ఈ అక్షరమాలను మొదటి, చివరి అక్షరాలనుకలిపిన కఠ అనే సంకేతంతో పిలుస్తారు. ఇది పాణిని వ్యాకరణంలోని మహేశ్వరసూత్రాల పరిభాష. ఈ కఠ స్థానము ప్రాముఖ్యత తెలిపే ఉపనిషత్తుగా ఈ కఠయోగము, కఠోపనిషత్తు అనేపేర్లు వచ్చాయి.


కఠోపనిషత్ - 27 (జూన్ 30)
ప్రణవోపాసనతో నిర్గుణ వస్తువును కోరుకొన్న సాధకుడు సృష్టియొక్క మూలకారణమునకు చేరగలడు. ప్రణవముగురించి చెబుతూ ధర్మదేవత ఆత్మను గురించి తరువాత మంత్రములో చెబుతున్నాడు.
నజాయతే మ్రియతే వా నా విపశ్చి
న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్
అజో నిత్య శాశ్వతో2యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే (2.18)
(ఆత్మ వస్తువు) నజాయతే మ్రియతే వా - పుట్టదు. చావదు. విపశ్చిత్ - (అది) జ్ఞాన స్వరూపము. కుతశ్చిత్ న బభూవ - దేని నుండి పుట్టలేదు, పాలు పెరుగుగా మారినట్లు అది పరిణామంగా ఏర్పడలేదు. అది అనాదిగా యథాస్థితిలోనే ఉన్నది. అజః - పుట్టనిది, నిత్యః - నిత్యమైనది, శాశ్వతః - శాశ్వతమైంది, అయం పురాణః - ఇది సనాతనమైనది, న హన్యతే హన్యమానే శరీరే - నశ్వరమైన శరీరముతో బాటు అది చంపబడదు. ఇక్కడ నిత్యము, శాశ్వతము అనే పదాల అర్థభేదం తెలుసుకోవాలి. (శ్రీవెంకటేశ్వరస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. అవి శాశ్వత పూజలు కావు.) ఆత్మ నిత్యము, శాశ్వతముకూడా. అదే బ్రహ్మము.
మంత్రము (2.19)లో కూడా ఈ విషయమే ప్రస్తావింపబడుతున్నది. చంపేవాడు, చంపబడేవాడు, చంపుతున్నానని అనుకునేవాడు, చంపబడ్డాను అని అనుకొనేవాడూ వీరు పలికేది సత్యంకాదు. వీరికి అసలు విషయం తెలియదు. ఈ రెండు శరీరములలోనున్న ఆత్మవస్తువు ఒక్కటే. అదే భౌతిక ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది - ఈ సత్యంపైనే యోగశాస్త్రమంతా అధారపడియున్నది. యోగ సాధనలకు ఫలం స్వస్వరూపజ్ఞానం.

కఠోపనిషత్ 22 & 23 (జూన్ 25)




 
 
తరువాత మంత్రం చాలా ముఖ్యమైనది.
తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణమ్
అధ్యాత్మయోగాది గమేన దేవం
మత్వాధీరౌ హర్షశోకో జహాతి. (2.12)
దుర్దర్శం - కంటికి కనుబడనిది (ఆత్మవస్తువు) శరీరమున్నది కాబట్టి తనకు తాను కనబడుతున్నది. శరీరము లేకపోతే తనకు తాను కనబడడు. అందుకే శరీరమే నేను అనే భావన కలుగుతున్నది. నేను అనేదాని నిజస్వరూపం తెలియటంలేదు. నేను అంటే ఆత్మను అని తెలియడం లేదు. గూఢం అంటే నిగూఢమైనది. అనుప్రవిష్టం అంటే లోపల ప్రవేశించినది. అదే ఆత్మ వస్తువు. "అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత" అని పరమాత్మ చెప్పినది. దూరాన ఉన్న గ్రహాలను, నక్షత్రాలనూ పరిశీలిస్తున్నాము కాని మన లోపలే ఉన్న ఆత్మను సాక్షాత్కారం చేసుకోలేక పోతున్నాము. ఇట్టి నిగూఢము, రహస్యము ఐన ఆత్మవస్తువు "గుహాహితం గహ్వరేష్ఠం" ప్రవేశించ వీలులేని హృదయ గుహలో ఉన్నది. పురాణం - ఇది సనాతనమైనది. శరీరము ఇంద్రియములు దానిని కనుగొనలేవు. తం దేవం - ఆ తేజోమూర్తియైన పరబ్రహ్మ వస్తువు, అధ్యాత్మయోగాది గమేన - ధ్యాన యోగముచేతనే పొందగలిగినది. మత్వాధీరౌ హర్షశోకౌ జహాతి - అట్టి ధీరులు, మహాత్ములు - సుఖదుఃఖాలను జయిస్తున్నారు. ధ్యానయోగము వలన లభించిన జ్ఞానంతో ఈ రెండూలేని ఉత్తమస్థితికి వెళ్తున్నారు.

________________

కఠోపనిషత్తులో ఈ (2.12)వ మంత్రసారము, సాధనామార్గములనే నూరుసంవత్సరాల క్రితం భగవాన్ రమణమహర్షి కావ్యకంఠ గణపతిమునికి అనుగ్రహించారు.
హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం
హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేన భాతి
హృద్విష మనసా స్వం చిన్వతా మజ్జతావా
పవన చలనరోధాతాత్మనిష్ఠో భవత్వం.
నచికేతసుడు ఉత్తమశిష్యుడని ప్రశంసిస్తూ, అలాంటి శిష్యులు తనకి కావాలని కోరుతూ ధర్మదేవత చెప్పినది ఈ (2.12) మంత్రం. ఆత్మ (రమణులు చెప్పిన నేను) మనలోనేఉండి అంతర్యామిగా ఉన్నది. చొరవీలులేని హృదయమనే గుహలో ఉన్నది. ఆ దేవతామూర్తి కరచరణాదులు కల దేవతామూర్తి కాదు. సమస్తదేవతలకు కారణభూతమైన తేజోరూపమైన పరబ్రహ్మ వస్తువు. దానిని తెలుసుకునేమార్గము అధ్యాత్మిక యోగమే. ప్రాణాయామాది సాధనా పద్ధతులతో ఎవరైతే ధీరుడైన యోగి, మూలాధారము మొదలైన చక్రములను జయించి, ఆత్మదర్శనముచేయగలడో, అతడు సుఖ దుఃఖములనే ద్వంద్వములను విడిచిపెడుతున్నాడు. దేహాత్మభావనలో ఉన్నవారికే సుఖము దుఃఖము. ఎవరైతే శరీరములో ఉండికూడా శరీరమును అధిగమించి వెళ్ళగలుగుతాడో, శరీరముతో అనుభవించే సుఖదుఃఖాలు అతనికి ఉండవు. అనుషంగము (మోహపూరితమైన సంబంధము, జంజాటము) చేత, ఈషణత్రయము (దారేషణ, పుత్రేషణ, విత్తేషణ) చేతనే సుఖదుఃఖాలు కలుగుతాయి. ఆత్మ దర్శనమంటే, శరీరానికి దూరమవడమే).
ఏతచ్ఛ్రుత్వా సం పరిగృహ్య మర్త్యః
ప్రవృహ్యధర్మ్యమణుమేతమాప్య
సమోదతే మోదనీయగ్ం లబ్ధ్వా
వివృతగ్ం సద్మ నచికేతనం మన్యే (2.13)
మర్త్యుడు (సహజంగా జనన మరణములు కలవాడు) ఇదంతావిని ధ్యానములో విషయము గ్రహించి, జీవాత్మ పరమాత్మల సంబంధమును తెలుసుకొని ఆనందదాయకమైన దానిని సంపాదించి, నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. ఇప్పుడు నచికేతసునికి ఆత్మ అనే గృహం (సద్మ) తెరువబడినది (వివృతమ్).
ఇప్పటి నచికేతసుని స్థితిని పరీశీలిద్దాం. అతడు పాంచభౌతిక శరీరములోలేడు. అగ్నిరూపములో వచ్చిన అతడు, యముడు ఇచ్చిన ఉదకము (ప్రాణములు) స్వీకరించి లిఙ్గ శరీరముతో (లేదా అంగుష్ఠమాత్ర పురుషునిగా) ఉన్నాడు. ఈస్థితిలో అతడి జీవుడు యమునిబోధ గ్రహించి, అతని భూలోక వాసనలను అధిగమించి తన హృదయములోని పరమాత్మను దర్శించగల అంతర్దృష్టిని పొందినాడు. బోధనాకాలంలోనే అతని హృదయగృహద్వారం తెరువబడి పరమ సత్యము అతనికి లభించినది. అంతర్ముఖునివై బ్రహ్మానుభూతిని పొందమని యముడు శిష్యునికి తన ఆశీస్సును ఇస్తున్నాడు.

కఠోపనిషత్ 20 &21 (జూన్ 23)

https://www.facebook.com/vallury.sarma/posts/537174212986663


https://www.facebook.com/vallury.sarma/posts/537695236267894


మంత్రములు 7,8 బ్రహ్మవిద్య గొప్పతనాన్ని, గ్రహించినవాడికి వచ్చే మహా ఫలాన్నీ చెబుతాయి. "ఈ విద్యను "అతర్క్యమానం" అంటే మనో బుద్ధులతో చర్చించడంకాదు సాధనతో ఆఫలాన్ని సాధించుకోవాలి" అని చెబుతున్నది 8వ మంత్రం. వాక్కు సాధనా మార్గాన్ని చెబుతుంది. ధ్యానం జ్ఞానమనే ఫలాన్ని అనుభూతి ద్వారా అందిస్తుంది.
నైషా తర్కేణ మతిరాపనేయా
ప్రోక్తా 2న్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ
యాం త్త్వమాపస్యత్య ధృతిర్బదాసి
త్వాదృఙ్నో భూయా నచికేతః ప్రష్టా (2.9)
ప్రేష్ఠ (ప్రియ శిష్యా) ఈ ఆత్మ తర్కమువలన పొందదగినది కాదు.మనోబుద్ధి వికాసములచేత తెలిసికొనబడేది కాదు. ఇతరులచేత (జ్ఞానులైన గురువులచేత) చెప్పబడినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నీవు సత్యమైన నిష్ఠతో వచ్చావు. నీవంటి ప్రశ్నలు అడిగేవాడు మాకు కలుగును గాక.
వేద మంత్రములు, ఉపనిషద్రహస్యములైన విద్యలూ అనర్హులకు తరగతిగదిలో ఎన్నడూ బోధింపబడలేదు. ప్రాచీన భారతీయ విద్యా విధానములో సమర్థులైన గురుశిష్యుల మధ్యమాత్రమే ఈ విద్యాబోధన జరిగినది. ఒక శిష్యుని అర్హత పరీక్షించి గురువు అతనికి తగిన జ్ఞానాన్ని, సాధనలో అనుభూతిపొందే మార్గాన్ని బోధించేవాడు.
కేనోపనిషత్తు లోని శాంతిమంత్రం అందరకూ తెలిసినదే.
ఓం: సహనావవతు సహనౌభునక్తు: సహవీర్యం కరవావహై: తేజస్వినా వధీతమస్తు: మా విద్విషా వహై: ఓం శాంతిః శాంతిః శాంతిః. 


(మన సామాన్య సైన్స్, ఇంజనీరింగ్ వంటి విద్యలలో ఈ పద్ధతి కొంతవరకు Ph.D. మార్గ నిర్దేశనంలో అనుభవంలోకి వస్తుంది. మన విశ్వవిద్యాలయ ఆచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు చదవగలిగితే వారి పరిశోధనలలో తప్పక ఉపకరిస్తాయి.)

Janaki Sistla చాలా చక్కగా గురు శిష్యుల సంబంధాన్ని వారి ఆత్మగత భావాన్ని తెలియ చేశారు. బ్రహ్మవిద్య విశిష్టతను:
మనోబుద్ధులతో చర్చించటంకాదు సాధనతో ఆఫలాన్ని సాధించు కోవాలని.
కేనోపనిషత్తు లోని మంత్రమును వుదాహరణగా చూపించి.

ఉపనిషత్ అంటేనే మనకు కలిగే భావన
___________________


కఠోపనిషత్ 21 (జూన్ 24)
పదవ మంత్రం నచికేతుని భావనలను సూచిస్తుంది. ఈ ఉపనిషత్తులోని ఇతర మంత్రాల వలేనే నిగూఢంగా ఉంటుంది.
జానామ్యహగ్ం శేవధిరిత్య నిత్యం
నహ్యధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్
జానామి అహం హి ఇతి (నేను నిశ్చయముగా ఎరుగుదును) - శేవధిః (కోశాగారం,ధనం, పాండిత్యం, ఆరోగ్యం, బలం ఇవన్నీ) అనిత్యమ్ (అనిత్యములే). అధ్రువై తత్ ధ్రువం న అప్రాప్యతే (అనిత్యమైన వస్తువులనుండి నిత్యమైన బ్రహ్మ వస్తువు లభించదు.)
తతో మయ నాచికేతశ్చితోగ్ని
రనిత్యైద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యమ్ (2.10)
అనిత్యమైన ద్రవ్యములచేత నచికేతాగ్ని అనే యజ్ఞము నాచేత చేయబడినది. ఇది గురూపదేశం వింటూ నచికేతుడు చేసిన అంతర్యాగం. కాని ఆయజ్ఞము చేతనే నేను నిత్యమైన దానిని పొందగలిగాను. (అనిత్యద్రవ్యైః ప్రాప్తవాన్ అస్మి నిత్యమ్.)
"ఒక వాక్యములో అనిత్యమైన వస్తువులచేత నిత్యమైన బ్రహ్మ వస్తువు పొందబడజాలదు" అని నిశ్చయంతో చెబుతూ నేను శరీరము మొదలగు అనిత్యవస్తువులతో నచికేతాగ్ని అనే క్రతువు చేశాను, నిత్యమైన వస్తువును పొందినవాడను అయ్యాను” అని వెంటనే చెప్పిన మాటకు అర్థం ఏమిటి? అనిత్యమైన యజ్ఞాది కర్మలవలన అనిత్యమైన స్వర్గాది భోగములు వస్తాయి. కాని అతడు యజ్ఞమును అక్కడ ఆపకుండా ఆఫలములనుకూడా యజ్ఞ భోక్తయైన పరమాత్మకే సమర్పించాడు. దేవతలు స్వర్గసుఖాలు కోరినవారికి అవి ఇస్తారు, వానిని స్వీకరించకపోతే ముక్తికారణమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నచికేతాగ్ని రహస్యం ఇదే. ఆత్మజ్ఞానము శాశ్వతఫలమని అర్థం.
పదకొండవ మంత్రం యముని మాటలు. " ఓ నచికేతసుడా! యజ్ఞాల వలన కోరికలు తీర్చుకోవడమనే సామాన్య గుణాన్ని నీవు వదలిపెట్టావు. శాశ్వతమైన మనోబలం కలవాడవయ్యావు. అంటే నీకు నిత్యానిత్య వివేకం వచ్చింది. మృత్యువు అనేది ఉన్నదని అందరికీ తెలుసు. అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియక భయం, మనోవైకల్యం పొందుతారు. కానినీవు మృత్యువును జయించి అంతకు ఉత్తమమైన బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నావు. అంటే మృత్యుభయాన్ని తరించి అవతలి ఒడ్డుకు చేరావు. సృష్టిలో సకలము అనిత్యమని, బ్రహ్మ జ్ఞానమే శాశ్వతమన్న స్పురణ నచికేతసునికి కలిగినదని గురువైన మృత్యుదేవతయే మెచ్చుకున్నాడు

కఠోపనిషత్ 18 & 19 (జూన్ 21)

https://www.facebook.com/vallury.sarma/posts/536186329752118

https://www.facebook.com/vallury.sarma/posts/536759193028165

ఈ ద్వితీయ వల్లిలో శ్రేయస్సు,ప్రేయస్సులను గురించిన సంభాషణ అంతా యమునిది. యముడు ఇంకా ఇలా చెబుతున్నాడు.
"స త్వం ప్రియాన్ప్రియ రూపాగ్ంశ్చ కామా
నభిధ్యాన్నచికేతో 2త్యస్రాక్షీః
వైతాగ్ం సృంకాం విత్తమయీ మవాప్తో
యస్యాం మజ్జన్తి బహవోమనుష్యాః (2.3)
నచికేతా! నీవు ధీరుడవై ప్రియమైన వానిని, ప్రియమైన రూపము గల వానిని విచక్షణతో త్యజించావు. లోకములో అనేక మనుష్యులు ప్రియమైన వస్తువులు, సుఖాసంతోషాల ధ్యాసలో మునిగిపోతున్నారు (మజ్జన్తి). నీవు సంపదలనే వలలో పడలేదు. ఈ విధంగా గురుస్థానంలోనున్న యమధర్మరాజు నచికేతసుణ్ణి ప్రశంసించాడు. దాని అర్థం "నీవు నశించే సంపదలనుకోరక బ్రహ్మ విద్యకు ఉత్తమాధికారివి అయ్యావు." ఇది యముని భావం.
దూరమేతే విపరీతే విషూచీ
అవిద్యాయా చ విద్యేతి జ్ఞాతా
విద్యాభీప్సినం నచికేతసం మన్వే
న త్వా కామా బహవో2లోలుపంత
విద్య, అవిద్య అని రెండున్నాయి. వాటి మధ్య చాలా దూరం (విషూచీ). అనేక మోహములు, కామములు నీకూ ప్రలోభము కలిగించలేదు.నచికితేసా!నీవు సత్యమైన జ్ఞానార్థివే. యముని ఉద్దేశ్యం "నచికేతస! నీవు సామాన్యులవలె కాదు, అందుచేత నీకు చెప్పేది శ్రద్ధగా స్వీకరించు” అని గుర్తుచేయడమే.
దీని అర్థం మనుష్యులలో విద్య, అవిద్య రెండూ ఉంటాయని కాదు. కేవలమూ అవిద్యయే ఉంటుంది. ముక్తిని కోరేవాడయితే అవిద్యకు అంచున ఉంటాడు. విద్య, అవిద్య పరస్పరవిముఖమైన దిశలలో ఉంటాయి. అవిద్య అనబడే లౌకిక సుఖలాలస అంతరించడమే ముముక్షత్వం. సాధకుడు విద్యను కోరుకొనేవాడు. ఆ విద్యను జయించినవాడు సిద్ధుడు.
అవిద్యాయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పండితం మన్యమానాః
దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః
అంధేనైవ నీయమాన యథంధాః (2.5)
అవిద్యలో జీవిస్తూ, తాము విద్వాంసులు పండితులు అనుకుంటారు. ఒక గ్రుడ్డివానికి మరియొక అంధుడు దారిచూపిస్తాను అంటాడు.త్రాగినవాడు తూలుతున్నట్లు, మూఢులు కామములలో మైమరచిఉంటారు. ఈ మంత్రము ప్రక్షిప్తమని కొందరుభావిస్తారు. కాని ధర్మదేవతయే ఉత్తములను గురించిచెప్పునపుడు, మూఢుల ప్రస్తావన కూడా వచ్చినది. ఇదే మంత్రం ముండకోపనిషత్తులో ఉన్నది. అక్కడ ఎక్కువ సందర్బోచితంగా కనుపిస్తుంది. సాధన చేయాలిగాని కేవలం పాండిత్యముతో తత్త్వ విమర్శ చేయడం నిరుపయోగమనే సూచన ఈ మంత్రములో ఉంది.

____________________________

కఠోపనిషత్ 19 (జూన్ 22)
న సాంపరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యన్తం విత్తమోహేన మూఢం
అయంలోకే నాస్తి పర ఇతిమానీ
పునః పునర్వశమాపద్యతే మే (2.6)
ధనమోహంచేత మూఢులు ప్రమాదంలో పడతారు. వారి మనసులో ఉత్తరలోకములు భాసించుటలేదు. తమ మరణానంతర స్థితిగతుల యోచన లేదు. “ఈలోకం కాక పరలోకంలేదు.” … ఇలా అనుకునేవారు మాటి మాటికీ నాపాలబడుతున్నారు. "పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం" అనే గతిలోనే వారు ఉన్నారు.
శ్రవణాయాపి బహుభిర్యో నలబ్ధః
శృణ్వంతో2పి బహవో యం నవిద్యుః
ఆశ్చర్యోవక్తా కుశలో2స్యలబ్ధా
ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః (2.7)
పరమార్థ వస్తువు అనేకుల బోధలు వినుటవలన దొరకదు. ఒకవేళ లభించి వినినా దానిని తెలుసుకోవడంలేదు. దానిని గురించి చెప్పేవారు అరుదు. విని విషయము గ్రహించినవాడు కుశలుడు.
యముని భావం: గురు ముఖతా ఈ విషయం వినాలి. విషయం పూర్తిగా తెలిసిన గురువులు అరుదు. వారు లోకంతో సంబంధాలు పెట్టుకోరు. వారంతవారు ఉపన్యాసాలు ఇవ్వరు. వింటే అర్థమవడం కూడా కష్టమే. ఎక్కడనైన పరమసత్యం బోధింపబడి, గ్రహించే శ్రోత శిష్యునిగా దొరికితే ఆశ్చర్యమే సుమా. ఇవన్నీ చెప్పి యముడు విషయానికి వస్తాడు.
న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చింత్యమానః
అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీరాన్హ్య తర్క్య మణుప్రమాణాత్ (2.8)
ఇది (ఈ బ్రహ్మవిద్య) సామాన్యుడైన నరునిచేత చెప్పబడినప్పుడు అనేక విధములుగా వర్ణించి చెప్పబడుతున్నది. అనుభవంలేని సామాన్యుడు అనేకవిధములుగా ఆలోచిస్తాడు. ఇన్ని విధములుగా చింతిస్తే ఇంకా క్లిష్టంగా అవుతుంది. ఇది తేలికగా చెప్పబడేది, తేలికగా అవగతం చేసుకొనేదీ కాదు. నరుడు కాక ఇతరుడు చెప్పుట తప్ప మార్గంలేదు. ఇది తర్కించలేనిది. సూక్ష్మమైనది. బహుధా ఆలోచించడం వలన ప్రయోజనంలేదు.

కఠోపనిషత్ 16 & 17 ద్వితీయవల్లి (జూన్ 19)

https://www.facebook.com/vallury.sarma/posts/535327216504696

https://www.facebook.com/vallury.sarma/posts/535784163125668

కఠోపనిషత్తులో అధ్యాయాలని వల్లి అంటారు. రామాయణములో కాండము, మహాభారతములో పర్వము, భాగవతములో స్కంధము అనే పేర్లు సుపరిచితములే. వల్లి అంటే లత. అనేక పుష్పములతో, మధుర ఫలములతో, అన్నివైపులా వ్యాపించి జ్ఞాన ఫలాలను ఇస్తుంది. అంతిమఫలం మోక్షం. హృదయాకాశం,నచికేతాగ్ని అనేపదాలతో, యాగం, యోగం అనే రెండు సనాతన ధర్మములోని అంగాలను ప్రథమవల్లి సమన్వయంచేసింది. నచికేతాగ్ని విద్య మృత్యుంజయత్వాన్ని ఇస్తుంది. ద్వితీయవల్లిలో చెప్పబడిన మోక్షవిద్య దీనికి తరువాతది. మనం షట్చక్రాలలో మూలాధార చక్రం గురించి చెప్పుకున్నాము. వెన్నెముకకు అడుగున ఉన్న చక్రమే ఇది. యోగసాధన ఈ చక్రంలో స్థితి కలిగియున్న గణపతి ఉపాసనతో ప్రారంభమౌతుంది. గర్భస్థ శిశువు పెరుగుదల, శరీరనిర్మాణము ఇక్కడనుండే ప్రారంభం అవుతాయి. పూర్వజన్మ కర్మలకు అనుగుణమైన సంస్కారములతో ఈ మూలాధార పద్మం చుట్టూ శరీర నిర్మాణము జరుగుతుంది. జీవుడు తల్లిగర్భంలో ఈ స్థానంలోనే ప్రవేశిస్తాడు. శరీరపు పెరుగుదలతో మిగిలిన చక్రాలు ఏర్పడతాయి.
మొదలుగా విశ్వవ్యాప్తమైన జలాలతో గర్భస్త శిశువులో ప్రాణ శక్తి వస్తుంది.జంతువులలో సామాన్యం గా మూలాధారం, కొన్నిటిలో స్వాధిష్ఠానం వరకు మాత్రమే ఉంటాయని పెద్దలు చెబుతారు. మూలాధారం నాలుగు దళాల పద్మం. బీజాక్షరాలు వం, శం,షం, సం. తూర్పుదిక్కుకు తిరిగి పద్మాసనంలో యోగ సాధన చేసేవ్యక్తికి తూర్పు దిశలో వం, దక్షిణాన శం, పశ్చిమాన షం, ఉత్తరాన సం ఉంటాయి. సం మృత్యువుకు, వం అమృతానికి సంకేతం. జననం, మృత్యువు మధ్య సంబంధాన్ని ఈ చక్రం సూచిస్తుంది. సాధనా విశేషాలు గురువు ద్వారానే లభిస్తాయి. ఈ చక్రంపై సాధన దీర్ఘాయువునిస్తుంది. ఇది మొదటి వల్లి బోధ.
అన్యచ్చ్రేయో2న్యద్యుతైవ ప్రేయ
స్తేఉభే నానార్థే పురుషగ్ం సినీతః
తయోశ్శ్రేయ ఆదదానస్య సాధు
భవతి హీయతే2 ర్ధద్య ఉ ప్రేయోవృణితే (2.1)
ప్రపంచంలో శ్రేయస్సు, ప్రేయస్సు అనిరెండు ఉంటాయి. మనం శ్రేయోభిలాషులు అనుకునేవారు నిజానికి ప్రేయోభిలాషులు. నశించే లక్షణముగల అష్టైశ్వర్యములు, పుత్రాదులు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము. శ్రేయస్సుకోరుకునేవారు ఉత్తములు. వీటినే ప్రవృత్తి , నివృత్తి మార్గములంటున్నాము.

__________________________

కఠోపనిషత్ 17 (జూన్ 20)
ప్రథమ వల్లిలో నచికేతసుడు తండ్రి సంతోషముకొరకు తాను పునః భూలోకానికి వెళ్ళే మొదటివరము, యోగసాధనలో తనకు దీర్ఘాయువును ప్రసాందించగలిగే నచికేతాగ్ని గురించిన రెండవ వరములతోబాటు ఆత్మ జ్ఞానమును, మృత్యురహస్యమును తెలియజేసే ఆత్మవిద్యను తృతీయవరముగా కోరి దానిని సంపాదించగల అర్హతను నిరూపించుకున్నాడు. దానికి సంతోషించిన ధర్మదేవత, ద్వితీయవల్లిలో, అతనికి మొదట జీవుని కోరికలలో శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయని చెబుతాడు. కర్మలచేత స్వర్గాది సౌఖ్యములు కోరువారు, వానిని పొందిన వారుకూడా మోక్షమార్గము విషయములో దారి తప్పిన వారే అని చెబుతాడు. కేవలము నచికేతాగ్నిని ఉపాసించడంవలననే సంపదలు, సౌఖ్యములు ఈ భూమిమీదే అనుభవిస్తాడనీ, వానిని తిరస్కరించడమే వివేకమనీ చెబుతాడు.
ప్రపంచంలో కొంత చదువు, సంస్కారము, జ్ఞానము ఉన్నవానిని కూడా స్వర్గ సౌఖ్యములే ఆకర్షిస్తున్నాయి కనుక వారు కూడా దారి తప్పినవారే అవుతున్నారు. జీవుడు ప్రేయస్సు అంటే కర్మఫలాల చేతనే ఆకర్షింపబడుతున్నాడు. భగవద్గీతలో భగవానుడు "యోగక్షేమం వహామ్యహం" అని ఆశ్వాసన ఇస్తాడు. లోకస్థితిలో ముందుకావలసినది క్షేమము. అంటే ఉన్నది రక్షింపబడడమే. కీర్తి ప్రతిష్ఠలు, సంతానం, సంపదలు చిరస్థాయిగా ఉండడమే క్షేమము. ఇది ప్రేయస్సులోని మొదటిమెట్టు. లేనివి రావడం, అంటే లేనివానిని కోరుకోవడం యోగం (ధనయోగం, వాహన యోగం, రాజయోగం). లేమి జీవులకు దుఃఖ కారణం. ఇలా అర్థంచేసుకుంటే యోగక్షేమములే ప్రేయస్సు. ఇది సామాన్యార్థం.
అనన్యాశ్చింతయంతోమాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.(భ.గీ.)
"అన్యచింతలేకుండా అన్నిటినీ వదలిపెట్టి నన్ను మాత్రమే ఉపాసించినవాని యోగక్షేమములు నేను వహిస్తాను" అని భగవానుడుచెప్పినప్పుడు సామాన్యమైన అర్థము వర్తించదు. అక్కడ యోగక్షేమములంటే శ్రేయస్సు నిచ్చేవి, పరమమైన స్థితికి తీసుకొని వెళ్ళేవి. అనన్య చింతన అనే యోగమునకు క్షేమము, అనగా మృతిలేని ముక్తి మార్గమునందు సుస్థిరుని చేస్తానని భావము.
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత
స్తౌ సంపరీత్య వివినక్తి ధీరాః
శ్రేయో హి ధీరో2భి ప్రేయసో వృణీతే
ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే (2.2)
శ్రేయస్సును, ప్రేయస్సును బాగావిచక్షణచేసిన వివేకియైన ధీరుడు శ్రేయస్సునే వరిస్తాడు. మందబుద్ధి కలవాడు లౌకికమైన యోగక్షేమములను వరించును.


The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...