Showing posts with label Aravind Rao. Show all posts
Showing posts with label Aravind Rao. Show all posts

Tuesday, January 16, 2018

రణరంగంలో లేని వర్గంతో యుద్ధం వ్యర్థం 14-06-2016


మరొక చారిత్రక సత్యాన్ని మనం గమనించాలి. ఏ మతమైనా కేవలం విశ్వాసంపైన ఎంతశాతం ఆధారపడింది, విశ్వాసం – తత్త్వం రెండింటిపై ఎంతశాతం ఆధారపడింది అనే ప్రాతిపదికపై ఆ సంస్కృతికి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ వేదాంతం భవిష్యత్తులో ప్రపంచ మతం అవుతుందని సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం వివేకానందుడు చెప్పిన మాటలోని సత్యాన్ని ప్రస్తుతం పాశ్చాత్యదేశాల్లో చూడగలం. సత్యమేవ జయతే అనే మాట నిజమేనని కొంత ఊరట కలుగుతుంది. పాశ్చాత్య మేధావుల్లో వస్తున్న మార్పును ఐలయ్యగారు గమనిస్తే బాగుంటుంది.
శ్ర‌మైక జీవనంలో ఏ కులమెంత’’ అనే శీర్షిన జూన్‌ 8వ తేదీన ఆంధ్రజ్యోతిలో మిత్రులు ఐలయ్య గారు రాసిన వ్యాసానికి నా స్పందన ఇది.
                  ఏ యుద్ధానికైనా ఒక లక్ష్యముంటుంది. శత్రువు ఎవడు, అతణ్ణి అణిచి మనం ఏమి సాధిస్తాం అనే లెక్క ఉంటుంది. లక్ష్యంలేని యుద్ధానికి ఏ తెలివైనవాడూ పూనుకోడు. యుద్ధరంగంలోనే లేని వ్యక్తిని శత్రువుగా ఊహించుకుని కత్తులు నూరడం తెలివైన పనికాదు. గతంలో ఒకాయన గాలిమిల్లులపై యుద్ధానికి వెళ్ళినట్టు కథలు విన్నాం. ఐలయ్యగారి వ్యాసం చూసిన తర్వాత నాకు ఇదే అనిపించింది.

                  ఉత్పత్తిరంగంలో బ్రాహ్మణులు లేరనీ, వీరెప్పుడూ శ్రమజీవులు కారనీ ఐలయ్యగారు ఎప్పుడూ వాదించే విషయం. ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా, ఏకాలంలోనైనా ఏదో ఒక వర్గం బౌద్ధిక రంగంలో ఉండగా మిగతా వర్గాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. షేక్స్‌ పియర్‌ గుంతలు తీస్తూ ఉండి ఉంటే మనకు ఈనాడు అద్భుత సాహిత్యం దొరికి ఉండేది కాదు. ప్రస్తుత సమాజంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు, జడ్జీలు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు మొదలైనవారు నాగలి పట్టడం లేదు, ఇటుకలు చేయడం లేదు. వారిని సోమరిపోతులనలేం కదా? ఒకనాటి బ్రాహ్మణ వర్గానికి సమాంతరంగా ప్రస్తుతం ఏర్పడిన వర్గం ఇది. మిత్రులు ఐలయ్యగారు కూడా ఒకనాటి వర్గీకరణ ప్రకారం బ్రాహ్మణులే. ఈనాటి శాస్త్రవేత్తల లాగానే ఆనాడు లోహవిజ్ఞానశాస్త్రం, శిల్పశాస్త్రం, ధనుర్విద్య, అశ్వశాస్త్రం, నిర్మాణశాస్త్రం (వాస్తుశాస్త్రం) మొదలైన వాటిలో భారతీయులు గొప్ప ప్రతిభ చూపారు. వీరిలో అనేకులు అగ్రవర్ణాలవారే అయి ఉండవచ్చు. వారందరూ సోమరులు కారు. చరిత్రలో గ్రామీణ సమాజంలో మిగతా అన్నివర్గాలతో పాటు బ్రాహ్మణులు, వైశ్యులు లాంటివారు కూడా సేద్యం చేశారు. హాలికులకు కుశలమా అని పొలం దున్నుతున్న పోతనను శ్రీనాథుడు పలకరించడం మనకు తెలిసిందే. బ్రాహ్మణులు స్వయంగా సేద్యం చేయడం లేదా దగ్గరుండి సేద్యం చేయించడం పల్లెల్లో ఇటీవల వరకూ అందరూ చూసిన విషయమే.

                  చరిత్ర నాకు అర్థమైనంత వరకూ బ్రాహ్మణులపైనా, క్షత్రియులపైనా శారీరక దాడులు పదవశతాబ్దం నుంచి మొదలయ్యాయి. ఈ రెండువర్గాలూ అనేక హింసల్ని ఎదుర్కొన్నాయి. యూరోపియన్లు మన దేశానికి వచ్చిన కొత్తలో కూడా గోవా లాంటి ప్రాంతాల్లో మత ప్రచారకులు కేవలం బ్రాహ్మణుల్ని లక్ష్యంగా పెట్టుకొని హింసించడం చరిత్రలో చూడగలం. Asia in the Making of Europe అనే పుస్తకం మొదటి సంపుటిలో Donald Lach అనే రచయిత ఈ విషయంపై అనేక వివరాల్ని ఇచ్చాడు. బ్రిటిష్‌ వారు వచ్చే సమయానికి సమాజంలో విలువలు మారాయి, శారీరక దాడులు బదులుగా బౌద్ధిక దాడుల్ని వారు వ్యూహంగా ఎంచుకున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాల్లో అతి తక్కువ వ్యవధిలో అక్కడి మతాల్ని పెకిలించివేసి తమ మతాన్ని వ్యాప్తి చేసిన ఘనత యూరోపియన్లకు ఉంది. ఆ పని భారతదేశంలో చేయలేకపోయారు. అనేకులు భారతీయ గ్రంథాల పట్ల ఆదరం పెంచుకున్నారు. ముఖ్యంగా అమెరికన్‌ మేధావులు ఇటీవలి కాలం వరకూ భారతీయ సంస్కృతిని ఎక్కువగా ఆదరించారు. ఇటీవలి కాలంలోనే పాశ్చాత్య ప్రపంచంలో మతతత్త్వం పెరిగిన తర్వాత ఒక సంస్కృతిపై బాంబులు వేయడం, మరొక సంస్కృతిపై పుస్తకాల బాంబులు వేయడం చేస్తున్నారు. పై వర్గాలు బ్రాహ్మణులపై బౌద్ధిక దాడులు చేస్తున్నాయంటే అర్థం చేసుకోగలం. వారి వ్యూహంలో భాగమది. కానీ ఐలయ్యగారి ఉద్దేశమేమిటో, లక్ష్యమేమిటో తెలియడం లేదు. వారు మరొక మతానికి పనిచేస్తున్నట్టుగా చెప్పలేం. పేరు మాత్రం షెప్పర్డ్‌ అని వ్రాసుకుంటున్నారు. షెప్పర్డ్‌ అనే పదం ఏసుక్రీస్తును కూడా సూచిస్తుందని మనకు తెలిసిన విషయమే. నిజమేమిటో వారికే తెలియాలి.

                  మ్యాక్స్‌ ముల్లర్‌, విలియమ్‌ జోన్స్‌, మెకాలే మొదలైన అనేక రచయితలకు వారి మతాన్ని వ్యాపింపజేయాలనే అజెండా ఉన్నా అనేక వాస్తవాల్ని మూసి పెట్టలేకపోయారు.What India Can Teach Us? అనే పుస్తకంలో మ్యాక్స్‌ ముల్లర్‌ భారతీయ మూలగ్రంథాల్నీ, బ్రాహ్మణుల పాత్రనూ చాలా ప్రశంసించారు. మత ప్రచారకులందరూ సంస్కృతం నేర్చుకోవాలని మెనియర్‌ విలియమ్స్‌ ప్రతిపాదించాడు. ఇదంతా ఆనాటి వ్యూహం. బ్రాహ్మణుల్ని తమ మతపరమైన ధర్మం నుండి మిగతా రంగాల్లోకి మళ్ళించడానికి బ్రిటిష్‌ వారు వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. అణకువతో, విశ్వాసంతో పనిచేసే వర్గం అని వారి ఉద్దేశం. బ్రాహ్మణులు కూడా తమ ధర్మాన్ని సులభంగా వదిలేసి ఆధునిక జీవనానికి అలవాటుపడ్డారు. ఇది ఉభయులకీ లాభదాయకంగా నడిచింది. హిందూధర్మానికి మాత్రం కొంత నష్టాన్ని కలిగించింది. బ్రాహ్మణులందరూ పల్లెల్ని వదిలి పట్టణాలకు చేరుకోవడం వల్ల గ్రామాల్లో హిందూమతం ఉనికి తగ్గిపోవడం, ఆ అవకాశాన్ని ఇతరులు తీసుకోవడం సహజ పరిణామం. హిందూధర్మాన్ని రక్షించడంలో ప్రస్తుతం బ్రాహ్మణులేమీ ముఖ్య పాత్ర తీసుకోవడం లేదు. గుళ్ళలో అర్చకత్వం చేయడానికి మిగతా వారెవరూ రానందువల్ల వీరు ఆ పనులు చేస్తున్నారు.

                  మరొక ముఖ్యవిషయం. అనాదిగా హిందూధర్మం బ్రాహ్మణులపైనే ఆధారపడి లేదు. విజ్ఞానాన్నంతా వారే దాచుకున్నారని చెప్పలేం. జ్ఞానులైన రాజుల వద్ద బ్రహ్మవిద్య నేర్చుకోవడానికి బ్రాహ్మణులు వెళ్ళినట్లు ఉపనిషత్తుల్లో చూస్తాం. మన ఋషులు ఏ వర్గానికి చెందినవారో తెలియదు. క్షత్రియుడైన జనకుడు గొప్ప బ్రహ్మజ్ఞాని. వ్యాసుడు, వాల్మీకి మొదలైనవారెవరూ బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణులు పూజించే రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు మొదలుకుని ఈనాటి సాయిబాబా వరకూ ఎవరూ బ్రాహ్మణులు కారు. చరిత్రలో అనేక క్షత్రియులు, వైశ్యులు, వెలమలు, రెడ్లు మొదలైనవారు వైదిక సంస్కృతిలో గొప్ప జ్ఞానం కల్గినవారు. ఇటీవలి కాలంవరకూ రాజులు, ఇతర అగ్రవర్ణాల వారు బ్రాహ్మణులతో సమానంగా పండితులే. 19వ శతాబ్దం మొదలుగా వివేకానందుడు మొదలైనవారు రంగంలోకి వచ్చాక బ్రాహ్మణులు కాని వారు అనేకులు హిందూధర్మాన్ని రక్షించడంలోనూ, వ్యాప్తిచేయడంలోనూ ఎంతో కృషి చేస్తుండటం చూడగలం. రామకృష్ణ మిషన్‌, చిన్మయ మిషన్‌, శివానంద మిషన్‌ మొదలైనవి ఏ వర్గానికీ చెందినవి కావు. మరొక అంశం సాంకేతిక విప్లవం. ఇది మత ప్రచారాల శైలినే మార్చివేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లోనూ, సోషల్‌ మీడియాలోనూ ఎంతో ప్రచారం జరుగుతోంది. విదేశాల్లోని భారతీయులు అనేకులు ఈ మాధ్యమాల ద్వారా భారతీయ సంస్కృతిని తెలుసుకోగలుగుతున్నారు. ఈ మాధ్యమాల్ని నడుపుతున్నవారు బ్రాహ్మణులొక్కరే కారు, అనేకులున్నారు. కులాల ఏర్పాటుకూ మతసిద్ధాంతానికీ సంబంధం లేదని ఇదివరకు కొన్నివ్యాసాలలో వ్రాశాను. పల్లెలు స్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తి కల్గిన యూనిట్లుగా ఉండడం వల్ల అనేక వృత్తులు చేసేవారు ఆయా కులాలుగా ఏర్పడ్డారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ కులాలు ఉపయోగపడ్డాయి. మనుషుల గుణాల ఆధారంగా వారి వర్ణాన్ని నిర్ణయించాలని మన పుస్తకాలు చెప్పడాన్ని ఇదివరకు చాలా వ్యాసాల్లో వ్రాశాను. అస్పృశ్యత అనే మాట మనుస్మృతిలో లేదని కూడా వ్రాశాను. సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వర్గంపై వివక్ష చూపిస్తూ వచ్చారు. దీనికి బ్రాహ్మణుల్నే కారణంగా తీసుకోవడానికి కారణాలు లేవు.
                  ప్రస్తుత ప్రపంచంలో మత ఆధిపత్యానికై సంఘర్షణలు జరుగుతుండడం అందరికీ తెలిసిన విషయమే. భారతదేశం ఒక గొప్ప సంఘర్షణ వేదిక అని కూడా తెలిసినదే. కానీ మిగతా మతాలకు ఉన్న సంస్థాగత వ్యవస్థ హిందూమతంలో లేదు. బ్రాహ్మణులు పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చారు, పట్టణాల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. అందరితో పాటే సామాజిక మార్పులో భాగంగా వీరూ మారారు. కేవలం ఇంగువ కట్టిన గుడ్డలాగ ఏవో కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు కానీ ధర్మరక్షకులుగా ఏమీ లేరు. యుద్ధరంగంలోనే లేని వర్గంపై పట్టు వదలని విమర్శలు చేయడం వల్ల ప్రయోజనమేమీ కనిపించడం లేదు. పరశురాముడి గూర్చి ఐలయ్యగారు చెప్పిన ఒక విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. త్రేతాయుగం కాలంలో ఏ పరిస్థితిలో పరశురాముడు గొడ్డలి పట్టుకుని తిరిగాడో మనకు తెలియదు కానీ వాల్మీకి అతణ్ణి అవతార పురుషుడిగా కీర్తించలేదు. మామూలు ఋషిగానే వర్ణించాడు. పరశురాముడు మనకు ఆదర్శం కాదని బ్రాహ్మణుల సభల్లో ఎన్నోసార్లు చెప్పాను.
                  మరొక చారిత్రక సత్యాన్ని మనం గమనించాలి. ఏ మతమైనా కేవలం విశ్వాసంపైన ఎంతశాతం ఆధారపడింది, విశ్వాసం – తత్త్వం రెండింటిపై ఎంతశాతం ఆధారపడింది అనే ప్రాతిపదికపై ఆ సంస్కృతికి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ వేదాంతం భవిష్యత్తులో ప్రపంచ మతం అవుతుందని సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం వివేకానందుడు చెప్పిన మాటలోని సత్యాన్ని ప్రస్తుతం పాశ్చాత్యదేశాల్లో చూడగలం. వారిలో మేధావులు చాలామంది తమ మతాన్ని వదిలేసి వేదాంతం, యోగ, బౌద్ధమతంల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదివరలోని ఒక ప్రముఖ నాస్తికుడు ఖ్చిఝ ఏ్చటటజీట అనే అతను ఇటీవల గ్చిజుజీుఽజ ఠఞ అనే పుస్తకం వ్రాసి సంచలనం సృష్టించాడు. ఇందులో వేదాంతం, బౌద్ధమతం, ధ్యాన పద్ధతుల గూర్చి ఆయన గొప్పగా వ్రాశాడు. కాబట్టి సత్యమేవ జయతే అనే మాట నిజమేనని కొంత ఊరట కలుగుతుంది. పాశ్చాత్య మేధావుల్లో వస్తున్న మార్పును ఐలయ్యగారు గమనిస్తే బాగుంటుంది.
                                                                                               అరవిందరావు కె.

కాలస్వరూపమే విశ్వరూపం


http://www.andhrajyothy.com/Artical?SID=249004

తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ విశ్వరూపం సుపరిచితమే. కౌరవులు కృష్ణుణ్ణి బంధించడానికి వచ్చినపుడు, అర్జునుడు యుద్ధభూమిలో చతికిలపడ్డప్పుడు కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించడం చూశాం. దేవతలు, రాక్షసులు మొదలైన అనేక ముఖాలతో కనిపించే రూపమది. దీని అర్థమేమిటి?
మనిషి ఏదో ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాలంటే తనకు ఆ విషయంపై తెలిసిన పూర్తి సమాచారాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాడు. అర్జునుడికి యుద్ధభూమిలో వచ్చిన సందేహం తాను చేస్తున్న యుద్ధం గురించి. యుద్ధానికి సన్నద్ధం కావడానికి ముందు అతడే మిత్రరాజులందరితో మాట్లాడి సైన్యాలు సమకూర్చుకున్నాడు. కృష్ణుడి దగ్గరికి స్వయంగా వెళ్లి సహాయం కోరాడు. అలాంటివాడికి ఒక సందేహం. యుద్ధంలో అనేక మంది వీరులు మరణించాల్సి వస్తుంది.. అదెంత వరకు సమంజసం అని. అతనికి అప్పటికున్న అవగాహనతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక కృష్ణ భగవానుడిని అడిగాడు. బహుశా గ్రంథకర్త వేదవ్యాసుడు అర్జునుడి నోట అడిగించిన ప్రశ్న ఇది. ఇది అన్ని కాలాల్లో, అన్ని దేశాలకూ అన్వయించే ప్రశ్న. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు యుద్ధాన్ని సమర్థిస్తూ “the war to end all wars’ అని వర్ణించారు. రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబుల వల్ల లక్షలాది ప్రజలు మరణించారు, ఆ స్మారకదినం సందర్భంగా కొద్ది రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు జపాన్‌ వెళ్లి ప్రసంగించాడు. అమెరికా చర్య కూడా శాంతి కొరకే అని చరిత్రకారులు చెప్పారు.
విశ్వరూపం విషయానికి వస్తే అది కృష్ణుడు అర్జునుడి సంశయాన్ని పోగొట్టడానికి చూపెట్టిన రూపం. అది నిజంగా దేవుడి స్వరూపమా..? అంటే అది భగవంతుని స్వరూపం కాదు. కేవలం ప్రకృతి రూపంలో కనిపిస్తున్న భగవంతుని శక్తి మాత్రమే. భగవంతుడు అంటే కేవలం చైతన్యం మాత్రమే ప్రకృతిలోని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే వాటి పరిణామంతో ఏర్పడిన విశ్వమే ఇది. కేవలం అర్జునుడి అవగాహన కొరకు కృష్ణుడు చూపించిన రూపమిది. రుగ్వేదంలో పురుషసూక్తం ఉంది. మనం ఏ గుడికి వెళ్లి పూజ చేయించినా అక్కడ ముఖ్యంగా వినిపించే సూక్తమిది.
‘సహస్రశీర్షా పురుషః..’ అంటూ మొదలవుతుంది. విశ్వాన్నంతా ఒకే వ్యక్తిగా కల్పించి వర్ణించిన భావన ఇది. ఈ వ్యక్తిని విరాట్‌ పురుషుడు అన్నారు. ఈ వ్యక్తికి వేయి తలలు అన్నారు. అంటే సరిగ్గా లెక్కపెట్టి వేయి అని కాదు. లెక్కించడానికి వీలులేని సంఖ్యలో (infinite) ఉన్న తలలు అని అర్థం. అలాగే అనంతమైన సంఖ్యలో కళ్లు, పాదాలు, అవయవాలు. ఇవన్నీ ఎక్కడివి అంటే ఇవన్నీ మనమే అన్నారు. సృష్టిలోని ప్రతీ జీవి తల, అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ఆ విరాట్‌ పురుషునికి చెందినవే. సృష్టి ప్రారంభం నుంచి పుట్టి, నశించిన జీవులన్నీ ఈ విరాట్‌ స్వరూపమే. మన శరీరంలో ఎన్నో కోట్ల జీవకణాలు పుడుతూ, మరణిస్తున్నట్లు.. ఈ విరాట్‌ స్వరూపంలో భూత, వర్తమాన, భవిష్యత కాలాల్లోని జీవరాశులన్నీ ఇమిడిపోయాయి. మన మిత్రులు, శత్రువులు ఇందులో భాగమే.
ఇలాంటి రూపాన్ని చూడడానికి శ్రీకృష్ణుడు దివ్యదృష్టి ఇచ్చాడట. దివ్యదృష్టి అంటే అదేదో ఒక త్రీడీ అద్దాలలాంటిది కాదు. భగవంతుని గురించి సూక్ష్మంగా ఆలోచించగలిగిన మనసునే ఈ దివ్యదృష్టిగా అభివర్ణించారు. ప్రపంచాన్ని ప్రపంచంగా, శత్రువులు, మిత్రులుగా కాకుండా భగవంతుని స్వరూపంలో చూడడమే దివ్యదృష్టి. ఈ రూపంలో అతడు చూసినదేమిటి? బ్రహ్మ, రుద్రులు, ఆదిత్యులు మొదలైన దేవుళ్లనంతా. వీరంతా వేర్వేరు వ్యక్తులు కారు. నిరంతరం జరుగుతున్న లయమే రుద్రుడు. దీనిలోనే అనేకమైన కోరలతో వికృతమైన నోళ్లతో భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారు ప్రవేశిస్తున్నారట. భయంకరమైన కోరలతో కొందరి తలలు నలుగుతున్నాయట. అర్జునుడే ఆ రూపాన్ని చూసి కంపించిపోయాడు. నీ స్వరూపమేమిటి అని ప్రశ్నించాడు. నేను కాలస్వరూపుణ్ని అన్నాడు కృష్ణుడు. కాలప్రవాహంలో రాజ్యాలు, రాజులు అన్నీ సమసిపోతుంటాయి. గ్రీకు పురాణాల ప్రకారం కాలపురుషుడు ఒక రెక్కల రథంపై గొప్ప కొడవలి తీసుకుని లోకాన్ని నరుక్కుంటూ వెళ్తుంటాడు. అలాంటి కాలస్వరూపాన్నే ఇక్కడ అర్జునుడు చూస్తాడు. కృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు. భీష్ముడు, కర్ణుడు మొదలైనవారంతా ఇప్పటికే నాచే చంపబడ్డారు. నీవు లేకున్నా వీరందరూ మరణించడం జరుగుతుంది. నీవు కేవలం నిమిత్తమాత్రుడుగా విల్లంబులు పట్టుకుని యుద్ధం చేయి. వీళ్లందరినీ జయించి కీర్తిపొందు అని అన్నాడు. దీనిలో ఒక శాశ్వతమైన సత్యం ఉంది. ప్రపంచంలో ధర్మానికీ, అధర్మానికీ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు పోటీపడి బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచివాళ్లు హింసకు గురవుతుంటారు.
దుర్మార్గులు లాభం పొందుతుంటారు. ధర్మానికి తీవ్రమైన గ్లాని ఏర్పడినపుడు మనిషి రూపంలోనే మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ సృష్టిలో ఉంది. ఈ ప్రక్రియను చూడటమే విశ్వరూప దర్శనం. విశ్వరూపం అంటే ప్రపంచ చరిత్రను ఒక తెరపై చూసినట్లు అవగాహన చేసుకోవడం. మనం సాధారణంగా వర్తమానాన్ని మాత్రమే చూస్తూంటాం. అలాకాకుండా చరిత్ర మొత్తాన్ని, రాబోయే కాలాన్ని చూడటమే ఈ దర్శనం. అన్నీ మంచే చూడాలని మనం సాధారణంగా కోరుకుంటాం. కొన్ని భయంకర సత్యాల్ని చూడడానికి ఇష్టపడం. మంచి చెడు అన్నింటినీ నిర్లిప్తతతో చూడడమే విశ్వరూప దర్శనం. మొదట్లో అర్జునుడు కృష్ణుడితో ‘నన్నెందుకు ఈ ఘోరమైన కార్యానికి వినియోగిస్తున్నావు?’ అని అడిగాడు. విశ్వరూపం దర్శనం తర్వాత అతని ప్రశ్నకు సమాధానం దొరికింది. అనంతమైన కాలచక్రంలో తాను ఒక చిన్న ముక్కను మాత్రమే అని, నిమిత్త మాత్రుడనే అని. తన ధర్మాన్ని అర్థం చేసుకుని కర్తవ్యాన్ని చేయడమే కర్మ యోగమనే పేరిట అర్జునుడికి చెప్పిన పాఠం. ప్రపంచం అనే కురుక్షేత్రంలో అంటే కార్య క్షేత్రంలో మనందరికీ వర్తించే పాఠమే ఇది.

మన సంస్కృతికి మనమే వారసులం

పురాణాలను చరిత్రగా వక్రీకరించి దేవతలంటే ఆర్యులనీ, రాక్షసులంటే శూద్రులనీ చెబుతూ మన సమాజంలో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం యూరోపియన్లు అడుగుపెట్టిన కాలం నుంచి ఉంది. ఇటీవల ఈ వక్రీకరణ మరీ వెర్రితలలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

బ్రాహ్మణిజం గురించి విమర్శలు మన మేధావుల నుంచి వింటూనే ఉన్నాం. పాపం వీరందరూ బయట ఎవరో రాసిన పుస్తకాల్లోని మాటలే చెబుతూంటారు. అయితే ఈ పాశ్చాత్యుల రచనల్లో ఈ మధ్య ఒక వింత వాదన వినిపిస్తోంది.
రెండవ ప్రపంచయుద్ధానికి ముందు జర్మనీలో లక్షలాది యూదుల్ని జర్మన్‌ దేశీయులు చంపడం తెలిసిందే. చాలామంది జర్మన్‌ పండితులు తమది ఆర్యజాతి అని చెప్పుకునేవారు. సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేశారు. దీన్ని ఆధారంగా తీసుకుని వైదిక సంస్కృతి జర్మన్‌లను బాగా ప్రభావితం చేసిందనీ, ఆర్యజాతి శూద్రులను అణచినట్లే జర్మన్లు యూదులను అణచివేశారని, అంతటితో ఆగకుండా చంపారని Sheldon Pollock అనే మేధావి విశ్లేషణ. కుమారిల భట్టు అనే అతను రాసిన పూర్వమీమాంస శాస్త్రం బ్రాహ్మణిజం భావజాలాన్ని పెంచిందనీ, ఆ భావజాలంతో ప్రభావితులై జర్మన్లు లక్షలాది మంది యూదులను చంపి సమర్థించుకున్నారని అతని వ్యాఖ్యానం. ఇంకొక రచయిత ఒక అడుగు ముందుకు వేసి హిట్లర్‌ కరుడుగట్టిన మీమాంసకుడు అనవచ్చని రాశాడు. ఈ రచనలను ఇటీవలే ప్రచురితమైన “The Battle for Sanskrit’ అనే పుస్తకంలో (పేజీ: 170) రాజీవ్‌ మల్హోత్ర అనే రచయిత ఉటంకించారు. ఆరు మిలియన్ల (అరవై లక్షలు) మంది యూదులను చంపిన క్రౌర్యాన్ని సమర్థించడానికి ఈ పండితులకు పూర్వమీమాంస పనికివచ్చింది. పూర్వమీమాంస కేవలం యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞవేదిక ఎలా ఉండాలి, ఎలాంటి ద్రవ్యాలు సేకరించాలి, ఏ సమయంలో సేకరించాలి, ఒక చెట్టు కొమ్మను తెంపినప్పుడు కూడా ఆ చెట్టుకు క్షమాపణ కోరుతూ ఏ మంత్రం చెప్పాలి.. మొదలైన అనేక వివరాలను చెప్పే శాస్త్రం. దీనికీ, అణచివేతకూ ఎలాంటి సంబంధం లేదు. మన మేధావులకు ఒక విజ్ఞప్తి సమాజశాంతి మన అవగాహన పైనా, దాని ఆధారంగా జరిగే ప్రచారంపైనా ఆధారపడి ఉంది. పూర్వ మీమాంస చదివి ఆ శాస్త్రం మన మనసుల్లో అణచివేత ధోరణులు పెంచుతుందా అని పరిశీలించుకుందాం.
అలాగే రామాయణాన్ని మనం అనాదిగా పారాయణం చేస్తున్నాం. రామాయణం చదివిన వాడెవ్వడూ తీవ్రవాది కాలేదు. రామాయణ ప్రసంగాలు చెప్పేవారెవ్వరూ తీవ్రవాదాన్నీ లేదా అణచివేతనూ ప్రోత్సహించలేదు. కానీ షెల్టన్‌ పోలాక్‌ రామాయణాన్ని సామాజిక అణచివేతకు చిహ్నంగా వర్ణిస్తాడు. ఆయన రచనలను మన బాలబాలికలు అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. లాటిన్‌లో ఉన్న బైబిల్‌ పై వ్యాఖ్య రాయాలంటే మన శాసు్త్రలవారిని ప్రమాణంగా తీసుకోం. అలాగే అరబిక్‌ భాషలో ఉన్న ఖురాన్‌ గురించి రాయాలంటే మరొక శర్మగారిని అడగం. కానీ మన వేదాలను, శాస్త్రాలను గూర్చి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న వ్యాఖ్యల్ని పక్కన ఉంచి ఆంగ్ల మేధావులు తమ రచనల్నే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడం ఒక ఆందోళనకరమైన పరిణామం. పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో ఇస్లాం మతాన్ని గురించి చెప్పడానికి ఆ మతస్థుడే ఉంటాడు. బౌద్ధమతం గురించి చెప్పడానికి ఒక బౌద్ధుడే ఉంటాడు. కానీ ఇండియా గురించీ లేదా హిందూమతం గురించీ చెప్పడానికి ఏ జర్మన్‌ దేశీయుడో, అమెరికన్‌ దేశీయుడో ఉంటారు. భారతీయులకు ప్రవేశమే లేదు. ప్రవేశం ఉండాలంటే అక్కడ ఇది వరకే ఉన్నవారి సిద్ధాంతాలను అంగీకరించాలి. సంస్కృతంపై పెత్తనం తద్వారా సంస్కృతిపై పెత్తనం వారి చేతుల్లోనే ఉండాలని వారి ప్రయత్నం. దీనికి తగినట్లుగా మన పండితులు కూడా తమ ప్రపంచంలో తాము ఉండటం, సమాజంలో ఎలాంటి విషపూరిత భావాలు వస్తున్నాయనేది గమనించక పోవడం శోచనీయం.
పై రచయితలు తమను తాము వామపక్ష భావాలు ఉన్న వారిగా ప్రకటించుకుంటారు. వామపక్షంవారు అన్ని మతాల్నీ ఒకే రీతిలో విమర్శించాలి. అయితే వీరు తమ మతంపై కానీ, వేరొక మతంపై కానీ పైన చెప్పిన విధంగా విమర్శలు చేయడం లేదు. కాబట్టి వీరు నిజంగా వామపక్షవాదులా లేదా ఆ ముసుగులో ఉన్న మతఛాందసవాదులా అన్న సందేహం వస్తుంది. అమెరికన్‌ మేధావులు దాదాపు 1950 వరకూ భారతీయ సంస్కృతిని ఎంతో పొగుడుతూ రాశారు. మన స్వతంత్ర పోరాట సమయంలో స్వతంత్ర ఉద్యమాన్ని సమర్థించారు. ముఖ్యంగా ప్రాచీన భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం గురించి Will Durant రాసిన “Our Oriental Heritage’ అనే పుస్తకం (ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది) మనమందరం చదవాల్సిన గ్రంథం. Emerson, Thoreau లాంటివాళ్లు వేదాంతాన్ని ఎంత ఆరాధించారో తెలిపే పుస్తకం Philip Goldberg . దీన్ని గూర్చి ఇదివరకు ఒక పూర్తి వ్యాసంలో ప్రస్తావించాను. “The American Veda’. అనే మరొక అమెరికన్‌ విద్వాంసుడు వైదిక సంస్కృతి, మిగతా దేశాలపై దాని ప్రభావాన్ని గురించి ఈ మధ్య చాలా పుస్తకాలు రాశారు. కానీ వీటిని విశ్వవిద్యాలయాల్లోని వ్యూహ కర్తలు అంగీకరించడం లేదు.
విశ్వవిద్యాలయాలు భారత సంస్కృతికి వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నాయి. మనదేశంలో నడుస్తున్న భావజాల పోరాటాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి అని గమనిస్తే.. పాశ్చాత్య దేశాల్లో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇందుకు కారణం. ఆ దేశాల్లో ప్రజలకు తమ మతంపై ఆదరణ తగ్గిపోవడం, ఇతర మతాలు పెరగడం వారికి ఆందోళన కలగజేస్తోంది.Michael Lindsay అనే సామాజిక శాస్త్రవేత్త “Faith in the Halls of Power’ (2007) అనే పుస్తకంలో దాదాపు నలభై ఏళ్లుగా అమెరికన్‌ సమాజంలో వస్తున్న మార్పులను గూర్చి రాశాడు. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలో కూడా మతం ఎలాంటి పట్టు సాధించింది అని ఆయన చాలా ఉదాహరణలతో వివరించాడు. ఈ పుస్తకాన్ని చూస్తే స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ప్రతీకగా ఉన్న అమెరికా మతతత్వ దేశంగా తయారవుతోందా అనే సందేహం కలగక మానదు. మత ప్రచారకులే వామపక్ష రచయితల ముసుగులో విశ్వవిద్యాలయాల్లో ఉండవచ్చనే సందేహం కూడా కలుగుతుంది. ఈ రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో వినగలం.
మల్హోత్రా రాసిన “The Battle for Sanskrit’ పుస్తకంలో ఇంకా ఆసక్తికరమైన విషయాలను చూడగలం. సంస్కృత భాష కూడా ప్రజలను అణచడానికే వచ్చి భాష అని చెప్పడం, యజ్ఞం మొదలైన కర్మలన్నీ సమాజంలో వర్ణవ్యవస్థను పటిష్టం చేయడానికి వచ్చినవనీ, ముస్లింలను అణచడానికి రామాయణాన్ని హిందూపండితులు ఉపయోగించుకుంటున్నారనీ (పేజీ: 182) ఇలాంటి ఎన్నెన్నో వింత వ్యాఖ్యానాల్ని ఈ పుస్తకంలో వివరించారు. ఇవన్నీ సంస్కృత పండితులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...