Showing posts with label శ్రద్ధ - అంగీరసుడు. Show all posts
Showing posts with label శ్రద్ధ - అంగీరసుడు. Show all posts

Monday, January 22, 2018

శ్రద్ధ - అంగీరసుడు - 4

https://www.facebook.com/vallury.sarma/posts/524785904225494

2/05/2013 సప్తర్షులు - ఋషి పత్నులు
ఇంతకీ అంగీరసుని భార్య, సంతానం ఎవరు? దీనికి ఒక సమాధానం చెప్పడం కష్టం.ఇక్కడే పురాణాలను వేదాలను గురించిన అవగాహన కావాలి. మహాభారతం ఆరణ్యపర్వంలో మార్కండేయుడు అంగీరసుణ్ణి గురించి చెబుతూ ఆయన భార్య శుభ అంటాడు. మనం శ్రద్ధ అనిచెప్పుకున్నాం. ఇంటర్నెట్లో వెదికితే ఒకొకచోట ఒకొకపేరు కనుపిస్తుంది. అంగీరసుని పై వ్యాసం చదివితే, వికి పీడియా వ్యాస రచయితకి విషయంఅర్థం కాలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక పురాణాలలో వేరు వేరు వాటిలో వేరువేరు పేర్లు కనిపిస్తాయి. మనంచెప్పుకున్న శ్రద్ధ, అంగీరస మిథునం ఈ కల్పములో స్వాయంభువ మన్వంతరంలోనిది. శివపురాణం ప్రకారం అంగీరసుని భార్య సురూప. చాక్షుస మన్వంతరం లోని దక్షప్రజాపతి కుమార్తె స్మృతి భర్త అంగీరసుడే. తరువాత కొంతకాలానికి అంగీరసుడే దక్షప్రజాపతి కుమార్తెలే ఐన స్వధా, సతి అనేవారిని పెళ్ళిచేసుకున్నాడని ఉన్నది. అంగీరసుని వంశజులందరినీ అంగీరసులుగా వ్యవహరించి ఉండవచ్చును.
అంగీరసుడు, ఇతర ఋషులు ఎంతకాలంజీవించారు? వారికి ఎందరు పత్నులు, సంతానం? ఇతర సంబంధాలు ఎందుకు కలిగినవి? అనే అనుమానం రావచ్చు.దీనికి అర్థంచేసుకోవడానికి లోకములు, సృష్టి గురించి పురాణములు వేదములు ఎల్లాచెప్పుతున్నాయో అవగాహన కావాలి. అంగీరసుని వంటి మహర్షులు బ్రహ్మ పుత్రులు. దేవతలే. వారే ప్రజాపతులు. వారి జీవితకాలం కల్పాంతం వరకూ ఉంటుంది. వారు ప్రతి మన్వంతరంలో ఆయా ప్రజాపతుల కుమార్తెలను వివాహంచేసుకొని భూమిపై సృష్టిని కొనసాగిస్తారు.ఇక్కడ కాలమానం వారికి క్షణాలలో జరిగిపోతుంది. వారు దివ్యరూపాలతో తమలోకానికి వెళ్ళిపోతారు. మనకి భూమిపై వేల సంవత్సరాలు వారికి క్షణాలు. భూమిపై వారున్న కాలం, వారు ధరించిన శరీరాలు,సంసార బంధాలు వారికి లీలా వినోదమే, జగన్నాటకములోని దృశ్యాలే.
ఈ ఇతిహాస పురాణాలు మూలాలతో సహా చదివినవారు భారతదేశంలో ఎందరుంటారు? ఉన్నా వారు ఇంగ్ళీషులో వివరణ వ్రాయలేరు. వీటిని ఒకశతాబ్దంక్రితం ఇంగ్లీషులో అనువదించినది ఆంగ్లేయులు. వారికి వేద, పురాణాల అంతరంగం అర్థంకాలేదు. ఒకరకమైన వ్యంగ్యంతోకూడి ఉంటుంది వారి అనువాదం. ఒక ఉదాహరణ విల్కిన్స్ అనే ఆయన 1900 లో వ్రాసిన పుస్తకం.Hindu Mythology, Vedic and Puranic, by W.J. Wilkins. ఆయన వేద, పురాణాలలోని ఋషులగురించి వ్రాసిన అధ్యాయం పేరు Part III - Inferior Deities, Chapter 1, The Divine Rishis : పాపం A superior English man writing about inferior gods and saints of the inferior natives! ఇప్పటికీ అనేక ఇండాలజిస్టులది అదేబాట.
అంగీరస మహర్షి ప్రసక్తి బౌద్ధ వాఙ్మయం లో కనుపిస్తుంది. గౌతమ బుద్ధుడు గౌతమగోత్రజుడు. అంగీరస, ఆయాస్య, గౌతములు ఋషులు. బౌద్ధుల త్రిపిటకాలలో ఒకటైన వినయ పిటకలోబుద్ధుని అభిప్రాయం కనుపిస్తుంది. ఆయన ఉద్దేశ్యంలో వేదాలలో అత్రి, విశ్వామిత్ర , వామదేవ, అంగీరస, జమదగ్ని,భరద్వాజ, వశిష్ఠ,కశ్యప, భృగు మహర్షులు ద్రష్టలైన మంత్రములు ప్రమాణములు. తరువాత చేర్చిన కొన్నిభాగములు ఆయన ప్రమాణంగా స్వీకరించలేదు. దీనిని బట్టి ఆయన వేదాలను నిరసించాడనే అభిప్రాయం తప్పని తెలిసినది. ఆయన నిరసించినది స్వర్గము, స్వప్రయోజనాలకొరకు చేసే కర్మకాండ.
వేదాలలో అంగీరసుడు అనేక ఋగ్వేద మంత్రాలకు, అధర్వణవేద, శుక్లయజుర్వేద మంత్రాలకు ద్రష్ట. ఏ ఋషులు ఏకాలంవారు అనే విషయాలు కూడా తెలియదు. మన సాంప్రదాయం ప్రకారం అరణ్యము వంటి వేదమును ఒక క్రమములో నాలుగు వేదములుగా విభజించి ఉద్యానంలా చేసినవాడు వేదవ్యాసుడు. ఈయన ద్వాపరంలో శ్రీకృష్ణుని కాలంవాడు. వేదాలు అంతకు యుగాల ముందువి. ప్రతి మన్వంతరంలోనూ ప్రజాపతులు ఉన్నారు. అంగీరసుని కూడా ఒక ప్రజాపతిగా పరిగణిస్తారు. ప్రత్యాంగిరా (దేవి) మంత్రములు [ఋక్కులు (ఋచాః)]35 ని అంగీరసుని పుత్రికలుగా తలుస్తారు. ఇక్కడ విశేషము ఒకటి ఉన్నది. దేవత అంటే వేదములో మంత్రమే. విల్కిన్స్ గారి పుస్తకంలో అంగీరసుని గుర్రించి వ్రాస్తూ "His so-called daughters, the Pratyangirasa Bichas, are thirty-five verses addressed to presiding divinities." ఈ బిచాస్ అన్న అచ్చుతప్పు వందలాది వెబ్సైట్లలో యథాతథంగా ఉన్నది. ఋచాః అని ఉండాలి. "so called" అన్నప్రయోగం మంత్రస్వరూపములే ఆదేవతలు అనితెలియక పోవడంవలన వచ్చినది. (ఉదా: ఓం నమః శివాయ, అనేమంత్రాన్ని అమ్మవారుగాను (శివా), దాని అర్థాన్ని శివతత్త్వంగానూ భావించవచ్చు. వాగర్థా అంటే అదే.)
సప్తర్షులు,వారి భార్యలు, సంతానాలు సూర్య చంద్రులు, గ్రహములు, నక్షత్రములు, ధ్రువుని వంటి హరిభక్తులు వీనికి సంబంధించిన గాథలకు జ్యోతిశ్శాస్త్రానికి, వైదిక ఖగోళ శాస్త్రానికి (Vedic Cosmology)కి చాలా సంబంధాలున్నాయి. మనం అంగీరసుని కుమార్తెలు రాకా, సినీవాలి గురించిచెప్పుకున్నాము.కొన్ని పురాణాలు ఇంకో ఇద్దరు కుమార్తెలు అనుమతి, కుహూ గురించి చెబుతాయి. ఇవన్నీ పౌర్ణమి అమావాస్య, వాని ప్రక్క తిథులు. ఈ పేర్లన్నిటిలో సృష్టి రహస్యం దాగి ఉంది. ఇవి పరిశోధించవలసిన విషయాలు. విష్ణు పురాణం, భాగవత పురాణం ఇంకా అనేక పురాణాలలో ఈ విషయాలు ఉన్నాయి.

శ్రద్ధ - అంగీరసుడు - 3

https://www.facebook.com/vallury.sarma/posts/524251597612258


అంగీరసుని శాపంతో ఋషి పత్నులు బృందావనం లో విప్రస్త్రీలుగా జన్మిస్తారు. ఒకదినం గోపాలకులు శ్రీకృష్ణ బలరాములతో కలసి అరణ్యంలో పశువులనుమేపడానికి వెళ్ళారు. అక్కడ వారికి ఆకలివేస్తుంది. వెంటనే గోపాలకులు రామకృష్ణులను ఆశ్రయిస్తారు. అప్పుడు కృష్ణుడు అక్కడ సమీపములోనే ఉన్న విప్రపత్నులను అనుగ్రహించదలచి గోపాలురతో ఇలా అంటాడు. "సమీపము లోనే కొందరు బ్రాహ్మణులు స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో అంగీరసమనే ఒక యజ్ఞము చేస్తున్నారు. అక్కడ అనేక ఆహార పదార్థాలు వండి సిద్ధంగా ఉన్నాయి. వెళ్లి వారితో మేము మిమ్మలిని పంపించామనిచెప్పి ఆ పదార్థాలు తీసుకొని రండి" అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు ఆ బ్రాహ్మణుల వద్దకు వెళ్లి "ధర్మం తెలిసిన విప్రులారా! రామకృష్ణుల ఆదేశం మేరకు మేము వచ్చాము. మేమంతా ఆకలిగా ఉన్నాము. మీరుమాకు ఆహారము ఈయండి" అని ప్రార్థిస్తారు. ఆబ్రాహ్మణులు శ్రీకృష్ణుని గురించి వినియున్నారు. కాని యజ్ఞదీక్షితులై ఉండి పూర్ణాహుతి జరగకుండా నైవేద్యములకు ఉద్దేశించిన ఆహారము ఈయవచ్చునా? అనే మీమాంసలో పడ్డారు. అవును, కాదు అని చెప్పలేదు. ఆపిల్లలకు విసుగుపుట్టి కృష్ణుని వద్దకు పరుగుపెట్టారు. కృష్ణుడు నవ్వి "వీరికి శాస్త్రములపై ఉన్న నమ్మకం సత్యంపైలేదు. స్త్రీలు సహజంగా ఎక్కువ ప్రపంచజ్ఞానము కలిగి ఉంటారు. వారి పత్నులను అడగండి." అని వెనుకకు పంపిస్తారు. గోపాలురు విప్రస్త్రీల వద్దకు వెళ్లి ప్రసాదం ఇమ్మని, రామకృష్ణులు ఆకలితో ఉన్నారని చెబుతారు. ఆస్త్రీలు వెంటనే వారు వండిన ప్రసాదాలనన్నిటినీ తీసుకొని కృష్ణుడు ఉన్న చోటికి వెడతారు. భర్తలు, పుత్రులు వారిస్తున్నా వారు లెక్కచేయలేదు. యమునా తీరంలో దరహాసంతో, శిఖి పింఛంతో, వేణువుతో, పీతాంబరంతో, వనమాలతో ఉన్న నల్లనయ్య వారికి కనుపిస్తాడు. వారు ఆ దర్శనంతో మైమరిచి చిత్తాన్ని హరిపరంచేస్తారు. కృష్ణుడు వారిని వెనుకకు వెళ్లి యజ్ఞము సమాప్తిచేయించండి అని చెబుతాడు. మా వారు వారిస్తుంటే వచ్చాం. మరల మమ్ములను రానిస్తారా అని వారి భయం. "నా సమీపమున నున్నారంచు నలుగరు బంధులు భ్రాతలు బతులు సుతులు మిము దేవతలైన మెత్తురంగనలార" అనికృష్ణుడు వారికి చెబుతూ వారుతెచ్సిన భక్ష్యాలు ఆరగిస్తాడు.
పరమేశ్వరార్పణంబుగ
బరజనులకు భిక్షమిడిన బరమపదమునన్
బరగెదరట తుది సాక్షా
త్పరమేశ్వరు భిక్షసేయ ఫలమెట్టిదియో..
ఆభర్తలు తమకు "కాంతలపాటి బుద్ధిలేదు" అని చింతిస్తారు. జపహోమాధ్యయనములు, తపస్సులు లేని తరుణులు భగవంతుని చేరగలిగితే, అన్నీ ఉండి భక్తిలేక తాము హరినిచేరలేకపోయామని ఆవిప్రులు ఆలస్యముగా తెలుసుకుంటారు. శ్రీకృష్ణుని అవతార సమయంలో చదువురాని గోపాలురు, గోపికలు ముక్తిపొందితే, ఆయన సాన్నిహిత్యంవలన బాగు పడనిది బ్రాహ్మణులు. వారికి కృష్ణుడు అద్భుతములుచేసే గొల్లపిల్లవానిగనే కనుపింఛాడు. యాదవులు అమాయకులై అతడిని ఆరాధిస్తున్నారు అనుకున్నారు. విప్రులు తమని తాము వేదాలు చదువుకున్న పండితులమని, సమాజంలో అధికులమని భావించుకునేవారు. యోగికి పాండిత్యముతో పనిలేదు. భక్తుల చిత్తాన్ని యోగి గ్రహింపగలడు. భాగవతం భక్తుల చరిత్ర. సామాజిక వర్గాలని కృష్ణుడు పట్టించుకోలేదు.
యజ్ఞపతియైన హరికి ఆహారమిచ్చి అంగీరసుని శాపంతో విప్ర స్త్రీలుగా జన్మించిన ఋషిపత్నులు తపోలోకం కంటె ఉన్నతమైన గోలోక దర్శనంచేసుకున్నారు. వేదాలు చదివిన విప్రులు తమ ఎదురుగా ఉన్న భగవంతుని పోల్చుకోలేకపోయారు.

శ్రద్ధ - అంగీరసుడు - 2

https://www.facebook.com/vallury.sarma/posts/523886970982054


అంగీరసుడు భార్య శ్రద్ధాదేవితో గృహస్థజీవనం ప్రారంభించిన తరువాత అనేక సంవత్సరాలు మోక్షకాములై ఆదంపతులు తపోమార్గంలోనే ప్రశాంతమైన చిత్తంతో ఉన్నారు. బ్రహ్మ చెప్పిన సంతానం విషయం ఆయనకప్పుడు స్ఫురణకు వచ్చింది. తరువాత ఆయనకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు కలిగారు. వారి పేర్లు చూస్తే మన పురాణాల్లో మనవాళ్ళు ఎంత అర్థవంతమైన వైవిధ్యమైన పేర్లు పెట్టుకున్నారో తెలుస్తుంది. కుమారుల పేర్లు - బృహత్కీర్తి, బృహజ్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనస, బృహన్మంత్ర, బృహద్భాను, బృహస్పతి. కుమార్తెల పేర్లు - భానుమతి, రాక, సినీవాలి, ఏకానేక, అర్చిష్మతి,హవిష్మతి, మహామతి. రాకా అంటే పున్నమి దినానికి అధిస్ఠానదేవత. సినీవాలి అంటే అమావాస్యదినానికి దేవత. బృహత్కీర్తిని ఉతథ్యుడు అని , బృహజ్జ్యోతిని సంవర్తుడనీ వ్యవహరిస్తారు. సంవర్తుడు బృహస్పతి అన్నగారు. తమ్ముని కంటె తేజస్వి. నిస్సంగుడు, బ్రహ్మజ్ఞాని, అవధూత. అంగీరసుని వంశం పుత్రపౌత్రాభివృద్ధితో తామర తంపరగా పెరిగినది. వాళ్ళని అంగీరసులు అంటారు. ఇతిహాస పురాణాలలో వాళ్ళపేర్లు వస్తాయి. అధర్వణ వేదానికి అంగీరసుడు, అధర్వుడు ముఖ్య ఋషులు. అంగీరసుని వంశంలో ఆయాస్యుడనే ఋషి , ప్రముఖుడు. అనేక వేదమంత్రాలకు ద్రష్ట. అనేకుల గోత్రాలలో, ప్రవరలలో అంగీరస, ఆయాస్య నామాలు నేటికీ కనుపిస్తాయి. ఆయనను తలచుకోవడం వారికి శ్రేయస్సుని ఇస్తుంది.
అగ్నిదేవునికి ఒకసమయంలో కోపం వచ్చింది. (దేవతలు కూడా రాగద్వేషాలకు అతీతులు కారు. వారూ పొరపాట్లు చేస్తారు. శాపగ్రస్తులౌతారు. అనేక పురాణాకథలవలన మనకు ఇది తెలుస్తున్నది.) ఇతరదేవతలకు మానవులకు మధ్య తనని ఒక వాహకుడిగా భావిస్తున్నారనేభావం అతడికి కలిగింది. అందరి హవ్యాలను మోసుకొని పోయే హవ్యవాహకుడిని మాత్రమే అని ఒక ఆత్మా న్యూనతాభావం వచ్చింది. అందరి గృహాలనుండి , యజ్ఞశాలల నుండీ తనకు తాను ఉపసంహరించుకున్నాడు. అగ్నులు వెలగడం మానివేశాయి. తనకు చెప్పకుండానే అగ్నిఎక్కడకో వెళ్లిపోయాడని ఇంద్రుడు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకుంటాడు. బ్రహ్మ అంగీరస మహర్షిని అగ్ని స్థానంలోఉండమనికోరాడు. అంగీరసుడు అందుకు అంగీకరించి వెంటనే అన్నిస్థానాలలో అగ్నిగా ప్రజ్వలించాడు. యజ్ఞా యాగాలు యథావిధిగా జరగడం మొదలైనది. అంగీరసుడు లోకపూజ్యుడు అయ్యాడు. అగ్నిదేవుని అందరూ మరచిపోయారు. ఇది అగ్నిని బాధించింది. ఇంద్రుని వద్దకు వెడితే అక్కడకు అంగీరసుడు వచ్చి అగ్నిస్థానాన్ని అతనికి ఇచ్చివేస్తాడు. అవసరమైనప్పుడు తాను అగ్నికి సహాయకునిగా ఉండడానికి అంగీకరిస్తాడు. అగ్నికి అంగారమనే పేరువచ్చింది.
అంగీరసులకి వేదంలో ప్రముఖ స్థానం ఉంది. వారిని మహర్షులు, దేవతలు, పితృదేవతలుగా పరిగణించింది వేదం. అంగీరస మహర్షి ఇతరమహర్షులతో కలసి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఋషి పత్నులు అక్కడనే ఉన్నారు. వారిపై అగ్నిదేవునకు మోహం కలిగినది. ఒకసారి బాగా ప్రజ్వలించి వారిని తాకే ప్రయత్నంచేశాడు. పాపం ఆ స్త్రీలకు ఏ అనుమానం రాలేదు. వెంటనే అగ్ని తన పాపాన్ని గ్రహించి పశ్చాత్తప్తుడౌతాడు. కాని ఈచర్య ఫలితంగా తేజస్సుకోల్పోతాడు. అంగీరసుడు అగ్నిస్పర్శచే తమభార్యలకుకూడా దోషం వచ్చినదని నిశ్చయించి వారిని శపించాడు. "మీరు భూలోకంలో బ్రాహ్మణస్త్రీలుగా ఒక జన్మఎత్తి ఈ పాపఫలం అనుభవించండి" - అని ఆశాపం. ఆ పత్నులు వెంటనే తమవలన దోషం ఏమీజరగలేదనీ, మహా తపస్సంపన్నులైన భర్తలను విడిచి జీవించలేమనీ అంగీరసుని ప్రార్థిస్తారు. అంగీరసుడు వారు తపోలోకానికి వచ్చినా ఇంకా పరమేశ్వరుని గురించిన పరిపూర్ణజ్ఞానం వారికి కలగలేదని, భూలోకంలో వారికి శ్రీకృష్ణ దర్శనమౌతుందనీ, ఆయన ద్వారా తక్షణమే గోలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతాడు. అక్కడనుండి తపోలోకానికి తిరిగి వచ్చి వారి, భర్తలను కలుసుకుంటారని అనుగ్రహించాడు. బ్రాహ్మణ స్త్రీలుగా జన్మించిన ఈఋషి పత్నుల కథ భాగవతం దశమస్కంధంలో ఉన్నది.
(సశేషం , 3వ భాగం రేపు.)


Nandiraju Radhakrishna అగ్నిదేవుడంతటివాడు కూడ ఆగ్రహం వల్ల ఎంతో అరిష్టం కొనితెచ్చుకున్నాడన్న మాట. అంగీరసుడు ప్రత్యామ్నాయుడయ్యాడు."అంగీరసుడు లోకపూజ్యుడు అయ్యాడు." -నేను- లేకపోతే ప్రపంచం నడవదనుకోవడం మూర్ఖత్వమే ఔతుందని సాక్షాత్తు బ్రహ్మ (అగ్నిదేవుని ద్వారా) మానవులకు గుణపాఠం నేర్పాడు. ఒక మంచి మాట చెప్పారు. నమస్కారం శర్మగారు.

సప్తర్షులు - ఋషి పత్నులు

https://www.facebook.com/vallury.sarma/posts/523550244349060

సప్తర్షులు - ఋషి పత్నులు

సప్తర్షులు ఎవరు? వీళ్ళు శాశ్వతం కాదు. ప్రతి మన్వంతరంలోనూ వేరువేరు ఋషులు ఉంటారు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరంలో సప్తర్షులు - మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్త్య, వశిష్ఠులు. అలాగే ప్రస్తుత వైవస్వత మన్వంతరం లో కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజులు. వీరందరూ ప్రసిద్ధులు. మరి మధ్యమన్వంతరాలలో ఎవరు? వీరి పేర్లు తెలుసుకోవచ్చు కాని వీరినిగురించిన సమాచారం అంతగా లభించదు. రాబోయే సావర్ణి మన్వంతరంలో వేదవ్యాసుడు, ఋష్యశృంగుడు, కృపాచార్యుడు, ద్రౌణి, దీప్తిమత, గాలవ, రామ అనే వారు సప్తర్షులు. వీరిలో తెలిసిన వారినిగురించి చెప్పుకుందాం.
శ్రద్ధ - అంగీరసుడు
సృష్టి ప్రారంభంలో సృష్టింపబడిన సప్త మహర్షులలో అంగీరసుడు మూడవవాడు. ఇతడిని బ్రహ్మ తన మనస్సుతోకాక బుద్ధితోసృష్టించాడట. బ్రహ్మ మొదట సృష్టించిన మానసపుత్రులు సనక సనందనాదులు, నారదాదులు వివాహమునకు, అనంతర సృష్టికి ఉత్సాహం చూపక తపస్సుకు వెళ్ళిపోయారు. అందుచేత బ్రహ్మ అంగీరసుని సృష్టించగానే ఇలా అన్నాడు. "నేనెప్పుడు స్మరిస్తే అప్పుడు నావద్దకు వచ్చి, నేను చేయమన్న కార్యం నిర్వర్తించు. అదే నీ ఉద్యోగం." అంగీరసుడు బ్రహ్మతో వెంటనే " నీవు నన్ను ఎందుకు సృష్టించావో నీకు తెలుసు. అందుకే నీవు ఎప్పుడు ఏది ఆనతిస్తే, అది శిరసావహిస్తాను." అని బదులిచ్చాడు. బ్రహ్మ అతడిని ముందు తపస్సులో ఉత్తీర్ణుడవై తరువాత గృహస్థునివై సంతానాన్ని పొందు" అని ఆదేశిస్తాడు.బ్రహ్మాండమైన తేజస్సు బ్రహ్మ అంగీరసునకు ఇచ్చాడు. అంగీరసుడు దేహాత్మ భావాన్ని పరిత్యజించి, బ్రహ్మ జ్ఞానానికై లోక సంగ్రహార్థం ఎన్నో సంవత్సరాలు తపస్సుచేశాడు. అనేక వేదమంత్రాలకు ద్రష్టయై వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందచేశాడు.
సరస్వతీ నదీ తీరంలో తపస్సుచేసి కర్దమ ప్రజాపతి, భార్య దేవహూతి మహావిష్ణువు అనుగ్రహంతో తొమ్మండుగురు ఆడపిల్లలను కన్నారు. వారికి తగిన వరులకై అన్వేషిస్తూ, తన పుత్రికలను బ్రహ్మర్షులకే ఇచ్చి వివాహం చేస్తానని సంకల్పం చేసుకున్నాడు.ఈ పుత్రికల తరువాత మహావిష్ణువు అవతారమేఐన కపిలుని కుమారుడుగా పొందారు. ఆ కపిలుడే సృష్టి రహస్యాన్ని చెప్పే సాంఖ్యాన్ని ప్రతిపాదించాడు. తన తల్లికే గురువై మార్గోపదేశం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇది భాగవతంలో ఉన్నది. స్వాయంభువ మన్వంతరంలోని సప్తర్షులకు, భృగు మహర్షికి, అధ్వర్య మహర్షికి కర్దమ ప్రజాపతి, దేవహూతి తమ తొమ్మండుగురు కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు. ఈ మిధునాల నామాలు ఇలా ఉన్నాయి. మరీచి - కళ, అత్రి - అనసూయ, అంగీరస -శ్రద్ధ, పులస్త్య - హవిర్భువు, పులహ - గతి, క్రతువు - క్రియ, భృగు -ఖ్యాతి, వశిష్ఠ – అరుంధతి, అధ్వర్య –శాంతి.
అంగీరసుడు భార్య శ్రద్ధాదేవితో గృహస్థజీవనం ప్రారంభించిన తరువాత అనేక సంవత్సరాలు మోక్షకాములై ఆదంపతులు తపోమార్గంలోనే ప్రశాంతమైన చిత్తంతో ఉన్నారు. బ్రహ్మ చెప్పిన సంతానం విషయం ఆయనకప్పుడు స్ఫురణకు వచ్చింది. తరువాత ఆయనకు ఏడుగురు కొడుకులు,ఏడుగురు కుమార్తెలు కలిగారు. వారి పేర్లు చూస్తే మన పురాణాల్లో మనవాళ్ళు ఎంత అర్థవంతమైన వైవిధ్యమైన పేర్లు పెట్టుకున్నారో తెలుస్తుంది. కుమారుల పేర్లు - బృహత్కీర్తి, బృహజ్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనస, బృహన్మంత్ర, బృహద్భాను, బృహస్పతి. కుమార్తెల పేర్లు - భానుమతి, రాక, సినీవాలి, ఏకానేక, అర్చిష్మతి,హవిష్మతి, మహామతి.
(ఈ బృహత్ అన్న విశేషణం మాబెంగుళూరు బాగా వాడుకున్నది. మా కార్పొరేషన్ పేరు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP). మీ హైదరాబాద్ తెలుగులో గ్రేటర్ (GHMC) అంటారేమో! ) రాకా అంటే పున్నమి దినానికి అధిస్ఠానదేవత. సినీవాలి అంటే అమావాస్యదినానికి దేవత.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...