Tuesday, January 16, 2018

మన సంస్కృతికి మనమే వారసులం

పురాణాలను చరిత్రగా వక్రీకరించి దేవతలంటే ఆర్యులనీ, రాక్షసులంటే శూద్రులనీ చెబుతూ మన సమాజంలో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం యూరోపియన్లు అడుగుపెట్టిన కాలం నుంచి ఉంది. ఇటీవల ఈ వక్రీకరణ మరీ వెర్రితలలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

బ్రాహ్మణిజం గురించి విమర్శలు మన మేధావుల నుంచి వింటూనే ఉన్నాం. పాపం వీరందరూ బయట ఎవరో రాసిన పుస్తకాల్లోని మాటలే చెబుతూంటారు. అయితే ఈ పాశ్చాత్యుల రచనల్లో ఈ మధ్య ఒక వింత వాదన వినిపిస్తోంది.
రెండవ ప్రపంచయుద్ధానికి ముందు జర్మనీలో లక్షలాది యూదుల్ని జర్మన్‌ దేశీయులు చంపడం తెలిసిందే. చాలామంది జర్మన్‌ పండితులు తమది ఆర్యజాతి అని చెప్పుకునేవారు. సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేశారు. దీన్ని ఆధారంగా తీసుకుని వైదిక సంస్కృతి జర్మన్‌లను బాగా ప్రభావితం చేసిందనీ, ఆర్యజాతి శూద్రులను అణచినట్లే జర్మన్లు యూదులను అణచివేశారని, అంతటితో ఆగకుండా చంపారని Sheldon Pollock అనే మేధావి విశ్లేషణ. కుమారిల భట్టు అనే అతను రాసిన పూర్వమీమాంస శాస్త్రం బ్రాహ్మణిజం భావజాలాన్ని పెంచిందనీ, ఆ భావజాలంతో ప్రభావితులై జర్మన్లు లక్షలాది మంది యూదులను చంపి సమర్థించుకున్నారని అతని వ్యాఖ్యానం. ఇంకొక రచయిత ఒక అడుగు ముందుకు వేసి హిట్లర్‌ కరుడుగట్టిన మీమాంసకుడు అనవచ్చని రాశాడు. ఈ రచనలను ఇటీవలే ప్రచురితమైన “The Battle for Sanskrit’ అనే పుస్తకంలో (పేజీ: 170) రాజీవ్‌ మల్హోత్ర అనే రచయిత ఉటంకించారు. ఆరు మిలియన్ల (అరవై లక్షలు) మంది యూదులను చంపిన క్రౌర్యాన్ని సమర్థించడానికి ఈ పండితులకు పూర్వమీమాంస పనికివచ్చింది. పూర్వమీమాంస కేవలం యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞవేదిక ఎలా ఉండాలి, ఎలాంటి ద్రవ్యాలు సేకరించాలి, ఏ సమయంలో సేకరించాలి, ఒక చెట్టు కొమ్మను తెంపినప్పుడు కూడా ఆ చెట్టుకు క్షమాపణ కోరుతూ ఏ మంత్రం చెప్పాలి.. మొదలైన అనేక వివరాలను చెప్పే శాస్త్రం. దీనికీ, అణచివేతకూ ఎలాంటి సంబంధం లేదు. మన మేధావులకు ఒక విజ్ఞప్తి సమాజశాంతి మన అవగాహన పైనా, దాని ఆధారంగా జరిగే ప్రచారంపైనా ఆధారపడి ఉంది. పూర్వ మీమాంస చదివి ఆ శాస్త్రం మన మనసుల్లో అణచివేత ధోరణులు పెంచుతుందా అని పరిశీలించుకుందాం.
అలాగే రామాయణాన్ని మనం అనాదిగా పారాయణం చేస్తున్నాం. రామాయణం చదివిన వాడెవ్వడూ తీవ్రవాది కాలేదు. రామాయణ ప్రసంగాలు చెప్పేవారెవ్వరూ తీవ్రవాదాన్నీ లేదా అణచివేతనూ ప్రోత్సహించలేదు. కానీ షెల్టన్‌ పోలాక్‌ రామాయణాన్ని సామాజిక అణచివేతకు చిహ్నంగా వర్ణిస్తాడు. ఆయన రచనలను మన బాలబాలికలు అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. లాటిన్‌లో ఉన్న బైబిల్‌ పై వ్యాఖ్య రాయాలంటే మన శాసు్త్రలవారిని ప్రమాణంగా తీసుకోం. అలాగే అరబిక్‌ భాషలో ఉన్న ఖురాన్‌ గురించి రాయాలంటే మరొక శర్మగారిని అడగం. కానీ మన వేదాలను, శాస్త్రాలను గూర్చి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న వ్యాఖ్యల్ని పక్కన ఉంచి ఆంగ్ల మేధావులు తమ రచనల్నే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడం ఒక ఆందోళనకరమైన పరిణామం. పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో ఇస్లాం మతాన్ని గురించి చెప్పడానికి ఆ మతస్థుడే ఉంటాడు. బౌద్ధమతం గురించి చెప్పడానికి ఒక బౌద్ధుడే ఉంటాడు. కానీ ఇండియా గురించీ లేదా హిందూమతం గురించీ చెప్పడానికి ఏ జర్మన్‌ దేశీయుడో, అమెరికన్‌ దేశీయుడో ఉంటారు. భారతీయులకు ప్రవేశమే లేదు. ప్రవేశం ఉండాలంటే అక్కడ ఇది వరకే ఉన్నవారి సిద్ధాంతాలను అంగీకరించాలి. సంస్కృతంపై పెత్తనం తద్వారా సంస్కృతిపై పెత్తనం వారి చేతుల్లోనే ఉండాలని వారి ప్రయత్నం. దీనికి తగినట్లుగా మన పండితులు కూడా తమ ప్రపంచంలో తాము ఉండటం, సమాజంలో ఎలాంటి విషపూరిత భావాలు వస్తున్నాయనేది గమనించక పోవడం శోచనీయం.
పై రచయితలు తమను తాము వామపక్ష భావాలు ఉన్న వారిగా ప్రకటించుకుంటారు. వామపక్షంవారు అన్ని మతాల్నీ ఒకే రీతిలో విమర్శించాలి. అయితే వీరు తమ మతంపై కానీ, వేరొక మతంపై కానీ పైన చెప్పిన విధంగా విమర్శలు చేయడం లేదు. కాబట్టి వీరు నిజంగా వామపక్షవాదులా లేదా ఆ ముసుగులో ఉన్న మతఛాందసవాదులా అన్న సందేహం వస్తుంది. అమెరికన్‌ మేధావులు దాదాపు 1950 వరకూ భారతీయ సంస్కృతిని ఎంతో పొగుడుతూ రాశారు. మన స్వతంత్ర పోరాట సమయంలో స్వతంత్ర ఉద్యమాన్ని సమర్థించారు. ముఖ్యంగా ప్రాచీన భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం గురించి Will Durant రాసిన “Our Oriental Heritage’ అనే పుస్తకం (ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది) మనమందరం చదవాల్సిన గ్రంథం. Emerson, Thoreau లాంటివాళ్లు వేదాంతాన్ని ఎంత ఆరాధించారో తెలిపే పుస్తకం Philip Goldberg . దీన్ని గూర్చి ఇదివరకు ఒక పూర్తి వ్యాసంలో ప్రస్తావించాను. “The American Veda’. అనే మరొక అమెరికన్‌ విద్వాంసుడు వైదిక సంస్కృతి, మిగతా దేశాలపై దాని ప్రభావాన్ని గురించి ఈ మధ్య చాలా పుస్తకాలు రాశారు. కానీ వీటిని విశ్వవిద్యాలయాల్లోని వ్యూహ కర్తలు అంగీకరించడం లేదు.
విశ్వవిద్యాలయాలు భారత సంస్కృతికి వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నాయి. మనదేశంలో నడుస్తున్న భావజాల పోరాటాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి అని గమనిస్తే.. పాశ్చాత్య దేశాల్లో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇందుకు కారణం. ఆ దేశాల్లో ప్రజలకు తమ మతంపై ఆదరణ తగ్గిపోవడం, ఇతర మతాలు పెరగడం వారికి ఆందోళన కలగజేస్తోంది.Michael Lindsay అనే సామాజిక శాస్త్రవేత్త “Faith in the Halls of Power’ (2007) అనే పుస్తకంలో దాదాపు నలభై ఏళ్లుగా అమెరికన్‌ సమాజంలో వస్తున్న మార్పులను గూర్చి రాశాడు. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలో కూడా మతం ఎలాంటి పట్టు సాధించింది అని ఆయన చాలా ఉదాహరణలతో వివరించాడు. ఈ పుస్తకాన్ని చూస్తే స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ప్రతీకగా ఉన్న అమెరికా మతతత్వ దేశంగా తయారవుతోందా అనే సందేహం కలగక మానదు. మత ప్రచారకులే వామపక్ష రచయితల ముసుగులో విశ్వవిద్యాలయాల్లో ఉండవచ్చనే సందేహం కూడా కలుగుతుంది. ఈ రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో వినగలం.
మల్హోత్రా రాసిన “The Battle for Sanskrit’ పుస్తకంలో ఇంకా ఆసక్తికరమైన విషయాలను చూడగలం. సంస్కృత భాష కూడా ప్రజలను అణచడానికే వచ్చి భాష అని చెప్పడం, యజ్ఞం మొదలైన కర్మలన్నీ సమాజంలో వర్ణవ్యవస్థను పటిష్టం చేయడానికి వచ్చినవనీ, ముస్లింలను అణచడానికి రామాయణాన్ని హిందూపండితులు ఉపయోగించుకుంటున్నారనీ (పేజీ: 182) ఇలాంటి ఎన్నెన్నో వింత వ్యాఖ్యానాల్ని ఈ పుస్తకంలో వివరించారు. ఇవన్నీ సంస్కృత పండితులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...