మరొక చారిత్రక సత్యాన్ని మనం గమనించాలి. ఏ మతమైనా కేవలం విశ్వాసంపైన ఎంతశాతం ఆధారపడింది, విశ్వాసం – తత్త్వం రెండింటిపై ఎంతశాతం ఆధారపడింది అనే ప్రాతిపదికపై ఆ సంస్కృతికి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ వేదాంతం భవిష్యత్తులో ప్రపంచ మతం అవుతుందని సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం వివేకానందుడు చెప్పిన మాటలోని సత్యాన్ని ప్రస్తుతం పాశ్చాత్యదేశాల్లో చూడగలం. సత్యమేవ జయతే అనే మాట నిజమేనని కొంత ఊరట కలుగుతుంది. పాశ్చాత్య మేధావుల్లో వస్తున్న మార్పును ఐలయ్యగారు గమనిస్తే బాగుంటుంది.
శ్రమైక జీవనంలో ఏ కులమెంత’’ అనే శీర్షిన జూన్ 8వ తేదీన ఆంధ్రజ్యోతిలో మిత్రులు ఐలయ్య గారు రాసిన వ్యాసానికి నా స్పందన ఇది.
ఏ యుద్ధానికైనా ఒక లక్ష్యముంటుంది. శత్రువు ఎవడు, అతణ్ణి అణిచి మనం ఏమి సాధిస్తాం అనే లెక్క ఉంటుంది. లక్ష్యంలేని యుద్ధానికి ఏ తెలివైనవాడూ పూనుకోడు. యుద్ధరంగంలోనే లేని వ్యక్తిని శత్రువుగా ఊహించుకుని కత్తులు నూరడం తెలివైన పనికాదు. గతంలో ఒకాయన గాలిమిల్లులపై యుద్ధానికి వెళ్ళినట్టు కథలు విన్నాం. ఐలయ్యగారి వ్యాసం చూసిన తర్వాత నాకు ఇదే అనిపించింది.
ఉత్పత్తిరంగంలో బ్రాహ్మణులు లేరనీ, వీరెప్పుడూ శ్రమజీవులు కారనీ ఐలయ్యగారు ఎప్పుడూ వాదించే విషయం. ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా, ఏకాలంలోనైనా ఏదో ఒక వర్గం బౌద్ధిక రంగంలో ఉండగా మిగతా వర్గాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. షేక్స్ పియర్ గుంతలు తీస్తూ ఉండి ఉంటే మనకు ఈనాడు అద్భుత సాహిత్యం దొరికి ఉండేది కాదు. ప్రస్తుత సమాజంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జీలు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు మొదలైనవారు నాగలి పట్టడం లేదు, ఇటుకలు చేయడం లేదు. వారిని సోమరిపోతులనలేం కదా? ఒకనాటి బ్రాహ్మణ వర్గానికి సమాంతరంగా ప్రస్తుతం ఏర్పడిన వర్గం ఇది. మిత్రులు ఐలయ్యగారు కూడా ఒకనాటి వర్గీకరణ ప్రకారం బ్రాహ్మణులే. ఈనాటి శాస్త్రవేత్తల లాగానే ఆనాడు లోహవిజ్ఞానశాస్త్రం, శిల్పశాస్త్రం, ధనుర్విద్య, అశ్వశాస్త్రం, నిర్మాణశాస్త్రం (వాస్తుశాస్త్రం) మొదలైన వాటిలో భారతీయులు గొప్ప ప్రతిభ చూపారు. వీరిలో అనేకులు అగ్రవర్ణాలవారే అయి ఉండవచ్చు. వారందరూ సోమరులు కారు. చరిత్రలో గ్రామీణ సమాజంలో మిగతా అన్నివర్గాలతో పాటు బ్రాహ్మణులు, వైశ్యులు లాంటివారు కూడా సేద్యం చేశారు. హాలికులకు కుశలమా అని పొలం దున్నుతున్న పోతనను శ్రీనాథుడు పలకరించడం మనకు తెలిసిందే. బ్రాహ్మణులు స్వయంగా సేద్యం చేయడం లేదా దగ్గరుండి సేద్యం చేయించడం పల్లెల్లో ఇటీవల వరకూ అందరూ చూసిన విషయమే.
చరిత్ర నాకు అర్థమైనంత వరకూ బ్రాహ్మణులపైనా, క్షత్రియులపైనా శారీరక దాడులు పదవశతాబ్దం నుంచి మొదలయ్యాయి. ఈ రెండువర్గాలూ అనేక హింసల్ని ఎదుర్కొన్నాయి. యూరోపియన్లు మన దేశానికి వచ్చిన కొత్తలో కూడా గోవా లాంటి ప్రాంతాల్లో మత ప్రచారకులు కేవలం బ్రాహ్మణుల్ని లక్ష్యంగా పెట్టుకొని హింసించడం చరిత్రలో చూడగలం. Asia in the Making of Europe అనే పుస్తకం మొదటి సంపుటిలో Donald Lach అనే రచయిత ఈ విషయంపై అనేక వివరాల్ని ఇచ్చాడు. బ్రిటిష్ వారు వచ్చే సమయానికి సమాజంలో విలువలు మారాయి, శారీరక దాడులు బదులుగా బౌద్ధిక దాడుల్ని వారు వ్యూహంగా ఎంచుకున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాల్లో అతి తక్కువ వ్యవధిలో అక్కడి మతాల్ని పెకిలించివేసి తమ మతాన్ని వ్యాప్తి చేసిన ఘనత యూరోపియన్లకు ఉంది. ఆ పని భారతదేశంలో చేయలేకపోయారు. అనేకులు భారతీయ గ్రంథాల పట్ల ఆదరం పెంచుకున్నారు. ముఖ్యంగా అమెరికన్ మేధావులు ఇటీవలి కాలం వరకూ భారతీయ సంస్కృతిని ఎక్కువగా ఆదరించారు. ఇటీవలి కాలంలోనే పాశ్చాత్య ప్రపంచంలో మతతత్త్వం పెరిగిన తర్వాత ఒక సంస్కృతిపై బాంబులు వేయడం, మరొక సంస్కృతిపై పుస్తకాల బాంబులు వేయడం చేస్తున్నారు. పై వర్గాలు బ్రాహ్మణులపై బౌద్ధిక దాడులు చేస్తున్నాయంటే అర్థం చేసుకోగలం. వారి వ్యూహంలో భాగమది. కానీ ఐలయ్యగారి ఉద్దేశమేమిటో, లక్ష్యమేమిటో తెలియడం లేదు. వారు మరొక మతానికి పనిచేస్తున్నట్టుగా చెప్పలేం. పేరు మాత్రం షెప్పర్డ్ అని వ్రాసుకుంటున్నారు. షెప్పర్డ్ అనే పదం ఏసుక్రీస్తును కూడా సూచిస్తుందని మనకు తెలిసిన విషయమే. నిజమేమిటో వారికే తెలియాలి.
మ్యాక్స్ ముల్లర్, విలియమ్ జోన్స్, మెకాలే మొదలైన అనేక రచయితలకు వారి మతాన్ని వ్యాపింపజేయాలనే అజెండా ఉన్నా అనేక వాస్తవాల్ని మూసి పెట్టలేకపోయారు.What India Can Teach Us? అనే పుస్తకంలో మ్యాక్స్ ముల్లర్ భారతీయ మూలగ్రంథాల్నీ, బ్రాహ్మణుల పాత్రనూ చాలా ప్రశంసించారు. మత ప్రచారకులందరూ సంస్కృతం నేర్చుకోవాలని మెనియర్ విలియమ్స్ ప్రతిపాదించాడు. ఇదంతా ఆనాటి వ్యూహం. బ్రాహ్మణుల్ని తమ మతపరమైన ధర్మం నుండి మిగతా రంగాల్లోకి మళ్ళించడానికి బ్రిటిష్ వారు వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. అణకువతో, విశ్వాసంతో పనిచేసే వర్గం అని వారి ఉద్దేశం. బ్రాహ్మణులు కూడా తమ ధర్మాన్ని సులభంగా వదిలేసి ఆధునిక జీవనానికి అలవాటుపడ్డారు. ఇది ఉభయులకీ లాభదాయకంగా నడిచింది. హిందూధర్మానికి మాత్రం కొంత నష్టాన్ని కలిగించింది. బ్రాహ్మణులందరూ పల్లెల్ని వదిలి పట్టణాలకు చేరుకోవడం వల్ల గ్రామాల్లో హిందూమతం ఉనికి తగ్గిపోవడం, ఆ అవకాశాన్ని ఇతరులు తీసుకోవడం సహజ పరిణామం. హిందూధర్మాన్ని రక్షించడంలో ప్రస్తుతం బ్రాహ్మణులేమీ ముఖ్య పాత్ర తీసుకోవడం లేదు. గుళ్ళలో అర్చకత్వం చేయడానికి మిగతా వారెవరూ రానందువల్ల వీరు ఆ పనులు చేస్తున్నారు.
మరొక ముఖ్యవిషయం. అనాదిగా హిందూధర్మం బ్రాహ్మణులపైనే ఆధారపడి లేదు. విజ్ఞానాన్నంతా వారే దాచుకున్నారని చెప్పలేం. జ్ఞానులైన రాజుల వద్ద బ్రహ్మవిద్య నేర్చుకోవడానికి బ్రాహ్మణులు వెళ్ళినట్లు ఉపనిషత్తుల్లో చూస్తాం. మన ఋషులు ఏ వర్గానికి చెందినవారో తెలియదు. క్షత్రియుడైన జనకుడు గొప్ప బ్రహ్మజ్ఞాని. వ్యాసుడు, వాల్మీకి మొదలైనవారెవరూ బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణులు పూజించే రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు మొదలుకుని ఈనాటి సాయిబాబా వరకూ ఎవరూ బ్రాహ్మణులు కారు. చరిత్రలో అనేక క్షత్రియులు, వైశ్యులు, వెలమలు, రెడ్లు మొదలైనవారు వైదిక సంస్కృతిలో గొప్ప జ్ఞానం కల్గినవారు. ఇటీవలి కాలంవరకూ రాజులు, ఇతర అగ్రవర్ణాల వారు బ్రాహ్మణులతో సమానంగా పండితులే. 19వ శతాబ్దం మొదలుగా వివేకానందుడు మొదలైనవారు రంగంలోకి వచ్చాక బ్రాహ్మణులు కాని వారు అనేకులు హిందూధర్మాన్ని రక్షించడంలోనూ, వ్యాప్తిచేయడంలోనూ ఎంతో కృషి చేస్తుండటం చూడగలం. రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, శివానంద మిషన్ మొదలైనవి ఏ వర్గానికీ చెందినవి కావు. మరొక అంశం సాంకేతిక విప్లవం. ఇది మత ప్రచారాల శైలినే మార్చివేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లోనూ, సోషల్ మీడియాలోనూ ఎంతో ప్రచారం జరుగుతోంది. విదేశాల్లోని భారతీయులు అనేకులు ఈ మాధ్యమాల ద్వారా భారతీయ సంస్కృతిని తెలుసుకోగలుగుతున్నారు. ఈ మాధ్యమాల్ని నడుపుతున్నవారు బ్రాహ్మణులొక్కరే కారు, అనేకులున్నారు. కులాల ఏర్పాటుకూ మతసిద్ధాంతానికీ సంబంధం లేదని ఇదివరకు కొన్నివ్యాసాలలో వ్రాశాను. పల్లెలు స్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తి కల్గిన యూనిట్లుగా ఉండడం వల్ల అనేక వృత్తులు చేసేవారు ఆయా కులాలుగా ఏర్పడ్డారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ కులాలు ఉపయోగపడ్డాయి. మనుషుల గుణాల ఆధారంగా వారి వర్ణాన్ని నిర్ణయించాలని మన పుస్తకాలు చెప్పడాన్ని ఇదివరకు చాలా వ్యాసాల్లో వ్రాశాను. అస్పృశ్యత అనే మాట మనుస్మృతిలో లేదని కూడా వ్రాశాను. సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వర్గంపై వివక్ష చూపిస్తూ వచ్చారు. దీనికి బ్రాహ్మణుల్నే కారణంగా తీసుకోవడానికి కారణాలు లేవు.
ప్రస్తుత ప్రపంచంలో మత ఆధిపత్యానికై సంఘర్షణలు జరుగుతుండడం అందరికీ తెలిసిన విషయమే. భారతదేశం ఒక గొప్ప సంఘర్షణ వేదిక అని కూడా తెలిసినదే. కానీ మిగతా మతాలకు ఉన్న సంస్థాగత వ్యవస్థ హిందూమతంలో లేదు. బ్రాహ్మణులు పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చారు, పట్టణాల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. అందరితో పాటే సామాజిక మార్పులో భాగంగా వీరూ మారారు. కేవలం ఇంగువ కట్టిన గుడ్డలాగ ఏవో కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు కానీ ధర్మరక్షకులుగా ఏమీ లేరు. యుద్ధరంగంలోనే లేని వర్గంపై పట్టు వదలని విమర్శలు చేయడం వల్ల ప్రయోజనమేమీ కనిపించడం లేదు. పరశురాముడి గూర్చి ఐలయ్యగారు చెప్పిన ఒక విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. త్రేతాయుగం కాలంలో ఏ పరిస్థితిలో పరశురాముడు గొడ్డలి పట్టుకుని తిరిగాడో మనకు తెలియదు కానీ వాల్మీకి అతణ్ణి అవతార పురుషుడిగా కీర్తించలేదు. మామూలు ఋషిగానే వర్ణించాడు. పరశురాముడు మనకు ఆదర్శం కాదని బ్రాహ్మణుల సభల్లో ఎన్నోసార్లు చెప్పాను.
మరొక చారిత్రక సత్యాన్ని మనం గమనించాలి. ఏ మతమైనా కేవలం విశ్వాసంపైన ఎంతశాతం ఆధారపడింది, విశ్వాసం – తత్త్వం రెండింటిపై ఎంతశాతం ఆధారపడింది అనే ప్రాతిపదికపై ఆ సంస్కృతికి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ వేదాంతం భవిష్యత్తులో ప్రపంచ మతం అవుతుందని సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం వివేకానందుడు చెప్పిన మాటలోని సత్యాన్ని ప్రస్తుతం పాశ్చాత్యదేశాల్లో చూడగలం. వారిలో మేధావులు చాలామంది తమ మతాన్ని వదిలేసి వేదాంతం, యోగ, బౌద్ధమతంల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదివరలోని ఒక ప్రముఖ నాస్తికుడు ఖ్చిఝ ఏ్చటటజీట అనే అతను ఇటీవల గ్చిజుజీుఽజ ఠఞ అనే పుస్తకం వ్రాసి సంచలనం సృష్టించాడు. ఇందులో వేదాంతం, బౌద్ధమతం, ధ్యాన పద్ధతుల గూర్చి ఆయన గొప్పగా వ్రాశాడు. కాబట్టి సత్యమేవ జయతే అనే మాట నిజమేనని కొంత ఊరట కలుగుతుంది. పాశ్చాత్య మేధావుల్లో వస్తున్న మార్పును ఐలయ్యగారు గమనిస్తే బాగుంటుంది.
అరవిందరావు కె.
No comments:
Post a Comment