Monday, January 22, 2018

శ్రద్ధ - అంగీరసుడు - 2

https://www.facebook.com/vallury.sarma/posts/523886970982054


అంగీరసుడు భార్య శ్రద్ధాదేవితో గృహస్థజీవనం ప్రారంభించిన తరువాత అనేక సంవత్సరాలు మోక్షకాములై ఆదంపతులు తపోమార్గంలోనే ప్రశాంతమైన చిత్తంతో ఉన్నారు. బ్రహ్మ చెప్పిన సంతానం విషయం ఆయనకప్పుడు స్ఫురణకు వచ్చింది. తరువాత ఆయనకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు కలిగారు. వారి పేర్లు చూస్తే మన పురాణాల్లో మనవాళ్ళు ఎంత అర్థవంతమైన వైవిధ్యమైన పేర్లు పెట్టుకున్నారో తెలుస్తుంది. కుమారుల పేర్లు - బృహత్కీర్తి, బృహజ్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనస, బృహన్మంత్ర, బృహద్భాను, బృహస్పతి. కుమార్తెల పేర్లు - భానుమతి, రాక, సినీవాలి, ఏకానేక, అర్చిష్మతి,హవిష్మతి, మహామతి. రాకా అంటే పున్నమి దినానికి అధిస్ఠానదేవత. సినీవాలి అంటే అమావాస్యదినానికి దేవత. బృహత్కీర్తిని ఉతథ్యుడు అని , బృహజ్జ్యోతిని సంవర్తుడనీ వ్యవహరిస్తారు. సంవర్తుడు బృహస్పతి అన్నగారు. తమ్ముని కంటె తేజస్వి. నిస్సంగుడు, బ్రహ్మజ్ఞాని, అవధూత. అంగీరసుని వంశం పుత్రపౌత్రాభివృద్ధితో తామర తంపరగా పెరిగినది. వాళ్ళని అంగీరసులు అంటారు. ఇతిహాస పురాణాలలో వాళ్ళపేర్లు వస్తాయి. అధర్వణ వేదానికి అంగీరసుడు, అధర్వుడు ముఖ్య ఋషులు. అంగీరసుని వంశంలో ఆయాస్యుడనే ఋషి , ప్రముఖుడు. అనేక వేదమంత్రాలకు ద్రష్ట. అనేకుల గోత్రాలలో, ప్రవరలలో అంగీరస, ఆయాస్య నామాలు నేటికీ కనుపిస్తాయి. ఆయనను తలచుకోవడం వారికి శ్రేయస్సుని ఇస్తుంది.
అగ్నిదేవునికి ఒకసమయంలో కోపం వచ్చింది. (దేవతలు కూడా రాగద్వేషాలకు అతీతులు కారు. వారూ పొరపాట్లు చేస్తారు. శాపగ్రస్తులౌతారు. అనేక పురాణాకథలవలన మనకు ఇది తెలుస్తున్నది.) ఇతరదేవతలకు మానవులకు మధ్య తనని ఒక వాహకుడిగా భావిస్తున్నారనేభావం అతడికి కలిగింది. అందరి హవ్యాలను మోసుకొని పోయే హవ్యవాహకుడిని మాత్రమే అని ఒక ఆత్మా న్యూనతాభావం వచ్చింది. అందరి గృహాలనుండి , యజ్ఞశాలల నుండీ తనకు తాను ఉపసంహరించుకున్నాడు. అగ్నులు వెలగడం మానివేశాయి. తనకు చెప్పకుండానే అగ్నిఎక్కడకో వెళ్లిపోయాడని ఇంద్రుడు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకుంటాడు. బ్రహ్మ అంగీరస మహర్షిని అగ్ని స్థానంలోఉండమనికోరాడు. అంగీరసుడు అందుకు అంగీకరించి వెంటనే అన్నిస్థానాలలో అగ్నిగా ప్రజ్వలించాడు. యజ్ఞా యాగాలు యథావిధిగా జరగడం మొదలైనది. అంగీరసుడు లోకపూజ్యుడు అయ్యాడు. అగ్నిదేవుని అందరూ మరచిపోయారు. ఇది అగ్నిని బాధించింది. ఇంద్రుని వద్దకు వెడితే అక్కడకు అంగీరసుడు వచ్చి అగ్నిస్థానాన్ని అతనికి ఇచ్చివేస్తాడు. అవసరమైనప్పుడు తాను అగ్నికి సహాయకునిగా ఉండడానికి అంగీకరిస్తాడు. అగ్నికి అంగారమనే పేరువచ్చింది.
అంగీరసులకి వేదంలో ప్రముఖ స్థానం ఉంది. వారిని మహర్షులు, దేవతలు, పితృదేవతలుగా పరిగణించింది వేదం. అంగీరస మహర్షి ఇతరమహర్షులతో కలసి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఋషి పత్నులు అక్కడనే ఉన్నారు. వారిపై అగ్నిదేవునకు మోహం కలిగినది. ఒకసారి బాగా ప్రజ్వలించి వారిని తాకే ప్రయత్నంచేశాడు. పాపం ఆ స్త్రీలకు ఏ అనుమానం రాలేదు. వెంటనే అగ్ని తన పాపాన్ని గ్రహించి పశ్చాత్తప్తుడౌతాడు. కాని ఈచర్య ఫలితంగా తేజస్సుకోల్పోతాడు. అంగీరసుడు అగ్నిస్పర్శచే తమభార్యలకుకూడా దోషం వచ్చినదని నిశ్చయించి వారిని శపించాడు. "మీరు భూలోకంలో బ్రాహ్మణస్త్రీలుగా ఒక జన్మఎత్తి ఈ పాపఫలం అనుభవించండి" - అని ఆశాపం. ఆ పత్నులు వెంటనే తమవలన దోషం ఏమీజరగలేదనీ, మహా తపస్సంపన్నులైన భర్తలను విడిచి జీవించలేమనీ అంగీరసుని ప్రార్థిస్తారు. అంగీరసుడు వారు తపోలోకానికి వచ్చినా ఇంకా పరమేశ్వరుని గురించిన పరిపూర్ణజ్ఞానం వారికి కలగలేదని, భూలోకంలో వారికి శ్రీకృష్ణ దర్శనమౌతుందనీ, ఆయన ద్వారా తక్షణమే గోలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతాడు. అక్కడనుండి తపోలోకానికి తిరిగి వచ్చి వారి, భర్తలను కలుసుకుంటారని అనుగ్రహించాడు. బ్రాహ్మణ స్త్రీలుగా జన్మించిన ఈఋషి పత్నుల కథ భాగవతం దశమస్కంధంలో ఉన్నది.
(సశేషం , 3వ భాగం రేపు.)


Nandiraju Radhakrishna అగ్నిదేవుడంతటివాడు కూడ ఆగ్రహం వల్ల ఎంతో అరిష్టం కొనితెచ్చుకున్నాడన్న మాట. అంగీరసుడు ప్రత్యామ్నాయుడయ్యాడు."అంగీరసుడు లోకపూజ్యుడు అయ్యాడు." -నేను- లేకపోతే ప్రపంచం నడవదనుకోవడం మూర్ఖత్వమే ఔతుందని సాక్షాత్తు బ్రహ్మ (అగ్నిదేవుని ద్వారా) మానవులకు గుణపాఠం నేర్పాడు. ఒక మంచి మాట చెప్పారు. నమస్కారం శర్మగారు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...