Monday, January 22, 2018

శ్రద్ధ - అంగీరసుడు - 3

https://www.facebook.com/vallury.sarma/posts/524251597612258


అంగీరసుని శాపంతో ఋషి పత్నులు బృందావనం లో విప్రస్త్రీలుగా జన్మిస్తారు. ఒకదినం గోపాలకులు శ్రీకృష్ణ బలరాములతో కలసి అరణ్యంలో పశువులనుమేపడానికి వెళ్ళారు. అక్కడ వారికి ఆకలివేస్తుంది. వెంటనే గోపాలకులు రామకృష్ణులను ఆశ్రయిస్తారు. అప్పుడు కృష్ణుడు అక్కడ సమీపములోనే ఉన్న విప్రపత్నులను అనుగ్రహించదలచి గోపాలురతో ఇలా అంటాడు. "సమీపము లోనే కొందరు బ్రాహ్మణులు స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో అంగీరసమనే ఒక యజ్ఞము చేస్తున్నారు. అక్కడ అనేక ఆహార పదార్థాలు వండి సిద్ధంగా ఉన్నాయి. వెళ్లి వారితో మేము మిమ్మలిని పంపించామనిచెప్పి ఆ పదార్థాలు తీసుకొని రండి" అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు ఆ బ్రాహ్మణుల వద్దకు వెళ్లి "ధర్మం తెలిసిన విప్రులారా! రామకృష్ణుల ఆదేశం మేరకు మేము వచ్చాము. మేమంతా ఆకలిగా ఉన్నాము. మీరుమాకు ఆహారము ఈయండి" అని ప్రార్థిస్తారు. ఆబ్రాహ్మణులు శ్రీకృష్ణుని గురించి వినియున్నారు. కాని యజ్ఞదీక్షితులై ఉండి పూర్ణాహుతి జరగకుండా నైవేద్యములకు ఉద్దేశించిన ఆహారము ఈయవచ్చునా? అనే మీమాంసలో పడ్డారు. అవును, కాదు అని చెప్పలేదు. ఆపిల్లలకు విసుగుపుట్టి కృష్ణుని వద్దకు పరుగుపెట్టారు. కృష్ణుడు నవ్వి "వీరికి శాస్త్రములపై ఉన్న నమ్మకం సత్యంపైలేదు. స్త్రీలు సహజంగా ఎక్కువ ప్రపంచజ్ఞానము కలిగి ఉంటారు. వారి పత్నులను అడగండి." అని వెనుకకు పంపిస్తారు. గోపాలురు విప్రస్త్రీల వద్దకు వెళ్లి ప్రసాదం ఇమ్మని, రామకృష్ణులు ఆకలితో ఉన్నారని చెబుతారు. ఆస్త్రీలు వెంటనే వారు వండిన ప్రసాదాలనన్నిటినీ తీసుకొని కృష్ణుడు ఉన్న చోటికి వెడతారు. భర్తలు, పుత్రులు వారిస్తున్నా వారు లెక్కచేయలేదు. యమునా తీరంలో దరహాసంతో, శిఖి పింఛంతో, వేణువుతో, పీతాంబరంతో, వనమాలతో ఉన్న నల్లనయ్య వారికి కనుపిస్తాడు. వారు ఆ దర్శనంతో మైమరిచి చిత్తాన్ని హరిపరంచేస్తారు. కృష్ణుడు వారిని వెనుకకు వెళ్లి యజ్ఞము సమాప్తిచేయించండి అని చెబుతాడు. మా వారు వారిస్తుంటే వచ్చాం. మరల మమ్ములను రానిస్తారా అని వారి భయం. "నా సమీపమున నున్నారంచు నలుగరు బంధులు భ్రాతలు బతులు సుతులు మిము దేవతలైన మెత్తురంగనలార" అనికృష్ణుడు వారికి చెబుతూ వారుతెచ్సిన భక్ష్యాలు ఆరగిస్తాడు.
పరమేశ్వరార్పణంబుగ
బరజనులకు భిక్షమిడిన బరమపదమునన్
బరగెదరట తుది సాక్షా
త్పరమేశ్వరు భిక్షసేయ ఫలమెట్టిదియో..
ఆభర్తలు తమకు "కాంతలపాటి బుద్ధిలేదు" అని చింతిస్తారు. జపహోమాధ్యయనములు, తపస్సులు లేని తరుణులు భగవంతుని చేరగలిగితే, అన్నీ ఉండి భక్తిలేక తాము హరినిచేరలేకపోయామని ఆవిప్రులు ఆలస్యముగా తెలుసుకుంటారు. శ్రీకృష్ణుని అవతార సమయంలో చదువురాని గోపాలురు, గోపికలు ముక్తిపొందితే, ఆయన సాన్నిహిత్యంవలన బాగు పడనిది బ్రాహ్మణులు. వారికి కృష్ణుడు అద్భుతములుచేసే గొల్లపిల్లవానిగనే కనుపింఛాడు. యాదవులు అమాయకులై అతడిని ఆరాధిస్తున్నారు అనుకున్నారు. విప్రులు తమని తాము వేదాలు చదువుకున్న పండితులమని, సమాజంలో అధికులమని భావించుకునేవారు. యోగికి పాండిత్యముతో పనిలేదు. భక్తుల చిత్తాన్ని యోగి గ్రహింపగలడు. భాగవతం భక్తుల చరిత్ర. సామాజిక వర్గాలని కృష్ణుడు పట్టించుకోలేదు.
యజ్ఞపతియైన హరికి ఆహారమిచ్చి అంగీరసుని శాపంతో విప్ర స్త్రీలుగా జన్మించిన ఋషిపత్నులు తపోలోకం కంటె ఉన్నతమైన గోలోక దర్శనంచేసుకున్నారు. వేదాలు చదివిన విప్రులు తమ ఎదురుగా ఉన్న భగవంతుని పోల్చుకోలేకపోయారు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...