Monday, January 22, 2018

సప్తర్షులు - ఋషి పత్నులు

https://www.facebook.com/vallury.sarma/posts/523550244349060

సప్తర్షులు - ఋషి పత్నులు

సప్తర్షులు ఎవరు? వీళ్ళు శాశ్వతం కాదు. ప్రతి మన్వంతరంలోనూ వేరువేరు ఋషులు ఉంటారు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరంలో సప్తర్షులు - మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్త్య, వశిష్ఠులు. అలాగే ప్రస్తుత వైవస్వత మన్వంతరం లో కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజులు. వీరందరూ ప్రసిద్ధులు. మరి మధ్యమన్వంతరాలలో ఎవరు? వీరి పేర్లు తెలుసుకోవచ్చు కాని వీరినిగురించిన సమాచారం అంతగా లభించదు. రాబోయే సావర్ణి మన్వంతరంలో వేదవ్యాసుడు, ఋష్యశృంగుడు, కృపాచార్యుడు, ద్రౌణి, దీప్తిమత, గాలవ, రామ అనే వారు సప్తర్షులు. వీరిలో తెలిసిన వారినిగురించి చెప్పుకుందాం.
శ్రద్ధ - అంగీరసుడు
సృష్టి ప్రారంభంలో సృష్టింపబడిన సప్త మహర్షులలో అంగీరసుడు మూడవవాడు. ఇతడిని బ్రహ్మ తన మనస్సుతోకాక బుద్ధితోసృష్టించాడట. బ్రహ్మ మొదట సృష్టించిన మానసపుత్రులు సనక సనందనాదులు, నారదాదులు వివాహమునకు, అనంతర సృష్టికి ఉత్సాహం చూపక తపస్సుకు వెళ్ళిపోయారు. అందుచేత బ్రహ్మ అంగీరసుని సృష్టించగానే ఇలా అన్నాడు. "నేనెప్పుడు స్మరిస్తే అప్పుడు నావద్దకు వచ్చి, నేను చేయమన్న కార్యం నిర్వర్తించు. అదే నీ ఉద్యోగం." అంగీరసుడు బ్రహ్మతో వెంటనే " నీవు నన్ను ఎందుకు సృష్టించావో నీకు తెలుసు. అందుకే నీవు ఎప్పుడు ఏది ఆనతిస్తే, అది శిరసావహిస్తాను." అని బదులిచ్చాడు. బ్రహ్మ అతడిని ముందు తపస్సులో ఉత్తీర్ణుడవై తరువాత గృహస్థునివై సంతానాన్ని పొందు" అని ఆదేశిస్తాడు.బ్రహ్మాండమైన తేజస్సు బ్రహ్మ అంగీరసునకు ఇచ్చాడు. అంగీరసుడు దేహాత్మ భావాన్ని పరిత్యజించి, బ్రహ్మ జ్ఞానానికై లోక సంగ్రహార్థం ఎన్నో సంవత్సరాలు తపస్సుచేశాడు. అనేక వేదమంత్రాలకు ద్రష్టయై వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందచేశాడు.
సరస్వతీ నదీ తీరంలో తపస్సుచేసి కర్దమ ప్రజాపతి, భార్య దేవహూతి మహావిష్ణువు అనుగ్రహంతో తొమ్మండుగురు ఆడపిల్లలను కన్నారు. వారికి తగిన వరులకై అన్వేషిస్తూ, తన పుత్రికలను బ్రహ్మర్షులకే ఇచ్చి వివాహం చేస్తానని సంకల్పం చేసుకున్నాడు.ఈ పుత్రికల తరువాత మహావిష్ణువు అవతారమేఐన కపిలుని కుమారుడుగా పొందారు. ఆ కపిలుడే సృష్టి రహస్యాన్ని చెప్పే సాంఖ్యాన్ని ప్రతిపాదించాడు. తన తల్లికే గురువై మార్గోపదేశం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇది భాగవతంలో ఉన్నది. స్వాయంభువ మన్వంతరంలోని సప్తర్షులకు, భృగు మహర్షికి, అధ్వర్య మహర్షికి కర్దమ ప్రజాపతి, దేవహూతి తమ తొమ్మండుగురు కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు. ఈ మిధునాల నామాలు ఇలా ఉన్నాయి. మరీచి - కళ, అత్రి - అనసూయ, అంగీరస -శ్రద్ధ, పులస్త్య - హవిర్భువు, పులహ - గతి, క్రతువు - క్రియ, భృగు -ఖ్యాతి, వశిష్ఠ – అరుంధతి, అధ్వర్య –శాంతి.
అంగీరసుడు భార్య శ్రద్ధాదేవితో గృహస్థజీవనం ప్రారంభించిన తరువాత అనేక సంవత్సరాలు మోక్షకాములై ఆదంపతులు తపోమార్గంలోనే ప్రశాంతమైన చిత్తంతో ఉన్నారు. బ్రహ్మ చెప్పిన సంతానం విషయం ఆయనకప్పుడు స్ఫురణకు వచ్చింది. తరువాత ఆయనకు ఏడుగురు కొడుకులు,ఏడుగురు కుమార్తెలు కలిగారు. వారి పేర్లు చూస్తే మన పురాణాల్లో మనవాళ్ళు ఎంత అర్థవంతమైన వైవిధ్యమైన పేర్లు పెట్టుకున్నారో తెలుస్తుంది. కుమారుల పేర్లు - బృహత్కీర్తి, బృహజ్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనస, బృహన్మంత్ర, బృహద్భాను, బృహస్పతి. కుమార్తెల పేర్లు - భానుమతి, రాక, సినీవాలి, ఏకానేక, అర్చిష్మతి,హవిష్మతి, మహామతి.
(ఈ బృహత్ అన్న విశేషణం మాబెంగుళూరు బాగా వాడుకున్నది. మా కార్పొరేషన్ పేరు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP). మీ హైదరాబాద్ తెలుగులో గ్రేటర్ (GHMC) అంటారేమో! ) రాకా అంటే పున్నమి దినానికి అధిస్ఠానదేవత. సినీవాలి అంటే అమావాస్యదినానికి దేవత.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...