Monday, January 22, 2018

కఠోపనిషత్ 16 & 17 ద్వితీయవల్లి (జూన్ 19)

https://www.facebook.com/vallury.sarma/posts/535327216504696

https://www.facebook.com/vallury.sarma/posts/535784163125668

కఠోపనిషత్తులో అధ్యాయాలని వల్లి అంటారు. రామాయణములో కాండము, మహాభారతములో పర్వము, భాగవతములో స్కంధము అనే పేర్లు సుపరిచితములే. వల్లి అంటే లత. అనేక పుష్పములతో, మధుర ఫలములతో, అన్నివైపులా వ్యాపించి జ్ఞాన ఫలాలను ఇస్తుంది. అంతిమఫలం మోక్షం. హృదయాకాశం,నచికేతాగ్ని అనేపదాలతో, యాగం, యోగం అనే రెండు సనాతన ధర్మములోని అంగాలను ప్రథమవల్లి సమన్వయంచేసింది. నచికేతాగ్ని విద్య మృత్యుంజయత్వాన్ని ఇస్తుంది. ద్వితీయవల్లిలో చెప్పబడిన మోక్షవిద్య దీనికి తరువాతది. మనం షట్చక్రాలలో మూలాధార చక్రం గురించి చెప్పుకున్నాము. వెన్నెముకకు అడుగున ఉన్న చక్రమే ఇది. యోగసాధన ఈ చక్రంలో స్థితి కలిగియున్న గణపతి ఉపాసనతో ప్రారంభమౌతుంది. గర్భస్థ శిశువు పెరుగుదల, శరీరనిర్మాణము ఇక్కడనుండే ప్రారంభం అవుతాయి. పూర్వజన్మ కర్మలకు అనుగుణమైన సంస్కారములతో ఈ మూలాధార పద్మం చుట్టూ శరీర నిర్మాణము జరుగుతుంది. జీవుడు తల్లిగర్భంలో ఈ స్థానంలోనే ప్రవేశిస్తాడు. శరీరపు పెరుగుదలతో మిగిలిన చక్రాలు ఏర్పడతాయి.
మొదలుగా విశ్వవ్యాప్తమైన జలాలతో గర్భస్త శిశువులో ప్రాణ శక్తి వస్తుంది.జంతువులలో సామాన్యం గా మూలాధారం, కొన్నిటిలో స్వాధిష్ఠానం వరకు మాత్రమే ఉంటాయని పెద్దలు చెబుతారు. మూలాధారం నాలుగు దళాల పద్మం. బీజాక్షరాలు వం, శం,షం, సం. తూర్పుదిక్కుకు తిరిగి పద్మాసనంలో యోగ సాధన చేసేవ్యక్తికి తూర్పు దిశలో వం, దక్షిణాన శం, పశ్చిమాన షం, ఉత్తరాన సం ఉంటాయి. సం మృత్యువుకు, వం అమృతానికి సంకేతం. జననం, మృత్యువు మధ్య సంబంధాన్ని ఈ చక్రం సూచిస్తుంది. సాధనా విశేషాలు గురువు ద్వారానే లభిస్తాయి. ఈ చక్రంపై సాధన దీర్ఘాయువునిస్తుంది. ఇది మొదటి వల్లి బోధ.
అన్యచ్చ్రేయో2న్యద్యుతైవ ప్రేయ
స్తేఉభే నానార్థే పురుషగ్ం సినీతః
తయోశ్శ్రేయ ఆదదానస్య సాధు
భవతి హీయతే2 ర్ధద్య ఉ ప్రేయోవృణితే (2.1)
ప్రపంచంలో శ్రేయస్సు, ప్రేయస్సు అనిరెండు ఉంటాయి. మనం శ్రేయోభిలాషులు అనుకునేవారు నిజానికి ప్రేయోభిలాషులు. నశించే లక్షణముగల అష్టైశ్వర్యములు, పుత్రాదులు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము. శ్రేయస్సుకోరుకునేవారు ఉత్తములు. వీటినే ప్రవృత్తి , నివృత్తి మార్గములంటున్నాము.

__________________________

కఠోపనిషత్ 17 (జూన్ 20)
ప్రథమ వల్లిలో నచికేతసుడు తండ్రి సంతోషముకొరకు తాను పునః భూలోకానికి వెళ్ళే మొదటివరము, యోగసాధనలో తనకు దీర్ఘాయువును ప్రసాందించగలిగే నచికేతాగ్ని గురించిన రెండవ వరములతోబాటు ఆత్మ జ్ఞానమును, మృత్యురహస్యమును తెలియజేసే ఆత్మవిద్యను తృతీయవరముగా కోరి దానిని సంపాదించగల అర్హతను నిరూపించుకున్నాడు. దానికి సంతోషించిన ధర్మదేవత, ద్వితీయవల్లిలో, అతనికి మొదట జీవుని కోరికలలో శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయని చెబుతాడు. కర్మలచేత స్వర్గాది సౌఖ్యములు కోరువారు, వానిని పొందిన వారుకూడా మోక్షమార్గము విషయములో దారి తప్పిన వారే అని చెబుతాడు. కేవలము నచికేతాగ్నిని ఉపాసించడంవలననే సంపదలు, సౌఖ్యములు ఈ భూమిమీదే అనుభవిస్తాడనీ, వానిని తిరస్కరించడమే వివేకమనీ చెబుతాడు.
ప్రపంచంలో కొంత చదువు, సంస్కారము, జ్ఞానము ఉన్నవానిని కూడా స్వర్గ సౌఖ్యములే ఆకర్షిస్తున్నాయి కనుక వారు కూడా దారి తప్పినవారే అవుతున్నారు. జీవుడు ప్రేయస్సు అంటే కర్మఫలాల చేతనే ఆకర్షింపబడుతున్నాడు. భగవద్గీతలో భగవానుడు "యోగక్షేమం వహామ్యహం" అని ఆశ్వాసన ఇస్తాడు. లోకస్థితిలో ముందుకావలసినది క్షేమము. అంటే ఉన్నది రక్షింపబడడమే. కీర్తి ప్రతిష్ఠలు, సంతానం, సంపదలు చిరస్థాయిగా ఉండడమే క్షేమము. ఇది ప్రేయస్సులోని మొదటిమెట్టు. లేనివి రావడం, అంటే లేనివానిని కోరుకోవడం యోగం (ధనయోగం, వాహన యోగం, రాజయోగం). లేమి జీవులకు దుఃఖ కారణం. ఇలా అర్థంచేసుకుంటే యోగక్షేమములే ప్రేయస్సు. ఇది సామాన్యార్థం.
అనన్యాశ్చింతయంతోమాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.(భ.గీ.)
"అన్యచింతలేకుండా అన్నిటినీ వదలిపెట్టి నన్ను మాత్రమే ఉపాసించినవాని యోగక్షేమములు నేను వహిస్తాను" అని భగవానుడుచెప్పినప్పుడు సామాన్యమైన అర్థము వర్తించదు. అక్కడ యోగక్షేమములంటే శ్రేయస్సు నిచ్చేవి, పరమమైన స్థితికి తీసుకొని వెళ్ళేవి. అనన్య చింతన అనే యోగమునకు క్షేమము, అనగా మృతిలేని ముక్తి మార్గమునందు సుస్థిరుని చేస్తానని భావము.
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత
స్తౌ సంపరీత్య వివినక్తి ధీరాః
శ్రేయో హి ధీరో2భి ప్రేయసో వృణీతే
ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే (2.2)
శ్రేయస్సును, ప్రేయస్సును బాగావిచక్షణచేసిన వివేకియైన ధీరుడు శ్రేయస్సునే వరిస్తాడు. మందబుద్ధి కలవాడు లౌకికమైన యోగక్షేమములను వరించును.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...