Monday, January 22, 2018

కఠోపనిషత్ 18 & 19 (జూన్ 21)

https://www.facebook.com/vallury.sarma/posts/536186329752118

https://www.facebook.com/vallury.sarma/posts/536759193028165

ఈ ద్వితీయ వల్లిలో శ్రేయస్సు,ప్రేయస్సులను గురించిన సంభాషణ అంతా యమునిది. యముడు ఇంకా ఇలా చెబుతున్నాడు.
"స త్వం ప్రియాన్ప్రియ రూపాగ్ంశ్చ కామా
నభిధ్యాన్నచికేతో 2త్యస్రాక్షీః
వైతాగ్ం సృంకాం విత్తమయీ మవాప్తో
యస్యాం మజ్జన్తి బహవోమనుష్యాః (2.3)
నచికేతా! నీవు ధీరుడవై ప్రియమైన వానిని, ప్రియమైన రూపము గల వానిని విచక్షణతో త్యజించావు. లోకములో అనేక మనుష్యులు ప్రియమైన వస్తువులు, సుఖాసంతోషాల ధ్యాసలో మునిగిపోతున్నారు (మజ్జన్తి). నీవు సంపదలనే వలలో పడలేదు. ఈ విధంగా గురుస్థానంలోనున్న యమధర్మరాజు నచికేతసుణ్ణి ప్రశంసించాడు. దాని అర్థం "నీవు నశించే సంపదలనుకోరక బ్రహ్మ విద్యకు ఉత్తమాధికారివి అయ్యావు." ఇది యముని భావం.
దూరమేతే విపరీతే విషూచీ
అవిద్యాయా చ విద్యేతి జ్ఞాతా
విద్యాభీప్సినం నచికేతసం మన్వే
న త్వా కామా బహవో2లోలుపంత
విద్య, అవిద్య అని రెండున్నాయి. వాటి మధ్య చాలా దూరం (విషూచీ). అనేక మోహములు, కామములు నీకూ ప్రలోభము కలిగించలేదు.నచికితేసా!నీవు సత్యమైన జ్ఞానార్థివే. యముని ఉద్దేశ్యం "నచికేతస! నీవు సామాన్యులవలె కాదు, అందుచేత నీకు చెప్పేది శ్రద్ధగా స్వీకరించు” అని గుర్తుచేయడమే.
దీని అర్థం మనుష్యులలో విద్య, అవిద్య రెండూ ఉంటాయని కాదు. కేవలమూ అవిద్యయే ఉంటుంది. ముక్తిని కోరేవాడయితే అవిద్యకు అంచున ఉంటాడు. విద్య, అవిద్య పరస్పరవిముఖమైన దిశలలో ఉంటాయి. అవిద్య అనబడే లౌకిక సుఖలాలస అంతరించడమే ముముక్షత్వం. సాధకుడు విద్యను కోరుకొనేవాడు. ఆ విద్యను జయించినవాడు సిద్ధుడు.
అవిద్యాయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పండితం మన్యమానాః
దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః
అంధేనైవ నీయమాన యథంధాః (2.5)
అవిద్యలో జీవిస్తూ, తాము విద్వాంసులు పండితులు అనుకుంటారు. ఒక గ్రుడ్డివానికి మరియొక అంధుడు దారిచూపిస్తాను అంటాడు.త్రాగినవాడు తూలుతున్నట్లు, మూఢులు కామములలో మైమరచిఉంటారు. ఈ మంత్రము ప్రక్షిప్తమని కొందరుభావిస్తారు. కాని ధర్మదేవతయే ఉత్తములను గురించిచెప్పునపుడు, మూఢుల ప్రస్తావన కూడా వచ్చినది. ఇదే మంత్రం ముండకోపనిషత్తులో ఉన్నది. అక్కడ ఎక్కువ సందర్బోచితంగా కనుపిస్తుంది. సాధన చేయాలిగాని కేవలం పాండిత్యముతో తత్త్వ విమర్శ చేయడం నిరుపయోగమనే సూచన ఈ మంత్రములో ఉంది.

____________________________

కఠోపనిషత్ 19 (జూన్ 22)
న సాంపరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యన్తం విత్తమోహేన మూఢం
అయంలోకే నాస్తి పర ఇతిమానీ
పునః పునర్వశమాపద్యతే మే (2.6)
ధనమోహంచేత మూఢులు ప్రమాదంలో పడతారు. వారి మనసులో ఉత్తరలోకములు భాసించుటలేదు. తమ మరణానంతర స్థితిగతుల యోచన లేదు. “ఈలోకం కాక పరలోకంలేదు.” … ఇలా అనుకునేవారు మాటి మాటికీ నాపాలబడుతున్నారు. "పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం" అనే గతిలోనే వారు ఉన్నారు.
శ్రవణాయాపి బహుభిర్యో నలబ్ధః
శృణ్వంతో2పి బహవో యం నవిద్యుః
ఆశ్చర్యోవక్తా కుశలో2స్యలబ్ధా
ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః (2.7)
పరమార్థ వస్తువు అనేకుల బోధలు వినుటవలన దొరకదు. ఒకవేళ లభించి వినినా దానిని తెలుసుకోవడంలేదు. దానిని గురించి చెప్పేవారు అరుదు. విని విషయము గ్రహించినవాడు కుశలుడు.
యముని భావం: గురు ముఖతా ఈ విషయం వినాలి. విషయం పూర్తిగా తెలిసిన గురువులు అరుదు. వారు లోకంతో సంబంధాలు పెట్టుకోరు. వారంతవారు ఉపన్యాసాలు ఇవ్వరు. వింటే అర్థమవడం కూడా కష్టమే. ఎక్కడనైన పరమసత్యం బోధింపబడి, గ్రహించే శ్రోత శిష్యునిగా దొరికితే ఆశ్చర్యమే సుమా. ఇవన్నీ చెప్పి యముడు విషయానికి వస్తాడు.
న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చింత్యమానః
అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీరాన్హ్య తర్క్య మణుప్రమాణాత్ (2.8)
ఇది (ఈ బ్రహ్మవిద్య) సామాన్యుడైన నరునిచేత చెప్పబడినప్పుడు అనేక విధములుగా వర్ణించి చెప్పబడుతున్నది. అనుభవంలేని సామాన్యుడు అనేకవిధములుగా ఆలోచిస్తాడు. ఇన్ని విధములుగా చింతిస్తే ఇంకా క్లిష్టంగా అవుతుంది. ఇది తేలికగా చెప్పబడేది, తేలికగా అవగతం చేసుకొనేదీ కాదు. నరుడు కాక ఇతరుడు చెప్పుట తప్ప మార్గంలేదు. ఇది తర్కించలేనిది. సూక్ష్మమైనది. బహుధా ఆలోచించడం వలన ప్రయోజనంలేదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...