Monday, January 22, 2018

కఠోపనిషత్ 22 & 23 (జూన్ 25)




 
 
తరువాత మంత్రం చాలా ముఖ్యమైనది.
తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణమ్
అధ్యాత్మయోగాది గమేన దేవం
మత్వాధీరౌ హర్షశోకో జహాతి. (2.12)
దుర్దర్శం - కంటికి కనుబడనిది (ఆత్మవస్తువు) శరీరమున్నది కాబట్టి తనకు తాను కనబడుతున్నది. శరీరము లేకపోతే తనకు తాను కనబడడు. అందుకే శరీరమే నేను అనే భావన కలుగుతున్నది. నేను అనేదాని నిజస్వరూపం తెలియటంలేదు. నేను అంటే ఆత్మను అని తెలియడం లేదు. గూఢం అంటే నిగూఢమైనది. అనుప్రవిష్టం అంటే లోపల ప్రవేశించినది. అదే ఆత్మ వస్తువు. "అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత" అని పరమాత్మ చెప్పినది. దూరాన ఉన్న గ్రహాలను, నక్షత్రాలనూ పరిశీలిస్తున్నాము కాని మన లోపలే ఉన్న ఆత్మను సాక్షాత్కారం చేసుకోలేక పోతున్నాము. ఇట్టి నిగూఢము, రహస్యము ఐన ఆత్మవస్తువు "గుహాహితం గహ్వరేష్ఠం" ప్రవేశించ వీలులేని హృదయ గుహలో ఉన్నది. పురాణం - ఇది సనాతనమైనది. శరీరము ఇంద్రియములు దానిని కనుగొనలేవు. తం దేవం - ఆ తేజోమూర్తియైన పరబ్రహ్మ వస్తువు, అధ్యాత్మయోగాది గమేన - ధ్యాన యోగముచేతనే పొందగలిగినది. మత్వాధీరౌ హర్షశోకౌ జహాతి - అట్టి ధీరులు, మహాత్ములు - సుఖదుఃఖాలను జయిస్తున్నారు. ధ్యానయోగము వలన లభించిన జ్ఞానంతో ఈ రెండూలేని ఉత్తమస్థితికి వెళ్తున్నారు.

________________

కఠోపనిషత్తులో ఈ (2.12)వ మంత్రసారము, సాధనామార్గములనే నూరుసంవత్సరాల క్రితం భగవాన్ రమణమహర్షి కావ్యకంఠ గణపతిమునికి అనుగ్రహించారు.
హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం
హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేన భాతి
హృద్విష మనసా స్వం చిన్వతా మజ్జతావా
పవన చలనరోధాతాత్మనిష్ఠో భవత్వం.
నచికేతసుడు ఉత్తమశిష్యుడని ప్రశంసిస్తూ, అలాంటి శిష్యులు తనకి కావాలని కోరుతూ ధర్మదేవత చెప్పినది ఈ (2.12) మంత్రం. ఆత్మ (రమణులు చెప్పిన నేను) మనలోనేఉండి అంతర్యామిగా ఉన్నది. చొరవీలులేని హృదయమనే గుహలో ఉన్నది. ఆ దేవతామూర్తి కరచరణాదులు కల దేవతామూర్తి కాదు. సమస్తదేవతలకు కారణభూతమైన తేజోరూపమైన పరబ్రహ్మ వస్తువు. దానిని తెలుసుకునేమార్గము అధ్యాత్మిక యోగమే. ప్రాణాయామాది సాధనా పద్ధతులతో ఎవరైతే ధీరుడైన యోగి, మూలాధారము మొదలైన చక్రములను జయించి, ఆత్మదర్శనముచేయగలడో, అతడు సుఖ దుఃఖములనే ద్వంద్వములను విడిచిపెడుతున్నాడు. దేహాత్మభావనలో ఉన్నవారికే సుఖము దుఃఖము. ఎవరైతే శరీరములో ఉండికూడా శరీరమును అధిగమించి వెళ్ళగలుగుతాడో, శరీరముతో అనుభవించే సుఖదుఃఖాలు అతనికి ఉండవు. అనుషంగము (మోహపూరితమైన సంబంధము, జంజాటము) చేత, ఈషణత్రయము (దారేషణ, పుత్రేషణ, విత్తేషణ) చేతనే సుఖదుఃఖాలు కలుగుతాయి. ఆత్మ దర్శనమంటే, శరీరానికి దూరమవడమే).
ఏతచ్ఛ్రుత్వా సం పరిగృహ్య మర్త్యః
ప్రవృహ్యధర్మ్యమణుమేతమాప్య
సమోదతే మోదనీయగ్ం లబ్ధ్వా
వివృతగ్ం సద్మ నచికేతనం మన్యే (2.13)
మర్త్యుడు (సహజంగా జనన మరణములు కలవాడు) ఇదంతావిని ధ్యానములో విషయము గ్రహించి, జీవాత్మ పరమాత్మల సంబంధమును తెలుసుకొని ఆనందదాయకమైన దానిని సంపాదించి, నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. ఇప్పుడు నచికేతసునికి ఆత్మ అనే గృహం (సద్మ) తెరువబడినది (వివృతమ్).
ఇప్పటి నచికేతసుని స్థితిని పరీశీలిద్దాం. అతడు పాంచభౌతిక శరీరములోలేడు. అగ్నిరూపములో వచ్చిన అతడు, యముడు ఇచ్చిన ఉదకము (ప్రాణములు) స్వీకరించి లిఙ్గ శరీరముతో (లేదా అంగుష్ఠమాత్ర పురుషునిగా) ఉన్నాడు. ఈస్థితిలో అతడి జీవుడు యమునిబోధ గ్రహించి, అతని భూలోక వాసనలను అధిగమించి తన హృదయములోని పరమాత్మను దర్శించగల అంతర్దృష్టిని పొందినాడు. బోధనాకాలంలోనే అతని హృదయగృహద్వారం తెరువబడి పరమ సత్యము అతనికి లభించినది. అంతర్ముఖునివై బ్రహ్మానుభూతిని పొందమని యముడు శిష్యునికి తన ఆశీస్సును ఇస్తున్నాడు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...