Tuesday, January 23, 2018

కఠోపనిషత్ - 31,32 &33


https://www.facebook.com/vallury.sarma/posts/545817632122321

https://www.facebook.com/vallury.sarma/posts/546251492078935

https://www.facebook.com/vallury.sarma/posts/546834318687319

కఠోపనిషత్ - 31 (July 13)

నావిరతో దుశ్చరితా న్నాశాన్తో నాసమాహితః
నాశాన్త మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ (2.24)
దుష్టప్రవర్తనను విరమించనివాడు, ఇంద్రియములు శాంతి పొందనివాడు, సమాహితమైన చిత్తములేనివాడు, శాంతిలేని మనస్సు కలవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందరు. కేవలం ప్రజ్ఞచేత మాత్రమే పొందకలరు. పరీశుద్ధజీవనము వలన భౌతికదుఃఖ నివారణమేకాని ఆత్మజ్ఞానం రాదు. ప్రజ్ఞానం బ్రహ్మ. కేవలం ప్రజ్ఞయే బ్రహ్మ, అదే బ్రహ్మజ్ఞానము. ఆత్మ అన్నిశరీరాలలో ఉండే సత్యవస్తువు. దానిని మరవడం అవిద్య. ఉన్నది ఉన్నదిగా తెలుసుకోవడం జ్ఞానము. అవిద్యతొలగితే మిగిలినది స్వయంప్రకాశముగల జ్ఞానము.
యస్య బ్రహ్మ చ క్షత్రంచ ఉభేభవత ఓదనః
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సః
ఎవరికైతే బ్రాహ్మణుడు, క్షత్రియుడు (వీరు ఇరువురూ) ఆహారమవుతున్నారో, ఎవరికైతే మృత్యువు అల్పాహారముగా ఉన్నదో, దానిని ఈ ప్రకారముగా ఉన్నది అనిచెప్పి తెలుసుకొనుము. ఇక్కడ బ్రాహ్మణులను, క్షత్రియులను ఆహారంగానూ, ఇతరులను అల్పాహారంగా తినేది బ్రహ్మమనిచెప్పుకున్నప్పుడు ఈమంత్రం అర్థరహితంగా కనుపిస్తుంది. బ్రాహ్మణులు అంటే సత్త్వగుణమనే చెప్పుకోవాలి. క్షాత్రము అంటే రజోగుణము. ప్రథమంగా బ్రహ్మ వస్తువు ఉన్నది. తరువాత పుట్టినవి త్రిగుణాలు. లోకముల సృష్టి స్థితులు రజో, సత్త్వ గుణములనుండి పుట్టినవి. ఆ రెండుగుణాలు నశించే లక్షణము గలవి. తమస్సు అనే మూడవగుణము కూడా నిర్గుణమైన బ్రహ్మము నుండే పుట్టినది. సృష్టి అంతా ఎప్పటికప్పుడు మృత్యువు నోట పడుతూనే ఉంటుంది. అది మృత్యువుకు ఉపసేచనం (అల్పాహారం). తమస్సు సత్త్వరజములను వెన్నంటి ఉంటూ సృష్టిని లయంచేస్తుంది. బ్రహ్మజ్ఞాని ఇలాఅనుకుంటాడు - ఉన్నట్లు కనబడే సృష్టిని అలాంటి మృత్యువే కబళిస్తూంది. అందుచేత జ్ఞాని త్రిగుణములచేత బాధింపబడడు.



తృతీయవల్లి
కఠోపనిషత్తు మూడవ వల్లి చాలా గహనమైనది. "గుహా ప్రవిష్టౌ" - అనగా హృదయాకాశమందు ప్రవేశించిన యోగిని వర్ణించు చున్నాడు. పూర్వము చెప్పబడిన యజ్ఞమార్గము, యోగమార్గములలో లేని ప్రత్యేకత ఇక్కడచెప్పబడిన విద్యకు కలదని నిరూపింపబడుతున్నది. కర్మలు సుకృతములైనా, దుష్కృతములైనా వానిఫలములు ఇక్కడ భూమిపై అనుభవించవలసినదే! అన్నిలోకములకు అతీతమైన దహరాకాశమందు (హృదయ గుహయందు) ప్రవేశించినయోగి సర్వ పుణ్యపాపాది కర్మలనుండి విముక్తుడై ప్రణవోపాసన వలన ఫలితమగు అలోక స్థితిని పొందుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ నచికేతవిద్యద్వారా కాక రాజయోగముద్వారా అనాహత చక్రమును ప్రవేశించుటకై అక్కడ అధిష్ఠానదైవమగు వాయు తత్త్వమును “యం” అను బీజాక్షరముచేత ఉపాసించి దాటవలెను.
ఋతం పిబన్తౌ సుకృతస్యలోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పదార్థే
చాయాతపౌ బ్రహ్మవిదో వదన్తి
పంచాగ్నయో యే చ త్రిణాచికేత (3.1)
ఇక్కడ పిబన్తౌ, ప్రవిష్టౌ, చాయాతపౌ అని ద్వివచనము ఉండుటచేత ఇద్దరు యోగులను గురించి చెప్పబడుతున్నది. లోకములో మంచిపనులయొక్క యదార్థరూపమైన ఫలమునుపొందినవారైన ఇద్దరు పరతత్త్వమునకు మూలస్థానమైన హృదయగుహను ప్రవేశించి చాయ-ఆతపముల (నీడ వెలుగుల) వలె ఉన్నారని బ్రహ్మవిదులు చెప్పుచున్నారు. ప్రాణ స్వరూపములైన పంచాగ్నులను ఉపాసించిన వారు, నచికేతాగ్నిని మూడుసార్లు ఆచరించినవారు వరుసగా చాయ-ఆతపమువలె ఉన్నారు. ఈ సత్యమును అధికారికముగా బ్రహ్మవేత్తలుచెబుతున్నారు. పంచాగ్ని విద్య చాందోగ్యోపనిషత్తులో చెప్పబడినది. వేదములలో యజ్ఞములు, విధి విధానములు చెప్పబడినవి. ఇవి నచికేతవిద్య కంటె ప్రాచీనమైనవి. ఈ ఉపాసకులు ఉత్తమలోకములను పొందెదరని అందరకూ తెలిసినదే. వీరందరూ చాయామాత్రమైన స్థితిపొందియుండగా, ప్రణవోపాసకులైన నచికేతాగ్నియోగస్థులు శుద్ధతేజోమూర్తులై ముక్తులగుచున్నారు. అందుచేత ఈ ఉపనిషత్తు పూర్వమార్గమున వెళ్ళినవారికి పరమార్థకొరకు వారధి ఐనది.


కఠోపనిషత్ - 33 (July 17)
యః సేతురీజానానామక్షరం బ్రహ్మయత్పరమ్
అభయం తితీర్షతాం పారం నాచికేతగ్ం శకేమహే (3.2)
ఈజానానాం - యజ్ఞయాగాది క్రతువులు చేసేవారికి, యః సేతు - ఏదివారధివలెయున్నదో, తత్ నాచికేతం - అట్టినాచికేతవిద్యను మేము సాధించగలం. యజ్ఞయాగాదులు ఊర్ధ్వలోకాలను మాత్రమే ఈయగలవు. అది పరిమిత ఫలము. అట్టివారు మృత్యువును జయించి ఉత్తమఫలములను పొందాలంటే ప్రణవోపాసన అయిన నాచికేతవిద్యయే వారధి. తితీర్షతాం అభయం పారం అక్షరం పరం బ్రహ్మ - ఏలాంటి జన్మమృత్యుభయములేని దివ్యలోక స్థితియు, అటుపైన ముక్తిప్రదమైన ప్రణవోపాసన నాచికేతవిద్యయందున్నవి.
ఆత్మానగ్ం రథినం విద్ధి శరీరగ్ం రథమేవతు
బుద్ధింతు సారథింవిద్ధి మనః ప్రగ్రహమేవచ (3.3)
ఇది యమునిబోధ. రథము, రథికుడు, సారథి, కళ్ళెములు అని నాలుగు వస్తువులున్నాయి. రథికుడు ఆత్మ, శరీరం రథం, చోదకుడు (సారథి) బుద్ధి, మనస్సు కళ్ళెములు.
శరీరమును రథముతో పోల్చుకుంటే రథముయొక్క యజమాని ఆత్మ, అతని సారథి బుద్ధి, సారథివాడే కళ్ళెములు మనస్సు. బుద్ధిలోనే సంకల్పములు పుడతాయి. ఈ మంత్రమును యజుర్వేదములోని రుద్రమంత్రముతో పోల్చవచ్చును.
రథిభ్యో 2రథేభ్యశ్చవో నమో
నమో రథేభ్యః రథపతిభ్యశ్చవో నమః
కొంచెం తరువాత ఈ అనువాకంలోనే "రథకారేభ్యశ్చవో నమః అని వస్తుంది. రథములవంటి శరీరములు ఈశ్వరసృష్టి. తానే సారథియు, జీవాత్మయూ అయిఉండుటవలన రథకారుడు, సారథి, రథపతి అయిఉన్నాడు. అందుంచేతనే శరీరకృత్యములన్నీ తానేచేయుచున్నట్లు భాసించుచున్నాడు. తాను ఈశ్వర ప్రతిరూపమేయని గ్రగించి జ్ఞానప్రాప్తికి అర్హుడవడం అతడి కర్తవ్యం. .

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...