Monday, January 22, 2018

కఠోపనిషత్ - 25, 26 & 27

https://www.facebook.com/vallury.sarma/posts/539483836089034

https://www.facebook.com/vallury.sarma/posts/539821756055242

https://www.facebook.com/vallury.sarma/posts/540217896015628


కఠోపనిషత్ - 25 (జూన్ 28)
సర్వే వేదా యత్పద మామనన్తి
తపాగ్ంసి సర్వాణిచ యద్వదంతి
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదగ్ం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ ( 2.15)
యమధర్మరాజు ఇంకొక రహస్యంచెబుతున్నాడు. సర్వే వేదా యత్పద మామనన్తి - అన్నివేదములు కూడా ఏ పదమును చెప్పుతున్నాయో, (ఇక్కడ పదం అంటే పరమ పదం, పరమ గమ్యం.) తపాగ్ంసి సర్వాణిచ యద్వదంతి - అన్ని తపస్సులు ఏమి చెబుతున్నాయో, దేనిని కోరి ఋషులు తపోదీక్ష, బ్రహ్మచర్య దీక్ష వహించి తపములు చేస్తున్నారో, దానిని గురించి, సంగ్రహేణ బ్రవీమి - సంగ్రహంగా వెబుతాను, ఓమిత్యేతత్ - అదే ప్రణవం (ఓంకారం). యముడు మంచి గురువుగా "నచికేతా! నీవు ఏమి అనుభవిస్తున్నావో చెప్పు" మని అడిగి, తానే నీవు ప్రణవార్థాన్ని అనుభవిస్తున్నావు అనిచెప్పాడు. మనస్సుతో, వాక్కుతో, కర్మతో జిజ్ఞాసువులు దేనిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాక్కు రూపంలో చెప్పాలంటే అదే ప్రణవం.
ఏతద్ద్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్ద్యేవాక్షరం పరమ్
ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్యతత్ (2.16)
ఈ ఓంకారము అక్షరము (నాశనములేనిది). అదిబ్రహ్మ వస్తువే. దీనిని ఎవరైతే జ్ఞాత్వా (తెలుసుకొని) యః యదిచ్ఛతి (ఏది కోరుకుంటారో) తస్య తత్ (అది అతనికి లభిస్తుంది.) ఊర్ధ్వలోకాలున్నవని తెలుసుకొనడం నిరుపయోగం. వాటిని అక్కడే పొందాలి. అదే అనుభవం. బ్రహ్మ జ్ఞానము ఏ ఉపాధిలోనున్నా పొందవచ్చును. (స్త్రీ పురుషుడు, ఏ కులము, మతమైనా సరే) ప్రణవోపాసనయే ఉత్తమ మార్గం.
ఒక సందర్శకుడు రమణ మహర్షిని ఒక కాగితంమీద తన పేరు, కనీసం ఒక అక్షరము వ్రాసి ఇమ్మని ప్రాధేయ పడ్డాడు. ఆయన సమాధానం
ఏక మక్షరం హృది నిరంతరం
భాసతే స్వయం లిఖ్యతే కథమ్
దానికి వారిదే తెలుగు అనువాదం
ఏకమై వెలుగునే హృదయమందెపుడు
ఏకమక్షరము మేమెటు వ్రాయగలము?
హృదయగుహలో ప్రకాశించే జ్యోతి ఆత్మ, అది అక్షరము, దానిని వ్రాయుట ఎట్లు? ఆ అక్షరమే ఓంకారము.

కఠోపనిషత్ - 26 (జూన్ 29)
ఏతదాలంబనగ్ం శ్రేష్ఠమేతదాలంబనం పరమ్
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే (2.17)
ఆలంబనమంటే చేయూత, ఆధారము. ఏతద్ అంటే ఇది (ఈ ప్రణవోపాసన) శ్రేష్ఠమైనది. పరమైనది. పరమ శ్రేష్ఠమని చెప్పుకోవచ్చు. దానిని ఆధారము చేసుకొని ఎట్టి ఫలమైనా పొందవచ్చును. ఏ విషయాన్నైనా మొదట బుద్ధితో గ్రహించాలి. తరువాత దాని ఉపాసనా విధానాన్ని తెలుసుకోవాలి. ఆవిధానంతో దాని అనుభూతిని పొందాలి. తన యావచ్ఛక్తినీ (ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులన్నీ) వినియోగించి ఆ అనుభూతి పొందాలి. అప్పుడు సాధకుడు సృష్టికి కేంద్రస్థానమైన బ్రహ్మలోకమును పొందగలిగిన మహిమాన్వితుడు కాగలడు. (బ్రహ్మ లోకే మహీయతే)
ఓంకారమే పరబ్రహ్మ. అదే అపర బ్రహ్మ (సగుణ బ్రహ్మ) కూడా. దానినే శబ్ద బ్రహ్మ అనికూడా అనవచ్చును. ఈనాదము నుండి వర్ణములు (వానిని సూచించే అక్షరములు) పుట్టినవి. వర్ణములకు మాతృకగా అకార, ఉకార, మకారములతో కూడిన ఓంకారము పుట్టినది. దానినుండి వర్ణములు పుట్టినవి. అ, ఉ, మ త్రిమూర్తులైన విష్ణువు, బ్రహ్మ, రుద్రులను సూచిస్తాయి. ఈ అక్షరములే సృష్టిని చూపిస్తాయి. శరీరములోని షట్చక్రములనే పద్మముల దళములపై మొత్తంఅక్షరమాల ఉంటుంది. హృదయాకాశము అనాహత పద్మ స్థానము. అనాహత పద్మమునకు అధిష్టానము యం అనే వాయు బీజము. దాని పన్నెండు దళముల బీజాక్షరాలు {క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ} ఈ అక్షరమాలను మొదటి, చివరి అక్షరాలనుకలిపిన కఠ అనే సంకేతంతో పిలుస్తారు. ఇది పాణిని వ్యాకరణంలోని మహేశ్వరసూత్రాల పరిభాష. ఈ కఠ స్థానము ప్రాముఖ్యత తెలిపే ఉపనిషత్తుగా ఈ కఠయోగము, కఠోపనిషత్తు అనేపేర్లు వచ్చాయి.


కఠోపనిషత్ - 27 (జూన్ 30)
ప్రణవోపాసనతో నిర్గుణ వస్తువును కోరుకొన్న సాధకుడు సృష్టియొక్క మూలకారణమునకు చేరగలడు. ప్రణవముగురించి చెబుతూ ధర్మదేవత ఆత్మను గురించి తరువాత మంత్రములో చెబుతున్నాడు.
నజాయతే మ్రియతే వా నా విపశ్చి
న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్
అజో నిత్య శాశ్వతో2యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే (2.18)
(ఆత్మ వస్తువు) నజాయతే మ్రియతే వా - పుట్టదు. చావదు. విపశ్చిత్ - (అది) జ్ఞాన స్వరూపము. కుతశ్చిత్ న బభూవ - దేని నుండి పుట్టలేదు, పాలు పెరుగుగా మారినట్లు అది పరిణామంగా ఏర్పడలేదు. అది అనాదిగా యథాస్థితిలోనే ఉన్నది. అజః - పుట్టనిది, నిత్యః - నిత్యమైనది, శాశ్వతః - శాశ్వతమైంది, అయం పురాణః - ఇది సనాతనమైనది, న హన్యతే హన్యమానే శరీరే - నశ్వరమైన శరీరముతో బాటు అది చంపబడదు. ఇక్కడ నిత్యము, శాశ్వతము అనే పదాల అర్థభేదం తెలుసుకోవాలి. (శ్రీవెంకటేశ్వరస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. అవి శాశ్వత పూజలు కావు.) ఆత్మ నిత్యము, శాశ్వతముకూడా. అదే బ్రహ్మము.
మంత్రము (2.19)లో కూడా ఈ విషయమే ప్రస్తావింపబడుతున్నది. చంపేవాడు, చంపబడేవాడు, చంపుతున్నానని అనుకునేవాడు, చంపబడ్డాను అని అనుకొనేవాడూ వీరు పలికేది సత్యంకాదు. వీరికి అసలు విషయం తెలియదు. ఈ రెండు శరీరములలోనున్న ఆత్మవస్తువు ఒక్కటే. అదే భౌతిక ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది - ఈ సత్యంపైనే యోగశాస్త్రమంతా అధారపడియున్నది. యోగ సాధనలకు ఫలం స్వస్వరూపజ్ఞానం.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...