Monday, January 22, 2018

నైతిక పాప కాలుష్య ఫలమిది! -డాక్టర్ కందుకూరి శివానందమూర్తి 29/06/2013

నైతిక పాప కాలుష్య ఫలమిది!
-డాక్టర్ కందుకూరి శివానందమూర్తి 29/06/2013 Andhra Bhoomi Daily 

https://www.facebook.com/vallury.sarma/posts/540241342679950

కేదార సంఘటన మన అందరికీ చాలా బాధ కలిగిస్తూనే ఉంది. భక్తితో, నమ్మకంతో వెళ్ళిన వాళ్ళు ఆలయం దగ్గరే పోవడాన్ని భరించడం చాలా కష్టం. అది శివసన్నిధి కదా! అక్కడ రక్షణ ఉండదా? వంటి ఎన్నో ప్రశ్నలు పుడతాయి. కొద్దిపాటి తాత్విక అవగాహన మనకి శాంతినివ్వగలదు. ఈ ప్రకృతి అంతా చైతన్యమయం. అదే మనలో ఉన్న ప్రాణం, ఆకలి, మనస్సు, బుద్ధి. అంతవరకూ మనమందరం ఒక్కటే. ఆ మనస్సులోంచి మాత్రం గుణాలు, స్వభావాలు, కామక్రోధాలు, పాపము, సిద్ధాంతాలు, తిరస్కారాలు, ద్వేషం ఇవన్నీ పుట్టి, వాటి ఫలంగా పుట్టిన సుఖాలు, దుఃఖాలు మనమనుభవించక తప్పదు. మొదట ఉన్న చైతన్యం పేరే ఈశ్వరుడు. మన కర్మకి ఫలమిచ్చే ఆ చైతన్యం స్వతహాగా దయ, అనుగ్రహం అనే లక్షణాలను కలిగి ఉంది. కాని మనం దానిని అలాగ వాడుకుంటున్నామా? ఆ దయ మొత్తం మానవజాతి మీద సమానంగానే ఉంది. కానీ మానవజాతి మాత్రం పరస్పరం సమానంగా చూసుకోవడం లేదు. మన మనస్సులోంచి పుట్టి వికారాల్లో అంతటా సమానంగా ఉండే ఈశ్వరుడిని అసమానంగా చూస్తున్నాం. ఒకరి విశ్వాసం, మరొకరికి అజ్ఞానం. ఒకరి సిద్ధాంతం మీద మరొకరికి ద్వేషం. అందరిపైనా సమానంగా ఉండే దయని పంచుకోవడానికి బదులు ద్వేషాలు పెంచుకొని ఆ దయలోనే ఆగ్రహం సృష్టించుకొని దాన్ని అనుభవిస్తున్నారు. దీనే్న దుష్ట శిక్షణ అని, పాపఫలితమని మనమంటాం. అట్లాంటి పాపఫలితం అంతటా ఉన్న చైతన్యంలోకి వ్యాపిస్తుంది. ఆ మహాచైతన్యంలోనే పంచభూతాలు పనిచేస్తున్నాయి. దయా స్వరూపమైన ఆ చైతన్యంలోనే మనం తినే ఆహారం కూడ పుడుతోంది. మనం, మన గుణాలు, కర్మలు, దోషాలతో నిండి, మన ఆహారం, నిద్ర, మనం నిత్యం చేసే పనులు, నడక, నడవడి, తరచు దుఃఖప్రదమవుతాయి. ఇదింకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఒక విశ్వాసంలో ఉండే వాళ్ళని, మరో విశ్వాసంలో ఉండే వాళ్లు... పొరుగు దేశాల్లో, ఒక ఉద్యమంగా చంపుతున్నారు. అక్కడ మానవ సమానత్వం పోయింది. ఆ చనిపోయిన వాళ్ళు చేసిన ప్రత్యేక పాపం ఏమీ ఉండదు.
అందువల్ల ఈ పాపమనేది ఒక విషంగా పరిణిమించి నీరు, గాలి, నేల వీటిలో వ్యాపిస్తుంది. నేడు ఈ ద్వేషం, హింస, అనే పాపం రోజు, రోజుకు పెరుగుతోంది. ఆ గాలి, నీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా హాని కల్పించవచ్చు. అయితే ఈ పాపం ప్రకృతిలో ప్రవేశించినప్పుడు దానికి ఒక విచక్షణ, బుద్ధి, న్యాయాన్యాయ విచారణ ఉండవు. క్రీ.శ. 1018 డిసెంబర్ 2వ తేదీనాడు మథురా పట్టణాన్ని పాలించే రాజ్యపాలుడు మహమ్మూద్ని ఎదిరించలేక పారిపోయాడు. సుల్తాన్ మథురా పట్టణాన్ని రెండువందల దేవాలయాలతో సహా నేలమట్ట చేసి తగులబెట్టాడు. అక్కడ శ్రీకృష్ణాలయంలో పదిహేను అడుగుల ఎత్తు కలిగిన ఎర్రని బంగారు పోత పోసి, ఎన్నో రత్నాలు పొదిగిన విగ్రహాలను నేలమట్టం చేసి ముక్కలు చేశాడు. వేలాది ప్రజలు మరణించారు. దేశమంతా దుఃఖసముద్రంలో మునిగారు. ఈ ఆపదకు ఎవరు కారణం? ఇలాంటి వందలాది ఘోరాలను జననష్టంతో ఈ దేశం భరించింది. దేవుడెందుకు కాపాడలేదు? ఇవే ప్రజలకు కలిగే సామూహిక దుఃఖాలు. ఆ విధంగా లక్షల మంది యొక్క శ్రద్ధా, భక్తులకు కేంద్రమైన మథురలోని కృష్ణాలయం, మరొకరి ద్వేషానికి బలైంది. ఇక్కడ భక్తి సత్వగుణమైతే, దానికంటే బలంగా ద్వేషం, రజోగుణం, విజృంభించాయి. సాత్వికులైన భక్తులు వేలమంది చనిపోయారు. పవిత్ర స్థానాల్లో సహజంగా సత్వగుణమే ఉంటుంది. కొనే్నళ్ళకు పూర్వం వెంకటేశ్వరాలయంలో తొక్కిసలాటలో అనేక మంది చనిపోయారు. ఇటీవల పాతికమంది యువకులు షిరిడి యాత్రకు పోతూ మరణించారు. ఇదంతా మనుష్యుల యొక్క గుణములు, కర్మ, ప్రకృతి వీటి కథేకాని భగవంతుడు కొందరిపైన ఆగ్రహించడం అనేది లేదు. మనం చేసే జీవహింసే అపరిమితంగా ఉంది. ఆత్మరక్షణకోసం కొందరు చేసే ప్రార్ధన కంటే ప్రకృతిలోని ఆగ్రహం బలం గా ఉండవచ్చు. అలాంటివి ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకుంటున్నారు. ఈ పాపమనేది పెద్దలు చేస్తే దానికి శక్తి మరీ ఎక్కువ. మహాభారతంలో చాలాపాపం చేసిన పెద్దలు పదిమందే. చనిపోయిన వారు లక్షమంది. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలు లక్షమంది. అహంకారం, రాగద్వేషం, వీటితో ఆచరించిన సత్కర్మలు అంటే-క్రతువులు, జపతపాలు, దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వకుండా ఆ వ్యక్తి యొక్క మృత్యువులోనే నశిస్తున్నాయి. ప్రకృతిని మన భౌతిక మానసిక ప్రవర్తన ద్వారా పవిత్రంగాపెట్టుకోవడం మన కర్తవ్యం. ఇటువంటి దుఃఖకర ప్రాకృతిక దుస్సంఘటనలు వెనుక మనుష్యుల వంటి కారణాలు కనబడేవి కావు. ప్రకృతిలో మానవులు చేసిన పాపకర్మ, సామూహిక పాపకర్మ వ్యాపించి ఉండడం చేత ఇట్టి వైపరీత్యాలు, సంఘ మరణాలు సంభవించవచ్చు. అంతేకాని ఇందులో ఈశ్వరుడు ఆగ్రహించాడని కాని, దయచూపలేదని కాని వ్యాఖ్యానించకూడదు. అలాగే పోయిన వ్యక్తులు వారి పాపఫలం అనుభవించారని చెప్పకూడదు. వారందరికి అప్పుడే ఆయువు తీరిందని కూడా చెప్పకూడదు. ఇక్కడ ఏ వ్యక్తి యొక్క కర్మ ముఖ్యం కాదు. ప్రకృతిలో భౌతిక కాలుష్యం దాని ఫలము మనకి కనబడతాయి. మానవ సంఘం చేసే అసురీ స్వభావం కలిగిన నైతిక పాప కాలుష్యం యొక్క ఫలం ఇట్లా ఉంటుందని గ్రహించుకోవాలి. కష్ట నష్టాలకి గురైన వారందరికి మన సానుభూతి చూపవలసిందే.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...