Tuesday, January 23, 2018

మనం చేసిన పాపాలను బట్టి శిక్ష వేస్తాడు అంటారు కదా

https://www.facebook.com/vallury.sarma/posts/561840853853332

Abhiram Kondepudi

1.మనం మరణించాక యమధర్మరాజు మనం చేసిన పాపాలను బట్టి శిక్ష వేస్తాడు అంటారు కదా.
2.ఇంకో పురాణంలో ఏ జన్మలో చేసిన పాపాలకు పరిష్కారం ఇదే జన్మలో శిక్షగా వస్తుంది అంటారు.
3.గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కూడా ఉంటాయి. దాన్ని ప్రకారమే కష్టం సుఖం ఉంటాయి అంటారు. మరి ఎన్నో జన్మల పుణ్యం వల్ల మానవ జన్మ వస్తుంది అంటారు.. అప్పుడు నం.3 తప్పు అవుతుంది కదా.
4. పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదో చీమ అయినా కదలదని అంటారు.అందువల్ల మనం చేసిన పాప పుణ్యాలు ఈశ్వరుడే నిర్ణయిస్తాడుకదా. అటువంటప్పుడు మనకు శిక్షలు ఎందుకు?

V. V. S. Sarma
1. నా సమాధానాలు
మీ ప్రశ్నలు చూస్తే మీకు ఒక అవగాహనలేదనిపిస్తుంది.
1.మనం మరణించాక .. అంటే .. ఒకవ్యక్తి మరణించాక, అతని మృత శరీరం అగ్నిలోనో, భూమిలోను వేయబడి తిరిగి పంచ భూతాలలో జేరుతుంది. మరి యమునివద్దకు వెళ్ళేది ఎవరు? జీవుడు, జీవాత్మ, అంగుష్ఠమాత్ర పురుషుడు. అంటే ఒక దేహాంతర్గతమైన తేజోరూపుడు. దానిలోని కేంద్రబిందువు పరమాత్మ స్థానం.సుఖదుఃఖాలు అనుభవించేది జీవుడే.పరమాత్మ సాక్షి. అపూర్వమనే సంబంధముతో పుణ్యపాపాలు జీవునితోబాటుగా ఉంటాయి. పుణ్యాలకు స్వర్గం, పాపాలకు నరకం నిర్ణయించి ఆ యా సమయాలలో ఆలోకాలలో జీవాత్మ ఆసుఖ దుఃఖ భావనలను పొందుతుంది. స్వర్గానికి భోగ శరీరం, నరకానికి యాతనా శరీరం ధరించి ఉంటాడు. జీవుని స్థితి సంవత్సర కర్మ వరకూ ప్రేతస్థితి. 

2. మనుష్యజన్మ అనేక పూర్వజన్మల పాప పుణ్యాల మిశ్రమము వలన కలుగుతుంది. ఇక్కడ సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలని ఉంటాయి. మనిషి కర్మబంధం ఒక జన్మలో తీరేది కాదు. బాంక్ లోన్ వలె తీర్చడానికి అనేక instalments (జన్మలు) పట్టవచ్చు. ఈ లోపల ఈ జన్మలో పాపాలు కూడా వస్తాయి. పుణ్యం కూడా బంధమే. ఉదాహరణకు ఒకడు పుణ్యఫలం వల్ల ఈ జన్మలో ధనవంతుడై మంత్రియై అవినీతి పరుడయ్యాడనుకోండి. వాడి కర్మకు నరకంలో శిక్ష చాలదు. దుర్భరమైన జన్మలు అనేకం ధరించవలసి వస్తుంది. సుఖాలు అంటే మీఅక్కౌంట్ లో పుణ్యం ఖర్చవడం, కష్టాలు అంటే మీకు పాపకర్మ క్షయం అవడం అన్నమాట. ఇది సరియైన attitude. 

3. మరణించిన తరువాత ఎంతకాలానికి తిరిగి జన్మ వస్తుందో తెలియదు. ప్రేత రూపంలో ఉన్నజీవునికి తన పాప కర్మల memory ఉంటుంది కాని అవిక్షయం అయే మార్గం ఉండదు. సరియైన జన్మకూడా వస్తుందో తెలియదు. అందుకే మానవజన్మ దుర్లభం. ఆస్వల్పకాలాన్ని పాపాలుచేయకుండా గడపాలి. కష్టాలు తన పూర్వకర్మ వలన వచ్చినవే, కాని ఈశ్వరుని వల్ల వచ్చాయని అనుకోకూడదు. అసలు మీ ప్రశ్నే సరిగాలేదు. మానవ జన్మ అంటేనే సుఖ దుఃఖాల మిశ్రమం. అది పూర్వ జన్మల పుణ్య పాపాల వలన వస్తుంది. పుణ్యం అధికంగా ఉంటే మంచికుటుంబంలో మంచి పరిస్థితులలో పుడతారు.   

4. పరమేశ్వరుడు ప్రతి చీమను కదలమని ఆజ్ఞాపిస్తూ కూర్చోడు. పాపాలు చేయవద్దని అడ్డు పెట్టడు. పుణ్యాలు చేయమని ప్రోత్సహించడు. నాస్తికులకు తాను ఉన్నట్లు నిరూపించుకోడు. జీవితంలో సంఘటనలు కర్మ ఫలాలుగా జరుగుతాయి. నడుస్తోంటే కారువేగంగావచ్చి పేవ్ మెంటెక్కి ఒకరిని ఢీకోవడం దైవికం. కాని దొంగతనమో, హత్యో, ప్రభుత్వాధికారి లంచం తీసుకోవడమో వ్యక్తి స్వేచ్ఛతో జరుగుతాయి. వాటి ఫలంగా వచ్చే శిక్షలను అమలుజరిపేవాడు యముడు. ప్రధాన మంత్రి జీవుడు, ముష్టివాని జీవుడూ అని ఉండవు. యమధర్మరాజు వద్ద VIP బ్రేక్ దర్శనాలు, సిఫారస్ లేఖలు ఉండవు. అందుకే ఆయన సమవర్తి.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...