Thursday, January 25, 2018

On Cosmologies – New Series – 7 అథోలోకములు

https://www.facebook.com/vallury.sarma/posts/597934676910616



మామిత్రుడు ఆచార్య ప్రసాద్ గారు "మీరు 14 భువనములలో ఊర్ధ్వలోకములను గురించి చెప్పారు. అధోలోకములను గురించి మనకు అంతగా తెలియదు. వాటి వివరాలు ఏమిటి? మనకు అవి అవసరమా?" అని అడిగారు. మానవ జన్మ చాలా పరిణామము పొందిన జీవులది. ఊర్ధ్వలోక గమనము ఇక్కడనుండే సామాన్యంగా సాధ్యము. అథోలోకాలు కూడా బ్రహ్మ సృష్టిలోనివే. అక్కడా ప్రజాపతుల సంతానమైన జీవులు ఉన్నారు. దేవతల ప్రభావము అక్కడా ఉంటుంది. అనేక పురాణాలలో ఈ లోకాల వివరాలు ఉన్నాయి. ఉదహరణకు మనకు బాగా తెలిసిన భాగవతము, పంచమ స్కంధము చూదాము.
అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళలోకములు అధోలోకములు
ఊర్ధ్వలోకమైన స్వర్గలోకముకంటే ఎన్నోరెట్లు అధిక సుఖాభోగాలు అనుభవించే అవకాశంఉన్నవి అధోలోకాలు. వనాలు, ఉద్యానవనాలు, క్రీడా విహారాలు, ఐశ్వర్యం, ఆనందం అక్కడి జీవుల స్వంతం. ఆ జీవులుకూడా దేవయోనులే. ప్రజాపతుల సంతానమే. దితి పుత్రులైన దైత్యులు, దనువు పుత్రులైన దానవులు, కద్రువ పుత్రులైన కాద్రవేయులు (నాగ జాతి వారు) అక్కడ సతులు, సంతానము, ఐశ్వర్యములతో తులతూగుతూఉంటారు.
అట్టి పాతాళంబులందును మయకల్పి
తములగు పుటభేదనముల యందు
బహురత్ననిర్మిత ప్రాకార భవన గో
పుర సభా చైత్య చత్వరవిశేష
ముల యందు నాగాసురుల మిథునములచే
శుక పిక శారికానికర సంకు
లముల శోభిల్లు కృత్రిమ భూములను గల
గృహములచే నలంకృతము లగుచు
కుసుమచయ సుగంధి కిసలయ స్తబక సం
తతులచేత ఫలవితతులచేత
నతులరుచిర నవలతాంగనాలింగిత
విటపములను గలుగు విభవములను. (భాగవతము)
------- అధోలోక వాసులు కలిగి ఉంటారు.
దేవతల శిల్పి విశ్వకర్మ అయితే అధోలోకవాసుల శిల్పి మయాసురుడు. ఒకప్పుడు భూమిమీద నివసించేవాడు. మహాభారతములో ఇంద్రప్రస్థములో పాండవులకు మయ సభ నిర్మించిన వాడితడే. భూమిపై ఇతడి నగరం నేటి మీరట్ (మయారాష్ట్ర). త్రిపురాలను రాక్షసాత్మలతో నిర్మించినవాడితడే. కాని శివుడు వాటిని ధ్వంసంచేశాడు. ఇతడు మాత్రం గొప్ప శివ భక్తుడు. సూర్య సిద్ధాంతమనే జ్యోతిష గ్రంథానికి కర్త ఇతడే. ఆదిశేషుని నాగలోకమే పాతాళం. సూర్యకాంతి అధోలోకములకు చేరకపోయినా అనంతుడైన ఆదిశేషుని శిరోమణితో అధోలోకాలన్నీ కాంతివంతములుగా ఉంటాయి. ఆలోకములోని జీవులు అమృతం బదులుగా దివ్యౌషధులు , రస రసాయనములు అన్నపానాలుగా స్వీకరిస్తారు. అక్కడ ప్రజలకు ఆధివ్యాధులు, ముసలితనము, శరీరము రంగు మారుట, స్వేదము, దుర్గంధము ఉండవు. వారికి మృత్యుకారణము, భయదాయకము విష్ణువు సుదర్శనమొక్కటే. మయాసురుని కుమారుడు బలాసురుడు. అతని ఆవులింతలనుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలు అనే మూడు స్త్రీ గణాలు ఉద్భవించాయి. వారి శరీరాలు పంచభూతాత్మకాలు కావు. దేవతలవలెనే స్త్రీలో సద్యోగర్భధారిణులు.
వితలమనే అధోలోకములో శివుని భూతగణాలు నివసిస్తాయి, వానిలో హాటకి అనేశక్తి అగ్నిభక్షణముచేసే శక్తికలది. దాని ఉచ్చిష్టము బంగారమువంటి లోహము. అక్కడ స్త్రీలు ఆభరణాలుగా ఉపయోగిస్తారు.
V V S Sarma

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...