Thursday, January 25, 2018

పద్మినీ

https://www.facebook.com/vallury.sarma/posts/572689146101836

https://www.facebook.com/vallury.sarma/posts/573824705988280


నీవు ఆదికవి నన్నయ్య భారతమునకు సముచిత స్థానం కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. అభినందనలు. ఏదైనా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం 6 నెలలక్రితం వ్రాసిన నన్నయ భారత ఆంధ్రీకరణానికి సంబంధించిన విషయాలను, ముఖ్యంగా ఆకాలపు చారిత్రక నేపధ్యాన్ని తిరిగి ఇక్కడ ఇస్తున్నాను.ఇది ఉపయోగకరం కావచ్చు. నేటి నేపధ్యంలో పరిశీలించవచ్చు.
1
రాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము
మన చరిత్ర పుస్తకాలలో లో రాజరాజ నరేంద్రుని పేరు కనిపించదు. ఉత్తరభారతంలో ఘజనీ మహమ్మదు 17 పర్యాయములు దండెత్తి ముఖ్యదేవాలయాలు విధ్వంసం చేసే సమయంలో దక్షిణభారతంలో సనాతన ధర్మ ప్రతిష్ఠాపన జరుగుతూంది. ఆది శంకరుల అడుగుజాడలలో, దేశభాషలకు ప్రచారమిచ్చిన బౌద్ధ జైనాలకు దీటుగా, సనాతన ధర్మ గ్రంధాలను దేశభాషలలోనికి తీసుకొని రావలసిన అవసరం వచ్చింది.వేంగి దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు, రాజరాజ నరేంద్రునిచేత (సా.శ.1019–1061) ఆ కార్యక్రమం ప్రారంభింపబడినది. రాజమండ్రి అనే రాజమహేంద్రవరాన్ని స్థాపించి, పాలించినవాడాయన. తన మంత్రి, గురువు ఐన నన్నయ భట్టారకుని పిలిచి లక్ష శ్లోకాల సంస్కృతభారతమును తెనిగించమని కోరాడు. నన్నయ జన్మస్థలం తణుకు అని చెబుతారు. ఆయన భారతాంధ్రీకరణం మొదలుపెట్టి తన జీవిత కాలంలో ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని అనువదింఛాడు.
1. కావ్యారంభం
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. అవిహితమైన స్త్రీ, పురుష యోగోద్భవమైన లోకముల స్థితి వారు కలిగించుచున్నారు. వేదస్వరూపులు, దేవతాపూజ్యులు, పురుషోత్తములు, అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. -- మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
2. మహా భారత ప్రాశస్త్యం
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు
3. సభలో ఎలా మాట్లాడాలి?
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
తెలుగు మహాభారతం ఆంధ్రదేశమంతా బహుళ ప్రచారం పొందినది. "వింటే భారతం వినాలి" అనిపించింది. నేటి వరకు దీనిని మించినదిలేదు. గత వేయి సంవత్సరాలలో అభివృద్ధిచెందిన తెలుగు భాషకు, దానికి కారణమైన ఆంధ్రమహాభారత గ్రంధానికీ నిరాదరణ వస్తుందా? అనే అనుమానం 21వ శతాబ్దపు భారతదేశ లక్షణం. ఇప్పుడు 25-45 సం. వయస్సులోనివారు ఎందరికి కవిత్రయం భారతంతో పరిచయంఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, నన్నయగారి శిలా ప్రతిమ కంటే ముఖ్యం. 5000 ఏళ్ళనాటి మహాభారతగాధను తెలుగు భారతం సామాన్యులకు అందించింది. దేశమంతా రామాయణము ప్రసిద్ధము,లోకప్రియము. కేవలము ఆంధ్రులకు భారతం అత్యంత ప్రియమైన గ్రంధం. 21వ శతాబ్దంలో భారతాన్ని చదువుకుంటే, శ్రీకృష్ణుని పూజిస్తే, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని రక్షించుకోగలము. మహాభారతానికి, భారతదేశానికి మధ్య ఉన్నది అవినాభావ సంబంధం.
2
తెలుగు సాహిత్య చరిత్ర చెప్పుకుంటూ తూర్పు చాళుక్య రాజు, రాజరాజ నరేంద్రుణ్ణీ, ఆదికవి, వాగనుశాసనుడు నన్నయ్యని, రాజమండ్రీని , తణుకునీ తలచుకున్నాం. సమయం సా.శ. 1050 ప్రాంతం. ఎవరీ తూర్పు చాళుక్యులు? ఎక్కడనుండి వచ్చారు? తెలుగు చరిత్ర, సాహిత్యం గురించి మాట్లాడుకుంటే కటకం, పర్లాకిమిడి, రాజమండ్రి, వేములవాడ, వరంగల్లు, నెల్లూరు, చెన్నపట్టణం, కంచి, తంజావూరు, మధుర, హంపీ విజయనగరం, శృంగేరి, కోలారు, బళ్ళారి, ఎలహంక (బెంగుళూరు), బాదామి (వాతాపి), ఢిల్లీ, (హరప్పా, లాహోరు తో సహా) గుర్తుకు తెచ్చుకోవాలి. రాజకీయంగా రాజమండ్రీకి పూర్వరంగం కర్ణాటక లోని బాగలకోట జిల్లాలోని బాదామి (వాతాపి). చాళుక్యుల ముఖ్య ప్రదేశం. వాళ్ళే పశ్చిమ చాళుక్యులు. వాళ్ళే బాదామినుండి రాజమండ్రీ వరకు ఆరవ శతాబ్దమునుండి, పదకొండవ శతాబ్దము వరకు ఇప్పటి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలుగా చెప్పబడే ప్రాంతాన్ని పాలించారు. కన్నడభాషని సాహిత్యాన్ని పోషించారు. కన్నడ కవులు పంప, తరువాత రన్న, పొన్న అనేవారు హళెగన్నడ (పాత కన్నడం) అనే అప్పటి భాషలో కన్నడ సాహిత్యానికి ఆద్యులు. వీరు కన్నడ భాషకు కవిరత్నత్రయం. ఆదికవి పంప కన్నడభాషలో పంప భారతాన్ని వ్రాశాడు. దాని మరోపేరు విక్రమార్జున విజయం. ఈ పంప వేములవాడ నుండి వెళ్ళాడు. పొన్న వేంగీ దేశపు (ఏలూరు ప్రాంతం) వాడు. ఈయన భారతం పేరు గదాయుద్ధ (భారతయుద్ధం ఆఖరి ఘట్టం -భీమ దుర్యోధన యుద్ధం). నన్నయ పేరు నారాయణ శబ్దానికి తెలుగు వికృతి. ఈయన తన మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో భారత రచన చేశాడు. నారాయణ భట్టుకు ఈ కన్నడ సాహిత్యంతో పరిచయం ఉన్నది. కాని కన్నడ భారతాలు వ్యాస భారతం అనువాదాలు కాదు. ఆ కవులకు కూడా జైనమతంపై ఉన్న అనురక్తి సనాతనధర్మం పైలేదు. వాళ్ళ ముఖ్యగ్రంధాలు జైన పురాణాలు. వీరరస ప్రధానగ్రంధాలుగా వాళ్ళు భారత కథను వ్రాశారు. పైగా ఒకరు అర్జునుని నాయకుడుగా వ్రాస్తే, ఒకరు భీముణ్ణి నాయకునిచేశారు. వాళ్ళవాళ్ళ ప్రభువులను ఆయా నాయకులతోపోల్చారు. ఈ పంప చాళుక్యరాజు అరికేసరి ఆస్థానకవి. రాజును అర్జునునితో పోల్చినప్పుడు ద్రౌపదికి ఐదుగురు భర్తలంటే ఏంబాగుంటుంది? అందుకు ద్రౌపదిని అర్జునునికి ఒక్కడికే భార్యను చేశాడు. యుద్ధం తరువాత అర్జునునికే పట్టంకడతారు. పైగా సుభద్ర మహారాణి. జైన పురాణాలు, ఈ మార్చిన భారతకథలూ ఆంధ్ర దేశంలోకూడా ఈ కవి పండితులద్వారా ప్రచారమయ్యాయి. వీరంతా అన్ని రాజ్యాల రాజుల వద్దకూ వెళ్ళేవారు. రాజమండ్రీనుండి కటకంపై వరకు కళింగ సామ్రాజ్యం. ఈ రాజకుటుంబాలన్నీ వివాహ సంబంధాలు కలిగిఉండేవి. రాజ రాజనరేంద్రుని కాలానికి, గోరక్షనాథ ప్రభావం వలన జైనం స్థానంలో స్మార్త శైవం వచ్చినది. సారంగధర కథ మాళవదేశమునుంచి వచ్చినది. చరిత్ర గతిలో వ్యాస మహాభారతాన్ని యధాతథంగా తెలుగు ప్రజలవద్దకు తీసుకు రావలసిన అవసరం వచ్చినది. తెలుగు సాహిత్యపు శుభారంభానికి రాజమండ్రి కేంద్రమయింది. కాని రాజ రాజ నరేంద్రుని అనంతరం అనతికాలం లోనే సామ్రాజ్యకేంద్రం తంజావూరుకు, భాషా చరిత్ర కేంద్రాలు వరంగల్లుకు, వెలనాడుకు, నెల్లూరుకు తరలిపోయాయి.



పద్మిని వ్రాసిన నేటి విద్య చాలా అర్థవంతమైనది. గత 10 సంవత్సరాలలో ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను మూడు వర్గాలుగా విభజించారు. ధనస్వామ్య వర్గం, ఉద్యోగస్తుల వర్గం, సామాన్యుల వర్గం. విద్య, వైద్య రంగాలనుండి ప్రభుత్వం తప్పుకుని, సారా వేలాల మీద బతుకుతూంది. ప్రజలను ముష్టివాళ్ళనుచేసే పథకాలు పెట్టి పన్నులు కట్టే మధ్యతరగతుల రక్తం పీలుస్తోంది. నేను 1951-57 లో తాడేపల్లిగూడెం జిల్లాపరిషత్తు (అప్పుడు డిస్త్రిక్ట్ బోర్డ్) స్కూల్లోనే చదివాను. ఊళ్ళో అందరూ ఆరోజుల్లో అక్కడే చదివేవారు. ఉచిత విద్యలు, మధ్యాహ్నం భోజనాలు లేవు. ఇప్పుడు అదేస్కూలు భవనసముదాయం శిధిలస్థితిలో ఉన్నది. పూటకు గతిలేనివాళ్ళు మాత్రమే అక్కడ చదువుతున్నారు. మిగతా అందరూ ఎవరి ఒపికను బట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువులు (కారాగారాలు, కనీసం కర్మాగారాలు) కొనుక్కోవలసినదే. 1972-1996 వరకు మా ముగ్గురు అమ్మాయిలు బెంగుళూరులో ప్రైవేటు స్కూళ్ళలో చదివినా ఆ స్కూలు జీతం నెలకు 20 నుండి 200 వరకు మాత్రమే పెరిగినది. కాని 21వ శతాబ్దం పరిస్థితి వేరు. నెలకు లక్ష జీతం వచ్చేవాళ్ళు కూడా ఒక పిల్లవాణ్ణి లేదా అమ్మాయిని మంచిస్కూల్లో లక్షలలో ఫీజుతో చదివించలేక ఖర్చులలో అందరిక్లాసులోని మిగిలిన కోటీశ్వరుల పిల్లలతో పోటీ పడలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇది మాపిల్లల పిల్లలతో చూస్తున్నాను. మాచిన్నప్పుడులా ఇంట్లో చెప్పుకుని మెట్రిక్యులేషన్ పరీక్షకు కట్టి చదివించే పరిస్థితి తిరిగివస్తే ఉపయోగం.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...