Thursday, January 25, 2018

రాష్ట్ర విభజన - తక్షణ కర్తవ్యాలు

https://www.facebook.com/vallury.sarma/posts/595280250509392

మహామహోపాధ్యాయ సద్గురు శివానందమూర్తి 11/11/2013 Andhra Bhoomi
సుమారు మూడు మాసాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంఘర్షణతో అశాంతిగా ఉంది. ప్రభుత్వం నడక, ఆర్.టి.సి. వాహనాలు స్తంభించిపోయి, ప్రజలెన్నో కష్టాలకి గురి అయినారు. మొదటి కారణం కేంద్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రకటన, రెండవది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ రెండు వర్గాలు కూడా నాయకుల చర్చలు, సంప్రదింపులు అనేవి లేకుండానే క్రియకు ఉపక్రమించడం జరిగింది. తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం తప్పు అనడం సరికాదు. ఎందుకంటే అది కూడా 40 ఏళ్ళనాటి ప్రజా ఉద్యమమే. అయితే ఏకపక్షంగా చేసిన తీర్మానం కొంత తొందరపాటు చర్య. సీమాంధ్రకు, ముఖ్యంగా ఉద్యోగులకు విభజనవల్ల జరగబోయే సాంఘిక, సామాజిక, ఆర్థిక సంక్షోభం ఒక గొప్ప భూకంపంలాంటిదే. అయితే కష్టనష్టాలు కనీసం పదేళ్ళపాటు భరించాక తరువాతి కాలంలో స్వతంత్రాంధ్రప్రదేశ్ ఎటువంటి లాభం పొందగలదూ? అని దూరాలోచనతో ఆలోచించాలి. కావాల్సినంత ఆర్థిక, రాజకీయ సహాయ సంపత్తిని కేంద్రం నుంచి పోరాడి తీసుకోవలసి ఉంటుంది.
కనీసం 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఆదాయం రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. ఆంధ్రకు ఒక నూతన ఉత్తమ రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, నదీజలం, విద్యుత్తు వాదించి తీసుకోవలసిన సంపదలు. నదీ జలాల పంపకం అన్ని ప్రాంతాల వారికి కేంద్రమే న్యాయంగా నిర్ణయించాలి. ఇంకా పదివేల పడకల ఆసుపత్రులు అవసరమవుతాయి. లక్షమంది ఉద్యోగుల కుటుంబాలకు, కనీసం 100 లక్షల చదరపుటడుగుల గృహవసతి సౌకర్యాలతో కావాలి. ఇదికాక 20 లక్షల చదరపుటడుగుల స్థలం ప్రభుత్వ కార్యాలయాలకు కావాలిసిందే. ఇదంతా కేంద్రం భరించక తప్పదు కదా! ఒకవేళ తప్పనిసరి అయితే ఇవన్నీ సాధించడానికి ప్రణాళికలు రూపొందించవద్దా? అంతేకాక ఈ హక్కులు, బాధ్యతలు మొదలైనవన్నీ రేపు లోక్సభలో పెట్టబోయే బిల్లులోనే స్పష్టంగా చేర్చి పెట్టాలి. దానికి కావలసిన సిబ్బంది, కాలవ్యవధి ఆలోచించకుండా మూడు నెలలు నష్టపోలేదా మనం?
సరే.. సమైక్యంగా 55 సంవత్సరాలలో ఆంధ్ర సీమ ఏం గొప్ప ప్రగతి సాధించింది? ఏదైనా ఒక మహానగరం రూపుదిద్దుకుందా? ఈ సీమలో ఏదైనా ఒక్క పెద్ద విమానాశ్రయం లభించిందా? సీమలో ఏదైనా ఒక్క అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గాని, ఉత్తమశ్రేణి విద్యాలయం గాని ఆవిర్భవించిందా? ఏదైనా ఒక గొప్ప పరిశ్రమ సీమలో ఏర్పడిందా? బెజవాడ నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న హైదరాబాదు పట్టణం సీమ ప్రజలకు చాలా సౌకర్యంగా నిలిచిపోయిందా? ఇలా వెతికి చూస్తే సీమాంధ్రకు ఏకైక రాష్ట్రంలో ఎటువంటి లాభాలు, ప్రగతి లభించాయి? అనేది తెలుస్తుంది. హైదరాబాదులో తమకున్నదంతా పెట్టుబడి పెట్టినవారికి వ్యాపార లాభాలు, బహుశా వందమందికి లభించి ఉండవచ్చు. అది సీమకేం లాభం? ఉద్యోగానికి వెళ్ళినవారు ఒక లక్షమంది హైదరాబాదులో సొంత ఇళ్ళు కట్టుకున్నారేమో? తరతరాలనాటి సొంత ఊరు వదిలిపెట్టి, దూరం వెళ్ళి, కుటుంబానికి ఒక కోటి అప్పు చేసి సంపాదించడం ఒక గొప్ప ఐశ్వర్యమా? ఆంధ్ర రాష్ట్రం వేరుగా ఉండి ఉంటే అంతకన్నా మంచి పట్టణం ఇక్కడ సొంత ఊళ్ళకి దగ్గరగా పుట్టి ఉండేది కాదా? అసలు హైదరాబాద్ తెలుగు పట్టణమా? సుమారు 15 లక్షల మందికి తెలుగు బాగా రాని పట్టణము. వ్యాపారమంతా తెలుగువారి చేతిలో ఉందా? లేదు కదా! భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు అన్ని భాషలతో పంచుకున్న పట్టణమే హైదరాబాదు. ఇలా ఆలోచిస్తే సీమాంధ్రులకు స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తితో వేరొక తెలుగు రాజధాని కాలక్రమేణా లభించడం కోరుకోదగినది కాదా?
ఇక తెలంగాణ విషయం
ఇది ఇలా ఉండగా సమైక్యతలో 55 ఏళ్ళలో తెలంగాణ వారికి లభించిన ప్రగతి ఏది? వరంగల్లో ఘీౄ చ్ఘ్దజ జ, 5000 కుటుంబాలని పోషించేది మూతపడింది. హైదరాబాద్ పట్టణంలో గళఔఖఇజష యూళ, -్ఘ్ఘ య్యఒ, తీకశఒ, హ వంటి ఉన్నత స్థాయికి ఛెంది, విజయవంతమైన పరిశ్రమలు సమైక్య ప్రభుత్వ కాలంలో మూతపడిపోయాయి. అంటే నైజాం కాలంలో పుట్టిపెరిగిన సంస్థలు కూడా మూతపడ్డాయి. తెలంగాణలో గ్రామీణ ప్రజల పేదరికం మార్పు చెందలేదు కదా? ఇలాగ ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఆంధ్ర ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి ఉండవచ్చు. తెలంగాణ ప్రజలు ఆంధ్రకి రానే లేదు. ఇదంతా సహజీవనమా? సామరస్యమా? లేక సమైక్యతా? తెలంగాణ ప్రజలలో సీమాంధ్ర ప్రజల పట్ల సుహృద్భావం, స్నేహం ఏర్పడిందా? కొన్ని వర్గాలలో ద్వేషం కూడా ఏర్పడింది. మరి సహజీవనం, సామరస్యం ప్రజల మధ్యన ఎలా సాధ్యవౌతాయి? దానివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు సాగడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రభుత్వ సిబ్బందిలో అనైక్యత ఇప్పుడే వచ్చేసింది. తెలంగాణ వారు తిరస్కరించిన సమైక్యత, సీమ ప్రజలు ఎలాగ సాధిస్తారు? ఇవన్నీ ఆలోచిస్తే 5 లేక 6 సంవత్సరాలు కష్టనిష్టూరాల తరువాత సీమ ప్రజలు ఒక సుందర రాజధానిని తమకోసం వేరుగా సాధించుకోవచ్చు. అలాగే రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు తప్పక సాధ్యవౌతాయి. ఉన్నత శ్రేణి జాతీయ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన య్యెశ డష్ద్య్య వంటి సంస్థలు మన రాష్ట్రంలోని పర్వత సీమలలో నెలకొల్పుకోవచ్చు. తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో ఎన్నో గొప్ప సంస్థలు టీ, కాఫీ తోటలు, అనేక పర్యాటక కేంద్రాలు నూరేళ్ళ నుంచి అక్కడి దేశాన్ని, ప్రభుత్వాన్ని కూడా అపార ధనవంతుల్ని చేశాయి. అటువంటి పని ఆంధ్ర సీమలోని నల్లమలై, రత్నగిరి, విశాఖ సమీపంలోని అనంతగిరి పర్వతాలు ఎన్నో ఉండగా ఈ సమైక్య ప్రభుత్వం వాటినెందుకు వినియోగించుకోలేకపోయింది? కేంద్రం అధికారంలో ఉన్న ఈ ప్రాంతాలు సీమ ప్రజలకిగాని, ప్రభుత్వానికి గాని, అక్కడ జీవిస్తున్న ఆటవిక జాతులకు కాని ఎటువంటి ఆదాయము, ఉపయోగము కల్పించలేదు. కేంద్రం విభజన క్రియలో వేగంగా ముందుకు పోతోంది. 50 ఏళ్ళనాటి పరిపాలనలో రెండు ప్రాంతాలలోనూ సాధించిన ప్రగతి గొప్పగా ఏమీ లేదు. విభజనలో సీమాంధ్ర ఉద్యోగులకు మాత్రమే కలుగబోయే కష్టాన్ని, నష్టాన్ని అధిగమించడానికి కేంద్రం నుంచి హక్కుగా సాధించవలసినవి ధనము, శాసనపరమైన ప్రత్యేక హక్కులు ఎన్నో ఉండగా ఆ విషయంలో ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకోక ఆందోళనతో కాలం గడచిపోయింది. ప్రజలు కష్టపడ్డారు. కేంద్రం వాళ్ళకి తోచింది ఇవ్వడానికి ఇప్పుడిప్పుడు సిద్ధపడుతున్నారు. హైదరాబాద్లోని ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకి వెళితే మిగిలిన ఆంధ్ర ప్రజలు అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నట్లే హైదరాబాదులో ఉండిపోగలరు. వాళ్ళని వెళ్ళగొట్టే హక్కు ఎవరికీ లేదు. ఐటిలో సీమప్రజలెంతమందో ఉన్నారు. వారికెవరూ అపకారం చెయ్యలేరు. సాధించవలసిన హక్కులు, హామీలూ ఎన్నో ఉన్నాయి. పోలవరం రెండేళ్ళలోపల పూర్తిచేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. నీరు, విద్యుత్ నిబంధనలతో సాధించాలి. కాలవ్యవధి చాలా తక్కువ. విభజనతో ఆంధ్రకి అంతా నాశనమే వంటి మాటలు పలుకకూడదు. ఆంధ్ర సీమ మనుగడ తెలంగాణ మీద ఆధారపడి లేదు. విభజన తరువాత రెండు ప్రాంతాలు ఒక మాతృభాషతో సోదరభావం పెంచుకోవచ్చు. అందరూ శాంతిగా ఆలోచించవలసిన సమయం ఇది.
రాయలసీమ విషయం
ఇక రాయలసీమ వారితో స్నేహం కుదుర్చుకొని ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అది కూడా బిల్లులో స్పష్టం చేసుకోవాలి. తిరుపతి వెనుకనున్న పలమనేరు నుండి కర్నూలు వరకు గల పర్వత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలా ఆదాయం వస్తుంది, అందరికీ లాభం కలుగుతుంది. నల్లమలైకొండలు కొంత భాగం ప్రజల ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఈ విషయంపట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఆ విధంగా రాయలసీమ ఎంతో లాభం పొందవచ్చు.
ఇక కేంద్రం విషయం
ఇక ప్రభుత్వ కేంద్రం విశాఖపట్టణమైతే అది ఒక మహానగరం కావచ్చు. సమీపంలోని పర్వత సీమలు ప్రజల యొక్క ఉపయోగంలోకి రాగలవు. దానికి అనుమతులు కేంద్రం నుంచి సాధించాలి. గుంటూరు సీమ రాష్ట్ర మధ్యభాగంలో ఉన్నా వేసవిలో అక్కడి వేడి 45 డిగ్రీలదాకా వెళుతుంది. అప్పుడు విశాఖలో వేడి 7, 8 డిగ్రీలు గుంటూరు కన్నా తక్కువ ఉంటుంది. పట్టణంలోనే ఉన్న కొన్ని కొండలనైనా నివాసయోగ్యంగా తీర్చవచ్చు. వాటికొక అందచందాలుంటాయి. విశాఖ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వేసవిలో పనిచేయని ప్రభుత్వ కార్యాలయాలు హైకోర్టు లాంటివి, కొన్ని విశ్వవిద్యాలయాలు గుంటూరులో ఉండవచ్చు.
త్రవ్వి సిద్ధంగా ఉన్న కాలువలు గోదావరి నదీ జలాలను సమృద్ధిగా తేగలవు. త్వరలో పోలవరం సిద్ధమయితే ఇప్పుడు సముద్రం పాలవుతున్న 90 శాతం గోదావరి, కృష్ణానదీ జలాలు (వరదల సమయంలో) కొంతవరకైనా ప్రజలకు కాలువల ద్వారా కూడా ఉపయోగం కావచ్చు. అలోచించవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. విరోధము, ద్వేషము లేకుండా విడిపోతే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించగలవు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...