Thursday, January 25, 2018

షిర్డీ సాయిమందిరాలు హిందూ దేవాలయాలు కావు

https://www.facebook.com/vallury.sarma/posts/598821680155249

నాగార్జున కావూరి - నేను పర మత ద్వేషిని కాను. కాని హిందూ మతమంటే అభిమానం. మీరు చూస్తున్న ఈ చిత్రం మాస్కో నగరం లోని ఒక హిందూ దేవాలయం. ఒక విదేశీ వనిత ఓ హిందూ యువకునికి శటగోపం పెడుతుంది. నేనైతే దీన్ని ఆహ్వానిస్తాను. అలాగే మంచి చెడులు చెప్పే గంటల పంచాంగంలో, కొంతమంది పురుషులకు కొన్ని మాసాల్లో స్త్రీ సౌఖ్యం ఉంటుందని(ఎక్కువ, తక్కువ) రాస్తారు. మరి మహిళలకు పురుష సౌఖ్యం గురించి ఎందుకు రాయరూ? ఇలాంటి సౌఖ్య ప్రస్తావన అనవసరం అని నా భావన. గ్రామాల్లోన్నూ పూజారులు కరవయ్యారు. కనుక ఇకనుండి గర్భగుడి కాకుండా భక్తుడు సరాసరి దేవుని దగ్గర కొబ్బరి కాయ కొట్టుకుని, దణ్ణం పెట్టుకుని వచ్చేట్లు దేవాలయాలు ఉండాలి (షిర్డీ సాయి మందిరాల్లాగా). హేతుబద్దంగా ఆలోచించి కొన్ని నమ్మకాలకు తప్పనిసరిగా పాతరేయాలి. అపుడే హిందూ మతం ప్రజ్వలిస్తుంది. కొసమెరుపు ప్రశ్న:- LIC పాలసీ మంచి ముహూర్తంలో చేయాలా? దుర్ముహూర్తంలో చేయాలా? 



V V S Sarma

మీకు హిందూ మతం అంటే అభిమానం ఉన్నది. హిందూ మతసంస్థలు బాగు పడాలనీ కాలానుగుణంగా మారాలనీ తపన ఉన్నది. కాని చాలామంది ఆధునికుల వలెనే మీకు సనాతన ధర్మంపై అవగాహనలేదు. మీరు వ్రాసినదానిలో ఏవాక్యమూ హేతుబద్ధంగా లేదు.

1. నేను పర మత ద్వేషిని కాను. ----- మీ రాగద్వేషాలు, అభిప్రాయాలు మీ ఇష్టం. మిగతావిషయానికి దీనికి సంబంధంలేదు.

2. మీరు చూస్తున్న ఈ చిత్రం మాస్కో నగరం లోని ఒక హిందూ దేవాలయం. ఒక విదేశీ వనిత ఓ హిందూ యువకునికి శటగోపం పెడుతుంది. నేనైతే దీన్ని ఆహ్వానిస్తాను. --- --- మీరుచెప్పిన విదేశీ వనిత గుడిలో అర్చకత్వం నిర్వహిస్తూంది. విదేశీ అనేది ప్రశ్నయే కాదు. ఆమె హిందూ స్త్రీ. ఇది మనదేశంలోనూ ఈనాడు జరుగుతున్నది. మహారాష్ట్రలో స్త్రీలు పౌరోహిత్యం చేస్తున్నారు. కాథొలిక్ గా జన్మించిన అమెరికన్, పండిత వామదేవశాస్త్రి (డేవిడ్ ఫ్రాలే) సద్బ్రాహ్మణుడే! ఋగ్వేదము, ఆయుర్వేదము, జ్యోతిషము, యోగ శాస్త్రము చదువుకున్నాడు. నా ఫేస్ బుక్ మిత్రుడు కూడా. జిల్లేళ్ళమూడీ ఆలయంలో మహిళలు రుద్రంతో అమ్మకు అభిషేకం చేస్తారు. శివరాత్రినాడు తిరువణ్ణామలైలో అర్థరాత్రి అభిషేకంలో అనేక విదేశీయులు ఉంటారు. ఇస్కాన్ లో అనేకులు విదేశీయులే. భారతదేశంలో కంటె విదేశాలలోనే ఇప్పుడు సంస్కృత విద్యకు ఎక్కువ ప్రోత్సాహం ఉంది. 

3. గ్రామాల్లోన్నూ పూజారులు కరవయ్యారు. కనుక ఇకనుండి గర్భగుడి కాకుండా భక్తుడు సరాసరి దేవుని దగ్గర కొబ్బరి కాయ కొట్టుకుని, దణ్ణం పెట్టుకుని వచ్చేట్లు దేవాలయాలు ఉండాలి (షిర్డీ సాయి మందిరాల్లాగా). హేతుబద్దంగా ఆలోచించి కొన్ని నమ్మకాలకు తప్పనిసరిగా పాతరేయాలి. అపుడే హిందూ మతం ప్రజ్వలిస్తుంది. ---- -- షిర్డీ సాయిమందిరాలు హిందూ దేవాలయాలు కావు. షిర్డీ సాయిబాబా హిందూదేవతకాదు. షిర్డీ సమాధిమందిరంలో ఉదయం హారతి వినండి. సద్గురు సాయినాథాయ నమః అంటారు. ఆయన మానవుడు. సద్గురువు. శిష్య ప్రశిష్యులకు మార్గదర్శకుడు. భక్తులపై అనుగ్రహం వర్షిస్తాడు. మత సామరస్యం బోధించాడు కాని మహమ్మదీయులు సాయి మందిరాలకు నమాజుకు రావడంలేదు. ఆయనే శివుడు ఆయనే అల్లాహ్ అని అనుకోవడం భక్తుల లక్షణం. ఇతరులకు అది భాషలో రూపకాలంకారము. వేదాలలో దేవాలయాల ప్రసక్తి ఉండదు. అక్కడ దేవతారాధన అగ్నిముఖంగా యజ్ఞకర్మలో జరుగుతుంది. దానికి చాలా నియమాలు విధి నిషేధాలు ఉన్నాయి. దేవాలయ వ్యవస్థ దీనినే మూర్తిపూజగామార్చి అందరి అందుబాటులోకి తెచ్చినది. మీకు బదులుగా మీరు మమ అని నమస్కారంపెట్టుకుంటే అర్చకుడు మీకు అధివక్తగా భగవంతునికి వేద సూక్త విధానంతో అర్చన చేస్తాడు.ఆలయ నిర్మాణానికి పాంచరాత్ర, వైఖానసము వంటి వైష్ణవ ఆగమాలు, పాశుపతం వంటి శైవాగమాలు ఉన్నాయి. భగవంతుడు విగ్రహం కాదు. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే అది శాస్త్రోక్త భగవదారాధన ఔతుంది. దేవాలయాని షిర్డీ సాయిమందిరంగా చేస్తే అది దేవాలయం అవదు. ప్రార్ధనా మందిరమౌతుంది. అక్కడ విగ్రహమైన, చిత్రపటమైనా, శిఖ్ఖులవలే గ్రంధమైనా ఒకటే. నిగమాగమాలు లేకపోతే హిందూమతంలేదు. అనేక ప్రవక్తలమతమౌతుంది. క్రైస్తవ ఇస్లాం మతాలు ప్రపంచంలో అధికసంఖ్యాకులు అనుసరిస్తారు. అవి క్రమశిక్షణతో, సామాజిక ఐక్యతతో ప్రపంచవ్యాప్తిపొందిన మతాలు. పైగా వారు ఇతరులను అహ్వానిస్తారు. అదికూడా ఒక హేతుబద్ధమైన పరిష్కారమే.   

4. అలాగే మంచి చెడులు చెప్పే గంటల పంచాంగంలో, కొంతమంది పురుషులకు కొన్ని మాసాల్లో స్త్రీ సౌఖ్యం ఉంటుందని(ఎక్కువ, తక్కువ) రాస్తారు. మరి మహిళలకు పురుష సౌఖ్యం గురించి ఎందుకు రాయరూ? ఇలాంటి సౌఖ్య ప్రస్తావన అనవసరం అని నా భావన. -------- ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. గృహ యజమానికి వ్రాస్తే ధర్మపత్నికీ వర్తిస్తుంది. కాని గంటల పంచాంగంలో రాసుల ఆధారంగా వ్రాసిన వ్యక్తిగత సంవత్సర ఫలాలు అనవసరమని నాఉద్దేశ్యంకూడా. ఎవరి జాతకం వారు చూపించుకోవాలి. పంచాంగం ఈ జాతక ఫలాలకు ఉద్దేశ్యింపబడినది కాదు. Mundane Astrology అంటే దేశము, రాష్ట్ర పరిస్థితి వ్రాస్తే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది. అలాగే ప్రకృతి ఉత్పాతాలు, వరదలు, తుఫానులు, వర్షపాతం గురించి కూడా. 2010లో నేను ఒక అంతర్జాతీయ జ్యోతిష సదస్సుకు వెళ్ళాను. ఎవరో రాష్ట్ర విభజన గురించి అడిగారు. ఆ ప్రఖ్యాత జ్యోతిష్కుడు 2012,13లలో విభజింపబడాలి. 90శాతం అవకాశం ఉన్నది. అప్పుడు జరగకపోతే ఎప్పటికి జరగదు.అనిచెప్పారు

5. LIC Policy - నా అనుభవం చెబుతాను. 1967 లో నేను లెక్చరర్ గా చేరినప్పుడు. నా నెలజీతం 600. రోజూ ఒక ఇన్సూరెన్స్ ఏజంట్ వచ్చి పాలసీ తీసుకోమని బలవంతంచేసేవాడు. నెలకు 100 తేలికగా కట్టగలరు. ఒక 25 వేలకి తీసుకోండి. రిస్క్ కవర్ చేస్తుంది అన్నాడు. నాకు ఏదన్నా అయితే 25 వేలకి కుటుంబానికి ఏమి ఒరుగుతుంది? అన్నాను. మరి ఎంతకు కడతారు. అంటే ఒక కోటి చూసుకో, నేను రిటైర్ అయేసరికి ఒక ఇల్లు వస్తుంది అన్నాను. కాని ప్రీమియం కట్టడానికి నాజీతం సరిపోదు. నేను ఏనెలజీతం ఆనెల ఖర్చుపెట్టుకుంటాను. అన్నాను. LIC పాలసీ దండగబేరం ముహూర్తంచూసుకునే Scene లేదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...