Tuesday, January 23, 2018

శ్రీ గురువుగారి శ్రీకృష్ణతత్త్వము వి. వి. ఎస్. శర్మ , బెంగుళూరు

https://www.facebook.com/vallury.sarma/posts/550863031617781

శ్రీ గురువుగారి శ్రీకృష్ణతత్త్వము
వి. వి. ఎస్. శర్మ , బెంగుళూరు
("శివానందస్ఫూర్తి" పుస్తకము నుండి (సం.- శ్రీ ఎం. వి. ఆర్. శాస్త్రి, 2013, గురు పూర్ణిమ, దుర్గ పబ్లికేషన్స్, హైదరాబాదు))
నాకు 1966 ఫిబ్రవరిలో గురువుగారితో (సద్గురు శివశ్రీ కందుకూరి శివానందమూర్తి గారు) ప్రత్యక్షపరిచయం కలిగినది. అది నా వివాహ సమయం. కన్యాదాత నాభార్య మేనమామగారైన శ్రీ కందుకూరి వీరబసవరాజు గారు, శ్రీ గురువుగారి నాన్నగారు. వారు గురువుగారిని నాకు పరిచయంచేస్తూ అన్నారు "మా అబ్బాయి. జ్యోతిషంలో బాగా కృషిచేశాడు." తరువాత తెలిసినది మా పెళ్ళి ముహూర్తం ఆయనే పెట్టారని. నాకు ఏమీతెలియని విషయం కావడంతో ఏమి మాట్లాడాలో తెలియలేదు. మళ్ళీ 1973 వరకు ఆయనను కలుసుకునే అవకాశం కలుగలేదు. అనుకోకుండా REC వరంగల్ లో నా పరిశోధనా విషయంలో ఒక సభ జరిగినది. నాభార్యతో కలసి వరంగల్ వెళ్ళాను. గురువుగారు రైల్వే స్టేషనుకు వచ్చి మమ్ములను వారి ఇంటిలో ఉండమని ఆహ్వానించారు. అప్పుడు వారు నిత్యమూ రుద్రాభిషేకము చేయడము, అనేకులు ముఖ్యముగా విశ్వవిద్యాలయ ఆచార్యులు వచ్చి తీర్థము తీసుకోవడము, ఆయనను ఆసమయములో అనేక ప్రశ్నలు అడగడటము జరిగేది. నేను రెండే ప్రశ్నలు అడిగేవాణ్ణి. నేను అమెరికా ఎప్పుడు వెడతాను? నాకు అసిస్టెంట్ ప్రొఫెసరుగా ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? విజ్ఞానశాస్త్రంలో పనిచేసేవారికి ఆరోజుల్లో అమెరికా వెళ్ళడమంటే, ముస్లిములు హజ్ యాత్రకు వెళ్ళడమంత ముఖ్య విషయం. రెండిటికీ మరికొంత సమయం పడుతుందని చెప్పేవారు. అప్పటినుండి తరచుగా వారి ఇంటికి వెళ్ళేవాళ్ళము. కాని మొదటిరోజులలో ఆయనను పిల్లల ఆరోగ్యవిషయాలు, జాతకాలు, సమస్యలు ఇటువంటివే అడిగేవాళ్ళము. ఒకసారి గురువుగారు మమ్ములను కురవి వీరభద్రాలయమునకు తీసుకు వెళ్ళారు. అక్కడకు లంబాడీలు అనేకులు వచ్చేవారు. గురువుగారు చెప్పారు "వాళ్ళది మూఢ భక్తి కాదు, గాఢ భక్తి". చదువులూ, తర్క వితర్కాలు భక్తి మార్గంలో అవరోధాలు అని అర్థం కావడం క్రమంగా జరిగినది.
తరువాత కాలంలో నా జీవితంలోని అన్ని ముఖ్య కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతోనే జరిగాయి. స్వగృహనిర్మాణం వంటి పనులు, విదేశ ప్రయాణం, పిల్లల పెళ్ళిళ్ళు, ఇలాటి ఇతర లౌకిక విషయాలు, యాత్రలు, క్షేత్ర దర్శనాలు ఆయన వలననే సాధ్యపడ్డాయి. గీతలో చెప్పినట్లు ఆరోగ్యవిషయాల్లో ఆర్తితో, కొన్నిసమయాలలో కోరికలతో అర్థార్ధిగా, జ్ఞాన బోధకై జిజ్ఞాసువుగా, ఆయనను అనేక పర్యాయాలు ప్రార్థించడం జరిగినది. ఆయన శ్రీకృష్ణుని వలెనే ఆయా సమయాలలో అవసరమైనవి సమకూర్చారు.
ఒకొక సారి కలసినప్పుడు ఆయన వ్యక్తిత్వంలో ఒక నూతన కోణం కనబడేది. ఒక సారి నాభార్య ఆయనను ఒక ఫొటో అడిగింది. “నాది కాదు” అని రమణ మహర్షి ఫొటో ఇచ్చారు. అప్పటికి మాకు రమణమహర్షి గురించి ఏమీతెలియదు. క్రమేణా అరుణాచలం వెళ్ళడం, మహర్షిపై వచ్చిన సాహిత్యం చదవడం, ఆయన మార్గంపై గురువుగారి బోధలు వినడం జరిగింది. గురువుగారి జీవితచరిత్ర, ఆయన బహుముఖ ప్రజ్ఞ, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ ఇప్పుడు అందరకూ పరిచయమైనవే. అసలు ఆయన ఎవరు? ఆయన తత్త్వము ఏమిటి? అనే ముఖ్యమైన ప్రశ్నలు నాకు అనేక సమయాల్లో వచ్చాయి. ఈ మధ్య 2012 శ్రీ కృష్ణాష్టమి నాడు ఆవిష్కరింపబడిన, వారి “శ్రీకృష్ణ” పుస్తకము మూడు, నాలుగు నెలలుగా చదువుతున్నాను. దానిలో శ్రీ కృష్ణుని గురించి సామాన్యంగా అందరికీ తెలియని అనేక రహస్యాలను, శ్రీకృష్ణ తత్త్వాన్నీ గురువుగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకం చదువుతుంటే ఒక వింత ఊహ వచ్చింది. శ్రీకృష్ణుని తత్త్వాన్ని వారిమాటలలో అర్థంచేసుకుంటేనే, మనం గురువుగారి తత్త్వాన్ని కొంత వరకు అవగాహన చేసుకో గలమని తెలిసింది.
గురువుగారిలో స్పష్టంగా కనబడే శ్రీకృష్ణుని జగద్గురు తత్త్వ లక్షణాలను పరిచయం చేయడమే ఈ వ్యాసంలో నా ఉద్దేశ్యం. ఆయనతోగల 45 సంవత్సరాల అనుబంధం నాకు ప్రత్యక్ష ప్రమాణం. ఆయనను సామాన్య వ్యక్తులతో పోల్చలేము. ఆయనను సరిపోల్చాలంటే అతికొద్ది ఉదాహరణలు దొరుకుతాయి. ఆయనను చూచేవారికి, ఆయనలో శివుడు, స్కందుడు, శ్రీ కృష్ణుడు, మైత్రేయ మహర్షి కనుపిస్తారు. వీరందరినీ తమ అనేక ఉపన్యాసాలలో, గురువుగారు స్మరించుకోవడము మనందరికీ తెలిసినదే. గురుపరంపరలో త్రైలింగస్వామి, భగవాన్ రమణ మహర్షి గుర్తుకు వస్తారు. ఆయన వారివలె యతి కాదు. ఆదర్శ గృహస్థుడు. ఉత్తమ పౌరుడు. బకదాల్భ్య మహర్షి వర్ణన "త్రైలోక్య కుటుంబి" ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. ఇది కృష్ణునితో మరియొక సామ్యం.
కృష్ణావతారమునాటి దేశకాల పరిస్థితులు, ఆనాడు శ్రీకృష్ణుని బోధలు 1928 నుండి నేటివరకు గల భారతదేశ పరిస్థితులు, ఈ రంగస్థలం మీద గురువుగారి పాత్ర, గురువుగారి నిరంతర బోధనా వ్యాసంగం, అధ్యయనం చేయవచ్చును. గురువుగారు శ్రీకృష్ణుని గురించి ఇలా చెబుతారు. "వైదిక ధర్మము అనుసరిస్తూ, మోక్షమార్గము సూచిస్తూ, కర్మ, భక్తి, జ్ఞాన, యోగాదులను గురించి బోధించుటకు మానవమాత్ర జీవితమందు, మానవమాత్రుడిగా సంపూర్ణ జ్ఞానము అవతరించినది." ఇది గురువుగారి విషయంలో ఎంతనిజమో అందరికీ తెలుసు. గురుదేవుల భగవద్గీతా ప్రసంగములలో ఆయన శ్రీకృష్ణుని అంతరంగాన్ని సూచించిన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ తత్త్వాన్ని తనలో ధరిస్తే తప్ప, ఇతరులకు ఇది అసాధ్యం. ఈ భారతదేశములో సాధనా బలంతో కృష్ణ తత్త్వానుభూతిని (Krishna Consciousness) పొందిన మహాత్ములు ఎందరో ఉన్నారు. దానివలన కృష్ణ తత్త్వముపై సంపూర్ణ జ్ఞానము కలుగుతుందా?" అనే ప్రశ్నకు గురువుగారి సమాధానం చూడండి. "చిత్తానుభూతి వలన సాధకుని వ్యక్తిత్వము ఎంతవరకు పెరిగియున్నదో, అంతవరకు తత్త్వ గ్రహణ సాధ్యము." ఆయన చెప్పిన ఉపమానం "సముద్రము వద్దకు ఎంతపాత్రతో వెడితే అంత జలము తెచ్చుకొన వచ్చును. సంపూర్ణ తత్త్వ గ్రహణకు ఆసముద్రములో తాను కలసిపోయి తనవ్యక్తిత్వమునే కోల్పోవాలి". పైన చెప్పిన శ్రీకృష్ణ పుస్తకంలో తత్త్వ విశేషాలు గమనిస్తే గురువుగారికి శ్రీకృష్ణునికి ఉన్న సామ్యము స్పష్టంగా కనుపిస్తుంది. శ్రీకృష్ణునితోనే కలియుగంలో గురుపరంపర ఆరంభమైనది. ఈ విషయం తెలిపినది విష్ణువు అంశలో జన్మించిన వ్యాసుడు. అందుకే గురుపౌర్ణమి నాడు వ్యాసుని స్మరిస్తాం. శ్రీకృష్ణుని బోధలను గ్రంధస్థము చేసినవాడు వ్యాసుడు. శివ, సుబ్రహ్మణ్య, అరిష్టనేమి, మొదలైనవారి అంశలతో ఉన్న తన తేజస్సును మైత్రేయ మునిలో ప్రతిష్ఠించి కలియుగ గురుపరంపరకు కృష్ణుడే ఆద్యుడు అయ్యాడు. ఆ పరమగురువు పరంపరలోనివారే మన గురువుగారు.
తన సహజ వినయంతో గురువుగారు తననుగురించి తాను ఇలా చెబుతారు. "శివతత్త్వము నా గమ్యము, శ్రీకృష్ణుడు నా తాత్త్విక, లౌకిక జీవన మార్గ ఆదర్శము." శ్రీకృష్ణ పుస్తకంలో నారదుని మహత్తుని గురించిన శ్రీకృష్ణుని వాక్కులు గమనింపదగినవి. కృష్ణుని మాటలలో "నారదుడు శాంతుడు, తత్త్వవేత్త, సత్యవాది, తేజస్సు, జ్ఞానము, వివేకము, వినయము, తపస్సు, అహంకార రాహిత్యము కల ఉన్నతుడు." నారదుని సద్గుణములు వర్ణించిన కృష్ణుని గురించి గురువుగారు ఇలా వ్యాఖ్యానిస్తారు. "అసలు ఈలక్షణాలన్నీ కృష్ణునికే ఉన్నాయి." ఆయన అనుయాయులమైన మనందరికీ గురువుగారిలో కనబడే లక్షణాలు ఇవే.
శ్రీకృష్ణ పరమాత్మకూ, గురువుగారికి ఉన్న మరియొక సంబంధం యోగమార్గము. శ్రీకృష్ణుని యోగేశ్వరేశ్వరుడు అన్నారు. ఆయన భగవద్గీతలో అన్ని సాధనా మార్గములనూ యోగమనే అన్నారు. శ్రీకృష్ణుని యోగమార్గాన్ని గురువుగారు కృష్ణుని కార్యక్రమాలలో నిరూపించారు. కృష్ణుడు మహాయోగిగా ఏవిధముగా పరిణామము చెందాడో, గురువుగారు వర్ణిస్తారు. "కృష్ణుడు యోగులమధ్య, బ్రాహ్మణుల మధ్య కాకుండా గొల్లల మధ్య జీవించడంవలన గొప్పయోగి అయినాడు. వారు పశువుల కాపరులు. నిరక్షరులు. ఆ అమాయకపు సామాన్య సమాజములొ పెరగడం వలననే ఆయన సంపూర్ణమైన యోగి అయినాడు" గురువుగారు కూడా అదేవిధముగా జమిందారుల కుటుంబములో పుట్టి, పోలీసుశాఖలో చిన్న ఉద్యోగములో చేరి గుప్తముగా జీవించారు. రామావతార కాలములోని ఋషులు, మునులు కృష్ణుని సమయములో అమాయకులైన గోపాలకులు, గోపికలుగా పుట్టి మోక్షము పొందారు. గురువుగారి శిష్యకోటిలోని అనేకులకు గురువుగారి ముందు తమ విద్యార్హతలు విలువలేనివని అర్థమౌతుంది. ఇదే విషయాన్ని గురువుగారు శ్రీకృష్ణుని విషయంలో చెబుతారు. "ఆ సమయంలో అందరికంటే నిమ్న స్థాయి చదువుకున్న బ్రాహ్మణులది. వేదములు చదువుకొనిన పండితులమనీ, సంఘములో ఉన్నతులమనీ ధీమాతో ఉండేవారు." గురువుగారి సమక్షంలో అందరికీ వారి వారి విజ్ఞానమును గురించి ఉన్న భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. గురువుగారి సమక్షంలో "సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ" అనే వాక్యం అవగతమౌతుంది. శ్రీకృష్ణుడు తన జీవితకాలంలో అనేక యోగ శక్తులను ప్రదర్శించాడు. సాందీపని కుమారుని బ్రతికించడం, ఘంటాకర్ణుడనే గంధర్వునికి నూతన శరీరం ఈయడం, విశ్వరూప దర్శనం దీనికి ఉదాహరణలు. శ్రీకృష్ణుడు కుబ్జకు సౌందర్యప్రదానము చేయడము ఒక క్రియాయోగ రహస్యమని గురువు గారు చెబుతారు. తమ సన్నిహితుల ఆరోగ్యపరిస్థితులను గురించి క్లిష్ట సమయాల్లో అనేకులు గురువుగారికి పరిస్థితిని నివేదించడమూ, ఆయన ఆశీస్సులతో వారు ఆ ప్రమాద పరిస్థితి నుండి బ్రతికి బయటపడడమూ అందరికీ తెలిసినదే. అనేక సంఘటనలలో గురువుగారి యోగ శక్తులను గుర్తించవచ్చును. కాని అనేక సన్నివేశాలలో అంతర్గతంగా ఉన్న యోగ రహస్యాలను ఆయన విశదీకరిస్తారు. పద్మ వ్యూహంలో అభిమన్యుని మరణం, గోపికలు మణిపూరక చక్రాన్ని కృష్ణునిపై మోహముతోనే అధిగమించడం వంటివి ఆయన ఇచ్చిన ఉదాహరణలు.
గురువు గారిలో మనకు ముఖ్యంగా కనుపించేవి అచంచలమైన దేశభక్తి, మూర్తీభవించిన భారతీయత. భారతీయులను చరిత్రను సరిగా అధ్యయనం చేయమని ఆయన తరచుగా చెబుతారు. రామాయణ కాలంలోని సమాజం, ధర్మం, మహాభారత కాలంలోని సమాజం, నాడు సంభవించిన ధర్మగ్లాని, శ్రీకృష్ణుని ప్రభావం, కలియుగ ప్రవేశం, తరువాత కాలంలో బుద్ధుడు, మహావీరుడు, ఇతర తీర్థంకరులచే వ్యాప్తి పొందిన బౌద్ధ, జైన ధర్మాలు, శంకరులచేత సనాతన ధర్మ పునః ప్రతిష్ఠ, ఆ తరువాత వచ్చిన విదేశ దండయాత్రలు, 700 సంవత్సరాల ఇస్లాం మతస్థుల పరిపాలన, ఇస్లాం మత వ్యాప్తి, వాస్కోడగామా రాక, క్రైస్తవులైన ఐరోపా వాసుల రాక, 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన, స్వాతంత్ర్య సమరం, దానిలోని అపశృతులు, దేశ విభజన, మనకు మిగిలిన మత నిరపేక్ష రాజ్యం, తద్వారా ఎక్కువైన అన్యమతాలలోనికి హిందువుల మత మార్పిడులు -- ఈ విధంగా చరిత్రతో ముడిపడిన సనాతన ధర్మ చరిత్ర, క్షీణ దశకు చేరుకున్న భారతీయ సంస్కృతి గత 30 సంవత్సరాలుగా వారి దృష్టిలో ఉన్నాయి. గడచిన 60-70 సంవత్సరాలలో అధర్మము, అవినీతి, ఆర్థిక అసమానతలు, దారిద్ర్యం, హింస, నాయకులలోని అపరిమిత స్వార్థం పెరిగి ముఖ్యంగా హిందూ సమాజానికి రక్షణ కరువైనది. గురువుగారి ముఖ్యబోధలన్నీ, దేశ భవిష్యత్తు సనాతనధర్మ, భారతీయ సంస్కృతీ పరిరక్షణల పైనే ఆధారపడిఉంటుందన్న విషయంపైనే కేంద్రీకరింపబడి ఉన్నాయి.
గురువుగారు అనేక ప్రజాహిత కార్యాలకు శ్రీకారం చుట్టారు. అనేకరంగాలలో కృషిచేస్తూ దేశ ప్రగతికి తోడుపడుతున్న ఉత్తమ పౌరులను సత్కరించడం, సంగీత ఎకాడమీ ద్వారా శాస్త్రీయ సంగీత, నృత్య రంగాలలోని ప్రముఖులను సత్కరించడమూ, శ్రీరామ నవమి, కృష్ణాష్టమి సందర్భాలలో సాహిత్య, పాత్రికేయ, రాజకీయ, ధార్మిక రంగాలలోని ప్రముఖులను సత్కరించడమూ, ఇలా యువతరానికి దిశానిర్దేశం చేయడము గురువుగారు చేపట్టారు. నల్ల ధనం, అవినీతి, దేశ రక్షణ, విద్యావిధానం - ఇలా దేశ సమస్యలన్నిటిపై స్పందించి తన సలహాలను అందచేయడము ఆయన కార్యక్రమాలలో ఒకటి. ఆయనను పరిపూర్ణ మానవుడు, సద్గురువు అనడమే నాకు ఇష్టం. దైవాన్ని మనం అనుకరించలేము. గురువు గారు మన సమాజంలో ఒక వ్యక్తిగా మనకు ఆదర్శం గా ఉంటారు. వారితో జరిపిన ప్రతి సంభాషణా ధర్మ బోధయే. 85 సంవత్సరాల జీవితంలో ఆయన ఏఏ ప్రాంతాలు దర్శించి ఉంటారు? ఎందరితో మాటలాడి ఉంటారు? సామాన్యులు, రాజకీయ నాయకులు, ముఖ్య మంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు, సైన్యాధ్యక్షులు, శాస్త్రవేత్తలు, వేద పండితులు, జ్యోతిష్కులు, వైద్యులు, పాత్రికేయులు, కళాకారులు వీరందరితో ఒకే స్థాయిలో ఆయన మాట్లాడగలరు. వారి సందేహాలు తీర్చగలరు. ఇదికూడా శ్రీకృష్ణుని లక్షణమే!

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...