నన్నయ గారు తన భారత రచన చదువుతుండగా సరస్వతీ సభలోనున్న వ్యాసుడు, భవభూతి, కాళిదాసు తమ తమ కవిత్వములను మనసున నన్నయ రచనతో సరిపోల్చుకున్నారు. మధ్య మధ్య సభకు ముందు సరస్వతీదేవి పాదములకు పారాణి రాయవచ్చిన అప్సరస మేనక కూడ సంభాషణలో పాలు పంచుకొనుచున్నది.
కాళిదాసు - మనము ఈ సంభాషణలో నన్నయ పద్యములు సరిగా వినలేదు. ఆయన కవిత్వ శోభను ఆస్వాదించుదము గాక.
సరస్వతి - వినుడు. భిన్న స్వరములతో నన్నయ స్వీయ రచనను పఠించుచున్నాడు.
నన్నయ
బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీధర మజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికిఁ బాయక సెజ్జయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁడనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడిన్
(మహారణ్యములు, వృక్షములు, మహా సముద్రములు, కులపర్వతములు,సరస్సులు, సరస్వతి మొదలైన మహానదులు, అన్య పర్వతశ్రేణులను కలిగిన భూమిని అనవరతము తన సహస్ర శిరస్సులపై ధరించిన ఆదిశేషుడు శయ్యయై విశ్వరూపుడైన మహావిష్ణువును కూడా అలవోకగా ధరించిన వాడు. అట్టి అనంతుడు మాకు ప్రసన్నుడగును గాక.)
కాళిదాసు- ఏమి కవితామృత ప్రాహము. ఈ రచన వినుచు నేను ఆంధ్రుడనైపోవుచున్నాను.
......
……
వాడి మయూఖముల్ గలుగువాఁడపరాంబుధి గ్రుంకె ధేనువుల్
నేడిటవచ్చె నేకతను నిష్టమొయిన్ భవదగ్నిహోత్రముల్
పోడీమి వేల్వగాఁ బడియెఁ బ్రొద్దును వోయెఁ గచుండు నేనియున్
రాడు వనమ్ములోన మృగరాక్షస పన్నగ బాధ నొందెనో
భవభూతి - అడవికి వెళ్ళి, ప్రొద్దు పోయినా తిరిగిరాని కచునిపై గురుపుత్రి దేవయాని పడిన బాధను హృద్యముగా వర్ణించినారు. ఈ రచన్ చూచు నేను తెలుగు వానినా అనిపించుచున్నది.
సరస్వతి - కాళిదాస భవభూతులారా మీ ఇరువురి అంశలతోనే నన్న్య్య జన్మించినాడయ్యా.
...... (సభలో కలకలం) ...
మేనక - ఏమి సభలో కావ్య పఠనమునకు అంతరాయ మేర్పడి నట్లున్నది.
దౌవారికుడు - మహారాజా వేంగీ రాజ్యములో జైన మఠ స్థలములో వివాదములు పరిష్కరింపమని వారు తమతో విన్న వించుకోవలెనని వచ్చినారు.
మేనక - ఇంకెవరో కూడ వచ్చినట్లున్నారే
దౌవారికుడు - ధరణికోట సమీపము నుండి బౌద్ధ శ్రమణులు ఏదో చెప్పుకొనుటకు వచ్చినారు.
….. ((సభలో అంతరాయం)..
సరస్వతి - స్వల్ప సమయం నిరీక్షింతుము గాక.
….
సరస్వతి - ఇంతలోనే ఈ సభ పూర్తియైనట్లున్నది. వంది విష్ణువర్ధనుని స్తోత్రము చేయుచున్నాడు.
వంది -
బిరుదాంక భీమభీమే
శ్వరకృత నిత్య ప్రసాద సౌజన్య గుణా
భరణ పరగండ భైరవ
పరనృపమణిమకుటఘటిత పద విబుధనుతా!
సభాసదుడు - అంతయు బాగుగనే ఉన్నది కాని ఈ నన్నయ తన రచనను నరాంకితముచేసినాడేమి?
మేనక - ఆనరుడు సామాన్యుడు గాడు. భీమేశ్వరకృత నిత్య ప్రసాదుడు. దక్షారామ భీమేశ్వరునకు నిత్యనైవేద్యమైన వార్త అంచెలమీద రాజమహేంద్రవరమునకు చేరినగాని భోజనమునకు కూర్చొనడు.
వంది -
ఘన దురితానుబంధ కలికాలజ దోషతుషార సంహతిం
దన యుదయ ప్రభావమున దవ్వుగఁజోసి జగజ్జనానురం
జనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతి నెంతాయున్
దనరుఁ జళుక్యమన్మధుఁడు ధర్మ ద్యార్ద్ర నిబద్ధ బుద్ధియై
భవభూతి - ఇతని తెలుగు, సంస్కృతములు రెండూఉ మనొహరములుగా యున్నవి.
సరస్వతి - ఓయి కాళిదాస భవభూతులారా! ఆంధ్ర మహాభారత రచన వలన నాశరీరకాంతి ఇనుమడించుచున్నది. గీర్వాణమెంత ప్రియమో నాకు తెలుఁగును అంతయే ప్రియము
ద్వారపాలకుడు - అంధ్రభారతమునకు జయమగు గాక! అంధ్రజాతి వర్ధిల్లును గాక - తెలుగు భాష సారస్వతములు శాశ్వతత్త్వము పొందు గాక! -
(సమాప్తం)
కీర్తిశేషులు, కవి సమ్రాట్టులు విశ్వనాథ సత్యనారాయణ గారి రేడియో రూపకమును (1961) కొంచెం మార్పు, చేర్పులతో ఇక్కడ ఈయడంజరిగినది. భగవంతునిసృష్టిలోని ఫలపుష్పాదులనే ఆయనకు సమర్పించినట్లు వారి అద్భుత కల్పన వారి స్మృతికే అంకితం.
No comments:
Post a Comment