Thursday, January 25, 2018

మానస సోపాన పంక్తి

https://www.facebook.com/vallury.sarma/posts/565277586842992

https://www.facebook.com/vallury.sarma/posts/565549870149097

https://www.facebook.com/vallury.sarma/posts/565988570105227


ఇంగ్లీషులో ఒక పదం ఉంది. అది మైండ్ (mind). అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది.? దానికి బ్రెయిన్ (మెదడు) అనేపదానికి సంబంధం ఏమిటి? మైండ్ అంటే మనసేనా? పెద్ద మనసుతో ఆలోచించండి అంటారు. (broad-mindedness) . విశాల హృదయం అంటే అదేనా? మనసుకి బుద్ధికి సంబంధం ఉన్నదా? వివేకం, విచక్షణ, విశ్లేషణ,స్మృతి ఇవి ఎక్కడ ఉంటాయి? ఇంకో పదం ఉంది. చిత్తం. మనోహరుడు అన్నా చిత్తచోరుడు అన్నా ఒకటేనా? ఆలోచనలు ఎక్కడ వస్తాయి? ఆచరణ ఎక్కడ మొదలౌతుంది? ఇవి మనస్తత్త్వ శాస్త్ర విషయాలా వేదాంతం విషయాలా? వేదాంతం అనే పదం ఫిలాసఫీ అనే పదానికి సరియైన తెలుగు పదమేనా? మనసు మన తెలుగు కవులు విపరీతంగా వాడే పదము.వాళ్ళదృష్టిలో మనసు ఒక పదార్థం, వస్తువు. పారేసుకుంటారు, దోచుకుంటారు. ఇచ్చి పుచ్చుకుంటారు. తెలుగు వాళ్ళ భాషలో వాడే ఇదంతా ఒక మానసిక స్థితి. చిత్త విభ్రమం అనికూడా అనవచ్చును. ఇంకా ఉన్నాయి అహంకారం, మమకారం, అహంత, ఆత్మ వంటివి. ఈ పదాలు కొంచెం అర్థంచేసుకుంటే మన పలుకులు మనకే అర్థమౌతాయి. ఇంగ్లీషు పదాలు మాత్రమే వాడితే అస్పష్టత పెరుగుతుంది. తెలుగు ఇంగ్లీషు పదాలు ఒకదానికి ఒకటి అతకవు. వీటి సంగతి కొంచెం చూదాం. .

ఇంగ్లీషులో మైండ్ అనే పదము ఒక్కటే ఉంది. దానిని మన భారతీయ తత్త్వ శాస్రంలో చాలా లోతుగా అర్థంచేసుకుంటాం.. అది ఒక మెట్ల వరుస వంటిది. దానిని ఇంగ్లీష్ లో Internal Hierarchy of Mind అనవచ్చును. దాని మొదటి స్థాయి మనస్సు. మనస్సు ఎక్కడ ఉంటుంది? ఒకచోట ఉండదు. కోతిలాంటిది. చంచలము. మననుంచి ఒకచూచిన వస్తువు మీదకో, విన్నపాట మీదకో వెడుతుంది. ప్రయత్నంతో అదిలేకుండాకూడా చేసుకోవచ్చు. నా మనస్సు blank గా ఉందంటే ఆ క్షణంలో లేదనే అర్థం.absent-mindedness అదే. అంటే ఆలోచన ఉంటేనే మనస్సుకు ఉనికి ఉంది. ఆలోచన, లోచన (కన్ను) తరువాత ఘట్టం. మనం కళ్ళతోచూస్తే మనసులో ఆలోచన పుడుతుంది. అంటే మనస్సు మనం జ్ఞానేంద్రియాలతో గ్రహించినదానిని తన పైస్థాయికి చేరుస్తుంది. అందుకే నేత్రానికి అనుబంధంగా ఉన్న అంతరేంద్రియం మనస్సు. మనస్సుని అందుకే అంతః కరణం అంటాము. మనసు ఆలోచనను బుద్ధికి అందిస్తుంది. మనస్సుకి గుణంలేదు. ఆ గుణాలు ఉన్నది బుద్ధికి. సుబుద్ధి, దుర్బుద్ధి, బుద్ధిమంతుడు, కుక్క బుద్ధి, కోతిబుద్ధి - ఇలాంటి అనేక పదాలు వాడుకలో ఉన్నాయి.
బుద్ధిలోనే విశ్లేషణ, విచక్షణ, వివేకము, స్మృతి మొదలైనవి వస్తాయి. Intellect, intelligence, discrimination అని మనం చెప్పుకోవచ్చును. బుద్ధితన నివేదికను తరువాత స్థాయిలో ఉన్న చిత్తానికి నివేదిస్తుంది. ఈ చిత్తమనేది భారతీయ తత్త్వ శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. Consciousness దీనికి సన్నిహితమైన ఆంగ్లపదం. బుద్ధినుండి వచ్చిన నివేదిక ఆధారంగా చిత్తం కార్యాచరణకు ఆయత్తమౌతుంది. పతంజలి యోగసూత్రాలలో మొదటిది "యోగః చిత్తవృత్తి నిరోధకః" అనేది. చిత్తమనేది మనిషిలో అహంకారానికి ( ego ) కి స్థానం.
ఉదాహరణ - .మనిషి ఒక గదిలో కూర్చుని ఉంటాడు. ఒక పురుగు పాకుతూంది. ఇది కన్ను చూచిన పిమ్మట , మనసుకు వచ్చిన ఆలోచన. మనసు బుద్ధికి దీనిని అందిస్తుంది. బుద్ధి తన స్మృతిలో నున్న జ్ఞానం వలన - అది ఒక తేలు, కూడితే చాలా బాధకలుగుతుంది. దానిని చంపాలి - అనే ఈ నివేదికను.చిత్తానికి ఇస్తే చిత్తం కార్యాచరణకు శరీరాన్ని(కర్మేంద్రియాలను) ప్రేరేపిస్తుంది. చిత్తంలో ఉన్న అహంకారం “నేను ఒక తేలును చూచాను. వెంటనే చంపాను.” అని ఆ పని యొక్క కర్తృత్వాన్ని వహిస్తుంది. In computer language each of these hierarchical functions of mind can be called scripts (procedures) coming into play in a sequence.
ఒక యువకుడు ఒక యువతితో నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఆక్షణం అతని మనసు ఆమెపై ఉన్నది. ఇంకొక గంట తరువాత అతనిమనస్సు భోజనంపై ఉంటుంది. సత్యం ఇదే.


మానస సోపాన పంక్తి – 3
మనసు,బుద్ధి అందరికి సమానమే. వివేకము,విశ్లేషణ, విచక్షణ కలవారిది సద్బుద్ధి. ఈ బుద్ధి యొక్క గుణాలు కొన్నిసంస్కారాల రూపంగాను కొన్ని సాధనారూపంగానూ వస్తాయి. వీనికంటె పైస్థాయిలోని చిత్తము బుద్ధియొక్క నివేదికను యథాతథంగా స్వీకరించి కార్యాచరణకు ప్రేరేపిస్తుంది. చిత్తము ఒక అద్దమువంటిది. దాని వద్దకు వచ్చిన దానినే పునః పరిశీలనలేకుండా ప్రతిబింబమును (ప్రతిక్రియను) ఇస్తుంది. చిత్తమును భగవాన్ రమణమహర్షి సినిమాతెరతో పోల్చారు. దానిపై ప్రదర్శించిన చిత్రాల మంచిచెడ్డలతో తెరకు ఏమీ నిమిత్తం ఉండదు. దాని వృత్తి reflection మాత్రమే. మరి చిత్తవృత్తి నిరోధము ఎలా సాధ్యముతున్నది? బుద్ధినుండి వచ్చే స్పందన లను చిత్తము స్వీకరించకపోవడమే. అద్దాన్ని బుద్ధి వైపునుండి అహంకారము వైపు తిప్పడమే. చిత్తము బుద్ధిప్రేరణలను నిరాకరించి, అహంపై కేంద్రీకరించడమే. అప్పుడు దుర్బుద్ధియొక్క ప్రేరణలను చిత్తం నిరాకరించ గలుగుతుంది. నేను అనే తత్త్వంపై విచారణ ఇంద్రియములనుండి మనసునుండి బుద్ధినుండి వచ్చిన దానిని వదలి తనని తాను తెలుసుకుంటుంది. చిత్తము అంతర్ముఖము కావడమంటే అదే. ఆత్మజ్ఞాన సముపార్జనకు మార్గమదే.
సామాన్యునికి, జ్ఞానికి శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి సమానంగానే ఉంటాయి. కాని చిత్తవృత్త్లులను నిరోధించడం వలన ప్రపంచములో జరిగే సంఘటనల ప్రభావం జ్ఞానిపై ఉండదు. జ్ఞాని మౌనం వహించవచ్చు, సంభాషణలో పాలు పంచుకోవచ్చు కాని అతడు ఉద్రేక పడడు. కంగారు పడడు. సమతౌల్యం కోల్పోడు.
ఒక గీతా శ్లోకం గుర్తుకు వస్తుంది.
విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః (భ.గీ. 5.18)
విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, ఆవు యందును, ఏనుగుయందును, కుక్కయందును, కుక్క మాంసము తినువాని యందును సమదృష్టిగలవారే జ్ఞానులు అనిచెప్ప బడతారు.
ఇది సామాన్యంగా జ్ఞాని సమబుద్ధినిచెప్పడానికి అందరూ ఉదహరించే శ్లోకం. కాని ఒకోసారి విపరీతార్థాన్ని ఇచ్చినట్లు కనబడుతుంది. సమదర్శనః అంటే ఊరకుక్క ఇంట్లోదూరితే జ్ఞాని ఛీఛీ అని అదిలించకుండా ఉంటాడా? గొప్ప పండితుడిని గౌరవించి నమస్కరించకుండా ఉంటాడా? ఈ విధమైన ప్రశ్నలు రావచ్చును. ప్రకృతిలో మనం చూచే ప్రాణులన్నీ విభిన్నమైనవి. జంతువులు వేరు. వాటిలో నీచ జంతువులు వేరు. పండితుడు వేరు, పామరుడు వేరు. కాని శునక లక్షణము, గో లక్షణము, పాండిత్యము, అజ్ఞానము వేరైనా అవన్నీ ఉపాధికి సంబంధించినవి. సర్వభూతాశయస్థితుడైన పరమాత్మవస్తువు ఒక్కటే. బాహ్య స్వరూపముల తేడా అందరికీ తెలిసెదే. జ్ఞాని శరీరమును శరీరముగా, ఆత్మవస్తువును ఆత్మగా చూడగలుగుతాడు. కుక్క ముట్టుకుంటే స్నానం చేసి వస్తాడు. కుక్కను విదిలిస్తాడు. పండితునికి నమస్కరిస్తాడు. కాని, ఆకుక్కను హింసించడు. ఆ కుక్కపై క్రోధం, ద్వేషం వహించడు.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...