Thursday, January 25, 2018

On Cosmologies – 13


మనం రెండు రకాల విశ్వవిజ్ఞానాలని గురించి ముచ్చటించుకుంటున్నాము. ఒకటి ఖగోళ భౌతిక శాస్త్రాలకు సంబంధించిన ఆధునికవిజ్ఞానము. రెండవది మన పురాణాలలో చెప్పిన బ్రహ్మాండరచన, సృష్టినిగురించిన విజ్ఞానము. ఏది మనకు ఎక్కువ అవసరం? ఏది ఎక్కువ ఉపయోగం? ఉదాహరణకు మనకు స్టీఫెన్ హాకింగ్ పుస్తకాలు చదవడం ఇష్టం అనుకోండి. ఆయన ( English theoretical physicist, cosmologist, author and Director of Research at the Centre for Theoretical Cosmology within the University of Cambridge ) ఆయన పుస్తకాలు A Briefer History of Time, Universe in a Nutshell, The Grand Design గత 12 సంలో వ్రాసినవి చాలా పేరుపొందినవి. రెండవ తరగతికి చెందినవి హిందువులు తప్పక చదువలసిన బ్రహ్మాండ, విష్ణు, భాగవత పురాణాలు. మొదటివి ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఇచ్చేవి. తెలుసుకుంటే మంచిదే. తెలియకపోవడం వలన వచ్చిన పెద్ద నష్టమూ లేదు. కాని రెండవ తరహావి మనుష్యుణ్ణి ఉద్ధరించేవి. ఇది నా మూఢ విశ్వాసమా? కాదు. నేను కొంతవరకు రెండూ చదివాను. ఇది నా విశ్లేషణ తరువాత వచ్చిన వ్యక్తిగత నిర్ణయం. ఆలోచిస్తే ఈ విచికిత్స పురాణాలను వ్రాసిన వ్యాస మహర్షికి కూడా వచ్చింది. ఆయన నాలుగు వేదాలను విభజించాడు. తరువాత వేదాంత శాస్త్ర సూత్రగ్రంధం బ్రహ్మసూత్రాలు రచించాడు. దాని విషయం బ్రహ్మ జిజ్ఞాస. తరువాత ఆయన ఒక పాత్రధారియైన ఆనాటి చరిత్రను తెలిపే మహాభారతాన్ని రచించాడు. అందులో భగవద్గీతను పొందు పరచాడు. ఐనా ఆయనకు తృప్తి కలుగలేదు. భగవంతుని లీలలను తెలిపే పురాణాలని, ఆఖరుకు భాగవతాన్ని అప్పుడు రచించాడు.
బ్రహ్మ సూత్రాలు జ్ఞాన మార్గంలో ఉండే పండితులకు పనికి వచ్చేవి. లక్షమందిలో పదిమందికి పనికి వచ్చేవి. భారతము అందులో బోధింపబడిన ధర్మములు, నీతులు అందరికీ లౌకిక జీవితంలో పనికి వచ్చేవి. ఇది అందరికీ కావాలి. కాని జీవిత యాత్ర ప్రారంభంలో చదవాలి. జీవుని గతిని,మోక్షమార్గాన్నీ సూచించే భాగవతం ఈ జన్మకేకాక అనంత కాల చక్రంలో జీవుని సద్గతికి సంబంధించినది. భగవంతునితో యోగాన్ని ఇచ్చేది. పురాణాలను నిందా పూర్వకంగా "పుక్కిటి పురాణాలు", కల్పిత కథలు అనే మేధావులము అనుకునే వాళ్ళు ఉన్న కాలంలో ఇది చెప్ప గలగాలి. మనకు పురాణేతిహాసాలు ఉన్నాయి కాని నవలలు, కల్పిత కథలు లేవు. ఆంగ్ల సారస్వత పరిచయంతో ఇరవైయ్యవ శతాబ్దంలో వచ్చిన నూతన ప్రక్రియలు అవి. కంటికి కనబడే జగత్తును మిథ్య అనగలగడం అద్వైతవేదాంతం. మిథ్యను యంత్రపరికరాలతో నిజమని నమ్మింపడం ఆధునిక విజ్ఞానం.
మన పురాణాలు జీవన పరమార్థాన్ని తెలుపుతాయి. అంతరిక్షంలోను, ద్యులోకంలోను ఉన్న భూమండల సమీపంలోనున్న ఊర్ధ్వలోకాలను గురించి చెబుతాయి. అవి సైన్స్ కి కనబడవు. సైన్స్ కేవలం భౌతిక పదార్థాలను మాత్రం గుర్తించగలదు. ఊర్ధ్వలోకాలు తేజో నిర్మితమైన లోకాలు. దేవతలకు, ప్రేతాలకూ కూడా మనవంటి భౌతిక శరీరాలు ఉండవు. సైన్స్ ఉన్నవని చెప్పినవి ఉంటాయి. లేవనిచెబుతే సైన్స్ కు వాటిని గురించి ఎలా అన్వేషించాలో తెలియలేదనే అర్థము. ఇక సైన్స్ ఫిక్షన్ గ్రహాంతరవాసులని, శత్రువులుగా చిత్రిస్తుంది. వారికి మనమీద శత్రుత్వం ఎందుకు? వారికి మన నుండి ఏమికావాలి? మన సృష్టి రచనను గురించిన కథనము సృష్టికి, జీవితానికి అర్థాన్ని సూచిస్తుంది. సృష్టిలో మనుష్యులు ఎంతనిజమో దేవతలు అంతనిజము. అసురులు కూడా అంతే నిజము. మనుష్యలోకంలోనే జంతుజాలము నుండి పరిణామం చెంది వచ్చిన జీవులను, ఊర్ధ్వలోకం నుండి దిగివచ్చిన జీవుల ప్రవృత్తులను కూడా చూడగలం.
సైన్స్ ఎప్పుడూ అసంపూర్ణం. ఈ రోజుకు మనకు అర్థమైనట్లు కనపడే సమాచారం సైన్స్. రేపు సైన్స్ నేటి సైన్స్ కి విరుద్ధంగా ఉంటుంది. దానికి పూర్ణత్వం లేదు. కాని మన సుగతికి వైదిక విజ్ఞానం మనకు అవసరమైనంత పరిజ్ఞానాన్ని ఇస్తుంది. సైన్స్ వృత్తి విద్య. మన ఆటవస్తువులను తయారుచేయడానికి ఉపయోగిస్తుంది. సైన్స్ మేధస్సుకు, బుద్ధికి పదును పెడుతుంది. పురాణం చిత్తవృత్తులను మార్చి, ఆత్మజ్ఞాన సముపార్జనకు మార్గం సూచిస్తుంది. వైదిక సాహిత్యం మోక్ష విద్య. ఇహంలోనూ, పరంలోనూ సుఖశాంతులని ఇస్తుంది.
శుభమస్తు.


2 comments
Comments
Suryanarayana Murthy Dharmala ఆచార్య శర్మగారు విజ్ఞానశాస్త్ర, పురాణేతిహాసాల విషయాలు తులనాత్మక పరిశీలనతో చాలా చక్కగా వివరించారు. నిజానికి విజ్ఞాన శాస్త్ర పరిశోధనా ఫలితాలు(results) ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాని పురాణేతిహాసాలలో శాశ్వత సత్యాల ఆవిష్కరణ జరిగి ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
ఈ సత్యాల జ్ఞానం విజ్ఞానానికి(science)కి కంచిత్ కాలానన్తరం పరిశోధనద్వారా మాత్రమే అవగతమవుతుంది.
మేధకు,బుద్ధికి అందని పురాణేతిహాసాలలో పొందుపరచబడిన ఎన్నో అంశములనువిజ్ఞాన శాస్త్రము తన పరిశోధన ద్వారా స్థిరీకరించి తెలియజేసిన సందర్భములు అనేకములు మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ దృష్టితో సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానం నేటి ఆధునిక విజ్ఞానము కన్న మిన్న అని నా నమ్మకము.

Koundinya Raghavan Science is having its own limitations.Arshavijnana shows the eternal path to the humanity.Sarmagaru the article is good and informative.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...