నందిరాజు రాధాకృష్ణగారు నూతనసంవత్సరంలో విష్ణుసహస్రనామాలను పరిచయం చేయడం సంతోషదాయకం. మహాభారత యుద్ధాన్ని శ్రీకృష్ణపరమాత్మ యుగాంతంలో జరిగే మహాయజ్ఞంగా సంకల్పించాడు. అర్జునాదులను ఋత్విక్కులుగాను, 17 అక్షౌహిణీలసేననూ సమిధలుగాభావించవచ్చును. ఈ యజ్ఞం 18 దినములు జరిగినది. కృష్ణావతార ప్రయోజనాలు రెండు ఉన్నాయి.ఒకటి విష్ణుతత్త్వంలోనే ఉన్న సంహారాంశ. "వినాశాయ చ దుష్కృతాం" అంటే అదే. రెండవది బోధాంశ. జగద్గురువుగా అర్జునుని నెపంతో మనకిచ్చినది భగవద్గీత. రెండవది కృష్ణుని ప్రోత్సాహంతో అంపశయ్యమీద భీష్ముని చేత ధర్మరాజుకు చేయించిన జ్ఞానబొధ. అదంతా మహాభారతము శాంతి, అనుశాసనిక పర్వాల్లో కనుపిస్తుంది.అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూచిన భీష్ముడు చేసిన ఏకైక కార్యం మహావిష్ణుధ్యానం. ఆదే ఆయన ధర్మరాజు వ్యాజముగా మనకు ఇచ్చినవి విష్ణు సహస్రనామ స్తోత్రం (నిజానికి మహామంత్రము), మహనీయ జపము అనేవి. కేవలం ఒక స్తోత్రముగా చదవడంకంటె ప్రతినామము విడిగా ధ్యానిస్తే మంచిదని సద్గురు బొధ. రోజు కొన్ని (30) నామాలనుకొని ఒక మండలములో పూర్తిచేయవచ్చును. ఓం విశ్వాయనమః, ఓం విష్ణవేనమః ... ప్రతినామమూ ఎంతోశక్తి వంతమైనది.
ఓం విశ్వాయనమః, ఓం విష్ణవేనమః మొదటి రెండూ నామాలే ఎన్నో ఆలోచనలకు దారితీస్తాయి. విష్ణువు పరమేశ్వరుడు. సృష్టిని సంకల్పించినవాడు. విశ్వము సృష్టింపబడినది. మరి వరుస అలా లేదే. విశ్వం ముందు. విష్ణువు తరువాత వ్యాసభగవానుని ఉద్దేశ్యం ఏమిటి? (వ్యాసుడు ఈ మహామంత్రానికి ఋషి) ఏవేదాంతమైనా మూడిటిని చెబుతుంది... జగత్తు, జీవుడు, ఈశ్వరుడు.అన్వేషణ జీవునిది. మహర్షి ఐనా సరే. ప్రత్యక్షంగా కనబడేది విశ్వము. అది అనంతం. పదునాలుగు భువనాల బ్రహ్మాండం పైన కూడా విశ్వం వ్యాపించే ఉంటుంది. శబ్ద పరంగా విశ్వము, విష్ణువు కూడా విశ్ (వ్యాపించు) అనే ధాతువునుండే వచ్చాయి. అర్థంరెంటిలోకూడా అనంతమైన వ్యాప్తి..ప్రత్యక్షం ప్రధమ ప్రమాణం. ఈ అనంత విశ్వాన్ని చూస్తే దీని రచయిత, కర్త ఎవరు అనే ప్రశ్న వస్తుంది.అది ఈశ్వరుడు అనే స్పృహ కలుగుతుంది. ఈశ్వరుడు అనుమాన ప్రమాణం ద్వారా సాధ్యం అవుతాడు. ఇది మతములకు మూలమైన ఆలోచన. భూమిని , సూర్యుణ్ణి , నక్షత్రాలనీ, సౌరమండలాన్ని, బ్రహ్మాండాన్ని, అనేక బ్రహ్మాండాలను అన్నిటినీ సృష్టించినవాడి వ్యాప్తి ఎంత? ఒకదానికి ఒకటి ఉపమానం. (ఉపమాన ప్రమాణము). అదే వేదం చెప్పినది. (శబ్ద ప్రమాణం.) ఇదే న్యాయ సమ్మతం LOGIC హిరణ్యకశిపుడు అమాయకుడు. విష్ణువుని స్తంభంలో చూపిస్తావా? అని అడిగాడు. నీలోనూ, నాలోను, మన మధ్యనూ కూడా చూపిస్తావా? అని అడిగితే జ్ఞాని అయేవాడు. ఈసృష్టిలో సమస్తవస్తుజాలాన్నీ వాటి మధ్య వెలుపలనున్న ఆకాశాన్నీ తానే అయి తానే వ్యాపించినవాడు విష్ణువు. మొదటి రెండు నామాలను గురించి నేను చదివిన, విన్న నాకు అర్థమైనంతవరకూ తెలిసిన విషయాలు.
ఓం వషట్కారాయ నమః - ఇది మూడవ నామము. నమః, స్వాహా, వషట్, హుం, వౌషట్, ఫట్ ఈ శబ్దాలతో మంత్రాలు ఉచ్చరిస్తారు. హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్, కవచాయ హుం, నేత్రత్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్ ...ఇలా హృదయ న్యాస మంత్రాలు సాగుతాయి. శరీరభాగాలను దేవతలకు అర్పించడమన్న మాట . వషట్ లో షట్ శబ్దం ముఖ్యం. అంటే ఆరు విభూతులు. పరమేశ్వరునికి షడ్విభూతులు, షడైశ్వర్యాలు ఉంటాయి. విభూతులు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ, కారణ క్రియలు ఆయన లీలలు. అలాగే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము ఈశ్వర లక్షణములు. సృష్టి జ్ఞానాన్నీ అంటే పంచవింశతి (25) తత్త్వాలను సృష్టించి,వాని జ్ఞానాన్ని కలిగిఉన్నవాడు.వైరాగ్యమంటే కర్తృత్వ భావన లేనివాడు.
వషట్కార - అంటే జగత్తును శాసించువాడు అనే అర్థం కూడా ఉంది. రుద్రములో “యంతాచమే ధర్తాచమే” అనేదాని అర్థం ఇదే. నీవు నాకు నియంతగానుండి నన్ను ధరించుము అని శరణగతిని పొందడం. నాచేత నాబుద్ధి వలన జరిగే పొరపాటు పనులను నియంత్రించి, సన్మార్గములొ నీవే నడిపించు అనిచెప్పడం. ఆధునిక యుగం లో ఈ మంత్రము ప్రాచుర్యము వెబ్ లో కనుపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధికి, వీసా, ఉద్యోగపు ఇంటర్ వ్యూలకు. స్నేహాలను, పరిచయాలను (network) పెంచుకోడానికి ఈ మంత్రము జపించమని సలహా ఇస్తున్నారని విన్నాను. మంత్రమంటే - మననాత్ త్రాయతే ఇతి మంత్రః - జపించిన వారిని, మననము చేసుకున్నవారిని రక్షిస్తుందని అర్థము.
(మొదటి మంత్రం ఓం విశ్వాయనమః అని నిన్న ఇచ్చాను. ఓం విశ్వస్మై నమ: అని రూపాంతరం కూడ చూచాను. ఏది సరియైనదో తెలియదు. విశ్వం నపుంసక లిఙ్గ శబ్దం. చతుర్థీవిభక్తి రూపం ఎవరైన పండితుడు చెప్పాలి.)
No comments:
Post a Comment