Sunday, January 21, 2018

లోపాముద్ర -అగస్త్యుడు - 2

https://www.facebook.com/vallury.sarma/posts/520375871333164


శృతర్వుడు అనే రాజు వద్దకు అగస్త్యుడు వెళ్ళి, "రాజా నాకు కొంచెంధనము కావాలి" అని అడుగుతాడు. రాజుకు ఆశ్చర్యం, భయం కూడా వేశాయి. ఈ మహర్షి కనక వర్షం కురిపించగల తపశ్శాలి. నన్ను అడుగుతున్నాడు. ఆయనకు ఎంత కావాలో నేను ఈయగలనో లేదో అని సంకోచిస్తాడు. ఇద్దరు ముగ్గురు రాజులు ఆయనకు ఇవ్వడానికి వెనుకాడారు. అప్పుడు ఇల్వలుడు అనే రాక్షసాంశ లో పుట్టిన రాజు వద్దకు వెడతాడు. ఆరాజుకో తమ్ముడున్నాడు. వానిపేరు వాతాపి. వాళ్ళిద్దరికీ రాక్షసమాయలున్నాయి. కామరూపధారణ వంటి కొన్ని శక్తులున్నాయి. వారికి ఒక మునితో జరిగిన అనుభవం ఒకటి ఉంది. ఆమునిని వారు ఆశ్రయించి "మాకు కోరికలు తీరే మంత్రము ఉపదేశించండి" అని అడుగుతారు. ఆ ముని మీకు రాక్షసాంశ ఉన్నది.మీరు మంత్రాన్ని దురుపయోగంచేస్తారని భయం. మీకు ఈయను అంటాడు. ఇల్వలుడు వినయంగా "పోనీ వదిలేయండి. మాఇంట్లో పితృ కార్యం ఉన్నది.రేపు మాయింటికి భోక్తగా రండి" అని ఆహ్వానిస్తారు. వాతాపిని అన్నగారు మేకగా మార్చి, చంపి ఆమాంసాన్ని ఆ బ్రాహ్మణునికి పెడతాడు. తరువాత "వాతాపీ రా " అని మంత్రిస్తే వాడు బ్రతికి, ఆ ముని పొట్టచీలుచుకొని, బయటకు వస్తాడు.ఈ ప్రకారంగా వాళ్ళు వీలైనప్పుడల్లా బ్రాహ్మణ మాంస భక్షణ చేస్తున్నారు. అగస్త్యుడు ఇల్వలుని యొద్దకు ధనమడగటానికి వెడతాడు. అగస్త్యునికి అదే సత్కారం చేదామని ఇల్వలునికి అనిపిస్తుంది. ధనానికి ఏముంది. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. ముందు మా ఇంటిలో భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. మామూలుగానే వాతాపిని మేకగా మార్చి వండి వడ్డిస్తాడు. భోజనమవగానే అగస్త్యుడు "వాతాపి జీర్ణం" అని మూడు సార్లు అంటాడు. వాతాపీ రా!రా! అని ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లాభంలేక పోయింది. సముద్రజలమంతటినీ త్రాగిన అగస్త్యునికి వాతాపి ఒక లెక్కా? ఇల్వలుడు భయంతో వణికి పోయాడు తన దగ్గరున్న బంగారమంతా ఆయనకే ఇచ్చాడు. ఈ లోకోపకార కృత్యం ఆయన వలన జరగటానికే ఈ సంఘటన జరిగినది. నేటికీ మన దేశంలో తల్లులు పసిపిల్లలకు ఆహారమిచ్చినప్పుడు "జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం" అనడం వింటాము. అది అగస్త్య మునిని తలచుకోవడమే.
ఆయన బంగారం, ధనం తెచ్చి భార్యకు నగలు చేయించి, ఆమె కోరిన విధంగా ఉండి ఆనంద పేట్టాడు. కొన్ని రోజుల తర్వాత భార్యతో, "నీకు శక్తి, తేజస్సు కలిగిన నూరుగురు కొడుకులు కావాలా? దానికి పదిరెట్లు శక్తి, తేజస్సు కలిగిన, పది మంది పుత్రులు కావాలా? అందరి శక్తి తేజస్సు కలిగిన ఒక్క కొడుకు కావాలా? అని అడుగుతాడు. ఆమె ఆలోచించి ఒక్కడు చాలు అంటుంది. కొడుకు పుట్టాక వానికి తేజస్వి అని పేరు పెడతారు. ఎన్నో తరాలకు సరిపడ పుణ్యంచేసి పిత్రుదేవతలను వారి లోకానికి పంపించాడు. వాళ్ళకు ఉత్తమగతులు కలిపించడంకోసం అగస్త్యుని లీల ఇది. నిజానికి ఇది అగస్త్యుని ఋణం కాదు. తరువాత మళ్ళీ లోపాముద్ర, అగస్త్యుడు ఆశ్రమవాసానికి వెళ్ళిపోతారు.
ఒక సారి బ్రహ్మ దేవుడు వారి ఆశ్రమానికి వస్తాడు. "వేల సంవత్సరాలు తపస్సు చేస్తేకాని అవని బ్రహ్మ దర్శనం ఎందుకు కలిగినదని అగస్త్యునకే సందేహం వచ్చినది. "భూలోకంలో మనుష్యులు అనేక అధర్మాలు, పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలే వాతాపి వలే నీఆహారం. నీలాంటి వాళ్ళ ఉనికి వల్లనే భూమి ధర్మ బద్ధంగా నడుస్తూంది. నీవే వాటిని జీర్ణం చేసుకోగలవు. మహర్షులే మానవ జాతికి ప్రాతః స్మరణీయులు. ఈ మాట నీతో చెప్పడానికే వచ్చాను" అని బ్రహ్మ అంటాడు.
దక్షిణ దేశంలో కవేరుడనే ముని బహుకాలం ముక్తి కొరకు శివుని గురించి తపస్సుచేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నీవు ఇంకా ముక్తికి అర్హుడవు కావు. బ్రహ్మను గురించి తపస్సుచేయి. ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చి ముక్తి మార్గాన్ని సూచిస్తాడు అని శివుడు చెప్పగా కవేర ముని అలాగే చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై “ నీకు జన్మాతరంలోని తీరనికోరిక ఒకటి మిగిలి పోయింది. అది పూర్తి ఐతేగాని నీకు ముక్తి రాదు. నీవు గృహస్థాశ్రమం స్వీకరించి ఒక బాలికకు తండ్రి కావాలి. ఆ కన్యను తగిన వరునికి ఇచ్చి వివాహం చేస్తే నీవు బంధవిముక్తుడవౌతావు అనిచెబుతాడు.కవేరుడు గృహస్థుడౌతాడు. కుమార్తె జన్మిస్తుంది. ఆమె కారణజన్మురాలు. ఆమెయే విష్ణుమాయ. ఆమె తండ్రి ముక్తి కోసం తపస్సు ప్రారంభిస్తుంది.కవేరుని కుమార్తె గా ఆమె పేరు కావేరి.
(సశేషం)

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...