ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని లోకోక్తి. ధర్మం మనల్ని రక్షించాలి కాని మనం దాన్ని రక్షించడం ఎలా..? అనే ప్రశ్నను ప్రస్తుతం మనదేశంలో నడుస్తున్న కుల వివాదాల నేపథ్యంలో పరిశీలించాల్సి ఉంది.
ఇదివరకు పలు వ్యాసాల్లో ధర్మాన్ని గురించి అక్కడక్కడా ప్రస్తావన వచ్చింది. ధరించి ఉంచేది ధర్మం అని ఆ పదానికున్న అర్థం. అనగా సమాజం విడిపోకుండా పట్టి ఉంచేది. ఎవరూ అందులో నుంచి విడిపోకుండా పట్టుకుని ఉండేది. అంటే దాని పరిధి సంకుచితంగా ఉండకూడదు, విశాలంగా ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని దీనర్థం. ధర్మాన్ని రక్షించడం అంటే అందరినీ కలిపి ఉంచే లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం.
ఇదివరకు పలు వ్యాసాల్లో ధర్మాన్ని గురించి అక్కడక్కడా ప్రస్తావన వచ్చింది. ధరించి ఉంచేది ధర్మం అని ఆ పదానికున్న అర్థం. అనగా సమాజం విడిపోకుండా పట్టి ఉంచేది. ఎవరూ అందులో నుంచి విడిపోకుండా పట్టుకుని ఉండేది. అంటే దాని పరిధి సంకుచితంగా ఉండకూడదు, విశాలంగా ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని దీనర్థం. ధర్మాన్ని రక్షించడం అంటే అందరినీ కలిపి ఉంచే లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం.
మనదేశంలో రాజుల కాలంలో కూడా ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమివ్వడం చూడగలం. అనాటి ప్రజల అభిప్రాయానికి తలవంచి శంబుకుణ్ని చంపిన శ్రీరాముడే అదే ప్రజాభిప్రాయం మేరకు సీతను అడవిలో వదిలాడు. నియంతృత్వ పాలనలో తప్ప మిగతా అన్ని సమాజాల్లో ధర్మం ప్రజల అంగీకారాన్ని కలిగే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చెప్పనక్కర్లేదు. ధర్మం గురించి మరొక ముఖ్యమైన మాట ఉంది. ఇది తిక్కన భారతంలో ఉన్న పద్యం. ‘సారపు ధర్మమున్ విమల సత్యము’ అంటూ ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు కౌరవ సభలో చెప్పే మాట. ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత దెబ్బతీయబడే సందర్భంలో ఆ అధర్మాన్నీ, అసత్యాన్నీ నివారించే శక్తి ఉండి కూడా ఊరక ఉండేవారు కూడా నశిస్తారు అంటాడు. ద్రౌపదికి అవమానం జరిగినపుడు మిన్నకుండా ఉన్న భీష్ముడు, ద్రోణుడు లాంటి వారు కూడా మిగతావారితో పాటు నశించడం చదివాం.
‘ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడున్’ అనగా దేవుడు మళ్లీ ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు అంటూ తిక్కన చెప్పాడు. కానీ ఇది ఎంతో వినాశనం తర్వాత. ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటికప్పుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు వైదిక సిద్ధాంతాన్ని బుద్ధుడు విమర్శిస్తే ఆయన సిద్ధాంతాన్ని మళ్లీ సంప్రదాయకులు విమర్శించారు. బౌద్ధులను జైనులు విమర్శించారు. వైదిక సంప్రదాయంలోనే శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్ధాంతాన్ని మరొకరు విమర్శించుకున్నారు. ఎదుటివాడి సిద్ధాంతాన్ని సమీక్షించి తమ సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు.
ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించడం, ఎన్ని విమర్శలు వచ్చినా మన పండితులు, మతపెద్దలు స్తబ్ధంగా ఉండటం చాలా ఆశ్చర్యకరం. మన విమర్శకులైన పాశ్చాత్యులు కూడా ఈ విషయాన్ని వేలెత్తి చూపారు. The Death of Sanskrit అనే వ్యాసంలో Sheldon Pollock అనే ప్రముఖ రచయిత ఈ విషయంపై తీవ్రంగా వ్యాఖ్యానించాడు. పదహారవ శతాబ్దం వరకూ ఉన్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలెలా ఉన్నా.. ఈ వ్యాఖ్యలో మాత్రం కొంత సత్యముంది.
ప్రస్తుతం భారతీయ సంస్కృతిపై కొన్ని విశ్వవిద్యాలయాల్లోనూ, మీడియాలోనూ జరుగుతున్న అసత్య ప్రచారాలను పై దృష్టికోణం నుంచి పరిశీలించగలం. ఈ విమర్శలకు రెండు కారణాలు. మొదటిది మన దేశాన్ని బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న ఉద్యమాలు. రెండోది నిజంగానే మన వ్యవస్థలో రావాల్సిన మార్పు. మొదటి అంశం ఇక్కడ చర్చించడం లేదు. రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోనిది.
భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు ఉన్నాయనేది నిర్వివాదాంశం. హిందూమత సిద్ధాంతానికీ, కుల వ్యవస్థకూ ఎలాంటి సబంధం లేదు. మూల గ్రంథాలైన భగవద్గీతలాంటి వాటిలో సత్వం, రజస్సు, తమస్సు అనే గుణాల ఆధారంగా మనసులో ఉన్న భేదాలను వర్ణం అనే పేరిట చెప్పారు. కాని కులవ్యవస్థ లేదు. వివిధ కులాల ప్రస్తావన రుగ్వేదంలో ఉండటం వల్ల సమాజంలో అప్పటికే అనేక విధాల వృత్తి నైపుణ్యాన్ని బట్టి ఆయా వృత్తుల వాళ్లు ఒక కులంగా ఏర్పడ్డారని తెలుస్తుంది. ఆనాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి అనేక కులాలు ఏర్పడ్డాయని సామాజిక శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాల్లో చెప్పారు. యూరోపియన్ దేశాల్లో కూడా పద్దెనిమిదవ శతాబ్దం వరకు వివిధ కులవృత్తుల వారు economic guildsగా ఉండేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత సమాజంలో వచ్చి మార్పుతో ఆ వృత్తులు అంతరించాయి. ఆ కులాలు ప్రస్తుతం కనబడటం లేదు. మనదేశంలో నగర జీవనంలో కులాలు కనబడనప్పటికీ గ్రామీణ సమాజంలో ఇప్పటికీ కులవృత్తులు, కులాల కట్టుబాట్లు కొనసాగుతున్నాయి.
వృత్తుల వల్ల కులాలు సమాజంగా ఏర్పడటం ఒక పద్ధతి. కాగా స్మృతుల్లో మరొక పద్ధతి చెప్పారు. రెండు వర్ణాల మధ్య వివాహాలు జరగడం వల్ల కొన్ని కులాలు ఏర్పడినట్టు చూస్తాం. బహుశా రెండు పద్ధతుల్లోనూ కులాలు ఏర్పడి ఉండవచ్చు. ఎలాగున్నా ఇటీవలి కాలం వరకు గ్రామాల్లో అందరూ కలిసే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టడం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించడం, అందుకు మన సమాజం మౌనం వహించడం ప్రమాదకరం.
కులాల వారీగా సమాజాన్ని విడదీస్తున్న శక్తులకు ఎవరు సమాధానమివ్వాలి..? మతంతో ముడిపెడుతున్నందు వల్ల మతాధికారులు కూడా దీనిపై స్పందించాలి. ఉపనిషత్తులు, భగవద్గీతలకు ప్రాధాన్యమివ్వాలా అనేది మౌలికమైన ప్రశ్న. స్మృతులకు ప్రాధాన్యమిస్తే దేశ వ్యతిరేక శక్తులకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. మతానికీ, మూల సిద్ధాంతానికీ నష్టం కలుగుతుంది. కులం అనేదానికి మన మతానికి సంబంధం లేదని స్పష్టంగా అవసరం ఉంది. సమాజంలో వచ్చిన మార్పు వల్ల అన్ని కులాల వారు భగవద్గీతలో చెప్పినట్లు ద్విజుల కోవలోకి వస్తారు. మార్పును ఎవరు అడ్డుకోలేరు. దీన్ని అంగీకరిస్తూ ధర్మం యొక్క నిర్వచనాన్ని ఎప్పటికప్పుడు పునఃపరిశీలించాలి. మతపెద్దలు తప్ప మరెవ్వరు చెప్పినా దీనికి ప్రామాణ్యం ఉండదు.
స్వతంత్ర పోరాట యోధులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ఒక ప్రతిపాదన చేశారు. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరుచేయడం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని ఆయన చెప్పారు. అందరికీ ఉపనయనం చేయాలనీ, గాయత్రి మంత్రం నేర్పాలనీ ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనబడవచ్చు. కానీ లోతుగా ఆలోచించాల్సిన విషయం పై వర్గాలకు మేలు చేస్తున్నామనే భావంతో వారిని ఉద్యమాల్లోకి దింపి మన దేశాన్ని, సంస్కృతినీ ద్వేషించేట్టు చేసేవారిని అడ్డుకోవడానికి ఇదొక మార్గం.
No comments:
Post a Comment