Thursday, January 18, 2018

గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం

https://www.facebook.com/vallury.sarma/posts/602280333142717

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి వ్యాసం ఈ రోజు ఆంధ్రభూమిలో
గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం…
- సామవేదం షణ్ముఖశర్మ 25/11/2013 Andhra Bhoomi Daily 

శ్రీశ్రీశ్రీ శ్రీ శివానందమూర్తిగారి కారణజన్మబహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది. 

1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా, అసంఖ్యాకులను ప్రేరేపించి, వారి జీవితాలను, ధర్మమయంగా, తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం. ... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
మన సనాతన ధర్మం ఆర్షగ్రంథాలపైనా, భవ్యక్షేత్ర తీర్థ దేవాలయాలపైనా ఆధారపడి వర్థిల్ల్లినదే కాదు. ఎందరో మహాత్ముల ద్వారా తేజరిల్లుతున్నది. ఎప్పటికప్పుడు ఆయా దేశ కాలాలకనుగుణంగా యోగులు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. కొన్ని వేల గ్రంథాల వలన తెలియవలసిన జ్ఞానం, కలుగవలసిన ప్రభావం ఒక్కయోగివల్ల జరుగుతుంది. ఒక రమణులు, ఒక కంచి మహాస్వామి... ఇలా ఎందరో జీవన్ముక్తులు సనాతన బ్రహ్మ విద్యకు సాకారంగా సంచరించి ధర్మసౌధాన్నినిలుపగలుగుతున్నారు. వీరే మన పరంపరకు, సంప్రదాయాలకు, అమోఘమైన జ్ఞానానికి ఆధారస్తంభాలు. ఈ సద్గురు పరంపరకు ప్రణామాలు. * * *
చాలా యేళ్ల క్రితం... ఒక స్నేహితుడు రమణమహర్షిగారి అరుదైన ఫొటో ఆల్బమ్ను నాకు చూపించారు. చక్కని సాంకేతిక విజ్ఞానంతో ఏర్పరచిన సమాహారమిది. స్ఫుటమైన రమణుల ప్రశాంత ముఖచిత్రాలు ఎన్నోఅందులో ఉన్నాయి. అయితే ప్రతి చిత్రంలోనూ ఆకళ్లల్లో ఏదో అనిర్వచనీయ తేజస్సు ద్యోతకవౌతోంది. ఇలాంటి నయనాలను ఎక్కడో ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తోంది. అవును- ఒకే ఒక్క వ్యక్తిలో అలాంటి నేత్రజ్యోతి దర్శనమయింది. ఎవరా మహనీయులు- కాసేపట్లో జ్ఞప్తికి వచ్చింది. అలాంటి ప్రకాశవంతమైన, నిర్మల, నిర్వికార, జ్ఞానస్ఫురనేత్రాలు కల గురువర్యులు సద్గురు శివానందమూర్తిగారు. నాడు అరుణాచలంలో స్థాణు చైతన్యం, నేడు భీమునిపట్నపు ఆనందవనంలోనూ, వరంగల్ గురుధామ్లోనూ, కొన్ని ప్రత్యేక సభల్లోనూ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాత్సల్యంతో సంచరిస్తున్న చైతన్యం! వ్యక్తిగతంగా దర్శించిన, అనుభవించిన దివ్యత్వాలు ఒక గ్రంథానికి సరిపడా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తిత్వంలో స్ఫురించిన సందేశాలను ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తాను. వారి ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రం, మననం చేసే వారిని రక్షించేది. మంత్రం (మననాత్ త్రాయతే మంత్రః) – అని శాస్తన్రిర్వచనం, అందుకే ఆ వాక్యాలు మంత్రాలు. ఈ దేశం పట్ల, దీని సహజ స్వభావమైన ఆర్య ధర్మం పట్ల వారికున్న పరిజ్ఞానం,పరమభక్తి ‘నాన్యతో దర్శనీయం’. నేటి యువత గ్రహించి స్ఫూర్తి చెందవలసిన అంశం. ఆసేతుశీతాచలం భిన్న రాష్ట్రాల వైవిధ్యంలో ఏకసూత్రంగా అల్లుకున్నసనాతనధర్మ వైభవాన్నివారు పర్యటించి, పరిశీలించి, పరిశోధించి గ్రహించి ఉద్బోధిస్తున్నారు. వ్యతిరేక శక్తుల కువిమర్శలను ప్రశాంతంగానూ, పరమ స్పష్టంగానూ, సూటిగాను ఎదుర్కొంటూ వారు పలికిన, రాసిన వాక్యాలు ప్రత్యేక ధర్మశాస్త్రాలు. అపారమైన వాత్సల్యం, కారుణ్యం వారి కనులనుండి వర్షిస్తున్నా, రాగద్వేషాదుల చాయలు కానరావు. ఒక విశాలమైన ఆహ్లాదినీ దృక్కుంతి హృదయాలను స్పర్శిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నగరంలో వారిని దర్శించేందుకు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక భావన కలిగింది. ‘‘నిత్యం ఏదో కొంతసేపు మాత్రమే ఉపాసన చేసుకోగలుగుతున్నాను. ఉపన్యాసాలతోనే కాలమైపోతోంది. నేను తరించేదెలా?’’- అనే విచారం మనసునావరించింది. వారిని దర్శించి తీర్థం పుచ్చుకున్నప్పుడు, మనసులో ఉన్న ఈ వేదనను చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను. మౌనంగానే ఉన్నాను. అప్పుడు వారు విబూదిని నా నుదుటరాస్తూ ‘‘నీ ఉపన్యాసమే నీకు ఉపాసన’అన్నారు. ఆశ్చర్యం కలిగింది. మాటాడనవసరం లేకుండా మనసును గ్రహించే మహాదేవ తేజస్సుకి మనసా నమస్కరించుకున్నాను. వారి ఈ మాటలో నాకు గొప్ప సందేశం అందింది. ‘ఉపన్యాసాన్ని ఉపాసనగా సాగించు’అనే ప్రబోధమిది. తరువాత అనేక సందర్భాల్లో ధర్మప్రచారం గురించి కర్తవ్యోన్ముఖులని చేశారు.
‘‘మన సనాతన ధర్మం గురించి ప్రచారంచేయడం ముఖ్య కర్తవ్యం. ఋషులిచ్చిన ధర్మం గురించి ప్రచారం చేయడమనేది ఎన్నోఅశ్వమేధ యాగాలకంటె గొప్పది. యాగం స్వర్గాన్నిస్తుంది- అంతే. ధర్మప్రచారం అంతకంటే గొప్పదైన ఈశ్వర కృపను ప్రసాదిస్తుంది’’అని బోధించారు. ‘ఈ దేశంయొక్క అసలు చరిత్రను తెలుసుకోవాలి.దేశమంతా సంచరించాలి. నాకైతే ఈ దేశపు మట్టిలో దొర్లితేనే ధన్యత అనిపిస్తుంది. అంత పవిత్రమైనదీ దేశం’’. ఈ ఆర్యభూమిపై వారికున్నప్రపత్తి అంతటిది. ధర్మప్రచారానికి, ప్రబోధానికి అంకితమయ్యేలా తీర్చిదిద్దినది వారి ఉపదేశం, ఆదేశం, ఆశీర్వచనం. లౌకికాపేక్షలను జన్మతోనే జయించిన ఆజన్మశుద్ధులు వారు. లోకాన్ని ఒక చిత్తరువులా చూసే నిర్వికారులు, జ్ఞానదృష్టితో సర్వాన్నీ వీక్షించే వారి సన్నిధి ప్రశాంతతను ప్రసాదించడమేకాదు, వారివారి యోగ్యతలననుసరించి కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. నడిపిస్తుంది. మౌనంగానూ, ప్రభావవంతంగానూ వారందించే స్ఫూర్తి నిశ్శబ్దంగానే ఎందరో ధార్మిక యోధుల్ని తయారుచేసింది. దేశ సౌభాగ్యంకోసం వారు నిర్వహించిన, నిర్వహిస్తున్న యాగాలు అనేకం.
‘‘మనకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంతోషమే, కానీ అంతకంటె ముఖ్యంమన దేశ క్షేమం గురించి ప్రార్థించాలి. తన క్షేమం కంటె, దేశ క్షేమంకోసం ప్రార్థించే వారి క్షేమాన్ని భగవంతుడు ప్రధానంగా అనుగ్రహిస్తాడు.’’ ఇది వారిచ్చిన మహాసందేశం. హిమగిరుల నుండి సముద్ర తటాలవరకు విస్తరించిన భవ్య భారత చరిత్ర వారికి కరతలామలకం. విభిన్నరాష్ట్రాల ప్రజలనేకాదు, విదేశాలలోను హిందూ ధర్మ పరిశోధకులు డా.డేవిడ్ ఫ్రాలే వంటి మేధావులు కూడా వారిని ఆశ్రయించి స్ఫూర్తినీ, సరియైన దృక్పథాన్నీసంపాదించుకున్నవారే.
ఈ దేశాన్నీ, దీని స్వాభావిక ఆర్షధర్మాన్నీ ఎప్పటికప్పుడు గమనించి కాపాడుకునే ఒక సిద్ధ వ్యవస్థ- సూక్ష్మభూమికలో సిద్ధ భూములలో ఉంది. ఆ వ్యవస్థనుండి ఒక మహాప్రయోజన సిద్ధికై వచ్చిన జీవన్ముక్తులు మా గురువుగారు శ్రీ శివానందమూర్తిగారు. తాను శైవ సంప్రదాయంలో జన్మించి, శివయోగిగా పరిణిమించి, ఆ అద్భుత శివయోగంలో సమగ్ర భారతీయతను పొదువుకున్న ‘జ్ఞానప్రేమ’వారిది. అందుకే వారి శిష్యుల్లో శైవ వైష్ణవాది సర్వసంప్రదాయాల వారున్నారు. అన్నికులాల, రాష్ట్రాలవారూ ఉన్నారు. వారి ఆదేశంతో కాశీలో ఆధ్యాత్మిక సాధనచేస్తున్న కొందరు విదేశస్థుల గురించి తెలుసుకొని ఆశ్చర్యం కలిగింది.
‘‘దేవతల కంటె ఋషులనే ముందు స్మరించి ఆరాధించాలి. దేవతలు కూడా ఋషులవల్లనే తెలియబడుతున్నారు. వారుకూడా ఋషుల మాటకు కట్టుబడి ఉంటారు’’అంటూ ఋషుల గొప్పతనాన్ని ఎన్నోమార్లు వింగడించారు. వారి మాటలో, వ్రాతలో మహర్షుల చరిత్రలు స్ఫూర్తిదాయకంగా వెలుగులీనాయి. రాజకీయాలు, సామాజిక పరివర్తనలు, మారుతున్న జీవన మూల్యాలు... ఇలా అన్ని పరిణామాలను పరిశీలిస్తూ, వాటిని ధార్మిక దృష్టితో సవరించుకోవలసిన బాధ్యతను, విధానాలను స్పష్టంగా, నిష్పాక్షికంగా సూచించారు. నేటి రాజకీయ విధాన నిర్ణేతలు వాటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒక సమగ్ర దృష్టి కలిగిన వారి సందేశాన్ని పాలనా బాధ్యత కలిగినవారు. గమనించేలా, శిష్యులైన మేధావులు బాధ్యత. వహించాలి. దేశంలో ప్రధాన పీఠాధీశ్వరులందరికీ మా గురువుగారిపై ప్రత్యేక ప్రేమ మాత్రమే కాదు, విశిష్ట గౌరవభావముంది. పీఠాల నడుమ ఎవరి పరిమితులు. వారికి ఉన్నప్పటికీ, ఈ సద్గురువు విషయంలో అపరిమిత సౌహార్దం, మన్నన అన్ని పీఠాలు కనబరచుతూనే ఉన్నాయి.
సద్గురువుల రచన ‘కఠయోగా’నికి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామివారు అనుగ్రహించిన విస్తార శ్రీముఖం, ఇటీవల ఆంధ్ర దేశ పర్యటనలో పీఠాధీశ్వరులు గురువులతో ఆత్మీయంగా ‘ఆనందవనం’లో సమావేశమవడం దివ్య ఘట్టాలు. నేపాల్, కాశీ, భారత ఈశాన్య రాష్ట్రాలు, ఇలా ఎన్నో ప్రాంతాలలో, కేవలం యాత్రా దృష్టిగాకాక, ఒక తపశ్శక్తితో, భారతీయతా పరిరక్షణ దృష్టితో సంచరించి వీరిచ్చిన సందేశాలు, చేసిన స్ఫూర్తిమంతమైన కార్యాలు అందరూ గమనించి గ్రహించవసినవి. సముద్రతీరంలో సముద్రతనయ అయిన మహాలక్ష్మీ ఆలయాన్ని ‘ఆనందవనంలో, ఉత్కళ శిల్పంలో నిర్మించిన మహోపకృతికి వందనాలర్పించవలసినదే. ‘ఆద్యాలక్ష్మి’రూపంగా పరాశక్తిని ప్రతిష్ఠించి, ‘దేశదారిద్య్రా’న్ని తొలగించమని ప్రార్థించారు. మనచేత ప్రార్థింపజేస్తున్నారు. అనేకమంది జీవితాల్లో వీరి అనుగ్రహ ప్రభావాలు కోకొల్లలు. కానీ అవి ప్రకటితాలు కాకుండా, గుప్తంగానే, తన జ్ఞానస్ఫూర్తిని ప్రసరింపజేయడం సద్గురువుల ప్రత్యేకత. వారి కారణజన్మ బహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది.
1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ, ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా అసంఖ్యాకులను ప్రేరేపించి వారి జీవితాలను ధర్మమయంగా తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం.
... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
భారతీయ విజ్ఞాన సంపదలు, సంస్కృతి నిక్షేపాలన్నిటినీ పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను- తానుచేస్తూ, మనకు బోధించారు. ‘‘గురువు ఒక వ్యక్తికాదు. ఈ అనంత విశ్వంలో గురువు ఒక జటిల ప్రశ్న- దాని సమాధానమూను.’’అని ఎంతో గూఢంగా వచించే సద్గురువులు పరంపరాగతమైన, ఋషి సంప్రదాయ సిద్ధమైన గురుతత్వానికి సాకారం.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...