Sunday, January 21, 2018

హిందూమతం - ఆగమనం, నిష్క్రమణం

https://www.facebook.com/vallury.sarma/posts/513621212008630

https://www.facebook.com/vallury.sarma/posts/514002581970493

https://www.facebook.com/vallury.sarma/posts/514300071940744

మతంనుండి బయటకు వెళ్ళడం, తిరిగిరావడం దీనినే మనము మతమార్పిడి అంటున్నాము. మనదేశంలో మతాలైన హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిఖ్ఖుమతాలకు ఇది ఎలా వర్తిస్తుంది? సనాతన ధర్మం ప్రపంచంలో ఏ ఇతరమతం లేని నాటిది. రామాయణకాలంలోనూ, మహాభారతకాలంలోను అసురులతో సహా అందరిదీ ఒకటేధర్మం. బుద్ధుడు కూడా తాను ఒక క్రొత్తమతము స్థాపిస్తున్నాననిచెప్పలేదు. నచ్చినవారు అతనిని అనుసరించారు. సామాన్యుల నుండి పండితుల వరకూ అందులో ఉన్నారు. ఒక వేయి సంవత్సరాలలో అనేక కారణాల వలన బయటకు వచ్చేశారు. బౌద్ధులు తిరిగి హిందువులయ్యారు.
ముస్లిములుగామారినవారు తిరిగి హిందూమతం లోకి రావడం జరగలేదు. మనదేశానికి వచ్చిన ముస్లిములు కొందరు టర్కీ, ఇరాన్, ఇరాక్, అరబ్ దేశాలనుండి వచ్చియుండవచ్చు. కాని వారు ఇక్కడవారితో వివాహాది సంబంధాలేర్పరచుకుని కలసిపోయారు.అనేకులు ఇక్కడ కూడా కారణాలేమైనా ముస్లిములుగా మారియున్నారు. ఇది ఒక రకమైన one way traffic. ఇలా ఎందుకు జరిగినది - అంటే ఇస్లాములో apostasy (స్వమత పరిత్యాగము) అని ఒక నేరము ఉంది. అలాగే blasphemy (అధికారమత లేక దైవ దూషణ) అని ఒకనేరము ఉంది. ఏ కారణముననైనా, ఒక ముస్లిం తన మతాని వదలిపెట్టి ఇంకొక మతంలోనికి మారితే, అది ఇస్లాం మతం తీవ్రమైన అపరాధంగా పరిగణిస్తుంది. చాలా ముస్లిం దేశాలలో ఇది శిక్షార్హమైన నేరం. ఈ ఆధునిక యుగంలో అన్ని ముస్లిం దేశాలలోనూ ఒకేరకమైన శిక్షలు లేవు. దీనికి వేయగల అత్యధిక శిక్ష మరణదండన. రచయిత సాల్మన్ రష్డీకి తన పుస్తకం "Satanic Verses" కారణంగా ఇరాన్ పాలకుడు ఖొమేనిచేత మరణదండన విధించబడినది. ఇరాన్ దేశంలో apostasy కి శిక్ష మరణదండన. సౌదీ అరేబియా లోనూ ఇదేశిక్ష. ఇది ముస్లిములు హిందువులుగా మారటానికి ఒక ప్రతిబంధకం కావచ్చును. కాని కొద్దిమంది ముస్లిములు చరిత్రలో తిరిగి హిందువులుగా మారారు. వారిలో హరిహర రాయలు బుక్కరాయలు సుమారు మొదటివారు. విద్యారణ్య స్వామికి ముందు హిందూ ఆచార్యులెవరూ పునరాగమనానికి తోడ్పడలేదు. గాంధీగారు కూడా మతమార్పిడులని ఇష్టపడలేదు కాని, reconversionని కూడా ప్రోత్సహించలేదు.. గాంధీగారు మతగురువుకాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయానికి విలువలేదు. అందుచేత ఆర్యసమాజ స్థాపకుడు దయానందసరస్వతి శుద్ధికార్యక్రమం హిందూమత చరిత్రలో మలుపు అనేచెప్పాలి.

విజయనగర సామ్రాజ్యము - బహమనీ - దక్కన్ సుల్తానులు
ఇక్కడ నేటి హంపీ సమీపములో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినప్పుడే, దక్కన్ లో బహమనీలు ఢిల్లీ సుల్తానులనుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. వారి రాజధాని అహసానా బాద్ (నేటి గుల్బర్గా, కల్బుర్గి). తరువాత అది మహమ్మదాబాదు (నేటి బీదరు)కు మారింది. 70 సం.లో అదికూడా - బీజపూర్, బీదర్, గోల్కొండ,అహమద్ నగర్, వర్హాద్ (బేరార్) అనే ఐదు దక్కన్ రాజ్యాలుగా విడిపోయింది. విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నది సుమారు 250 సంవత్సరాలు. దీనిలో 150 సం. హక్క, బుక్కల, సంగమ వంశం పాలిస్తే, తరువాత 20 సం. సాళువ వంశం, 80 సం. శ్రీకృష్ణదేవరాయల తుళువ వంశం పాలించాయి.తళ్ళికోట యుద్ధంలో విజయనగరం ధ్వంసమైనది. కృష్ణరాయల అల్లుడు (అళియ) రామరాజు చంపబడ్డాడు. అతని సోదరుడు తిరుమల రాయలు పెనుకొండ నుండి మిగిలిన రాజ్యాన్ని పాలించాడు.
పశ్చిమతీరంలో పెనుమార్పులు సంభవించాయి. మొదట విజయనగర పాలకులు గోవా కొంకణతీరాన్ని జయించారు. తరువాత గోవా బహమనీసుల్తానుల వశమైనది. ఆతరువాత అది దక్కన్ సుల్తానుల చేతికి వచ్చింది. ఈలోపల 1498లో వాస్కోడగామా కాలికట్ (కోజికోడ్) చేరాడు. ఈదేశ పరిస్థితులను గుర్తించి గోవా ప్రాంతాలను 5-6సం.లోపుననే ఆక్రమించుకున్నాడు. భారత చరిత్రలో RC క్రైస్తవమతం ప్రవేశించింది.
(యేసు 12 అనుయాయులలో ఒకరైన థామస్ సా.శ. ఒకటవ శతాబ్దంలోనే భారత్ కు వచ్చాడనీ కేరళలో కొద్దిమంది క్రైస్తవులతో ప్రాచీన క్రైస్తవ సమాజం ఏర్పడిందన్న ఉహాగానాలకు చాలా ప్రచారమే జరిగింది. మద్రాస్ లోని సెంట్ థామస్ మౌంట్ అతని జ్ఞాపకార్థమనీ కథలున్నాయి. మైలపూరు బ్రాహ్మణులు అతనిని హత్యచేశారని కూడా ఒక కథ ఉన్నది.) ఎక్కువ నమ్మతగిన సాక్ష్యాధారాల ప్రకారము థామస్ ఒక్ జొరాష్ట్రియన్ రాజు చేఏతిలో ఇరాన్ బెలూచిస్తాన్ సరిహద్దులో మరణించాడు. అతడు కేరళ, చెన్నైలకు రావడం పుక్కిటిపురాణమే అనిపిస్తుంది. భారతదేశం వచ్చిన థామస్ శతాబ్దాల తరువాత వచ్చిన ఒక వర్తకుడని ఇంకొక కథ ఉన్నది. St Thomas Christians, Syrian Christians - కేరళలో వీళ్ళు పోర్చుగీస్ వారు రావడానికి చాలా శతాబ్దాల ముందునుండీ ఉంటున్నారు. వీళ్ళు కేరళ ప్రజానీకంలో కలసిపోయారు. పోర్చుగీస్ వారిది రోమన్ కాథొలిక్ (RC) చర్చి. వీరికి వారికీ కొన్ని బేధాభిప్రాయాలు వచ్చాయి. యేసు క్రీస్తు శిలువపై మరణించలేదనీ, రక్షింపబడి శిష్యుల సాయంతో కాశ్మీరుచేరి శేషజీవితం గడిపాడనీ ఒక కథ ఉన్నది. శ్రీనగర్ సమీపంలో ఆయన సమాధిగా చెప్పబడే స్థలం ఉంది. ఇది క్రైస్తవులు ఒప్పుకోరు - పునరుత్థానం నమ్మకం దీనికి విరుద్ధం కదా.)
పూర్వం చెన్నపురి సముద్రతీరంలో ఒక ప్రాచీన కపాలీశ్వర దేవాలయం ఉండేది. అది పల్లవుల నిర్మాణం. ఇప్పుడు చెన్నై, మైలాపూర్లో ప్రఖ్యాతిగాంచిన కపాలీశ్వర దేవాలయం ఉంది. దానికథకు పోర్చుగీసుల విధ్వంసానికి సంబంధం ఉన్నది. నాయనారులలో ఒకరైన జ్ఞానసంబంధులు మద్రాసు సముద్రతీరాన ఉన్న కపాలీశ్వరదేవాలయాన్ని కీర్తిస్తూ పాట వ్రాశారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు సాంథోం చర్చి ఉన్నది. ఇదిప్రాచీన కపాలీశ్వర దేవాలయం ఉన్నచోట కట్టినది. సముద్రతీరానికి 1.5 కి.మీ. దూరాన ఉన్న ప్రస్తుత దేవాలయం విజయనగర రాజులు కట్టించారు. తరువాత విజయనగర రాజులే చెన్నపురి (మద్రాసు) తీరాన్ని ఆంగ్లేయులకు ధారాదత్తం చేశారు. అరాచకంగా ఉన్న భారతదేశంలోకి మిగిలినది దోచుకోడానికి ఐరోపా వాసులు - మొదట పోర్చుగీసు (మనవాళ్ళు బుడత కీచులు అనేవారు), తరువాత డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు వ్యాపారనెపంతో ప్రవేశించి - రాజ్య స్థాపనకి, వారి మతాన్ని ప్రచారంచేసి నాగరికత నేర్పడానికి వచ్చారు


త్రిమతాచార్యులు - వారి తరువాత
దక్షీణ భారతంలో బౌద్ధజైనాల ప్రభావం తగ్గించడానికి కారణం ఆదిశంకరుల ఆవిర్భావం (సా.శ. 800). బౌద్ధుల, జైనుల వాదాన్ని జయించి వారిని జయించి,ఒప్పించి ఈపని చేయగలిగారు.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే | స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః ||
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః | శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా||
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడు. (కూర్మపురాణం నుండి).(వికిపీడియా)
శంకరాచార్యుడు ఉత్తర మీమాంస (వేదాంత) దర్శనగ్రంధమైన వ్యాస విరచిత బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం వ్రాశాడు. (దీని తెలుగు వ్యాఖ్యానం మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు వ్రాశారు)
శంకరుల అద్వైత సిద్ధాంతము ప్రకారము "బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు, పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే అందరి లోని ఆత్మ బ్రహ్మ మయమే. మాయవలన అజ్ఙానము, దానివలన భేదభావము కలుగుచున్నవి." అందరికీ అనుభవమయ్యే జగత్తును మిథ్య అనడం, దానిని వ్యావహారిక సత్యం అనినా కొందరు వేదాంతులకు నచ్చలేదు. దానిని విమర్శించి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినది శ్రీ రామానుజాచార్యులు (సా.శ. 1100). నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీ వైష్ణవమని అంటారు. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. అజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు. రామానుజులు శ్రీపెరుంబుదూరులో జన్మించి, కాంచీపురంలో కొన్నినాళ్ళుగడిపి, శ్రీరంగం చేరారు. తిరుపతి పూజా విధానంలోకూడా ఆయన చేసిన సంస్కరణలు ఉన్నాయి. శ్రీ రాముని అరణ్యవాసం వలె ఈ రామానుజులు కూడా 14 సంవత్సరాలు కర్ణాటకలోని మైసూరు సమీపంలోని (50 కి.మీ.) మేల్కోటే లోగడపవలసి వచ్చింది. అదికూడా శ్రీవైష్ణవులకు ముఖ్యమైన యాత్రా స్థలమైంది. అన్నికులాలలోనూ వైష్ణవ మతం వ్యాపింపచేసిన ఘనత రామానుజులకు దక్కుతుంది. శంకరులను ప్రచ్చన్న బౌద్ధుడంటే, రామానుజుని ప్రచ్చన్నజైనుడు అన్నారు.
శ్రీరంగాన్ని వైకుంఠం తో పోల్చారు.
కావేరి విరజాశేయం వైకుణ్ఠం రంగమందిరం |స వాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం ||
విమానం ప్రణవాకారం వేద శృంగం మహాద్భుతం | శ్రీరంగశాయీ భగవాన్ ప్రణవార్థ ప్రకాశకః ||
రామానుజుని తరువాత వేదాంతదేశికుల కాలంలో ఢిల్లీ పాలకుని సేనాని మలిక్ కాఫర్ ఓరుగల్లును జయించాక శ్రీరంగంను కూడా ముట్టడించాడు (సం. 1371). మేల్కోటే చెలువ నారాయణ ఆలయాన్నికూడా వారు విధ్వంసం చేశారు.అప్పుడు ఇద్దరుదేవేరులతో, రంగనాథుని ఉత్సవ విగ్రహాలను తిరుపతిలో భద్రపరిచారు. మధ్వాచార్యులు (1199-1278) (ఆనందతీర్ధులు, పూర్ణప్రజ్ఞ) ప్రతిపాదించిన తత్వము ద్వైతము. మూడింటిలో చివరిది. పై రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా అధ్యయనం చేసిన తరువాత ప్రతిపాదింపబడినది. జీవుడు, జగత్తు, దేవుడు - ఈ మూడూ వేరు వేరనీ, వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము. దేవునకు, జీవునకు గల సంబంధము యజమానికి, దాసునకు మధ్య గల సంబంధము వంటిది. హనుమంతుడు, భీముడు తరువాత ఈయనను వాయుదేవుని మూడవ అవతారంగా చెబుతారు.
త్రిమతా చార్యులు అద్భుతమైన మేధావులు.ఒకరినిమించిన వాదనాపటిమతో ఒకరు, తమ వాదాన్ని నెగ్గించుకొని తమ మతాలను స్థాపించారు. అదేసమయంలో మిథిల, నవద్వీపాలలో నవ్య న్యాయమనేపేర నూతన తర్క శాస్త్రం ఆవిర్భవించిది. "రాముడు దశరథుని కుమారుడు", "దశరథుడు రాముని తండ్రి" ఈ రెండు వాక్యాలలో పదాల సంబంధంఏమిటి? రెండు వాక్యాలకు భేదం ఏమిటి? దానిని అనుయోగి-ప్రతియోగి సంబంధం అంటారు. మొదటి వాక్యములో "రామ నిష్ఠ పుత్రత్వం" ముఖ్యమైతే రెండవ వాక్యములో దశరథునిలో ఉన్న పితృత్వం మనకు ముఖ్యమైనది అన్నమాట. ఇలాటి వాదం ఆధారంతోటే మధుసూదన
సరస్వతి తన అద్వైత సిద్ధి తన గ్రంధంతో మధ్వాచార్యుని వాదాన్ని ఖండించి అద్వైతాన్ని వంగదేశంలో తిరిగి స్థాపించారు. ఈ వేదాంత విషయాలు సామాన్య ప్రజలకు అక్కరలేదు.హిందూ సమాజానికి ఈ పాండిత్యం ఉపయోగపడినదా? ఇది పెద్ద ప్రశ్న. సా.శ. 1500 నాటికి అనేక గురువులు ఆవిర్భవించి భక్తి మార్గాన్ని, అప్పటి పరిస్థితులకు అనుగుణమైన మతాన్నీ ఇచ్చారు.


జాజి శర్మ "శంకరులను ప్రచ్చన్న బౌద్ధుడంటే, రామానుజుని ప్రచ్చన్నజైనుడు అన్నారు." ఈ వాక్యాలు ఎవరన్నవి? కారణాలు వివరించగలరు.
Vvs Sarma నరసింహ శర్మ "శంకరులను ప్రచ్చన్న బౌద్ధుడంటే, రామానుజుని ప్రచ్చన్నజైనుడు అన్నారు." ఈ వాక్యాలు ఎవరన్నవి? కారణాలు వివరించగలరు.
జీవుని అణుత్వము,జీవుని భగవద్దాసత్వమూ, వేదాల అపౌరుషేయత్వము, వేదాలు సిద్ధమైన అర్థాన్నికూడా బోధించడమూ, వేదముల స్వతః ప్రమాణత్వము, ప్
రత్యక్ష, అనుమాన, శబ్దములను ప్రమాణాలుగా అంగీకరించడము, తన మతం పాంచరాత్ర ఆగమము మీద ఆధారపడి ఉండడమూ, ప్రపంచము భేదముకూడ సత్యములే అన్నవిషయం - వీటన్నిటిలో తనమతంతో పోలిక ఉన్నాకూడా పరస్పర విరుద్ధాలైన భేద, అభేద, భేదాభేద ఆణె మూడు పక్షాలను అంగీకరించడం వలన (అనేకాంత వాదము వాడడం వలన)రామానుజ మతం క్షపణకుల (జైనుల) పక్షంలోజేరిపోయినది అని దీనిని ఉపేక్షించి ఆనంద తీర్థులు తన మతాన్ని ప్రతి పాదించారు. శంకరుడు బౌద్ధుల తర్కాన్ని వాడితే, రామానుజులు అంతకంటె నవీనమైన జైనుల వాదాని ఉపయోగించారు. --- మూలం సాయణ మాధవచార్యుల సర్వదర్శన సంగ్రహం (అనువాదం, వ్యాఖ్యానం - మహామహో పాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు).
Manage
4y
LikeShow More Reactions

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...