Sunday, January 21, 2018

శంకరులను ప్రచ్చన్న బౌద్ధుడంటే, రామానుజుని ప్రచ్చన్నజైనుడు అన్నారు.


శంకరులను ప్రచ్చన్న బౌద్ధుడంటే, రామానుజుని ప్రచ్చన్నజైనుడు అన్నారు.
నరసింహ శర్మ "శంకరులను ప్రచ్చన్న బౌద్ధుడంటే, రామానుజుని ప్రచ్చన్నజైనుడు అన్నారు." ఈ వాక్యాలు ఎవరన్నవి? కారణాలు వివరించగలరు.
VVS--- జీవుని అణుత్వము,జీవుని భగవద్దాసత్వమూ, వేదాల అపౌరుషేయత్వము, వేదాలు సిద్ధమైన అర్థాన్నికూడా బోధించడమూ, వేదముల స్వతః ప్రమాణత్వము, ప్రత్యక్ష, అనుమాన, శబ్దములను ప్రమాణాలుగా అంగీకరించడము, తన మతం పాంచరాత్ర ఆగమము మీద ఆధారపడి ఉండడమూ, ప్రపంచము భేదముకూడ సత్యములే అన్నవిషయం - వీటన్నిటిలో తనమతంతో పోలిక ఉన్నాకూడా పరస్పర విరుద్ధాలైన భేద, అభేద, భేదాభేద అనె మూడు పక్షాలను అంగీకరించడం వలన (అనేకాంత వాదము వాడడం వలన)రామానుజ మతం క్షపణకుల (జైనుల) పక్షంలోజేరిపోయినది అని దీనిని ఉపేక్షించి ఆనంద తీర్థులు తన మతాన్ని ప్రతి పాదించారు. శంకరుడు బౌద్ధుల తర్కాన్ని వాడితే, రామానుజులు అంతకంటె నవీనమైన జైనుల వాదాన్ని ఉపయోగించారు. --- మూలం సాయణ మాధవచార్యుల సర్వదర్శన సంగ్రహం (అనువాదం, వ్యాఖ్యానం - మహామహో పాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు


సామాన్య శకం 1500 - సనాతనధర్మం - భారతదేశ ముఖచిత్రం
ఢిల్లీ - సుల్తానులలో ఆఖరుదైన లోడీ వంశపు సికందర్ లోడీ పరిపాలన. 1517-26 లో ఆఖరువాడైన ఇబ్రహీంలోడీ పాలన. 1526 లో మంగోల్ బాబర్ దండయాత్రలో మొదటి పానిపట్ యుద్ధంలో లోడీ మృతి. ఇప్పటికే సుల్తానుల రాజ్యం పెషావరు నుండి శ్రీరంగం వరకు తన ప్రతాపాన్ని చూపించింది. ఇస్లాంలోకి బలవంతపు మత మార్పిడులు. దేశమంతా ఉన్న ప్రముఖ దేవాలయాల విధ్వంసం యథేచ్చగా జరుగుతూ వచ్చింది. ఫారసీ, అరబిక్ అధికార భాష లయ్యాయి. దేవాలయల శిధిలాల పైన, ఇతరచోట్లలో కూడా తమ విదేశీ శిల్పశైలిలో నిర్మాణాలు వెలసాయి. ఉత్తరభారత స్వరూపమే మారిపోయినది.
ఢాకా - అధిక సంఖ్యాకులు ఇస్లాంలోనికి వెళ్ళడం జరిగిపోయింది. ముఖ్యంగా బౌద్ధులు, తరువాత హిందువులూ మూక ఉమ్మడిగా ఇస్లాంలోకి జేరిపోయారు. 1300 వరకు ఢిల్లీ సుల్తానుల పాలనలోనే ఉంది. తరువాతది బెంగాల్ సుల్తానుల పాలన. 1500 లో హుసేన్ షాహీ వంశం పాలన. హిందువులు రెండవతరగతి పౌరులుగా జీవించడానికి అలవాటు పడ్డారు. మిథిల, నవద్వీపం వంటి ప్రదేశాలలో కొద్దిమంది కుటుంబాలలో సనాతనధర్మం, వేదాలు, వేదాంతం, దర్శనాలు సజీవంగానే ఉన్నాయి, కాని ఇవి సమాజంలో ఒక అల్పసంఖ్యాక వర్గంలోనే ఉండిపోయాయి.
వరంగల్ - కాకతీయ సామ్రాజ్యంధ్వంసం చేయబడింది. బహమనీ సుల్తానుల పతనం ఆరంభమయింది. షియా ముస్లిములైన కుతుబ్ షాహీ వంశస్థులు 1518లో స్వతంత్రరాజ్యం స్థాపించారు.పాలనా కేంద్రం గోల్కొండకు మారింది.
హంపీ (విజయనగరం) - సామ్రాజ్యం ఉచ్చ స్థితిలో ఉన్నది. శ్రీకృష్ణదేవరాయల పాలన 1509 లో మొదలై 1529 వరకు విజయపరంపరలో సాగింది.
వల్లభాచార్యుడు (1479-1531) ఈయన తెలుగు వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. ఈయనకుటుంబం ఈయనపుట్టకముందే కాశీ వెళ్ళినది.ఈయనది కృష్ణభక్తి మార్గము.కృష్ణదేవరాయల ఆస్థానంలో ఈయన అద్వైతులను ఓడించినట్లుచెబుతారు. రామానుజ, మధ్వ, నింబార్కాచార్యుల తో ఈయనను వైష్ణవ సాంప్రదాయములో ప్రముఖునిగా చెబుతారు.బ్రహ్మ సూత్రాలకు భాష్యము వ్రాశారు. భగవతం మీద వ్యాఖ్యానాలు వ్రాసి భాగవతధర్మాన్ని ప్రచారం ఛేశారు. వీరి సాంప్రదాయాన్ని పుష్టిమార్గమనిచెబుతారు.
చైతన్య మహాప్రభు (1485-1533) - వల్లభాచార్యుని సమకాలికుడైన చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నాడియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒరిస్సాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.
రూపాగోస్వామి ( !489-1564) చైతన్య మహాప్రభు ముఖ్య శిష్యుడు,కవి, వేదాంతి, శ్రీకృష్ణభక్తుడు. ముఖ్య గ్రంధాలు "భక్తిరసామృతసింధు, ఉజ్జ్వలనీలమణి"
గురునానక్ (1469-1539) - జననం పంజాబు (లాహోరు సమీపంలోని నంకానా సాహెబ్). ఈయనను శిఖ్ఖుమత స్థాపకుడుగా పరిగణిస్తారు. కాని అది సనాతనధర్మజన్యమైన మతమే. నిజానికి ఆంగ్లేయుల కాలం వరకూ సిఖ్ఖులు తమను తాము హిందువులమనేచెప్పుకునేవారు. వీరు విగ్రహారాధనచేయరు. ఒకేపరమేశ్వరుని నమ్ముతారు. సిఖ్ఖ్ మతములో గురునానక్ మొదటిగురువు, ఐదవగురువు అర్జునదేవ్, తొమ్మిదవగురువు తేజ్ బహదూర్. పదవగురువు గురుగోవిందసింగ్- వీరు ప్రముఖులు. ఈ పదిగురువుల కాలంలో వీరికి, ఢిల్లీ మహమ్మదీయ పాలకులైన మొఘలులకూ తీవ్రమైన విభేదాలు వచ్చాయి. దానితో గురుగోవింద్ సింగ్ వారి మార్గాన్ని ఆపరిస్థితులకు తగినట్లు నిర్దేశించవలసి వచ్చినది.
మీరాబాయి (1498-1557) - రాజస్థాన్ లో రాజపుత్రుల ఇంటజన్మించింది. బాల్యం నుండి గిరిధారియైన గోపాలుడంటే అమిత భక్తి. మీరా భజనలు సంగీత ప్రపంచంలో దేశమంతా ప్రసిద్ధి చెందినవి. తనని తాను పూర్వజన్మలో ఒక గోపికగా భావించుకునేది. సంత్ రవిదాస్ శిష్యురాలిగా ఆమె రాజభవనం వదలి బృందావనం వెళ్ళిపోయినది.
సనాతన ధర్మం హిందూమతంగా పరిణామంచెందడం విజయనగర సామ్రాజ్యకాలంలోనే ప్రారంభమైనది. జ్ఞాన మార్గం భక్తిమార్గానికి త్రోవ ఇచ్చింది. సనాతన వైదిక ధర్మంలో ఉన్నవారు భారతదేశంలో వస్తున్న నూతన పోకడలను గమనింపలేదనిపిస్తుంది. మహమ్మదీయమతం, అధికభాగంలో వారి పాలన, హిందూ దేవాలయాల పరిస్థితి - ఈ నేపధ్యంలోనే అంటే ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో భక్తి మార్గం అత్యధిక ప్రచారం పొందినదని చెప్పాలి.
కబీర్ దాస్ (1440-1518), గోస్వామి తులసీదాస్ (1497/1532-1623), సూర్దాస్ (1478-1581), గురు రవిదాస్ (1450-1520) మొదలైన అనేకులు భారతీయులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు.



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...