Monday, January 22, 2018

విశ్వాసము - శ్రద్ధ

https://www.facebook.com/vallury.sarma/posts/522256161145135

విశ్వాసము అంటే నమ్మకము. శ్రద్ధ అనేపదం కూడా దీనికి దగ్గరదే. మూఢ నమ్మకము, గ్రుడ్డి నమ్మకము, అంధ విశ్వాసము అనే పదాలు వాడుతారు. ఇవి అర్థంలేని పదాలు. ఇది ఒకరి నమ్మకం గురించి ఇంకొకరి నమ్మకం. ఈపదాలకు విలువలేదు. విశ్వాసములు లేని వ్యక్తి జీవితము దుర్భరము. దేనిమీదా నమ్మకం లేకపోవడం వలననే మన ఆధునిక భారత పరిస్థితి అధోగతిలో ఉంది. మనకు ఈరోజులలో ఏవ్యక్తి పైన, సంస్థ పైన, వస్తువుపైన, వ్యవస్థ పైన నమ్మకంలేకపోవడమే దీనికి కారణం. అంటే అనేకులు, సంస్థలు, వ్యవస్థలు విశ్వాస ఘాతకులుగా తయారయినట్లేకదా!
1. ఒకరు నాకు ఈశ్వరునిమీద పరిపూర్ణ విశ్వాసం ఉన్నది అంటారనుకోండి. ఇక ఆవ్యక్తికి జీవితంలో సహజంగా ఎదురుపడే సమస్యలను గురించిన చింత ఎందుకు? నీకు ఏమాత్రం అనుమానం వచ్చినా నీకు విశ్వాసంలేదనే అర్థం. నీ విశ్వాసం బలహీనమైన పునాదులమీద ఉన్నట్లే. నిజమైన విశ్వాసంఉంటే నిశ్చింతగా ఉండాలి. నేను భగవంతుని సన్నిధిలోనే, ఆయన రక్షణలోనే ఉన్నాను అనే విశ్వాసం ఉంటే చింత ఎందుకు? ఆయన ఎప్పుడో నా ప్రార్థన వింటాడు. అనే ఊహ సరియైనది కాదు. అదే భక్తునికి భగవంతునిపై ఉండవలసిన విశ్వాసం.
2. విశ్వాసమనేది అర్థంలేని హేతువాదము, తర్కయుక్తులనే విషానికి విరుగుడు. మన విశ్వాసమే మన వ్యక్తిత్వం. మన తర్క యుక్తులు, వాదనలు, ఆధునికత మనము తెచ్చిపెట్టుకున్న పైమెరుగులు. మన ధర్మం, మన వేద శాస్త్రాలు, మన సంస్కృతి, మన ప్రమాణ గ్రంధాలు, వీటిపై మనకున్న పరిపూర్ణ విశ్వాసమే మనకు రక్ష.
3. నీకు నమ్మకం లేక పోతే, చాలకపోతే ఏమిచేయాలి? లేకపోతే సమస్య లేదు. నీకు దేవుడు లేడు. ఆయన రక్షణ నీకు అవసరములేదు, లభించదు కూడా. ఏది ఎలా జరగాలో అలాగే నీ కర్మ ప్రకారమే జరుగుతుంది. నీకు దాని మీదా నమ్మకంలేక పోతే నీప్రయత్నం వలనో, అదృష్టం వలనో జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. నమ్మకం చాలకపోతే ఒక గురువుపై పూర్ణ విశ్వాసం ఉండి ఆయన చెప్పినట్లు చేయాలి. సద్గురువు లభించడంకూడా నీ అదృష్టం. లేకపోతే నీకు నీవే నీ మేధస్సుకు తగిన సమాధానం వెతుక్కోవాలి.
4. సద్గురువులు ఎవరూ తమ పై విశ్వాసం ఉంచమనీ, తమకు శరణాగతి చేయమని అడగరు. నమ్మకం ఉంచడం అంటే విగ్రహంపై పుష్పం ఉంచడం కాదు. అది బాహ్యంగా కనబడదు. నీ అంతరంగంలోనే ఆ నమ్మకం కలగాలి.
5. విశ్వాసాన్ని తర్కంతో పరీక్షించలేవు. తర్కంలో విశ్వాసానికి స్థానం లేదు. అనేక తర్కాలు ఉన్నాయి. ఏదీ పరమ సత్యానికి మార్గం చూపదు. కేవలం నిన్ను నీవు నమ్మించుకోడానికే తర్కం పనికి వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే భాషకు అనుభవం లేదు. అనుభవానికి భాష లేదు.
పనస తొనలకన్న పంచదారల కన్న| జుంటితేనె కన్న జున్ను కన్నII
చెరుకు రసముకన్న చెలిమాట తీపురా I విశ్వదాభిరామ వినురవేమ.||
అన్నిటికీ తీపి అన్న పదం ఒకటే భాషలో ఉంది. ఆ వేర్వేరు తీపులను అనుభవించాలంటే తిని, త్రాగి చూడాలి. అనుభవించాలి. భాష చాలదు.
6. కేవలం విశ్వాసమే సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఒక అనంతమైన శక్తిచే రక్షింపబడుతున్నామన్న భావమును కలుగజేస్తుంది.
(సద్గురుబోధకు స్వేచ్చాను వాదం.)

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...