Monday, January 22, 2018

పురాణ మిధునం కందళి-దూర్వాసుడు

https://www.facebook.com/vallury.sarma/posts/522087917828626

 https://www.facebook.com/vallury.sarma/posts/522441174459967

(గయ్యాళి భార్య - కోపదారి భర్త)
పురాణ ప్రసిద్ధ దంపతులు అత్రి అనసూయలకు త్రిమూర్తుల వరాలతో జన్మించినవారు దత్తాత్రేయుడు, దూర్వాసుడు. దూర్వాసుడు రుద్రాంశలో జన్మింఛాడు. అనసూయ పతివ్రతగా ముల్లోకాలలోనూ పేరుపొందినది. ఆమె దూర్వాసుని గర్భంలో ధరించినప్పుడు, హైహయవంశస్థుడైన ఒక రాజు ఆమెను పరాభవించాలనుకున్నాడు. గర్భం విచ్చిన్నమవాలని అభిచార హోమం చేయించాడు. గర్భస్థ శిశువుకు ఏమీకాలేదు గాని కాలాగ్ని రుద్రునివలె, ఆ శిశువు క్రోధమూర్తిగా మారింది. ఆక్రోధానికి ఆరాజు భస్మమైపోయాడు. ఆకోపం ఆయనతో ఎప్పుడూ ఉండిపోయింది. చిన్నతనంలోనే దూర్వాసుడు తల్లిదండ్రుల అనుమతితో ఇల్లువిడిచి తపస్సుకు వెళ్ళిపోయాడు. అన్నిలోకాలలో స్వేచ్చగా సంచరించడం వంటి అద్భుత శక్తులు ఆయనకు లభించాయి.ఆయన ఒకసారి ఉగ్రమైన తపస్సులో ఉంటే ఇంద్రుడు రంభాద్యప్సరాసలను పిలిచి ఆయనతపస్సును భంగంచేయమని అడుగుతాడు.వాళ్ళూ మావల్లకాదని చెబుతారు. వపువు అనే ఒక ఆమె తాను తపోభంగంచేస్తానని ముందుకు వచ్చినది. ఆమె వెళ్ళి అక్కడ ఆటో, పాటో మొదలుపెట్టింది. ఆమెను ఒక పక్షిలా మారమని శపిస్తాడు.ఆమె అతని కాళ్ళపై పడుతుంది. “కొంతకాలానికి నీకు అజ్ఞానం తొలగుతుంది అప్పుడు నీవు నీ సహజ రూపంతో నీలోకానికి వెడతావు” అని ఆశీర్వదిస్తాడు.
ఒకసారి తపోనిష్ఠలో ఉన్నప్పుడు బలిచక్రవర్తి వంశస్థుడైన సాహసికుడనే ఒక యువకుడు, తిలోత్తమ అనే అప్సరసతో కలసి వనవిహారానికి వచ్చాడు. ఆయన అక్కడ ఉన్నట్లు చూచికూడా ఆయనను లెక్కచేయక కేకలు, పరుగులు, ప్రేమ ప్రదర్శనలు మొదలుపెట్టారు. "మీకు సభ్యత తెలియదు. దివ్యమైన జన్మలకు అర్హులుకారు. మీలోకాలు విడిచి భూలోకంలో రాక్షస జన్మయెత్తి జీవించండి." అని శపిస్తాడు. వాళ్ళు దయచూపమని ప్రార్థిస్తే కృష్ణావతార కాలంలో మీకు విముక్తి కలుగుతుంది అనిచెబుతాడు. అతడే కృష్ణావతార సమయంలో గార్ధభాసురుడు (గాడిద రూపములోని రాక్షసుడు). ఆమె తన పూర్వ పుణ్యముచేత బాణాసురుని కుమార్తె ఉష గా జన్మించి అనిరుద్ధుని వివాహమాడుతుంది. (ఆధునికులు గమనించాలి. మనం చూసే గాడిదలు పూర్వజన్మలో Roadside Romeos కావచ్చును. ) దూర్వాసుడు ఈసంఘటన తరువాత ఆలోచిస్తాడు. “వారి ప్రేమ కలాపం నేను ఎందుకు పట్టించుకోవాలి? అంటే నాకు కూడా వివాహం చేసుకోవలెనని సందేశమేమో?” - అనుకుంటాడు.
ఋణానుబంధ రూపేణా పశు, పత్ని, సుత, ఆలయా అంటారు కదా! తన కర్మఫలం కొలదీ ఔర్వుడు అనే మహర్షి వద్దకు వెళ్ళి ఆయనకూతురుని తనకిమ్మని అడుగుతాడు. "నీవంటి గొప్పవాడు వచ్చి పిల్లనడిగితే నాకు ఏమిచెప్పాలో తెలియడంలేదు. నీకు కోపం ఎక్కువ అని విన్నాను. దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా విన్నాను. నా కుమార్తె నీకు తక్కువది కాదు. ఆమెకు విపరీతమైన కోపం. తన మాటకు ఎదురుచెబితే భరించలేదు.ఆమెకు ఎదురు చెప్పి బ్రతకడం కష్టం. పరమ గయ్యాళి అనే చెప్పాలి. మీ ఇద్దరి కాపురం ఎలాఉంటుందో నేను ఊహించలేను. నాకుమార్తెకు పెళ్ళి చేయడం నాకూ కష్టమే. వచ్చి అడిగావు కాబట్టి చెబుతున్నాను. నాకొక వాగ్దానం ఇవ్వాలి. ఆమెను ఏమీ అనకూడదు. అమె చెప్పినట్లే వినాలి. నీవు ఆమెపట్ల ద్వేషం, కోపం పెంచుకోకూడదు, ప్రదర్శించకూడదు. శాపాలు ఇవ్వకూడదు. ఆమెను ప్రేమతోనే ఏలుకోవాలి." అని ఔర్వుడు బదులుచెబుతాడు. దూర్వాసుడు ఆ షరతులకన్నిటికీ వప్పుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు.
(సశేషం , 2వ భాగం రేపు.)

పురాణ మిధునం - కందళి-దూర్వాసుడు -2
పాపం వివాహంతో దూర్వాసుని జీవితం మారిపోయింది. అతడు ఇంటిలో పరమసాధువుగా మారవలసి వచ్చినది. ఇదివరకు ఏలోకమునకు కావాలంటే అక్కడకు వెళ్ళి శివునో, విష్ణువునో దర్శించివచ్చే వాడు. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యముకూడా పోయినది. దేవేంద్రుడంతటివాడు తన పట్ల అపరాధంచేసినా వెంటనే భస్మంచేసేవాడు. నహుషుణ్ణి ఇంద్రపదవినుండి, భూమిపై అజగరం గా చేశాడు. ఆవిడ ఎంత విసుగుతెప్పించినా భార్యమీద కోపంతెచ్చుకోవడానికి వీలులేదు. తనకు కోపంవస్తే ఆమె బ్రతుకదు. భరించగలను అనుకున్నాడు కాని జీవితం నానాటికీ దుర్భరం అయింది. ఏంచేయాలి? ఆవిడను ఎలా మార్చి తనదారికి తెచ్చుకోవాలో తెలియదు? అహంకారం చంపుకొని ఏమన్నా భరించి ఎన్నాళ్ళు బాధలుపడాలో అర్థం కావటంలేదు. వదలలేడు. వదలకూడదు. ఏళ్ళు గడుస్తున్నాయి కాని ఆవిడ పద్ధతి దూర్వాసునకు అంతుబట్టటంలేదు. అలాగే చిరకాలం భరించాడు. ఏదీ తాను అడిగితే చేయదు. పైన విరుద్ధంగా చేస్తుంది. మెల్లిగా తన శిష్యులకు చెప్పినట్లు బోధలు ప్రారంభించాడు. ఈయన బోధించడం, ఆవిడ చేతనయినంత బాధించడం. ఇక ఒక నిశ్చయానికి వచ్చి తన పని తాను ఎప్పటివలే చేసుకుంటూ ఆమెను పలకరించడమే మానివేశాడు. నిస్పృహతో ఒకనాడు కూర్చొని ఉన్నాడు. "నాతో మాట్లాడకుండా రాయిలా కూర్చునేవాడికి నీకు పెళ్ళి ఎందుకు? భార్య ఎందుకు?" అని పెద్దస్వరంతో అరవడం ప్రారంభించినది. ఆమె దగ్గర తన తపస్సు ఎందుకూ పనికి రాలేదు. అన్ని సంవత్సరాల తరువాత కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న దూర్వాసునికి తనపై తనకే కోపం వచ్చినది. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న అతడు అసంకల్పితంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆమె ఉన్నది. ఒక క్షణంలో రుద్రుని వంటి ఆయనచూపుకు ఆమె భస్మమై పోయినది.ఒక దివ్య సుందరి అక్కడ ప్రత్యక్షమై ఆయన పాదాలకు నమస్కరించి "శాప వశాన ఇల్లా పుట్టాను. నిన్ను అనేక సంవత్సరాలు బాధించాను. నీవు సహించి నన్ను భరించి నాకు శాపమునుండి విముక్తి కలిగించావు" అని తనలోకానికి తాను వెళ్ళిపోయింది.
ఈసంఘటనతో దూర్వాసునికి చాలా బాధ కలిగింది. ఇన్ని సంవత్సరాలు సంయమనం వహించి కోపాన్ని జయించి కూర్చున్నా చివరకు ప్రమాదం జరిగినది. ఇన్నేళ్ళు తనతో సహజీవనం చేసినందుకూ ఆయనకు భార్యపై ప్రేమా ఉన్నది. కోపిష్ఠి వాడు. భార్యను పొట్టను పెత్తుకున్నాడని అందరూ తననే నిందిస్తారు. ఏంచేయాలో ఆలోచిస్తున్నాడు. ఈ లోపల మామగారు వచ్చి కూతురేది? అని అడిగాడు. జరిగినదిచెప్పాడు దూర్వాసుడు. తాను కళ్ళూ మూసుకుని కూర్చుంటే ఆమె మాటలతో అప్రయత్నంగా కళ్ళు తెరిచానని ఇలా జరిగిందనీ చెబుతాడు. ఔర్వునికి కోపం వచ్చినది. నాకూతురు గయ్యాళి తనాన్ని గురించి నీకు ముందేచెప్పాను. ప్రేమగా చూచుకొంటానని మాట ఇచ్చావు. నీకు అహంకారం. ఒక నాడు నీవు అవమానించబడతావని శాపం ఇస్తాడు. ఇది అంబరీషోపాఖ్యానంలో జరుగుతుంది.
దూర్వాసునికి తన భార్యకు శాశ్వతత్వం కలిగించాలని బుద్ధిపుట్టింది.ఆమె భస్మం నుండీ దూర్వాసుని సంకల్పంతో ఒక చెట్టు మొలచినది. అదే కదళీ వృక్షం (అరటి చెట్టు). దూర్వాసుని భార్యపేరు కందళి. అరటి పండు దైవ కార్యాలకు అన్ని ఫలాల కంటె ఎక్కువగా ఉపయోగిస్తారు. నైవేద్యాలకు, ప్రసాదాలకు, అభిషేకాలకు, శుభకార్యాలలో మండపాలంకరణకు, ఆహారానికి అరటి చెట్టు, కాయ, పండు, ఆకు, పువ్వు అన్నీ ఉపయోగపడి దూర్వాసునికి భార్యపైగల ప్రేమను గుర్తుచేస్తాయి.
ఆధారం - సద్గురు శివానందమూర్తి గారు - మార్గదర్శకులు - మహర్షులు

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...