Monday, January 22, 2018

జాబాలి మహర్షి



సామవేద ఉపనిషత్తులలో జాబాలము అనే ఉపనిషత్తు ఉంది. విభూతి (భస్మము),రుద్రాక్షల మహిమలను తెలిపే ఉపనిషత్తు అది. జాబాలి మహర్షి బోధించినదే ఈ ఉపనిషత్తు. జాబాల అనే విప్రస్త్రీ కుమారుడీతడు. ఒక గురువు వద్దకు ఆమె వెళ్ళి కుమారునికి చదువుచెప్పమని కోరినది. అలాగే కొంతకాలము బోధించాక ఆశిష్యుడు సామాన్యుడు కాడు, వేదవేదాంగములు, బ్రహ్మ విద్యబోధింపదగిన ప్రవృత్తి ఇతనిలో ఉన్నది అని గురువు అనుకుంటాడు. నాయనా! నీగోత్రనామాలు తెలుపు, మీ కుటుంబ విషయాలు చెప్పమని కోరాడు. బాలుడు తల్లి వద్దకు వెళ్ళి అడుగుతే ఆమె "నాకు భర్తలేడు. నీవు పుట్టినప్పుడు అనేకుల ఇళ్ళలో దాసీవృత్తిచేశాను. నీ తండ్రి ఎవరో నాకు తెలియదు" అనిచెప్పింది. ఆవిషయమే గురువుకు చెప్పాడు జాబాలి. నీవు నిస్సంకోచంగా సత్యము చెప్పావు. "నీలో సత్యము ఉంది. నీవు సత్యకామ జాబాలి అనిపిలవబడతావు" అని గురువు జాబాలితో చెబుతాడు. జాబాలి వేదవిద్యకు అర్హుడని నిర్ణయిస్తాడు. జాబాలి గోసేవ చేస్తాడు. ప్రకృతినుండి బ్రహ్మ జ్ఞానము పొందుతాడు. జాబాలి మహర్షిని గురువు "నీవు బ్రహ్మజ్ఞానివయ్యావు" అని ఆశీర్వదించి పంపాక, ఆయన సుబ్రహ్మణేశ్వరుని ఆరాధించి దర్శనము, ఆయననుండి తత్త్వ రహస్యములు పొందుతాడు.
పిప్పలాదుడనే మహర్షి జాబాలి వద్ద తత్త్వ రహస్యాలు తెలుసుకుంటాడు. జాబాలోపనిషత్తులోని విషయం ఇదే.
పిప్పలాద - మహర్షీ ! నాకు పరతత్త్వ రహస్యాని బోధించండి.
జాబాలి - నాకు పెద్దలు ఎలా చెప్పారో అలాగే చెబుతాను.
పిప్పలాద - మీకు ఎవరు చెప్పారు?
జాబాలి - సుబ్రహ్మణ్యుడు
పిప్పలాద - ఆయనకు ఎవరు చెప్పారు?
జాబాలి - శివ స్వరూపుడైన ఈశానుడు, నీకు సకల విషయాలు బోధిస్తాను. సంసారియైన జీవుడు అహంకారము చేత కప్పబడిన శివుడే. అప్పుడు అతడిని పశువు అంటారు. పశువులకు అధిపతి పశుపతి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములనేవి ఆయన పంచ కృత్యములు.
పిప్పలాద - జీవులు పశువులు ఎలా అయ్యాయి? వాటికి ఈశ్వరుడు పశుపతి ఎలా అయ్యాడు?
జాబాలి - గడ్డి తింటూ, వివేకం లేక, పశు పాలకుడు అదిలిస్తేనే పనిచేస్తూ, కష్టాలు సహిస్తూ, పాశబద్ధులై ఉండటం చేతనే జీవులు పశువులయ్యాయి. అతడు పశుపతి అని ఎలా తెలిసింది. శివుడు ధరించిన విభూతి వలన.
అప్పుడు జాబాలి విపులంగా విభూతి, రుద్రాక్షల మహిమలు చెబుతాడు. విభూతి ధారణ విధి చెబుతాడు. "వేద వెదాంగములు చదవక పోయినా, పాప చింతన, కామక్రోధాలు లేకుండా,సతతము శివనామ స్మరణ చేస్తూ స్థిరబుద్ధితో ఉంటే అతడు ధరించే రుద్రాక్షలే అతడిని రక్షిస్తాయి." విభూతి మూడు రేఖలుగా ధరించాలి. అవి అకార, ఉకార, మకారాలకు, మూడూ కలిపి ప్రణవానికి సంకేతాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతాలు. శైవులకు జాబాలోపనిషత్తు ప్రమాణ గ్రంధము.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...