Sunday, January 21, 2018

శృంగేరి - శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య

శృంగేరి - శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య

https://www.facebook.com/vallury.sarma/posts/513308928706525

మహా సంస్థానం, దక్షిణామ్నాయ శారదా పీఠం - 12 శతాబ్దాలక్రితం ఆదిశంకరాచార్య భగవత్పాదులు భారతదేశానికి నలువైపుల స్థాపించిన ఆమ్నాయ పీఠాలలో మొదటిది. పూర్వం రామాయణ కాలంలో ఋష్యశృంగముని తపస్సుచేసిన ప్రదేశం. శంకరులు తమ శిష్యుడైన సురేశ్వరాచార్యుని (పూర్వాశ్రమంలో ఇతడే మీమాంసకుడు మండన మిశ్ర అని ఒక ప్రతిపాదన ఉన్నది). అక్కడ ప్రధమ పీఠాధిపతిగా నియమించారు. ఈ పరంపరలో 12వ ఆచార్యుడు విద్యారణ్యుడు. హరిహర రాయలు, బుక్క రాయలు (స్థానికంగా హక్క, బుక్క) ఈయన శిష్యులు. వీరు సంగమవంశమువారు అని పిలవబడతారు. వీరు కన్నడ భాషీయులా, తెలుగు వారా? మనకు ఇల్లాంటి వాదాలు తప్పవు. (లేకపోతే చరిత్రకారులు పరిశోధనా పత్రాలు ఎలా వ్రాస్తారు?) కొందరు వీరు కర్ణాటకకు చెందిన హొయసళ రాజవంశానికి సంబంధించిన వారు అంటారు. హొయసళ వంశపతనంతో విజయనగర పాలన బలపడినది. ఈ హరిహరుడు మొదట అనంతపురంజిల్లాలో గుత్తి కేంద్రంగా హొయసళ రాజుల ప్రతినిధి గా ఉండేవాడు. కాని ఆయన కట్టించిన మొదటికోట పశ్చిమసముద్రతీరములో ఉన్నదని చెబుతారు. శ్రీనాథుడు వారిని కర్ణాటక క్షితినాథులు అనిసంబోధించాడు. కర్ణాటక ప్రాంతమంతా కన్నడమే మాట్లాడేవారని ఎలాచెప్పగలం? పోతనకూడా "కర్ణాట కిరాత కీచకులకమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతీ." అన్నాడు. దీనిని బట్టి వారికి తెలుగు కావ్యకన్యలను చేపట్టాలని ఉన్నట్లేకదా? నేలటూరి వెంకట రమణయ్య, బి.సూర్యనారాయణరావు వంటి వారు - హరిహర, బుక్కలు వరంగల్లునుండి, విద్యారణ్య స్వామి ప్రేరణ వలన అనంతపురం, బళ్ళారి, హొసపేట ప్రాంతాలకువచ్చి రాజ్యం స్థాపించి ఉండవచ్చు- అంటారు. తెలుగు, కన్నడ వివాదాలు 20వ శతాబ్దానివి. ఆనాటి వారిధ్యేయం ఢిల్లీ సుల్తానులను ఎదుర్కోడానికి దక్షిణములో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం. సుమారు రెండు, మూడువందల సంవత్సరాలు విజయనగరసామ్రాజ్యం ఒక గొప్ప హిందూ రాజ్యంగా నిలిచింది. ఇంకొక ఐతిహ్యం కాకతీయులతో యుద్ధంలో ఢిల్లీ సుల్తానులు, హక్క,బుక్కలను ఖైదీలుగా తీసుకువెళ్ళారనీ, అక్కడవారు ముస్లిములుగా మార్చబడి, బళ్ళారి జిల్లాలోని కాంపిలికి పాలకులుగా నియమింపబడ్డారనీ, దక్షిణానికి వచ్చాక వారు విద్యారణ్యుని ఆదేశాలమేరకు తిరిగి హిందువులుగా మారి విజయనగర సామ్రాజ్యంస్థాపించారనీ చెబుతారు. ముఖ్యంగా గమనించదగిన విషయం, ఆయన హరిహర, బుక్కలను హిందువులుగా పరిగణించి, వారికి ఉపదేశించడం. ఈ విషయము శృంగేరి శారదా పీఠము వారి వెబ్ సైట్ లో ఉండుటవలన ప్రమాణికముగా తీసుకొనవచ్చును. ఈ పరిశుద్ధి కార్యక్రమం, తరువాత కాలంలో ఆర్యసమాజ స్థాపకుడు దయానంద సరస్వతి చేశారు. ఆధునిక కాలంలో ఒక అమెరికన్, జన్మతః రోమన్ కాథొలిక్, వేదాలను అభ్యసించి, జ్యోతిషము, ఆయుర్వేదము, యోగము బోధిస్తూ, అనుసరిస్తూ హిందూమతమును స్వీకరించి పండిత వామదేవ శాస్త్రిగా పేరుపొందినవారు David Frawley. ఆయన పుస్తకము How I Became a Hindu (My Discovery of Vedic Dharma), Voice of India, New Delhi ఆసక్తి దాయకంగా ఉంటుంది. మీరు హాస్యప్రియులైతే తులనాత్మక అధ్యయనానికి ఆచార్య కంచ ఐలయ్య గారి "నేను హిందూ నెట్లైతా?" కూడా చదువవచ్చు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...