https://www.facebook.com/vallury.sarma/posts/509302145773870
ఆంధ్రదేశ చరిత్రలో ప్రజలు జైనాన్ని, బౌద్ధాన్ని వదలి హిందూమతానికి తిరిగి వచ్చిన కాలంలో ఎక్కువగా శైవం ప్రసక్తి వస్తుంది. ఆంధ్రదేశంలో శంకరాద్వైతానికి ఉన్న ప్రచారం శైవ, వైష్ణవాలకు లేదు అనిపిస్తుంది. శంకరాచార్యుడు రూపంలో శైవుడు. భక్తిలో వైష్ణవుడు. ఉపాసనలో శాక్తేయుడు. "శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే." తెలుగు ప్రజల సామాన్య అభిమతం. శైవం సనాతన ధర్మంలో ఒక ప్రాచీన సాంప్రదాయం. వైష్ణవం అర్వాచీనమని, దర్శనముల వరసలో రామానుజ పూర్ణప్రజ్ఞ దర్శనాల కంటె శైవ దర్శనాలు ఉత్తమములని సర్వదర్శన సంగ్రహ కారుని అభిమతం. శైవంలో నకులీశ పాశుపతం, శివాద్వైతం, ప్రత్యభిజ్ఞ దర్శనం (కాశ్మీర శైవం) వైదికమతాలు. కాపాలికులు, కాలముఖులు అనుసరించే శైవం అవైదికమని రామానుజులు తన బ్రహ్మసూత్రభాష్యంలోచెప్పారు. సామాన్యులకు శైవంపై అవగాహన తక్కువ. శైవం తమిళదేశంనుండి, కాశ్మీరం వరకు వ్యాపించినమతం. వేదం అందరు దేవతలను స్తుతించింది. యజ్ఞాన్నిధర్మంగా చెప్పింది. "యజ్ఞోవై విష్ణు" అని యజ్ఞమును విష్ణుస్వరూపముగా చెప్పినది. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, దుర్గ, విష్ణువు, రుద్రుడు, ఇలా అందరు దేవతలను యజించి యజ్ఞంలో స్వాహాకారంతో ఆహూతులు ఇవ్వడం పద్ధతి. అక్కడ ఎక్కువతక్కువలు లేవు. కాని దేవలోకంలోనే శివుడు లేనియజ్ఞం దక్ష ప్రజాపతి సంకల్పించాడు. దానిని వీరభద్రుడు నాశనంచేస్తూంటే విష్ణువుకూడా ఏమీచేయలేకపోయాడు. శివ పారమ్యము, శివద్వేషము - ఈ రెండిటిమూలాలు దక్షయజ్ఞం నాటివి. వీర శైవములో ముగ్గురు సిద్ధులను పేర్కొంటారు. వారు రేవణ సిద్ధుడు. మరుళసిద్ధుడు. ఏకోరామ సిద్ధుడు. రేవణసిద్ధునే జగద్గురు రేణుకాచార్యుడని కూడా అంటారు. ఆయన అగస్త్యమహర్షికి ఉపదేశంచేశారనీ, అగస్త్య మహర్షిద్వారా శైవం దక్షిణదేశములో ప్రచారమయిందనీ పురాణ కథ. ఈ రేణుకాచార్యుడే జగద్గురు శంకరభగవత్పాదులకు చంద్రమౌళీశ్వరలింగాన్ని ఇచ్చినట్లు ఐతిహ్యం ఉంది.
వైష్ణవులు శరణాగతికీ, దాస భక్తికి ప్రాధాన్యత నిస్తారు. హరిదాసుల గురించి విన్నంతగా శివదాసులను గురించి వినం. శైవులకు దాసోహం అనడం కంటే శివోహం అనేస్థితికి చేరుకోవడం ఇష్టం. సాలోక్యం,సామీప్యం, సారూప్యం కంటె సాయుజ్యం ఇష్టం. ఇది మాత్రం తేలికా, శంకరుడు ఎంత భోళానాధుడైనా? పరాభిమతా ముక్తానభవంతి, పరతంత్రత్వాత్ పారమైశ్వర్య రహితత్త్వాత్ అస్మదాదివత్ ముక్తాత్మానశ్చ పరమేశ్వరగుణసంబంధినః -- వైష్ణవంలో ముక్తులుకూడా విష్ణుదాసులుగా ఉండవలసినదే! ఈ దాసత్వం, పరతంత్రత్వం, పరాధీనత్వం,దుఃఖాన్నే కలిగిస్తాయి మాహేశ్వరులైతే పారమైశ్వర్యాన్నేకోరుకుంటారు. ముక్తులైతే పరమేశ్వరునివలెనే దుఃఖకారణాలులేక పరమేశ్వరగుణసంపన్నులై ఉంటారు అని వాదిస్తూ వీరు పాశుపతశాస్త్రాన్ని ఆశ్రయిస్తారు.పశువులంటే జీవులు, పశుపతి అంటే ఈశ్వరుడు.ఆయన ఇచ్చినది పాశుపత శాస్త్రం. కార్యము, కారణము, యోగము, విధి, దుఃఖాంతము అనే ఐదు పదార్థాలు తత్త్వజ్ఞాన సాధనకు ఉపయోగపడతాయి. మిథ్యా జ్ఞానము, అధర్మము, ఆసక్తిహేతువైన విషయాలు, ధర్మచ్యుతి ఇవి జీవత్వానికి మూలము. జపము, ధ్యానము, ఎల్లప్పుడు రుద్రుని స్మృతి, ప్రవృత్తి (రుద్రునికి శరణాగతి) ఇవి జీవుణ్ణి శివునివైపుకు తీసుకువెళ్టాయి. పశువు, పశుపతి తోబాటుగా పాశాన్ని కూడా స్వీకరిస్తే శైవాగమాలు చెప్పిన శైవదర్శనం వస్తుంది.
శివయోగి శివాచార్యుని సిద్ధాంత శిఖామణి మొదటి శ్లోకం.
త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే,
సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః.
దీని వివరణ శైవ సిద్ధాంత అవగాహనకు తోడ్పడుతుంది.
No comments:
Post a Comment