Monday, January 22, 2018

కఠోపనిషత్ 11 & 12 నచికేతసుడు యముణ్ణి మూడు వరాలు అడుగుతాడు.


https://www.facebook.com/vallury.sarma/posts/532883446749073

https://www.facebook.com/vallury.sarma/posts/533368196700598

కఠోపనిషత్ 11 (June 14)
నచికేతసుడు యముణ్ణి మూడు వరాలు అడుగుతాడు.
మొదటి వరం :
శాంత సంకల్పః సుమనా యథా స్యా
ద్వీతమన్యుర్గౌతమో మాభిమృత్యో
త్వత్ప్రసృష్టం మాభివదేత్ప్రతీత
ఏతత్త్రయాణం ప్రథమం వరం వృణే
ఓ మృత్యుదేవతా! నాపైన (నాతండ్రియైన) గౌతముడు శాంతుడైఉండుగాక! ఆయన వాక్కుచేతనే నేను పరలోకానికి వచ్చేశాను. ఆయనకు నావలన కలిగిన ఆదుఃఖం లేకుండు గాక! పూర్వంవలెనే నాపై అనుగ్రహంతో ఉండుగాక. (నాకోర్కె తీర్చి నన్ను ఆయనకు అశాంతి లేకుండుటకు నా తండ్రివద్దకు క్షేమముగా పంపుము.) మీచే తిరిగిపంపబడిన నన్ను చూచి నాతండ్రి ఆనందపడును గాక! ఇది నాకు మీరిచ్చే మొదటి వరం.
భూమిమీదకు తిరిగి రాకపోతే నచికేతుని జ్ఞానం లోకానికి ఎలా ఉపయోగపడుతుంది? యముడు ఆవరం వెంటనే ఇచ్చేసి " నిన్ను చూచి రాత్రులందు నీతండ్రి సుఖ నిద్ర పోవుగాక!. అతడు దుఃఖము తొలగి సంతోషించగలడు" (సుఖగ్ం రాత్రీః శయితా వీతమన్యుస్త్వాం దదృశివాన్) అన్నాడు.
మొదటి వరం విషయంలో మనం యోగపరంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి.
1. యమలోకంలోని యముని గృహానికి నచికేతుడు ఎలా వెళ్ళాడు? యమలోకంనుండి తిరిగి ఎలా వచ్చాడు?
రెండవ వరాన్ని అడిగేముందు స్వర్గాన్ని గురించి నచికేతసుడు ప్రస్తావిస్తున్నాడు.
స్వర్గే లోకే న భయం కించ నాస్తి (స్వర్గంలో కొంచెం కూడా భయమనేది ఉండదు). న తత్ర త్వం (భయపెట్టడానికి) నీవు అక్కడ ఉండవు. న జరయా (అక్కడ ముసలితనం లేదు) అశనా యా పిపాసే (ఆకలి దప్పులు లేవు). శోకంలేకుండా సుఖమే ఉన్నది (శోకాతిగో మోదతే స్వర్గలోకే). ఇలాంటి స్వర్గ ప్రాప్తి కావాలంటే చేయవలసిన క్రతువు రహస్యం చెప్పు. ఇది నాకు నీవిచ్చే రెండో వరం. ఈ విధంగా నచికేతసుడు ఇహపరసుఖాలనిచ్చే రెండు వరాలు అడిగాడు. ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలి.
2. యముడు తెలిపిన నచికేతాగ్ని అనే అగ్నివిద్య, ఆత్మవిద్యను ఇచ్చే ఉపనిషత్తులో ఎందుకు చెప్పబడినది?
ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు సద్గురు శివానందమూర్తి గారి కఠయోగము తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలలో లభిస్తాయి. ఇందులో ఇంగ్లీషు పుస్తకము పీఠికలో మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు నచికేతసుని వయసులో గురువుగారికి వచ్చిన యౌగిక అనుభవం, ఆయనకు లభించిన ఆదిశేషువు దర్శనం వర్ణిస్తారు. యోగసూత్రాల కర్త పతంజలి మహర్షి ఆదిశేషుని అవతారమని సుప్రసిద్ధం.
మొదటి ప్రశ్నకు సమాధానము యోగ విషయమే. ఇది అర్థము చేసుకోవడానికి సృష్టిలోని జగత్తును, శరీరములోని జీవుని సామ్యమును అర్థము చేసుకోవాలి. సృష్టింపబడిన మొదటి వస్తువు ఆకాశము. సృష్టి పూర్వమున్నది బ్రహ్మము. సృష్టి సంకల్పముతో అది ప్రకృతి పురుషతత్త్వములుగా, శివ శక్తులుగా, విభజింపబడినది. శివుడే ఆత్మ స్వరూపుడు. ఆకాశము ఆత్మయొక్క మొదటి వికారము. దానినుండి పుట్టినది వాయువు. వాయువునుండి పుట్టినది అగ్ని. అగ్నినుండి పుట్టినది జలము. జలమునుండి పుట్టినది భూమి. ఇవన్నియూకలసి స్థూల బ్రహ్మాండము. దీనిని విరాట్బ్రహ్మము అంటారు.
ద్యులోకము (భువర్లోక, సువర్లోకాది లోకములకు ఉపనిషత్ పరిభాష), సూర్య చంద్రులు, ఇవన్నియూ దీని అవయవములు ద్యావా పృథివి (ఆకాశము, భూమి) పితర్మాతలు (తండ్రి, తల్లి) అని వర్ణించారు. విరాట్ బ్రహ్మము యొక్క సూక్ష్మరూపమే మానవ దేహము. అందుకే దేహమునకు క్షుద్రబ్రహ్మాండము అని వ్యవహారము.
విశ్వవ్యాప్తమైన పరమాత్మ అణురూపములో కేంద్రబిందువుగానుండి, మనుష్యుని బుద్ధిగుహలో అంగుష్ఠమాత్రుడైన జీవునిగా పరిణామంచెంది, మనోప్రాణ, దేహములను సంతరించుకొని నేను ఈ స్థూలదేహమును” అనుకొని ప్రవర్తించుచున్నది. దేహభావన నుండి లోనికి వెళ్ళి మానవునకు ఈ ఆత్మను పరమాత్మగా తెసుకొనుట సాధ్యమే.

___________________


రెండవ వరంగా నచికేతసుడు స్వర్గాది ఉత్తమలోకాలకు తీసికొనివెళ్ళే క్రతురహస్యం చెప్పమని యముణ్ణి అడిగాడు. దానికి యముని సమాధానం -
ప్రతేబ్రవీమి తదుమే నిబోధ
స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్
అనంతలోకాప్తిమధో ప్రతిష్ఠాం
విద్ది త్వమేతం నిహితం గుహాయాం. (1.14)

ఓ నచికేతసా! స్వర్గమునకు తీసుకువెళ్ళే అగ్నితత్త్వమును నీకుచెబుతాను. సామాన్యమైన పుణ్యములు, యజ్ఞకర్మల వలన లభించిన స్వర్గ సౌఖ్యములు పుణ్యఫలము అయిపోగానే జీవులకు నష్టమౌతున్నవి. నేను చెప్పబోయే అగ్నికర్మ జీవునకు అనంత ఉత్తమలోక ప్రాప్తిని ఇస్తుంది. పునర్జననము లేనందువలన ఇది మృత్యుంజయత్వమే. ఇది హృదయకమలమునకు దిగువగా ప్రతిష్ఠింపబడిన యోగ రహస్యము. దీనిని బాగుగా తెలిసికొనుము. అథో ప్రతిష్ఠాం నిహితం గుహాయాం - అంటే హృదయకుహరానికి - అనాహత చక్రానికి - క్రిందచక్రములలో సాధనయే ఈ అగ్ని కార్యము. ఇది అంతర్యాగము. ఇక్కడ ఉత్తమలోకాలకు యోగ మార్గము, మోక్షస్థానమైన హృదయకుహరమూ సూచింపబడినవి.
ఈ మంత్రభావాన్ని అర్థం కావడానికి కొంత యోగసాధనను గురించిన విజ్ఞానం తెలియాలి. పద్మాసన స్థితుడైన యోగి వెనుపాము వెంట శిరస్సు వరకు ఏడు ప్రాణ శక్తికేంద్రాలు గుర్తించవచ్చు. వీనిని చక్రాలు అంటారు. క్రిందనుండి పైకి మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం,ఆజ్ఞాచక్రం - ఈ షట్చక్రాల పైన సహస్రారం. మూలాధారం వెన్నెముక క్రింద ఉంటుంది. సామాన్యమానవునికి ఇచ్చటనున్న కుండలినీ శక్తి నిద్రావస్థయందుండి అతడికి స్థిరమైన దేహాత్మభావన కలుగుచున్నది. ఈ కుండలిని అనుదాని చైతన్యమే శరీరమందలి నాడీమండలమున ప్రవేశించి పంచ ప్రాణముల రూపమున అనేక దేహక్రియలను నిర్వహిస్తున్నది.
సృష్టిలోని బ్రహ్మాండములో ఎన్నో లోకములున్నవి. ఆయా లోకములలోని జీవులు ఊర్ధ్వగతియందు ఒక్కొక్కలోకమునందు ఒక్కొక్క ఔన్నత్యమును పొందుచున్నారు యోగములో భూమిపైనుండి యోగసాధన వలన తనశరీరమందే అంతర్భూతమగు బ్రహ్మాండమును దర్శించి ఆయాలోకముల జ్ఞానమును పొంది ఆనందింపవచ్చును.
దేహమందలి లోకములకు సంబంధించిన విజ్ఞానమిట్లున్నది.
మూలాధారము - దేవత: బ్రహ్మ, లోకము: భూలోకము, గ్రంధి: బ్రహ్మ, గుణము: తమస్సు, తత్త్వము: భూమి
స్వాధిష్ఠానము - దేవత: విష్ణు, లోకము: భువర్లోకము, గ్రంధి: బ్రహ్మ, గుణము: తమస్సు, తత్త్వము: జలము
మణిపూరకము - దేవత: రుద్ర , లోకము: స్వర్లోకము, గ్రంధి: విష్ణు, గుణము: తమస్సు, తత్త్వము: అగ్ని
అనాహతము - దేవత: ఈశః , లోకము: మహర్లోకము, గ్రంధి: విష్ణు, గుణము: రజస్సు, తత్త్వము: వాయువు
విశుద్ధము- దేవత: సదాశివః , లోకము: జనోలోకము, గ్రంధి: రుద్ర, గుణము: రజస్సు, తత్త్వము: ఆకాశము
ఆజ్ఞా - దేవత: పరమశివః, లోకము: తపోలోకము, గ్రంధి: రుద్ర, గుణము: సత్త్వ, తత్త్వము: మనస్సు
సహస్రారము - లోకము: సత్య లోకము గుణము: సత్త్వ, తత్త్వము: ఆత్మ

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...