Monday, January 22, 2018

కఠోపనిషత్ 13 & 15

https://www.facebook.com/vallury.sarma/posts/533811506656267

ఇప్పుడు రెండో వరములో యముడుచెప్పిన యోగాగ్ని రహస్యము ఇట్లు చెప్పవచ్చును. మూలాధారము భూతత్త్వము. స్వాధిష్ఠానము అగ్నితత్త్వము. మణిపూరకము యోగి నాభి స్థానమునందున్నది. అది అగ్ని,జలముల మిశ్రమ తత్త్వము. కుండలినిని జాగృతముచేసి స్వాధిష్ఠాన, మణిపూరకములలో అగ్నితత్త్వములో ప్రవేశించి ప్రయత్నపూర్వకముగా కంఠమందలి విశుద్ధచక్రమును జేరి, యోగముచేత ప్రాణసహితమైన శరీరమును వదలి, యోగి సుషుమ్నానాడి ద్వారా ఊర్ధ్వలోక సంచారమునకు, తన జీవునిగా వెళ్ళగలడు. లేదా తనకు కావలసినప్పుడు ఇడా, పింగళా నాడుల ద్వారా దేహమును విసర్జింపగలడు. స్వచ్ఛంద మరణమనగా నిదియే. జీవించి యుండగా స్వర్గాదిలోకములకు వెళ్ళు మార్గమిదియే. భౌతికలోకములకు ఆధారమైన అగ్నిని, ఇటుకలను పేర్చిచేసిన హోమకుండమును ఏర్పాటుచేసి యజించు బాహ్యయజ్ఞమును కూడా నచికేతసునికి యముడు వివరించాడు.
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీత్యేకే నాయమస్తీతి చైకే
ఏదైతే మనుష్యునియందు ఉన్నదో, అది చనిపోయినపుడు ఏమౌతున్నదో నాకు సందేహమున్నది. కొందరు ఏదో ఉన్నదని అంటున్నారు. కొందరు ఏమీలేదంటున్నారు.
ఏతద్విద్యా మనుశిష్టస్త్వయాహం
వరాణా మేష వరస్తృతీయః (1.20)
ఈ విషయాన్ని నీవలన బోధింపబడి నేను తెలుసుకోగోరుచున్నాను. ఇది నచికేతసుడు అడిగిన మూడో వరం. తన వయస్సుకు తగినట్లు, అమాయకంగా అడిగినట్లున్న ప్రశ్న ఇది. ప్రాణము, జీవుడు ఇలాంటి పరిభాష వాడలేదు. చనిపోయినప్పుడు ఏమవుతుంది? స్వర్గానికి వెళ్ళేవాడు ఎవరు? నరకంలో కష్టపడేది ఎవరు? పాప పుణ్యాలు చేసింది ఎవరు? సుఖ దుఃఖాలు పొందేది ఎవరు? స్వర్గంలోకి ఏదివెడుతుందో దానికి శరీరము, తాను శరీరముతో చేసిన కర్మలూ గుర్తు లేక పోతే, ఎవరి పాపానికి, ఎవరు శిక్షింపబడుతున్నారు? ఇలాంటి సందేహాలన్నీ నచికేతసుడి ప్రశ్నలో ఉన్నాయి.
నచికేతునికి తన చిత్తభావనల అనుస్యూతి (continuity of consciousness) ఉండుటవలననే ఈ ప్రశ్న అడుగగలుగుతున్నాడు కదా? ఈ అనుమానం రావచ్చును. తాను మరణించి యమలోకానికి రాలేదు. తన తండ్రి తపశ్శక్తి ప్రభావం వలన, ఆయన మాటతోనే తాను రాగలిగాడు.అందుకే మొదటివరంలో స్వయం శక్తితో ఊర్ద్వలోకానికి వెళ్ళి, తిరిగి రావడం గురించి అడిగాడు. ముక్తి వేరు, మరణం వేరు. ముక్తి అంటే బంధన విముక్తి. అది శరీరంలో ఉండగనే రావచ్చును. అతడు అడుగుతున్నది సామాన్యుల మరణానంతర స్థితి. (ఇడా, పింగళ, సుషుమ్న అనే నాడులు షట్చక్రములను పరివేష్టించి ఉంటాయి. ఇవి కూడాస్థూల శరీరములో కనుపించేవి కాదు. సామాన్యంగా నాడి అంటే nerve అనే పదానికి బదులుగా వాడతాము. కాని ఇక్కడ channels or ducts, ప్రాణ శక్తి నాళములు అనుకోవచ్చును. కుడివైపున ఉన్న పింగళ ద్వారా ప్రాణము విడువడం సూర్యమండలం ద్వారా ఊర్ధ్వలోకాలకు వెళ్ళే మార్గం. ఎడమవైపున ఉన్న ఇడా నాడి చంద్రమండలము ద్వారా పితృలోకానికి వెళ్ళి పునర్జమ పొందే మార్గం. నాచికేత విద్య సాధకునికి పునర్జన్మ రహితమైన దేవమార్గాన్ని ఈయగలదు. మధ్యన ఉన్న సుషుమ్న తాత్కాలిక లోక సంచారానికి మార్గము.)



కఠోపనిషత్ 15 (జూన్ 18)
యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో
యత్సంపరాయే మహతి బ్రూహి నస్తత్
ఓ మృత్యుదేవతవైన యమా! శరీరధారణము, పతనము తరువాత ఏమి ఉన్నదో, దేనినిగురించి దేవతలకు కూడా సందేహములున్నవో, అట్టిదానిని గురించి నాకు చెప్పుము.
యో2యంవరో గూఢమనుప్రవిష్టో
నాన్యం తస్మాన్నచికేతా వృణీతే (1.29)
ఈ నిగూఢమైన విషయములో ప్రవేశించిన నచికేతసుడైన నేను మరియే అన్యవరమూ నిన్ను కోరను. యమునికి ఇప్పుడు తప్పనిసరిగా నచికేతసుడు అడిగిన మూడవ వరము ఈయవలసి వచ్చినది. నచికేతసునికి పూర్తిగా వైరాగ్యం వచ్చినదా, లేక ఇంకా భూలోకములోని జీవుల కోరికలున్నవా అని యముడు పరీక్షించాడు. పరీక్షలో ఉత్తీర్ణుడైన నచికేతసునికి జీవాత్మ రహస్యము బోధించాడు. సామాన్యులు దేవతా దర్శనమయ్యాక ఏకోరికలు కోరుకుంటారో వాటినన్నిటినీ నచికేతసుడు తిరస్కరించాడు.
జీవుడు మనుష్య శరీరాన్ని ధరించి ఉండగానే జీవన్ముక్తుడు కావడానికి మార్గమును ఉపదేశించడం ఈ ఉపనిషత్తు ప్రధాన లక్ష్యం. యముడు ఇచ్చిన మొదటివరం లౌకికమే. నచికేతసుడు సజీవంగా తండ్రిని చేరి ఆయనకు ఆనందం కలిగించడమే ఆ వరం ఉద్దేశ్యం. రెండవ వరంలో ఇచ్చినది శాశ్వత ఊర్ధ్వలోక నివాసం తప్ప మోక్షము కాదు. మూడవ వరంలో నచికేతసుడు అడిగినది జీవాత్మ రహస్యం, తద్వారా పరమాత్మ రహస్యం. జీవాత్మ,పరమాత్మల సంబంధం, నిత్యానిత్య వివేకం వంటి పారిభాషిక పదాలు వాడకుండా చిన్నపిల్లాడి వలెనే అసలు ప్రశ్న అడిగాడు. చిన్న పిల్లవాడిని ప్రలోభ పెట్టినట్లే యముడు కూడా చిన్న చిన్న ఆశలు కలిగించాడు. ముముక్షువుకు కావలసిన వైరాగ్యము, వివేకము, శమ దమాది గుణసంపత్తి, ముముక్షత్వము, పరిపక్వ స్థితి ఉన్నాయని నిశ్చయం చేసుకున్నాకే యముడు ఆత్మవిద్యను బోధింఛాడు.
మూడవ వరములొ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి, మృత్యుంజయత్వాన్ని ప్రసాదించే నచికేతవిద్య లోని యోగసాధనా రహస్యము ఏమిటి? దీనికి సమాధానం ద్వితీయవల్లిలో దొరుకుతుంది.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...