Monday, January 22, 2018

కఠోపనిషత్ – 9 & 10

https://www.facebook.com/vallury.sarma/posts/532219080148843

https://www.facebook.com/vallury.sarma/posts/532559760114775


కఠోపనిషత్ – 9 (June 12)

నచికేతసుని తండ్రియైన వాజశ్రవసునికి విశ్వజిత్ యాగము తరువాత ఒక మాటలో కుమారుని యమునియొద్దకు పంపగల సత్యవాక్కు, శక్తి ఎలా వచ్చాయి?
ఈ వేదవాక్కును గమనించండి - న కర్మణా న ప్రజయా ధనేన, త్యాగేనైకే అమృతత్వ మానసు - మోక్షము సంపద వలన, సంతానము వలన, కర్మలవలన (పుణ్య కర్మలు కూడా) లభించదు. కేవలము ఆ మూడింటి త్యాగము వలననే లభిస్తుంది. నచికేతుని తండ్రి మొదట తన సంపదనంతా దానం చేశాడు. కర్మ ఫలంగా వచ్చే ఊర్ధ్వలోక ప్రాప్తిని మోక్షంకొరకై త్యాగం చేశాడు. ఆఖరు బంధమైన కుమారుణ్ణి యమునికి దానమిచ్చాడు. ఈ మూడు దానాల ఫలం ఏమిటి? భూమిపై తను యజ్ఞవిధిగా త్యాగము చేసినది భగవంతునికి చేరుతుంది. (భోక్తారం యజ్ఞ తపసాం - భ.గీ.) భగవంతుడు ఆసంపదను ఏమి చేస్తాడు? ప్రార్థించిన వారికి భౌతిక సంపదను ఇస్తాడు. లేదా స్వర్గసౌఖ్యాలు ఇస్తాడు. నచికేతునికి కావలసినవి ఈ రెండూ కాదు. అతనికి కావలసినది జీవుని గతిని గురించిన జ్ఞానము. జీవులు తాము సామాన్యంగా చేసే దానాలు, ఇతర పుణ్యకార్యాలన్నీ తమ పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తారు. ఇది వారిని బంధించి ఉంచుతుంది. కాని వాజశ్రవసుడు తన ఏకైక పుత్రుణ్ణి దేవతలకు దానంచేసి మోక్షానికి అర్హుడయ్యాడు. అతని దానాల ఫలం కుమారుని జ్ఞాన సముపార్జనకు కూడా తోడుపడినది. మరణించినతరువాత జీవుని యదార్థస్థితిగతులు ప్రత్యక్షంగాచూచి అధికారికంగా చెప్పగలవాడు యముడు. యముడు నచికేతసుని పరీక్షించి, అతను జ్ఞానము పొందుటకు అర్హుడని తేల్చుకొని జ్ఞాన బోధచేశాడు.
తైత్తిరీయ బ్రాహ్మణము నుండి కొంత కథ
ఉపనిషత్తులో లేని కొన్ని అంశాలు తైత్తరీయబ్రాహ్మణములో ఉన్నాయి. ఔద్దాలకుడు తన కుమారునితో "నిన్ను నేను మృత్యువుకు ఇస్తాను” అని చెప్పగానే నచికేతుడు ఆలోచిస్తూ తండ్రికి కొంచెందూరంగా వెడతాడు. అప్పుడు అశరీరవాణి వాక్కులు ఇలా వినబడ్డాయి. "గౌతమ కుమారా! (వారు గౌతమ గోత్రజులు) నీతండ్రి చెప్పినది నిజమే. ఆయన నిన్ను మృత్యువుకు ఈయడానికే సంకల్పించాడు. నీవు తండ్రి ఆజ్ఞ ప్రకారం యమలోకం వెళ్ళగానే ఆయన నీకు దర్శనమీయడు. మూడు రాత్రులు అక్కడ నీవు ఆహారం లేకుండా గడపాలి. యముడు వచ్చి నిన్ను "బ్రాహ్మణుడా! నీవు ఎన్ని రాత్రులు నీవు ఇక్కడ గడిపావు? అని అడుగుతాడు. "మొదటి రాత్రి ఏమి తిన్నావు?" అని అడుగుతాడు. "నీ సంతానాన్ని" అని చెప్పు. రెండవరాత్రి ఏమి తిన్నావు?" అని మళ్ళీ అడుగుతాడు. "నీ సంపదని" అని చెప్పు. మూడవరాత్రి ఏమితిన్నావని మళ్ళీ అడుగుతాడు. "నీపుణ్యాన్ని" అని చెప్పు. (అశరీరవాణి అంటే అందరికీ వినపడేది కాదు. అంతరాత్మ ప్రబోధం అని అనుకోవచ్చును.) "యమదర్శనమైన తరువాత వరములడిగి ఆత్మవిద్యను గ్రహింపుము" అనికూడా అశరీరవాణి చెబుతుంది. నచికేతుడు యముని గృహంలో అలాగే సమాధానాలు చెబుతాడు.
ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు యముడు ఆత్మజ్ఞానాన్ని ఈయగల సమర్థుడా?
సూర్యుడు యాజ్ఞవల్క్యునికి శుక్లయజుర్వేదాన్ని ఇచ్చాడు. తైత్తిరీయోపనిషత్తు భృగువల్లిలో వరుణుడు భృగువుకు బ్రహ్మతత్త్వం బోధిస్తాడు. అలాగే యముడుకూడా నచికేతసునికి గురువయ్యాడు. శ్రీకృష్ణుడు గీతలో ప్రధమంగా తాను వివస్వంతునకు బోధించానని చెబుతాడు. అవసరమైతే పరమాత్మతోబాటు ఆయన అంశలైన దేవతలందరూ తమను అడిగినవారికి జ్ఞాన బోధచేయగలుగుతారని చెప్పుకోవాలి.



దహరం విపాపం పరమేశ్మభూతం యత్ పుణ్డరీకం పురమధ్యసగ్ంస్థం
తత్రాపి దహరం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం
Located in the center of the body is the subtle lotus of the heart, pure and untainted, which is the abode of the Supreme Being. Meditate on the Supreme Being residing in that inner expanse, which is subtle and free from sorrow.
మరికొంత పరిభాష
పంచ ప్రాణములు = 1. ముఖ్య ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (ఆసనమున యుండునది) 3. సమానము (నాభి మండలమున నుండునది) 4. ఉదానము (కంఠమున నుండునది) 5.వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది)
ప్రాణాహుతులు = భోజనానికి ముందు పంచప్రాణములకిచ్చు ఆహుతులు
మృత్యువు = ఆయుర్దాయము పూర్తి అయినప్పుడు, హృదయ సమీపములోని ముఖ్యప్రాణము స్వస్థానమును వీడి ఊర్ధ్వమార్గముకాని, అధోమార్గముకాని అనుసరించి నిర్గమించును. దీనికి పూర్వము దేహమంతటను వ్యాపించిన మిగిలిన నాలుగు క్రియాశీలక ప్రాణములు, వాటి వాటి క్రియలను వదలిపెట్టి కేంద్రమునందలి ముఖ్య ప్రాణమును చేరును. ఆనాలుగు ప్రాణముల ఉపసంహారమే మృత్యుబాధ. జీవనకాలమందు మనుష్యుడు ఈ బాధను ఊహింపలేడు. ఈ ముఖ్య ప్రాణమే గీతలో భగవంతుడు చెప్పిన " అహం వైశ్వానరో భూతా ప్రాణినాం దేహమాశిత". మిగిలిన నాలుగు ప్రాణములు "ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం" అన్నట్లు ఆహారమును నాలుగు కార్య రూపములుగా పచనము చేయుచున్నవి.
పంచకోశములు - లిఙ్గ శరీరము
పంచకోశములు = The five sheaths enclosing the human soul, the physical body being the grossest. 1. అన్నమయము, 2. ప్రాణమయము, 3. మనోమయము, 4. విజ్ఞానమయము. 5. ఆనందమయము
ఆత్మ – The soul is covered by three bodies: karana, sukshma and sthula or by five conceptual sheaths described above.
ఈ పంచ కోశములన్నీ అనాత్మలు, అవిద్యభూమికలు. వీనిని అర్థము చేసుకొని ఆయా కోశములలో ఉపాసన చేసిన, హేతు స్వరూప సోపాన పంక్తి (కార్య కారణరూపమైన మెట్ల వరుస) క్రమముగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దారి తీయును.
దహరాకాశము లేక హృదయపద్మము
ఈ పంచకోశముల లోపల ప్రదేశాన్ని బుద్ధి గుహ, దహరాకాశము లేక హృదయపద్మము (Heart Cavity) అంటారు. దహరము అంటే హృదయమే. ఇదే యోగశాస్త్రములోని అనాహత చక్ర స్థానము.
ఈ పంచకోశముల విశ్లేషణ తైత్తిరీయ ఉపనిషత్తు లోనిది. వరుణదేవుడు తన కుమారుడైన భృగువుకు బ్రహ్మ జ్ఞానమునకు మార్గదర్శనము చేయుట దీనిలోని విషయము. భృగువుకు నచికేతుని వలెనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని తీవ్రజిజ్ఞాస కలిగినది. దయతో తనకు బ్రహ్మతత్త్వోపదేశం చేయమని తండ్రిని అడిగాడు. దానికి తండ్రి – “నాయనా ! అన్నం, ప్రాణం, నేత్రం, శ్రోత్రం, మనస్సు, వాక్కు – ఇవన్నీ బ్రహ్మోపలబ్ధికి సాధనాలే. వీటన్నిటిలో బ్రహ్మతత్త్వం యొక్క అస్తిత్వం స్ఫురిస్తూనే ఉంటుంది. దేనిలోనుండి ఈ సర్వమూ ఉత్పన్నమయిందో, దేనిచేత పరిపోషింపబడుతున్నదో, దేనిలో చిట్టచివఱకు మహాప్రళయకాలంలో తిరిగి లయమవుతున్నదో ఆ మూలవస్తువును తెలుసుకొనడానికి ప్రయత్నించు. ఆ మూలతత్త్వాన్ని తపస్సుద్వారా ప్రత్యక్షం చేసుకొని అనుభవించు.” అని చెప్పాడు. భృగువు తపస్సుచేసి మొదటగా తెలుసుకొన్నది అన్నం వల్లనే ఈ సర్వప్రాణులూ ఉత్పత్తి చెందుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నం వల్లనే పరిపోషింపబడి సురక్షితంగా ఉంటున్నాయి. మరణించిన తర్వాత కూడా అన్నరూపమైన ఈ పృథివిలోనే అన్ని జీవరాశులూ కలిసిపోతాయి. ఆ తపస్సులో కల్గిన ప్రథమప్రబోధం బ్రహ్మం అన్నస్వరూపమనిపించడం. ఈ విషయమంతా తండ్రికి నివేదించాడు భృగువు. తండ్రి ఇలా అన్నాడు. “నాయనా ! నీకు బ్రహ్మం యొక్క స్థూలరూపమే పరిచయమైంది. నీవు ఇంకా తపస్సుచేయాల”ని చెబుతాడు. ఇలావరుసగా ప్రాణమే బ్రహ్మ తత్త్వమని, మనస్సే బ్రహ్మ తత్త్వమని, విజ్ఞానమే బ్రహ్మ తత్త్వమని, ఆనందమే బ్రహ్మ తత్త్వమని వచ్చి తండ్రికి చెబుతాడు భృగువు. తండ్రి కొడుకుతో, “కుమారా ! ఆనందం అనేది అన్నిటి కన్నా ఉత్తమంగా పరమాత్మరూపాన్ని విస్పష్టం చేసే రూపం. అయినా, అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం – ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. కానీ ఇవి ఒకదాని కన్నా మఱొకటి సూక్ష్మమయినవి. అన్నిటి కన్నా మించినది ఆనందమయ బ్రహ్మానుభూతి.” అనిచెబుతాడు


Sumalini Soma "బ్రహ్మం అన్నస్వరూపమనిపించడం" you showed us clearly. Can you please do the same with other pranas.
Vvs Sarma Sumalini Soma- This material is from TaittarIya Upanishat - Bhriguvalli It had to be brief because it is only referred to in our Kathopanishat narrative. Let me try to touch upon what you wanted at appropriate places.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...