Monday, January 22, 2018

లోపాముద్ర - అగస్త్యుడు – 6

https://www.facebook.com/vallury.sarma/posts/521765421194209

16/05/2013

దక్షిణదేశంలో అగస్త్యుడు - వింధ్య దాటి దక్షిణదేశానికి వచ్చిన అగస్త్యుడు ఇంకా ఏమి పనులు చేశాడు? రామ రావణ యుద్ధం పూర్తి అయ్యాక దక్షిణదేశంలో ఉత్తరదేశస్థులంటే, వారి సంస్కృత భాష అంటే ఒక రకమైన విముఖత ఏర్పడింది. ఆర్యావర్తమునుండి వచ్చిన శ్రీరాముడనే క్షత్రియుడు, తమ గొప్పరాజైన రావణుని ఓడించడం, వధించడం వారు జీర్ణించుకోలేక పోయారు.రాముడు విష్ణువు అవతారమని చెప్పబడటంచేత విష్ణుభక్తి కూడా తగ్గినది.ఈ పరిస్థితిలో అగస్త్యుడు లంక,తమిళదేశాల మధ్య సంచరిస్తూ సనాతన ధర్మాన్ని, ఆర్యసంస్కృతిని నిలబెట్టాడు. శివకుమారుడైన కుమార స్వామిని గురువుగా ఆరాధించి, తమిళదేశంలో శివుని, మురుగన్ అనేపేరుతో సుబ్రహ్మణ్యుని, ఆరాధించేటట్లు చేశాడు. సంస్కృతభాషను వదలి తమిళాన్ని అభివృద్ధిచేశాడు. తమిళులకు ఆరాధ్యుడైన మహర్షి అయ్యాడు. తమిళులు ఆయనను అగస్తియార్ అని పిలుస్తారు. తమిళభాషకు తండ్రిగా ఆరాధిస్తారు. తమిళాన్ని మహర్షి ప్రోక్తమైన ప్రాచీన భాషగా తలుస్తారు. స్కందుడే తమిళాన్ని అగస్త్యునకు ఇచ్చాడని చెబుతారు. తమిళాన్ని అగస్త్యం అనేపేరుతో పిలుస్తారు.
చెంగనూరు(కేరళ) లోని భగవతి-మహాదేవ ఆలయం దక్షిణ దేశంలో అగస్త్యునిచేత ప్రతిష్ఠింపబడిన మొదటి ఆలయం అంటారు. ఇది అలప్పుఝ (అలెప్పి) జిల్లాలో శబరిమల మార్గంలో ఉన్నది. దక్షయజ్ఞానంతరం సతీదేవి శరీరభాగం పడిన శక్తి స్థలం అంటారు. శివకల్యాణ సంబంధమైన ఐతిహ్యంకూడా ఒకటి ఉంది. హిమాలయాలలో హిమవంతుని గృహంలో శివ కల్యాణం జరిగినప్పుడు అక్కడకు చేరిన అసంఖ్యాక దేవతాగణాల బరువుకి, భూమి కృంగిపోవడం మొదలుపెట్టినదట. శివుడు అగస్త్యుని భారతదేశపు దక్షిణకొనకు వెళ్ళి ఆబరువును సమంచేయమని కోరగా అగస్త్యుడు ఒప్పుకున్నాడట. శివ పార్వతుల వివాహం చూచేందుకు దివ్యదృష్టినీ ఇచ్చిన శివుడు, తమ వివాహమయ్యాక అగస్త్యుని స్థానానికి వచ్చి దర్శనం ఇస్తామని చెప్పాడు. సహ్యాద్రిలో ఆస్థానంలో అగస్త్యుడు ఆ ఆలయాన్ని నిర్మించాడట. తమిళనాడులోని అనేక శివాలయాలలో అగస్తీశ్వరుడు అనేపేరిట శివలింగం ఉంటుంది. ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం పళని లోనే కుమార స్వామి అగస్త్యునికి దర్శనం ఇచ్చాడట.
అగస్త్యుని తమిళ దేశంలో అనేక యోగసిద్ధులుగల సిద్ధయోగిగా పరిగణిస్తారు. అయుర్వేదానికి తమిళ దేశంలో ప్రత్యామ్నాయంగా పేరుపొందిన సిద్ధవైద్యానికి (మూలికా వైద్యం) అగస్త్యునే మూలపురుషునిగా భావిస్తారు. అనేక దీర్ఘకాల వ్యాధులకు సిద్ధవైద్యం ప్రసిద్దిపొందినది.
ఉత్తర ఆకాశంలో ధ్రువ నక్షత్రం (Pole Star) ఉన్నట్లు, దక్షిణ ఆకాశంలో ప్రకాశవంతమైన దక్షిణ నక్షత్రం (Southern Pole Star) ఉన్నది. దానిని భారతీయ జ్యోతిశ్శాస్త్రములో అగస్త్యనక్షత్రమని పిలుస్తారు. దిక్సూచి లేనప్పుడు ఈ నక్షత్రాన్ని నావికులు దక్షిణదిశనుగుర్తించడానికి వాడేవారు. దీనిని ఆధునిక ఖగోళశాస్త్రంలో కానొపస్ (Canopus) అని పిలుస్తారు. అగస్త్య, మార్కండేయ మహర్షులు సువర్ణభూమికి (ఇండొనీషియా)సనాతన ధర్మాన్ని తీసుకొని వెళ్ళారని చెబుతారు. ఇండొనీషియాలొ అగస్త్య చాల ఎక్కువగా వినిపించే పేరు. హిందువులేకాక ముస్లిములు, క్రైస్తవులు, సంస్థలకు కూడా అగస్త్యుని పేరు పెట్టుకుంటారు. ఇండొనీషియా బహాసా (భాష) లో సంస్కృతపదాలు కనుపిస్తాయి. రాజధాని జకార్తా (జయకర్త) మరియొక పెద్దనగరం యోగ్యకర్త పదాలు సంస్కృతమే. తమిళదేశం ఈ ఆగ్నేయ-ఆసియా దేశాలతో వాణిజ్యం నిర్వహించేది. 10 వ శతాబ్దము నాటికి హిందూమతము ప్రధానంగా ఉండేది. ప్రాంబనన్ (మూల పదం పరబ్రహ్మ) నగరంలో పెద్ద శివాలయం ఇరు ప్రక్కల బ్రహ్మ విష్ణువు, త్రిమూర్తుల విగ్రహాలతో ఉన్నది. అది అగస్త్యుడు ప్రతిష్టించాడనిచెబుతారు. బాలి ద్వీపంలో ప్రజలు హిందువులే. శివునితోబాటుగా అగస్త్యుని పూజిస్తారు.
ఈవ్యాసంలో చాలా భాగానికి ఆధారం సద్గురు శివానందమూర్తిగారి రెండు సంపుటాల "మార్గదర్శకులు - మహర్షులు" అనే గ్రంధం. 50 పుటల నిడివితో వారి పుస్తకంలో అగస్యునిపై వ్యాసంలో ఉన్న అనేక విషయాలలో కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారి మహర్షుల చరిత్ర ఉపన్యాసాలను వారి కంఠస్వరములోనే, సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్లో వినవచ్చును. (www.sdctbheemili.org/)

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...