Sunday, January 21, 2018

సనాతన ధర్మం - హిందూమతం

https://www.facebook.com/vallury.sarma/posts/514946051876146

నాడూ-నేడూ
నేడు భారతదేశంలో సనాతన ధర్మవిషయాలలో చూచే స్థితికి అంకురార్పణ సా.శ. 1000 లోజరిగితే, దాని పూర్తి ప్రభావం దేశమంతటా సా.శ.1500 నాటికే పడింది. 1505లోనే గోవాలో క్రైస్తవమతముతో ముడిపెట్టబడిన పోర్చుగీస్ రాజ్యంఏర్పడినది. భారత దేశంలో ఒకభాగం రోమ్లోని పోపు అధీనంలోనికి వెళ్ళినది. క్సేవియర్ గోవా ఇంక్విజిషన్ పెట్టడానికి పోపు అనుజ్ఞ కోరాడు. ఆయన ఆజ్ఞతోనే అది అమలులోనికి వచ్చింది. (ఈ కాలంలో ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి, సెక్యులర్ అని చెప్పుకునే, ఈదేశంలో తన మతస్థులకు, ప్రజలందరి ఖర్చుతో, బెతెల్హామ్ యాత్రకు ధనం ఈయడం మొదలుపెట్టాడు.)
సా.శ.1500 నాటికే వాయువ్యరాష్ట్రాలు,సింధు,వంగ దేశాలు పూర్తిగాను, నేటి ఉత్తర ప్రదేశ, బీహారు, మధ్యప్రదేశ రాష్ట్రాలు కొంతవరకు ఇస్లాం మతప్రభావానికి లోనయ్యాయి. అప్పుడు సామాన్య ప్రజలకు కావలసినవి జ్ఞానము ముక్తి కావు. నిర్గుణ పరబ్రహ్మము కాదు. ఆర్తితో భగవంతుని ప్రార్థించి, కష్టాల నుండి రక్షణ, కష్టాలను ఎదుర్కోగల ధీరత్వం, పొందగలగడం, శివ, విష్ణు, శక్తులను కాకుండా అవతార పురుషులైన శ్రీరామ, శ్రీకృష్ణులను ప్రార్థించడం, తద్వారా సాంత్వన పొందడం. శ్రీరాముడు కష్టాలలో మర్యాదా పురుషోత్తమునిగా ఎలా బ్రతకాలో చూపిస్తే, శ్రీ కృష్ణుడు ఎల జీవించడమో, ఎలా పరిస్థితులను ఎదుర్కొని, భగవంతుని కరుణతో యోగక్షేమాన్ని పొందడమో చూపించాడు. ఈ కలియుగములో భక్తి మార్గమే ముక్తిమార్గమనీ, దీని వలన సమాజంలో అందరికీ భగవదనుగ్రహం కలుగుతుందనీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేశాడు. "అనన్యాశ్చింతయంతోమాం", "సర్వధర్మాన్ పరిత్యజ్య" శ్లోకాలు ఇదేచెబుతాయి.
కలియుగంలో ఏది అవసరమో ద్వాపరయుగాంతంలోనే నిర్ణయింపబడినది. వ్యాసుడు "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా" అని తన వేదాంత గ్రంధమైన బ్రహ్మసూత్రాలు మొదలుపెట్టాడు. ఇది మోక్షమార్గానికి తొలిమెట్టు. సమాజములో వేలజనంలో ఒకరికి ఇది అవసరం. ఇది హిందూ సమాజానికి సంబంధించినదికాదు. ముముక్షువులైన వ్యక్తులకు సంబంధించినది. శ్రీకృష్ణ నిర్యాణాంతరం వ్యాసుడే మహాభారతాన్ని క్లుప్తంగా జయమనేపేరుతో వ్రాశాడు. ఇది పూర్తిగా ప్రాపంచిక విషయం. ధర్మం, అధర్మం, ఈర్ష్య, కామం, క్రోధం, అర్థం,మాత్సర్యం, పగ, మోసం, స్నేహం,శాంతి, యుద్ధం, వ్యసనం - మానవ సమాజపు సామాన్యలక్షణాలన్నీ కల బృహత్కథ. దాని మధ్యలో స్వధర్మానుష్ఠానమైనకర్మచేయమని బోధిస్తూ అర్జునునికి కృష్ణుడు చెప్పిన భగవద్గీతనీ, భక్తిమార్గాన్ని ప్రతిపాదిస్తూ చేసిన భీష్మబోధ విష్ణుసహస్రనామ స్తోత్రాన్నీ పొందు పరిచాడు. వేదాలవలె నిషేధాలులేకుండా సర్వ జనులకూ ఉపయోగించే ధర్మ శాస్త్రమైన గ్రంధాన్ని రచించాడు.దీనిని చదివేవాళ్ళు నూటికి ఒకరు ఉండవచ్చు. ఆయనకు తృప్తి రాలేదు. ఆఖరుగా భాగవతము - కలియుగములో హరి నామము, హరిభక్తుల సాంగత్యము చాలుననిచెప్పే భాగవతాన్ని రచించాడు. భక్తి మార్గం ప్రతిపాదింపబడిన 16వ శతాబ్దపు పూర్వభాగనికే బమ్మెర పోతన తెలుగు భాగవతంకూడా వెలుగుచూచింది. ఈవిధముగా సనాతనధర్మమునకు గ్లాని కలిగే సమయంలోనే దేశమంతా భక్తి మార్గము అనేక గురువులచేత, కవి పండితుల చేత ప్రచారంచేయబడింది. 500 సంవత్సరాలుగా హిందూ మతాన్ని రక్షించినది ఈ దైవ భక్తియే.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...