Sunday, January 21, 2018

మన మతము - మన సంస్కృతి

https://www.facebook.com/vallury.sarma/posts/519383634765721



ఇక్కడ మన అంటే మనలో అధిక సంఖ్యాకులు ఇప్పటికీ అవలంబించే సనాతన భారతీయ సంస్కృతి, వారి మతంగా చెప్పబడే హిందూమతం. జమ్మూ-కాశ్మీర్, కేరళ, చాలా ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్ఘర్, ఒడీశాలలోని అటవీప్రాంతాలలో అన్య మతాల ప్రాబల్యం ఉన్నది. కాని అన్యమతస్థులలో కూడా భారతీయ సంస్కృతి అంతర్గతంగా కనుపిస్తుంది. మన మతానికి ఒక స్థాపకుడు, ఒక గ్రంధము, ఒక వ్యవస్థాలేవు. అంటే అనేక స్థాపకులు, అనేక గ్రంధాలూ, అనేక వ్యవస్థలు, ఉన్నాయి. స్థాపకులపై మొదట దృష్టి పెడదాం. మన మతం గురించి అబ్బురపడే విదేశీయులకు కనుపించే మొదటి విషయం అనేక దేవతలు, అనేక విగ్రహాలు, వారికి అర్థంకాని మన దేవాలయాలు. మనం గర్భగుడిలో దైవాన్ని దర్శిస్తే, ధ్యానిస్తే, వారు ప్రాకారాల మీద శిల్పాలకు, ముఖ్యంగ మైధున శిల్పాలకు ఆకర్షితులౌతారు. మనమే అర్థంచేసుకోము. తాపీధర్మారావు అనే పెద్దమనిషి "దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?" అని కొందరు పాశ్చాత్యుల భావాలని తన తెలుగు పుస్తకంలో ఆవిష్కరించారు. మన ప్రభుత్వం వారికి దేవాలయాలలో కనబడేది, భక్తులద్వారా సమకూడే ఆదాయం. అందుకే మనకు దేవాలయ శాఖలేదు, ఉన్నది దేవాదాయ, ధర్మాదాయ శాఖ. ఇది నేటి పరిస్థితి.
వాటి విషయాలు వదలి మన మత స్థాపకులను గురించి తెలుసుకుందాము. మన దేవతల కంటె ముఖ్యులు మన మహర్షులు. మహర్షుల వలననే మనకు దేవతల గురించి, తెలిసినది. వేదాన్ని తమ తపస్సులో విని శిష్య ప్రశిష్యుల ద్వారా నేటికి అందుబాటులో ఉంచినవారు మహర్షులు. మనకు నిజమైన మార్గ దర్శకులు. లోక కల్యాణమే వారి ఆదర్శం. వారు ఎప్పటి వారు? ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? వారి జీవితాలగురించి మనకు తెలియచేసేవి మన పురాణాలు, ఇతిహాసాలు. ప్రతి మంత్రానికీ,స్తోత్రానికి ఋషి పేరు తలచుకోవడం సంప్రదాయం. ఋషుల వలన స్థాపింపబడుటచేతనే మన మతానికి ఆర్షమతమని పేరు వచ్చింది. మొదటి తరం మహర్షులు బ్రహ్మ మానస పుత్రులు. దధీచి, అత్రి మొదలైన వారు వేదకాలపు మహర్షులు. తరువాత వారు వశిష్ఠ గౌతమాదులు. ఆతరువాతవారు విశ్వామిత్రాదులు. అగస్త్యాదులు ఇంకా తరువాతి కాలం వారు. వేద వ్యాసుడు భూమిమీదే జన్మించాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. వీరు బ్రహ్మ చే సృష్టించ బడినవారా లేక భూమిపై పుట్టినవారా?
అమెరికాలో ఒక చర్చ జరుగుతుంది. బైబిల్ లో చెప్పిన సృష్టి కథ పాఠ శాలలో చెప్పాలా? లేక డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పాలా?(Creation or evolution?) మనకు చర్చ లేదు. క్రైస్తవ పాఠశాలల్లో బైబిలు కథ చెబుతారు. మతరహిత పాఠ శాలల్లో డార్విన్ సిద్ధాంతంచెబుతారు. మన గ్రంధాలలోనికి వెడితే ఆరంభవాదమూ, పరిణామవాదము కూడా ఉంటాయి. ఒక ప్రశ్న అవసరం. నేటి సిద్ధాంతం ప్రకారం మనుష్యుడు మొదటిలో గుహలలో నివసించి వేటతో జీవించారని ఊహ. (Hunter Gatherer) అప్పటికి వారికి వ్యవసాయంతెలియదు. ఆర్యులు ఇలాంటి సంచార జాతి అని విదేశీచరిత్రకారుల అభిప్రాయం. అందుచేత వేదముల కాలం చాలా ముందుకు సుమారు సా.శ.పూ. 1800. జరుపుతారు. అందుచేత వారి లెక్కలకి, మన లెక్కకీ సంబంధంలేదు. భూమిపై నేడు గల అత్యధిక సంఖ్యాకులు పరిణామ వాదం ప్రకారమే జన్మించినా, ఒకానొకప్పుడు కొందరు మహర్షులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చారని నమ్మ వలసి వస్తుంది. వారే ఇక్కడ జ్ఞాన జ్యోతివెలిగించినవారు. మన సృష్టి సిద్దాంతంలో ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, వానిలో జీవులు అవసరమౌతాయి. మహా భారతంలో అటువంటి వారు దర్శనమిస్తారు. కేవలం human drama of epic dimesions అని నిశ్చయిస్తే గ్రంధానికి అర్థమేలేదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...