Sunday, January 21, 2018

తురుష్కులైన ఢిల్లీ సుల్తానుల, తరువాత విదేశీయులైన మంగోల్ (ముఘల్) పాదుషాల దండయాత్రలను

https://www.facebook.com/vallury.sarma/posts/511396282231123

తురుష్కులైన ఢిల్లీ సుల్తానుల, తరువాత విదేశీయులైన మంగోల్ (ముఘల్) పాదుషాల దండయాత్రలను తట్టుకొని దక్షిణభారతంలో సనాతన ధర్మం నిలబడటానికి ముఖ్యకారణం, దక్షిణదేశంలో బౌద్ధజైనాల స్థానంలో సనాతన
ధర్మాన్ని నిలబెట్టిన ఆచార్యపరంపర - శంకరాచార్యుడు, బసవేశ్వరుడు, శైవ, వైష్ణవా చార్యులు, పీఠాలు, మఠాలు, ఆలయాలు, మహాభారతం వంటి సాహిత్య పునరుద్ధరణ. చాళుక్యుల తరువాత, కాకతీయులు, నెల్లూరు చోళులు, తరువాత విజయనగర సామ్రాజ్యం, ఔరంగజేబు కాలానికి శివాజీ నాయకత్వంలోని మహారాష్ట్ర సామ్రాజ్యం వీరందరూ వారి వారి పరిమితులలో సనాతనధర్మాన్ని నిలబెట్టారు. శృంగేరి శారదా పీఠము, విద్యారణ్య స్వామి ప్రయత్నము విజయనగర సామ్రాజ్య స్థాపన వెనుక నున్న భగవదనుగ్రహము. మతం, దైవము పట్ల ప్రభుత్వమునకు ఉన్న విశ్వాసమే దేశానికి రక్షణ. స్వతంత్ర భారతదేశములో పాలకులు, రాజ్యాంగ కర్తలు మరచిన సత్యము కూడా ఇదే.
నెల్లూరి చోడులు - కాకతీయులు - తెలుగు మహా భారత రచనలో ద్వితీయఘట్టం
వెలనాటిచోడులతరువాత ఆంధ్రదేశమంతా కాకతీయుల పాలనలోనికి వచ్చినది. పాకనాటి చోడులు కాకతీయుల సామంతులు. 1223 – 48 - చోడ తిక్కన్న పాలన, నెల్లూరు చోడులలో సుప్రసిద్ధుడు. వారి అధికారం కావేరి వరకు విస్తరించింది. మహాకవి తిక్కన తండ్రి, తాతలు చోడతిక్కన్నను సేవించారు. 1248 - 63: చోడ తిక్కన కుమారుడు మనుమసిద్ధి పాలన. తిక్కన జీవిత కాలం 1205 – 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు. మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్ది కి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించినాడు. మనుమసిద్ధి గణపతిదేవుని సహాయం అర్ధించి, కాకతీయుల సామంతుడు గా రాజ్యం చేశాడు. ఈదౌత్య కార్యం నిర్వహించినది మంత్రియైన మహాకవి తిక్కన్న. భారతంలో శ్రీకృష్ణ భగవానుని రాజనీతిని ఆకళింపుచేసుకున్న వాడు. సేనాని ఖడ్గతిక్కన తిక్కన పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు. మహాదేవ, శ్రీకృష్ణులకృపతో క్షాత్రం, బ్రాహ్మం, తిరిగి రాజనీతిలో ప్రవేశించాయి. విరాటోద్యోగపర్వాలతో కవి తిక్కన భారతారంభం. ఓరుగల్లు వీర శైవం, కవి అద్వైతం కలసి రచనను హరిహరనాథమూర్తికి అంకితంచేశాయి.
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్
పై పద్యంతో తిక్కన భారత రచనకు శ్రీకారంచేశాడు. హరి హర నాథునిలో హరిఎవరు? మహాభారతయుద్ధంలో పార్థుని సారథియై గీతోపదేశంచేసిన శ్రీకృష్ణుడే. ఈ విషయం ఆయనే చెబుతాడు.
కిమస్థిమాలాం కిముకౌస్తుభంవా
పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం
కింకాలకూటః కిమువా యశోదా
స్తన్యం తవ స్వాదు వద ప్రభోమేః




నేను ప్రతి దినమూ మీముందు ఉంచుతున్న చారిత్రక విషయాలలో అంతర్గతంగా ఒక భావధార, ఒక దృష్టికోణం ఉన్నది. అది నేను ప్రత్యేకం చెప్పలేదు. కాని అందరికీ అర్థమయే ఉంటుంది. ప్రపంచంలో ఒకవైపు సనాతన ధర్మం ఉంటే, దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నవి అబ్రహామిక్ మతాలు. ఒక ప్రవక్త, ఒక పుస్తకం అన్నికాలాలకు, అన్ని దేశాలకూ, సరిపడే శాశ్వత సత్యాన్ని ప్రతిపాదించ గలవు అనే వాక్యాలు నాకు హేతు బద్ధంగా కనబడవు. ఇప్పుడు శ్రీ రాముని కంటె, శ్రీకృష్ణుడు మనకు ఎక్కువ అవసరం అంటే శ్రీ కృష్ణుని భావాలు, బోధలు మన ప్రస్తుత పరిస్థితికి అనువైనవి అన్నమాట.ఇక్కడ ఎవరు గొప్ప అన్నది లేదు. ఒకనాడు ఒకరు స్థాపించిన మతం, దాని అవసరం తీరాక వదలివేయ వలసినదే.మతం అంటే ఒక అభిమతం, ఒక ఆలోచనా ధార. మత వ్యవస్థలు వేరు. కట్టడాలు, స్థిరాస్థులు, ప్రార్థన మందిరాలు, దేవాలయాలు ఇవి వ్యవస్థలో భాగాలు. వీటికోసం యుద్ధాలవరకు వెళ్ళడం కూడా చారిత్రక సత్యమే. చార్వాక (లోకాయత), బౌద్ధ, జైన, సిఖ్ఖు మతాలను నేను సనాతన ధర్మంలోని దృష్టికోణాలుగానే చూస్తాను. ఆమతస్థులు దానిని ఒప్పుకోక పోవచ్చును. అందుచేత దక్షిణ భారతదేశంలో బౌద్ధజైనాల నిర్మూలన చారిత్రకంగా మనదేశానికి అవసరమైన మార్పు.ఇది జరగక పోతే మనము మహమ్మదీయ ప్రపంచంలో భాగంగా ఉండేవాళ్ళము. వ్యక్తులకు ఒక మోక్షమార్గంగా బౌద్ధము సరియైనదే,కాని దేశం క్షేమం దృష్ట్యా అది నిరుపయోగము. My main theme in these writings is to say that the history of India is the history of Sanatana Dharma, the challenges it faced and is facing. ఒక నాటికి ఇండియా క్రైస్తవ దేశంగామారితే,అదికూడా నేను మన సామూహికకర్మ ఫలమే అని భావిస్తాను. అది కొంత కాలం తిరోగమనం.కాని అదీశాశ్వతం కాలేదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...