https://www.facebook.com/vallury.sarma/posts/515682851802466
దక్షిణ కైలాసం - ట్రింకోమలీ - తిరుకోణమలై - కోనేశ్వర దేవాలయం
దక్షిణకాశీ గా పురాణాలలో చెప్పబడే ఊరు దక్షారామం (ద్రాక్షారామం)(తూ.గో.జి.) తమిళదేశంలో తిరునల్వేలి జిల్లాలో కుర్తాళం జలపాతం సమీపములో ఇంకొక దక్షిణకాశీ ఉంది. (తెన్కాశీ, టెంకాశీ). దక్షిణ కైలాసంగా పూర్వకాలంనుండి పిలువబడిన ఊరుతో, మనకు పరిచయంలేదు. శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో మనం తరచు విన్న ఊరు, శ్రీలంక తూర్పు తీరంలో ఉన్న ట్రింకోమలీ - తిరుకోణమలై. కోనేశ్వర స్వామిపేరుగల శివుడు వెలసిన ప్రాచీన శైవ క్షేత్రం. శ్రీ లంకలో తమిళ, హిందూ సంస్కృతికి కేంద్రం. టిబెట్లోని కైలాస పర్వతమున్న రేఖాంశంపైననే ఈఊరు ఉండటంవలన దక్షిణ కైలాసం పేరు వచ్చిఉండవచ్చును. ఇక్కడ స్థలపురాణాన్ని దక్షిణకైలాస పురాణం అంటారు. స్కందపురాణంలోను, వాయుపురాణంలోను, మహాభారతంలోనూ ఈ క్షేత్ర ప్రసక్తి ఉందని చెబుతారు. ఇక్కడ దొరకిన ప్రాచీన శాసనాలన్నీ తమిళభాషలోనే ఉన్నాయి. లంకాధిపతి ఐన రావణుని శివభక్తి మనకు బాగా తెలిసినదే. రామాయణ కాలంనుండి అది శివుని భూమి. అశోకుడు పంపిన బౌద్ధభిక్షువులతో బౌద్ధంకూడా వ్యాప్తిలోనికి వచ్చినది. బౌద్ధ, శైవాలకు నిలయంగా నిలచిన ఈ దేశంలో మత అసహనానికి బీజాలు వేసినది ఐరోపావాసులు. మళ్ళీ ఇక్కడ హిందూమతమును ఎదుర్కొన్నది క్రైస్తవులైన పోర్చుగీసువారు. తమిళ రాజ్యాలైన పల్లవ, చోళ, పాండ్య రాజులు ఆగ్నేయ ఆశియా రాజ్యాలైన బర్మా, సయాం, ఇండొనీషియా దేశాలతో నౌకా వ్యాపారం, సంస్కృతీ వినిమయం జరుపుతున్న కాలంలో ఇది పెద్ద ఓడరేవు. ఈ ప్రాంతం తమిళ రాజుల అధీనంలోనే ఉండేది. శ్రీ లంక ఉత్తర ప్రాంతవాసులు దక్షిణభారతంనుండి వచ్చిన తమిళులైతే, దక్షిణ ప్రాంతంవారు ఉత్తరభారతదేశంనుండి కళింగరేవుల ద్వారా వచ్చినవారు. ఇక్కడ ఉన్న నది పేరు మహావలి గంగా. ఇక్కడ హార్బరు ప్రాంతాన్ని గోకర్ణమని (Gokarna Bay) పిలిచేవారు. శ్రీ లంకలో దేశంచుట్టూ ఐదు శివాలయాలున్నాయి. ఉత్తరాన నాగులేశ్వరం, వాయువ్యాన కేతీశ్వరం, తూర్పున కోనేశ్వరం, పడమట మునేశ్వరం, దక్షిణాన తొండేశ్వరం. ఇవన్నీ సముద్రతీరములోనే ఉండటంతో 16 శతాబ్దం ప్రారంభములో పోర్చుగీసువారు వీనిని ధ్వంసముచేసి కోటలు కట్టారు. ఇంగ్లీషువారి పాలనలో వీనిని పునర్నిర్మించారు. పోర్చుగీసువారి తరువాత లంకకు వచ్చిన విదేశీయులు డచ్వారు. వారు 21 శాతం ప్రజలను క్రైస్తవులుగా మార్చారు.ఇంగ్లీషువారి పాలనలో ఆంగ్లికన్ మిషనరీలు వచ్చారు. కాని స్వాతంత్ర్యం వచ్చాక క్రైస్తవులలో సగంమంది తిరిగి వెనుకకు బౌద్ధమతంలోకి వచ్చారు. ఇది భారతీయులు పరిశీలించవలసిన విషయం.
No comments:
Post a Comment