Friday, January 19, 2018

కాలస్వరూపము - చరిత్ర

https://www.facebook.com/vallury.sarma/posts/501604209876997

https://www.facebook.com/vallury.sarma/posts/501927656511319

https://www.facebook.com/vallury.sarma/posts/502681373102614

https://www.facebook.com/vallury.sarma/posts/502958356408249

https://www.facebook.com/vallury.sarma/posts/503337006370384

నిన్న చెప్పిన ఈ వాక్యాలు మళ్ళీ చూదాం - అశోక చక్రవర్తి కళింగయుద్ధములో లక్ష సైనికుల మృతదేహాలను చూచి విషాదం చెంది బౌద్ధమతం స్వీకరించాడని అంటారు. ఇది అర్జున విషాదయోగానికి విపర్యయం. అర్జునుడు బంధుమిత్రుల మరణాన్ని ఊహించుకొని శోకిస్తే, కృష్ణుడు ధైర్యం చెప్పి గీత బోధించి యుద్ధోన్ముఖుణ్ణిచేశాడు. అశోకుడు దేశమంతా బుద్ధుని బోధలను రాళ్ళపై చెక్కించి ప్రచారం చేశాడు. తన పుత్రుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రను బౌద్ధసంఘములో భిక్షువులుగా చేసి సింహళానికి (నేటి శ్రీలంకకు) పంపించాడు.
శ్రీ కృష్ణుడు చేసినది ధర్మ సంస్థాపన. భారత యుద్ధం తరువాత పరీక్షిత్తు రాజయ్యాడు. తరువాత అతడి కుమారుడు జనమేజయుడు, తరువాత 28 తరాలు (3100 బి.సి.ఇ. నుండి 1800 బి.సి.ఇ. వరకు) ఆ వంశం హస్తినాపురానికి, కురు సామ్రాజ్యానికీ మంచి పాలన అందించారు. బుద్ధుడు చేసినది మోక్షజ్ఞాన బోధ, కాని అది కలియుగంలోని ధర్మచ్యుతి. భారతీయచరిత్రకు చాలా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. బుద్ధుడు సుక్షత్రియుడు. అతడు, కుమారుడు రాహులుడు భిక్షుకులవడంతో వారికి నిర్వాణం వచ్చి ఉండవచ్చు. కాని శాక్యరాజ్యం ఏమైనది? అరాజకమయినది. అశోకుడు కళింగ యుద్ధము తరువాత బౌద్ధుడయ్యాడు. తన కుమారుని కూడా భిక్షువును చేశాడు. అశోకుని సామ్రాజ్యం గాంధారం నుండి కర్ణాటక వరకు భారతదేశమంతా వ్యాపించింది. అతడి తరువాత మగధ సామ్రాజ్యం అంతరించినది. భారత మంతా అరాచకం ప్రబలినది. బౌద్ధ జైన ధర్మాలు గృహస్థులకు, సన్యాసులకు పనికి వస్తాయి. వారికి పరమ ధర్మాలు. రాజ్యమేలే రాజులకు కాదు. చాణక్యుడు చెప్పినట్లు రాజుకి కావలసిన విద్య - త్రయీ, అన్వీక్షకి, వార్తా, దండనీతి. అహింస కాదు. తన తండ్రుల, తాతల ధర్మాన్ని వదిలిపెట్టడం అశోకుని అజ్ఞానం. అతడికి గీతా బోధ చేసే వారు లేక పోయారు. అశోకుడు రాజ్యము, ప్రజల క్షేమాన్ని వదలి పెట్టి తన మోక్షాన్ని చూసుకున్నాడు మంచిదే. కాని అది మహరాజుగా ఉండి చేయవలసినది కాదు. తన తరువాత రాజ్యపాలనకు ఏర్పాట్లుచేసి తాను సన్న్యాసం స్వీకరించాలి. బౌద్ధంలో వర్ణమూ లేదు, ఆశ్రమమూ లేదు. ఈ విధముగా బౌద్ధము వ్యవస్థను భంగంచేసింది. బౌద్ధం భారతదేశంలో క్షాత్రానికి, దేశ రక్షణకు, విదేశీ దండయాత్రలను ఎదుర్కొనే శక్తికి సముచిత స్థానం లేకుండా చేసింది. ఆధునిక భారతంలో జైన, బౌద్ధాలను కొంతవరకు తెలివితక్కువగా అరాధించిన వారు గాంధీ, నెహ్రూ. నెహ్రూ పంచశీల మన దేశానికి తీరని నష్టం చేకూర్చింది. చైనాతో పంచశీల ఒడంబడిక చేసుకున్న నెహ్రూ 1962 చైనా దండయాత్రలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. (Himalayan blunder of Nehru).

కలియుగంలో వేద ధర్మం క్షీణించింది. వేదాన్ని ప్రమాణం గా స్వీకరించని జైన బౌద్ధాలు మానవుని పరిణామానికి, వ్యక్తిగత వికాసానికి,తోడ్పడినా, నిర్వాణానికి మార్గముచూపించినా, చాలా హేతుబద్ధంగా కనబడినా, సమాజాని ధర్మ బద్ధంగా నడిపే కార్యంలో సనాతన ధర్మానికి సాటి రాలేకపోయాయి. దీనికి అనేక కారణాలున్నాయి.
1. భగవంతుని నిరాకరించడము వానిలోని లోపము. ఈశ్వర ప్రసక్తిలేని మతము, దేశము నిలువవు. ముఖ్యముగా మన దేశములో ఈశ్వరునియందు భక్తి ప్రతి భారతీయునకు జన్మతః వచ్చిన సంస్కారము. In God We Trust" అన్నా "సత్యమేవ జయతే" అన్నా ఒకటే. 2. బౌద్ధ సంఘం పై విశ్వాసము వలన మొదట్లో మతవ్యాప్తి జరిగినా వేయి సంవత్సరాలలో అదే మత నిర్మూలనకు కూడా దోహదం చేసినది. మహమ్మదీయ పాలనలో బౌద్ధసంస్థాగత కార్యక్రమాలన్నీ నాశనమైయ్యాయి. మనకు దేవాలయాలు అనేకం విధ్వంసం అయినా కుటుంబాలలో వ్యక్తులలో మిగిలిన శాస్త్రజ్ఞానము మతాన్ని కాపాడింది. 3. ఇతిహాస, పురాణాలు, దేవీదేవతలు వారి మతాలలో కూడా జాతక కథలు,దేవతలు, పురాణాలు ప్రవేశ పెట్టవలసి వచ్చినది. 4. న్యాయ శాస్త్రాన్ని బౌద్ధజైనులకంటె గొప్పగా సా.శ. 8 వ శతాబ్దమునుండి సనాతన ధర్మవాదులు అభివృద్ది చేశారు. శంకర, రామానుజ ,మధ్వా చార్యులంతా వాదనలో గొప్ప ప్రతిభ చూపించారు. శ్రీ హర్షుడు, మధుసూదన సరస్వతి, గంగేశోపాధ్యాయుడు, రఘునాథ తర్క శిరోమణి వంటి వారు జైన బౌద్ధాల వాదాన్ని తార్కికముగా ఖండించడంలో సఫల మయ్యారు. 5.తులసీ దాసు రామాయణం, మీరా, సూరదాసు వంటి వారి భజనలు, చైతన్యుని కృష్ణ భక్తి మార్గం,జ్ఞానేశ్వరుడు, తుకారాం, సక్కుబాయి వంటి మహారాష్ట్ర భక్తులు, వల్లభ సంప్రదాయం, అన్నమయ్య, పురందర దాసు, త్యాగయ్య వంటి వారల చరిత్రలు దేశమంతా భక్తి మార్గాన్ని ప్రచారంచేయడంతో సమాజమంతా ప్రభావితమైనది. 6. బౌద్ధ, జైనాలు చెప్పిన సాధన సామాన్యుల శక్తికి అందరానిదానిగా కనుపించింది.
సనాతన ధర్మం లో ధర్మమనే పదాన్ని నిర్వచింపడం అర్థంచేసుకోవడం కష్టం. సద్గురు శివానందమూర్తి గారి నిర్వచనాలు నాకు నచ్చినవి. Dharma is appropriateness in thought, action, attitude and judgment to a thing or a happening or a desire or an incident in life ఇలా చూస్తే అశోకుని బౌద్ధస్వీకరణ ఆపరిస్థితిలో ధర్మచ్యుతియే.

కాలస్వరూపము - చరిత్ర
కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహప్రవృత్తం (భ.గీ. 11.311.32) భగవాన్ ఉవాచ - నేను లోకములను క్షయముచేయుటకు విజృంభించిన కాలమును. సంహారక్రియయే ఇప్పటి నాప్రవృత్తి. భగవంతుడే కాలము. అతడే కాలుడు (యముడు, కాళీదేవి). కాలము చక్రము వంటిది. ఒకటి కాదు మూడు కాలచక్రములున్నాయి అని బౌద్ధులు చెబుతారు. దలైలామా వంటి మతగురువులు పరిణతిచెందిన శిష్యులకు కాలచక్ర దీక్ష ఇస్తారు. 2006 లో ఆయన ఈ దీక్ష గుంటూరు జిల్లా అమరావతిలో ఇచ్చారు. తెలుగు సాహిత్యములో కాలతత్త్వజ్ఞానము కలవారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన వేయిపడగలు కాల ప్రభావాన్ని సూచించే అద్భుతనవల.
వేయి పడగల పాము విప్పారుకొనివచ్చి
కాటందుకున్నది కల లోన రాజును.
అనే గణాచారి పాటతో నవలా ప్రారంభం. ఇక్కడ పాము కాల సర్పం. వేయిపడగలు, భాగవత తత్త్వానికి ప్రతిబింబం. పరీక్షిత్తు పాముకాటుతో మరణిస్తే కలి విజృంభిస్తుంది. వృద్ధ జమిందారు మరణంతో సుబ్బన్నపేటలో కలియుగం ప్రారంభమౌతుంది.కాలగమనంలో సమాజంలో వచ్చే మార్పులను ఈ నవల అద్భుతంగా చిత్రిస్తుంది.విశ్వనాథ వారే ఝాన్సీరాణి అని ఒక పద్య ప్రబంధాన్ని వ్రాశారు. ఇది చారిత్రకం. 1857 నాటి కథ. ఆంగ్లేయులు సిపాయిల తిరుగుబాటుగా వర్ణించినదానిని మార్క్స్ ప్రథమ భారతీయ సంగ్రామం అన్నాడు. ఈ వైరుద్ధ్యం భారత చరిత్ర విశేషం. విశ్వనాథ వారి పీఠికను చూద్దాం. ఈ కావ్యమున కథానాయకుడు లేడు. లక్ష్మీబాయి కూడా చివరకు యుద్ధమున ఓడిపోయి మరణించును. నాయకుడు కాదు కదా, ఆమె కథానాయిక కూడా కాదు. ఇది ఆమెనుగూర్చిన వట్టి చరిత్ర కథ. ఏదోచేయవలెను.
"ఇంత పరాక్రమవంతురాలు కదా! భారతీయులదృష్టిలో రాజ ధర్మమును పాటించెను కదా! ఆమె ఎందుకు ఓడిపోవలయును? ఆమె సమకాలికులైన ఇతర భారతీయ రాజులు ఆంగ్లేయులకు దాసానుదాసులైరి. సీ!సీ! కాలము యొక్క మహిమ!లేనిచో ఆమె కథానాయకుడైయుండెడిది. విజయమును పొందెడిది. కావ్యము వీరరస ప్రథాన కావ్యమయ్యెడిది. అందుచేత కావ్యమును అధ్యాయములుగా విభజించి ప్రతి అధ్యాయముయొక్క ఆద్యంతములలోనూ కాలమును, దాని స్వరూపమును, దాని యవ లక్షణములను, దాని యుగధర్మము ననుసరించినడిచెడు పద్ధతిని వివరించితిని. కొంత దోషము పోయెనుకదా!” ఆధునిక యుగము. దాని లక్షణములు చరిత్రపై దాని ప్రభావము, ఇక్కడ ముఖ్య విషయములు. భారతదేశపు ప్రస్తుత అధోగతిని వివరించిన కవి విశ్వనాథ. ఆయన "తల వెనుకకు తిప్పియున్న జంతువు" అన్నాడో వామపక్ష విమర్శకుడు. విశ్వనాథ రచనలు అర్థంకాలేదు పాపం. వేదాన్ని ప్రమాణము కాదన్న అన్నలకు డాస్ కాపిటల్, మెగస్థనీస్ ఇండికా ప్రమాణాలు. రంగనాయకమ్మ విషవృక్షం, లక్ష్మీ ప్రసాద్ ద్రౌపది ఆధునిక సాహిత్యం.


మనం భారత దేశ చరిత్రను సనాతన ధర్మ చరిత్రగా పరిశీలిస్తునాము. సనాతన ధర్మమంటే వేదవిహితమైన వైదిక మతము ఒకటే కాదని తెలుసుకున్నాము. అనాదిగా తర్క సహాయముతో మతాలను చర్చించడం మన ప్రాచీన విధానం. చార్వాకము, బౌద్ధము, జైనము, శైవము, వైష్ణవము, అనేక మార్గములు, దర్శనములు సనాతన ధర్మాన్ని ఒక కీకారణ్యముగా మార్చివేశాయి. ఉదాహరణకు ఒక వేద వాక్యం తీసుకుందాము. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి." ఆధునిక గురువులు దీనికి విపరీతమైన అర్థాలతో సంక్లిష్టం చేశారు. దీని అర్థము సరళమే. సద్వస్తువు ఒకటే, దానిని విప్రులు బహువిధములుగా చెబుతారు. విప్రులు అంటే ఎవరు? జ్ఞానులు. అనంతమును పరిమితమైన పదములతో ఎలా వర్ణిస్తారు? వారు ఊహించిన స్వల్ప విషయాన్ని చెబుతారు. దీన్ని ఆధునిక గురువులలో కొందరు అన్ని మతాలు, అందరు దేవుళ్ళు, అన్ని మార్గాలు ఒకటే అని చెబుతారు. వైవిధ్యం సృష్టి లక్షణమైతే, ఆ భేదాలు గమనించడం విజ్ఞానమైతే అన్నీ ఒకటే అనడం "అన్నమైతే నేమిరా? మరి సున్నమైతేనేమిరా?" అన్నట్లే ఉంటుంది.
సద్వస్తువును అర్థంచేసుకున్నా లేకపోయినా ఈ వాదనల వలన ఒక రకమైన ప్రజా ప్రభుత్వ చర్చా ధోరణి భారతదేశములో ప్రవేశించినది. రాజరికము, నియంతృత్వము, ప్రజాప్రభుత్వము, దొరతనము, వర్గపాలన అని అనేకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి సృష్టిలో. సనాతన ధర్మము లేదా హిందూ మతము సంపూర్ణ ప్రజా ప్రభుత్వము. కొందరు పీఠాధిపతులు, ప్రవచనాలు ఇచ్చేవారు, గురువులు ఉన్నా వారి ప్రభావం అతిస్వల్పం. పాలకులు లేని ప్రజా సముదాయమే హిందూమతము. రోమన్ కాథలిక్ మతమును రాజరికము అనవచ్చును. పోప్ మకుటమున్న మారాజు. అందుకే ఆయనను భారత ప్రభుత్వము కూడా రాజ, దౌత్య లాంఛనాలతో ఆహ్వానిస్తుంది. పాకిస్తాన్ ది ఒకరకమైన వర్గ పాలన - కాని అక్కడ కూడ సైన్యాధికారులు, వర్తకులు, సున్నీ మతాధిపతులు పాలక వర్గ పాలనయే. షియాలు వెనుకబడినవారు, అహ్మదీలు, హిందూ, క్రైస్తవులు అస్పృశ్యులు లేదా బలిపశువులు. అమెరికా, ఇండియా ఇతర ప్రజా ప్రభుత్వాలలో కూడా వర్గ పాలన లేకపోలేదు.అందుకే ఆక్స్ ఫర్డ్ చరిత్ర ఆచార్యుడు ఇప్పటికీ ప్రభుత్వాల శక్తి నాలుగు వర్గాల సంఘర్షణ మీద ఆధారపడి ఉంటుదన్నారు. ఇప్పుడు వర్తకులు, సైన్యాధిపతులు, రాజకీయవాదులు/మేధావులు ఆవరుసలో అధికారం పంచుకుంటే పాలితులెప్పుడూ రైతులు, కార్మికులు, కూలీలు. ఇది ఒకరకంగా వర్ణ విభజన శాశ్వతత్త్వమే.


మనము భారతీయ చరిత్రలో సుమారు సా.శ. 1000 కి వద్దాము. ఆసమయంలో మనదేశ చరిత్రను ఇద్దరు వ్యక్తులు ప్రభావితము చేశారు. మొదటివారు ఆది శంకరాచార్య భగవత్పాదులు. ఆయన కాలమును గురించి విభేదాలున్నాయి. శృంగేరి శారదాపీఠము వారి ప్రకారము ఆయన కాలము సా.శ. 788-820. (కంచి కామకోటి వారి ప్రకారము ఆయన కాలము సా.శ.పూ 509-477.) (ఆది శంకరులు, అభినవ శంకరులు అని ఇద్దరున్నారా? అనే వాదముకూడా ఉన్నది.) తన అద్వైత వేదాంతముతో ఆయన అప్పటికే క్షీణదశలో ప్రవేశించిన బౌద్ధ జైనాలను తన పాండిత్య ప్రతిభతో, తర్కముతో ఎదుర్కొన్నారు. అంతకుముందే దేశమంతా వ్యాపించినది ఎక్కువగా శైవము. కాశ్మీరునుండి కన్యాకుమారివరకు శైవ ప్రభావము ఉన్నది. బసవేశ్వరుని వీరశైవము ఆమతానుయాయులైన లింగాయతుల ప్రభావము నేటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నది. వంగ, కామరూప (బెంగాల్, అసోం, బంగ్లా) వంటి ప్రాంతాలలో శాక్తేయం బహుళ ప్రచారంలోనికి వచ్చినది. మధ్యయుగంనాటికి మనదేశ చరిత్రపై సనాతన ధర్మంలోని పరిణామాలకంటె విదేశీదండయాత్రలప్రభావం ఎక్కువ అవి దేశ చరిత్రగతినే మార్చివేశాయి. మన చరిత్ర గతి మార్చిన రెండవ వ్యక్తి సుల్తాన్ మహమద్ ఘజనవీ (ఘజనీ మహమ్మదు) (సా.శ. 971-1030). ఒక విధంగా ఆయన పై ప్రభావము చూపింది ఇస్లాం మతము. దాని వ్యవస్థాపకులు ముహమ్మద్ ప్రవక్త (సా.శ. 570-632). ఆ కాలములో ప్రపంచమును అత్యధికంగా ప్రభావితము చేసిన వ్యక్తి. ఆనాటి ధార్మిక, రాజకీయ, సైనిక బలాలలో ఆయనకు ఎదురులేదు. భగవంతుని చేత ఆదాము, నోవా, అబ్రహాం, మూసా, ఈసా (యేసు)ల తరువాత పంపబడిన ఆఖరి ప్రవక్త అని ఆమతస్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశ చరిత్రలో కూడా శంకరాద్వైతము, ఇస్లాం మతము, క్రైస్తవమతము ప్రముఖ పాత్ర వహించాయి. నేటికీ వహిస్తున్నాయి. ప్రపంచజనాభాలో క్రైస్తవులు సుమారు 33 శాతం అయితే, ముస్లిములు 22 శాతం, హిందువులు 10 శాతం, బౌద్ధులు 5 శాతం, చైనీయ ప్రాచీన మతాలు 5 శాతం అనుకోవచ్చు.ఇంకా అనేక మతాలున్నాయి. ఆధునిక భారతీయ సమాజాన్ని మతదృష్టితో పరిశీలించడానికి గుర్తుంచుకోవలసిన విషయం 1947లో విభజన తరువాత ఏర్పడిన దేశాలు - ముస్లిం పాకిస్తాన్ (1971 తరువాత ముస్లిం పాకిస్తాన్, ముస్లిం బంగ్లాదేశ్), హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్, నాస్తిక, మతదృష్టి రహిత ఇండియా, లేక భారత్. ఇండియా ఈ అందరిదీ. ఈవిశ్లేషణ దేశానికీ, ప్రజలకూ, సంస్థలకూ కూడా వర్తిస్తుంది.



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...