Friday, January 19, 2018

కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు.

https://www.facebook.com/vallury.sarma/posts/499821023388649

https://www.facebook.com/vallury.sarma/posts/500026073368144

https://www.facebook.com/vallury.sarma/posts/500138283356923

https://www.facebook.com/vallury.sarma/posts/500458073324944


కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. మనతప్పుల తడకల చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే - మనకు లభించే ఆధారాలు గ్రంధాలు. సాంప్రదాయ నిర్ణయం ప్రకారం కృష్ణుని సమకాలికుడైన వేదవ్యాసుడు వ్రాసినవే భారత, భాగవతాలు. కృష్ణుని తరువాత వచ్చినది బుద్ధావతారం. ఈ ఊహకు ఆధారం భాగవత శ్లోకం. (భాగవతం - 1.3.24)
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్ |
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి ||
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు. ఈ బుద్ధుడెవరు? 12వ శతాబ్దపు జయదేవుని అష్టపది ప్రకారం గౌతమ బుద్ధుడు గుర్తుకు వస్తాడు --
నిందతి యజ్ఞవిదే రహః శ్రుతిజాతం, సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవ ధృత బుద్ధ శరీరా, జయ జగదీశ హరే ||
కాని భాగవత శ్లోకం లో జినసుత అనే పేరు, ఆ బుద్ధుడు వేరు అని సూచిస్తుంది. జైనం తో సంబంధాన్ని సూచిస్తుంది. దానికి అర్థం వసుదేవుడు జినుడు. వాసుదేవుడు జిన సుతుడు. దీనికి గ్రంధాలలో ఆధారాలు లేకపోలేదు. వసుదేవుడి సోదరుడు. సముద్రవిజయుడు. ఆయన కుమారుడు అరిష్టనేమి. ఆయన 22 వ జైన తీర్థంకరుడుగా ప్రసిద్ధుడు. ఆయననే నేమీనాథుడని పిలుస్తారు. శ్రీకృష్ణుడు కూడా జైనుల 63 ప్రసిద్ధ పురుషులలో ఒకడు. (ఆ గ్రంధం పేరు త్రిషష్ఠి శలాక పురుషా). బలదేవుడు కూడా వారిలో ఒకడు. భాగవతము పంచమ స్కంధంలో వృషభదేవుని విష్ణువు అవతారంగా భావించిన కథ ఉంది. వృషభదేవుడు మొదటి తీర్థంకరుడు. ఆయనకు ఆదినాథుడన్న పేరు కూడాకూడా ఉంది. ఆయనది ఆపేరుతో శివతత్త్వం అని కొందరి భావన. మన సనాతన ధర్మ చరిత్రలో జైన, బౌద్ధాలను, చార్వాక (లోకాయత) మతంతో సహా సనాతన ధర్మంలొభాగాలుగా నాస్తిక దర్శనాలుగా చూడాలి.
బౌద్ధ జైనాలు వైదిక మతానికి విరుద్ధమైనవి, ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి? ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు వాటివైపు ఆకర్షితులయ్యారు? అహింసా పరమో ధర్మః అని బోధించిన జైన తీర్థంకరులు, బుద్ధుడు క్షత్రియులు. అశోకుని వంటి చక్రవర్తులుకూడా బౌద్ధంవైపు మళ్ళారు. క్షత్రియులు క్షాత్రాన్ని వదలి ఇటు ఎందుకు నడిచారు? బౌద్ధ జైన తత్త్వ వేత్తలలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులే. అందుకే సాహిత్యమంతా తిరిగి సంస్కృతం లోనే వచ్చింది.? దీనికి కారణం ఏమిటి? నేటి క్రైస్తవం సమాజంలో అట్టడుగు వర్గాలను మొదట ఆకర్షించింది. దీనికి దానికి భేదమేమిటి? ఇప్పటి చరిత్రను అర్థంచేసుకోడానికి ప్రాచీన చరిత్ర ఉపయోగిస్తుంది.


జైన, బౌద్ధాల గురించి తెలుసుకునే ముందు కొంచేం తర్కం నేర్చుకోవాలి. ఈ క్రింది వాక్యాలు సత్యమో అసత్యమో చెప్పండి.
1. సూర్యుడు తూర్పున ఉదయించును.
2. 1+1 = 2
3. 1+1 = 10
4. కాంతి కిరణములు ఋజు మార్గములో ప్రసరించును.
5. యేసు క్రీస్తు శిలువవేయబడెను.
6. జగమే మాయ.
7. విజ్ఞాన శాస్త్రము చెప్పు ఏవిషయము నిత్య సత్యము కాదు.
8. యేసు క్రీస్తు డిసెంబరు 25 న పుట్టెను.
9. రాముడు, కృష్ణుడు మధ్యకాలము సుమారు 1000 సంవత్సరములు.
10. ఉత్తరమున ధ్రువనక్షత్రము వలెనే దక్షిణమున కూడా ఒక నక్షత్రము ఉన్నది.




ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు జైన, బౌద్ధ మతాల వైపు ఆకర్షితులయ్యారు?
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మతాలను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. మతాలను అనుసరించే వాళ్ళ ప్రతిక్రియ వేరువేరుగా ఉంటుంది. అన్ని మతాలు ఒకటే అనేవారు కొందరు, మాదే సత్యమైన మతం, మా దేవుడు, మా మతం, మా పుస్తకం, ఇదే అంతిమ సత్యం అనేవారు కొందరు. మా మతం గురించి మీరు మాట్లాడితే, మీకు ex parte శిక్ష విధిస్తాం, అనేవారు కూడా లేక పోలేదు. మతాలన్నీ మానవాళికి మత్తుమందులు అంటూ పరమ సత్యం మా సామ్యవాదమే అనేవారు కొందరు. అందుచేత కేవలం భారతీయ తత్త్వ శాస్త్ర దృష్ట్యా ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషిద్దాం. వేదం మహర్షుల నుండి శ్రుతి గా మనకు లభించింది. వందలాది ఋషుల తపస్సు ఫలం అది. తరువాత కాలంలో అది అర్థం అవడానికి 6 వేదాంగాలు (వ్యాకరణం జ్యోతిషం మొదలైనవి) అవసరమయ్యాయి. వాటిలోని తత్త్వాన్ని అర్థం చేసుకోడానికి దర్శనాలు పుట్టాయి. ప్రపంచ, లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించడానికి ముఖ్యంగా తెలుసుకోవలసినవి. న్యాయ, వైశేషికాలు - గౌతముడు, కణాదుడు వీటి సూత్ర గ్రంధకర్తలు. English equivalents are logic (epistemology) and ontology. ప్రత్యక్షము,అనుమానము, శబ్దము, ఉపమానము అనే ప్రమాణాల ద్వారా సత్యాన్వేషణ చేయడం న్యాయ శాస్త్ర పరిధి లోనిది. ఇది వైదిక మతానికి శాస్త్రము. దీని ద్వారా యథార్థ జ్ఞానాన్ని గ్రహించి, మిథ్యా జ్ఞానాన్నిపరిహరించడం ఉద్దేశ్యం. కాని చార్వాకుడికి ఒకటే ప్రమాణం - ప్రత్యక్షం. దేవుడు లేడు. ఉంటే చూపెట్టు - ఇది వాని వాదం. సనాతన వాదులకు ఈశ్వరుడు అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా సాధ్యం. శబ్దం అంటే శ్రుతి, ఆప్తవాక్యం. బౌద్ధులకు, జైనులకు ప్రత్యక్ష, అనుమానాలు మాత్రమే ప్రమాణం. అందుచేత వాళ్ళకు వేదం ప్రమాణం కాదు. గౌతమ న్యాయం కంటే బౌద్ధుల న్యాయ శాస్త్రం ఎక్కువ అభివృద్ధి చెందినది. నాగార్జునుడు, దిఙ్నాగుడు, ధర్మకీర్తి గొప్ప నైయాయికులు. దూరంగా కొండమీద పొగవస్తూంది. అంటే కొండమీద నిప్పు ఉంది అని చెప్పడం అనుమానం. ఇది చెప్పడానికి ఆధారం. "యత్ర యత్ర ధూమః , తత్ర తత్ర వహ్ని"ఎక్కడ పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుంది" అనే న్యాయవాక్య అవయవం. ఈ నిప్పుకు, పొగకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వ్యాప్తి అంటారు. ధూమాన్ని హేతువు అంటారు. దీన్ని ఉపయోగించి విషయాన్ని తెలుసుకోవడమే హేతువాదం. మన హేతువాదులకు తెలియనిది. ఈ శాస్త్ర జ్ఞానం వలన, వాదంలో బౌద్ధులు జైనులు, వైదికులపై విజయం సాధించారు. వారి వాదనలు ఎక్కువ హేతుబద్ధం గా ఉండేవి. వైదికులు "స్వర్గ కామయ యజేత" "యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది " అనేమాటలతో అప్పటి ప్రజలను నమ్మించలేక పోయారు. ప్రజలకు దేవుడు, స్వర్గం, యజ్ఞం గురించి మాట్లాడే మాటలు అంధ విశ్వాసాలుగా తోచాయి. వ్యక్తీ, సమాజం (జగత్తు) ప్రత్యక్షాలు. దేవుడు అనుమాన ప్రమాణంతోనే సాధ్యమౌతాడు. వారి వాదం బౌ ద్దుల, జైనుల న్యాయం ముందు ఓడిపోయింది. ఉన్నత వర్గాల ప్రజలు వాటివైపు ఆకర్షితులయ్యారు.




గౌతమ గోత్రజుడు, శాక్యవంశ రాజకుమారుడైన సిద్ధార్థుడిచేత బోధింపబడినది బౌద్ధధర్మం. ఆయన ప్రపంచంలోని దుఃఖానికి, దాని పరిహారానికి కారణం అన్వేషించడానికి, రాజభవనాన్ని, భార్యా పుత్రులని, తండ్రిని వదలి తపస్సుకి వెళ్ళిపోతాడు. అనేక సంవత్సరాలు గడిచాక ఆయనకు జ్ఞానోదయం అయి, బుద్ధుడని పిలవబడ్డాడు. ఆయన మొదట చెప్పినవి నాలుగు సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని). అవి 1. సంసారం దుఃఖమయం. జన్మ,జరా,వ్యాధి, మృత్యువు అన్నీ దుఃఖాలే. 2. కోరికలు దీనికి కారణం. అవే జనమరణ చక్రానికి కూడా కారణం. 3. దుఃఖ నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), 4. దీనికి మార్గము (అష్టాంగ మార్గం). సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్కర్మ (మంచి పనులు), సమ్యగ్జీవనము (మంచి జీవితం), సమ్యగ్వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్సంకల్పము (మంచి సంకల్పము). ప్రధానంగా వీటిని గమనింప వచ్చును. 1. గౌతమ బుద్ధుడు గురువు, (బుద్ధం శరణం గచ్ఛామి) 2. మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - ఇది బౌద్ధ ధర్మం. (ధర్మం శరణం గచ్ఛామి) 3. సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును. (సంఘం శరణం గచ్ఛామి) నిర్వాణం పరమోత్కృష్ట గమ్యం . ఈనాటి హిందువులుగా మనం దీనిని పరిశిలిస్తే మనకు విరుద్ధ భావాలు ఏవీ కనుపించవు. ఇది నిజంగా ఉపనిషత్తుల మతమే. ఒకే ఒక భేదం ఈశ్వర ప్రసక్తి లేదు. కాని గురువుని అంగీకరించారు కదా. ఇంచుమించు కొంతవరకు నేటి షిర్డీ సాయిబాబా నూతన సంప్రదాయాన్ని పోలి ఉండవచ్చు. మనకు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర, ఇంగ్లీషు భాష ఉపయోగం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. మతం అనే పదాన్ని మనం religion అనే పదానికి గతిలేక అనువాదంగా వాడుతున్నాము. కాని religion, religious conversion మత మార్పిడి అనే మాటలు మనకు పూర్తిగా అర్థం కావు. దిలీప్ కుమార్ ముస్లిం అయితే రహమాన్ గా మారి తీరాలి. శివారెడ్డి, శామ్యూల్ శివారెడ్డి గా మార వచ్చు. బాప్తిజం అనేప్రక్రియ ఉంటుంది. కాని పేరు విషయంలో కొంత వికల్పం ఉంటుంది. హిందూ బౌద్ధమతాలలో హిందువు, బౌద్ధుడు అనే పదాలకు నిర్వచనం లేదు. ఇది రేపు ముచ్చటించుకుందాం.






No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...